10, మార్చి 2014, సోమవారం

పాతికేళ్ళనాటి మాస్కో - 19

లక్ష రూపాయల పాల సీసా

1987  నుంచి దాదాపు అయిదేళ్లపాటు మాస్కోలో 'పిల్ల జమీందారు' లాగా వెలిగిన నా జర్నలిస్టు జీవితం  1971  ఆగష్టులో విజయవాడ ఆంద్ర జ్యోతిలో మొదలయింది.


 అసందర్భంగా అనిపించినా మాస్కో జీవితం గురించి రాస్తున్నప్పుడు ఆ నాటి రోజులను కూడా నెమరు వేసుకోవడం తప్పనిసరి అని అనుకుంటున్నాను. అప్పుడు నా నెల జీతం యాభయి రూపాయలతో ఆరంభమయి వంద రూపాయలకు పెరిగి- 1975  లో జ్యోతిని వొదిలిపెట్టేనాటికి నూట యాభయి రూపాయలకు చేరింది. జీతానికీ, జీవితానికీ పొంతన లేని రోజుల్లో- మా పెద్ద పిల్లవాడికి పాలపొడి టిన్నులు కొనడం అనేది గగనంగా వుండేది. ఆ గడ్డు రోజుల్లో ఒక రోజు రామారావనే ఆర్టిస్ట్ మా ఇంటికి వచ్చాడు. నా స్నేహితుడయిన లాల్ మోహన్ అనే మరో ఆర్టిస్ట్ అతడిని నాకు పరిచయం చేసాడు.ఒక విషయంలో నా సాయం కోరుతూ అతడు నా వెంట తిరుగుతున్నాడు. చెప్పాపెట్టకుండా అతడు రావడం నాకూ మా ఆవిడకూ ఆ క్షణంలో అంత బాగా అనిపించలేదు.  అతడు వచ్చిన సమయంలో మేమొక గడ్డు సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాము. పిల్లవాడికి పాలు పట్టాల్సిన సీసా కడుగుతుంటే పగిలిపోయింది. రూపాయి ఖరీదు చేసే ఆ సీసా కొనడానికి ఇల్లు మొత్తం గాలించినా యెర్ర ఏగాని దొరకలేదు. పిల్లవాడేమో ఒక పక్క గుక్క పట్టి ఏడుస్తున్నాడు. ఈ సీను చూసి అతడు వెళ్ళిపోయాడు. అమ్మయ్య వెళ్ళాడు కదా అని అనుకునేంతలో మళ్ళీ తిరిగి వచ్చాడు.ఆ వచ్చిన అతడి చేతిలో పాల సీసా కనబడగానే దేవుడే దిగివచ్చాడనిపించింది. పాల సీసా వెల తక్కువే కావచ్చు. కానీ ఆ క్షణంలో - దానికి ఖరీదు కట్టగల షరాబు లేడనిపించింది.
_---------------------------------------------------------------------------------------------------------_


9, మార్చి 2014, ఆదివారం

ఎన్నికలలో పీడకలలు

పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ(అ)ట్టు.  
అసెంబ్లీ ఎన్నికలు, ఆ  పైన లోకసభ, మునిసిపల్ ఎన్నికలు అనుకుంటే ఇప్పుడు తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు. రాజకీయపార్టీల పరిస్తితి కుడితిలోపడ్డ ఎలుక చందం.
అసలే వర్షాకాలం. అందులో తుపాను. పైనుంచి సునామీ.  
ఎన్ని'కల'లో పీడకలలు అంటే ఇదేనేమో!

ఒకటి పక్కన ముప్పై నాలుగు సున్నాలు


గణితములో భారతీయులది ఎంతో వినుతికెక్కిన ఘనత. వారు అంకెలను ఎంత వరకు చదవగలరో చూడండి. మన పాత పెద్ద బాల శిక్ష పుస్తకాలలో అనంత కోటి లెక్క ఇలా ఉంది.
1-ఏకం
10 -దశమం
100 -శతం (2 సున్నాలు)
1000 -సహస్రం (3 సున్నాలు)
10000 -దశ సహస్రం, అయుతం (4 సున్నాలు)
100000 -లక్ష (5 సున్నాలు)
1000000 -దశ లక్ష (6 సున్నాలు)
10000000 -కోటి (7 సున్నాలు)
100000000 -దశ కోటి (8 సున్నాలు)
1000000000 -శత కోటి (9 సున్నాలు)
10000000000 -అర్భుదము (10 సున్నాలు)
100000000000 -న్యర్భుదము (11 సున్నాలు)
1000000000000 - ఖర్వము (12 సున్నాలు)
మహా ఖర్వము (13 సున్నాలు)
పద్మము (14 సున్నాలు)
మహా పద్మము (15 సున్నాలు)
క్షోణి (16 సున్నాలు)
మహా క్షోణి (17 సున్నాలు)
శంఖము (18 సున్నాలు)
మహా శంఖము (19 సున్నాలు)
క్షితి (20 సున్నాలు)
మహా క్షితి (21 సున్నాలు)
క్షోభము (22 సున్నాలు)
మహా క్షోభము (23 సున్నాలు)
నిధి (24 సున్నాలు)
మహా నిధి(25 సున్నాలు)
పర్వతము (26 సున్నాలు)
పరార్ధము (27 సున్నాలు)
అనంతము (28 సున్నాలు)
సాగరము (29 సున్నాలు)
అవ్యయము (30 సున్నాలు)
అచింత్యము (31 సున్నాలు)
అమేయము (32 సున్నాలు)
భూరి (33 సున్నాలు)
మహాభూరి (34 సున్నాలు)

ఒకటి పక్కన పాతిక సున్నాలు


ఒకటి పక్కన పన్నెండు సున్నాలు అంటే ఇంగ్లీష్ లో ట్రిలియన్ అంటారు. సంఖ్యలని లెక్కపెట్టడానికి మిలియన్, బిలియన్, ట్రిలియన్ ఇలా లెక్కించే విధానం పాశ్చాత్య దేశాల్లో అమల్లో వుంది. నాలుగు ట్రిలియన్లు అంటే నాలుగు పక్కన పన్నెండు సున్నాలు పెట్టాలి. పాతిక సున్నాలు అంటే  ఎనిమిది ట్రిలియన్లకంటే ఎక్కువ. ఈలెక్క దేనికంటే ఇలా వచ్చిన ఈ సంఖ్య  ప్రపంచ దేశాలలోని జనాలు పరస్పరం పంపుకున్న ఎస్ ఎం ఎస్ లకు సమానం కాబట్టి.
ఇదొక లెక్కమాత్రమే. అసలు లెక్క ఇంకాస్త ఎక్కువే కానీ సున్నాల గందరగోళం ఎక్కువై అసలు విషయం గుండు సున్నా అవుతుందేమోనని ఇవ్వడం లేదు.  పల్లెటూళ్ళకు కూడా పాకిన ఈ ఎస్ ఎం ఎస్ ల కధాకమామిషూ ఏమిటో ఓసారి చూద్దాం.
ఈ శతాబ్దంలో అత్యంత వేగంగా నేలనాలుగు చెరగులనూ చుట్టబెట్టిన ఏకైక ఆధునిక పరికరం ఏమిటంటే సెల్ ఫోన్ అని ఇట్టే చెప్పెయ్యొచ్చు. ఓ ఇరవయ్యేళ్ళ క్రితంవరకూ ఎవరికీ తెలియని ఈ బుల్లి పరికరం ఈనాడు హస్తభూషణం గా తయారయి కూర్చుంది. ఇంటికి ఒక్క ఫోనే అబ్బురమనుకునే దేశంలో  ఇంట్లోవున్న నలుగురూ నాలుగు ఫోన్లు  ఎనిమిది రింగులుగా  కాలక్షేపం చేసే కాలం వచ్చేసింది. కుటుంబ సభ్యుల నడుమ మాటా మంచీ తగ్గిపోయి  ముక్కూ మొహం తెలియని వారితో మాటా మంతీ పెరిగిపోయింది.
ఇంకో లెక్క ప్రకారం రెండేళ్ళ క్రితం మన దేశంలోని మొబైల్ ఫోన్ ల సంఖ్య  అమెరికాలో వాడే సెల్ ఫోన్లకంటే రెండు రెట్లు ఎక్కువ (ట).
మొబైల్ ఫోన్ల ద్వారా మాట్లాడుకోవడానికే కాదు, సందేశాలు కూడా పంపుకోవడానికి కూడా వీలు వుండడంతో వీటి గిరాకీ మరింత పెరిగిపోయింది. ఈ ఫోన్లు రంగప్రవేశం చేసిన తొలినాళ్ళలో ఈ సౌకర్యం వుండేది కాదు. మొదట జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు ఈ దిక్కుగా ఆలోచించాయి. ఆ దేశాల ఫోన్ కంపెనీలు చేసిన కృషి ఫలితంగా – 1992 డిసెంబర్ మూడో తేదీన మొట్ట మొదటి ఎస్ ఎం ఎస్  ఇంగ్లండ్ లోని నీల్ పాప్ వర్త్ అనే ఒక వ్యక్తి నుంచి వొడా ఫోన్ ద్వారా వెళ్ళింది.
అప్పటినుంచి ఈ చిట్టి పొట్టి సందేశాల సాంకేతిక పిట్ట ప్రయాణం ఎదురులేకుండా సాగిపోయింది. అన్నిరకాల మొబైల్ ఫోన్ పరికరాలకు పనికివచ్చే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో – ‘ఎస్ ఎం ఎస్ ల విశ్వవిహారం మొదలయింది. ఇంగ్లండ్ లో 2006 డిసెంబర్  లో క్రిస్మస్ పండుగ సందర్భంగా  ఒకే ఒక్కరోజున - యిరవై కోట్ల పైచిలుకు ఎస్ ఎం ఎస్లు - పండుగ  శుభాకాంక్షలు తెలుపుతూ - ‘ఫోన్లు మారాయి.
ఈ లెక్కన ఈ లెక్కలు ఇప్పటికి ఎంతగా పెరిగాయన్నది లెక్కలు కట్టాల్సివుంది.
కానీ ఇలాటి లెక్కలు తీసేవాళ్ళు చెప్పిన ఒక లెక్క ప్రకారం – 2006 నాటికే ఈ ఎస్ ఎం ఎస్ ల వ్యాపారం ప్రపంచ వ్యాప్తంగా ఎనభై బిలియన్ డాలర్లు దాటిపోయింది.

అమెరికాలాంటి దేశాల్లో వినియోగదారుల నుంచి ఒక్కొక్క ఎస్.ఎం.ఎస్. కు పదకొండు సెంట్లు వసూలు చేస్తున్నారు. మరి ఈ వసూలు రాజాల కు ఇందుకయ్యే ఖర్చు చిల్లి సెంటు కూడా వుండదు. దీన్ని నిలువు దోపిడీ అనాలా లేక అదనపు సదుపాయం కల్పిస్తున్నందుకు వసూలు చేస్తున్న అదనపు చార్జీ అనాలా! బియ్యం మిల్లు యజమానులకు తవుడు అప్పనంగా మిగిలినట్టే, ఈ కంపెనీలకు ఇదొక అదనపు ఆదాయం.
ఇందులో ఇంత వుంది కాబట్టే   ఎస్ ఎం ఎస్  ల పేరుతొ ఇన్నిన్ని స్కీములు, ఇన్నిన్నిగేములు.
పేలాలు పంచి పప్పులు దంచుకునేందుకు ఇంకెన్నో టక్కు టమారాలు.
పట్టుకుంటే పట్టు చీరె నుంచి ఆటాడుకుందాం రా వరకు అన్నే ఎస్ ఎం ఎస్ గేములే.
ప్రతి టీవీ చానల్ లో ప్రతి అంశం మీదా ప్రజాభిప్రాయసేకరణలే. ఎస్ ఎం ఎస్ లు పంపాలని కోరని చానల్ తెలుగునాట కలికానికి కూడా కానరావడం లేదు.
పైగా ఈ ఎస్.ఎం.ఎస్.’ ల కు వసూలు చేసే ఛార్జీ ఒకటికి నాలుగు రెట్లు ఎక్కువ. కానీ తియ్య నీటికి చేపలు ఎగబడే చందంగా  ఎవరికివారు పోటీలు పడి తమ మొక్కుబళ్ళు చెల్లించుకుంటున్నారు. ఎవరి బాగుకోసం ఇదంతా. ఎవర్ని బాగుచేయడం కోసం ఇదంతా.                                                                      
బహుళ జాతి కంపెనీల మీద నిలువెత్తున ఎగిరిపడే వాళ్ళు కూడా  చాపకింద నీరులా వ్యాపిస్తూ, సామాన్యుల నడ్డి విరుస్తున్న ఈ ఎస్ ఎం ఎస్’ – వ్యాపార ధోరణులపై ఎందుకు చూపు సారించడం లేదో ఆలోచించాల్సిన విషయం.
టీవీ ఛానళ్ళు సయితం ఈ సంస్కృతిని ఎందుకు పెంచి పోషిస్తూ వున్నాయో, ఇందులోని వ్యాపార మర్మం ఏమిటో వెల్లడి చేస్తే బాగుంటుంది.కానీ ఇది జరిగే పనేనా!

తప్పులెన్నువారు తమ తప్పులు ఒప్పుకుంటారా!’   
Courtesy Image Owner          

8, మార్చి 2014, శనివారం

కలకంఠి కన్నీరు

 

(అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని)

గోపాలానిది అటూ ఇటూ కాని వయసు. ప్రతిదీ అర్ధం చేసుకోవాలనిపిస్తుంది. ఏదీ సరిగా అర్ధం కాదు.

అమ్మ వొంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకోవడం చూశాడు కానీ ఎందుకో అర్ధం కాలేదు. అదే అడిగాడు.

“ఇలా ఏడిస్తేకానీ నా గుండెల్లో భారం తగ్గదు” అంది భారంగా.

“అర్ధం కాలేదు. భారం అంటే?”

“నీకర్ధం కాదులే! ఇప్పడే కాదు ఎప్పటికీ అర్ధం కాదు” కొడుకును దగ్గరికి తీసుకుంటూ అంది తల్లి.

గోపాలం తండ్రి దగ్గరకు వెళ్లి అమ్మ ఏడుస్తున్న సంగతి చెప్పి కారణం అడిగాడు.

“మీ అమ్మే కాదు ఆడాళ్లందరూ కారణం లేకుండానే ఏడుస్తుంటారు” తేలిగ్గా తీసేశాడు తండ్రి.

కానీ ఆడవాళ్ళు ఎందుకు ఏడుస్తారు అన్న అనుమానం తీరలేదు చిన్న గోపాలానికి.

స్కూలుకు వెళ్ళినప్పుడు టీచరు వొంటరిగా వున్నప్పుడు చూసి తన అనుమానం బయట పెట్టాడు.

ఆ టీచరు బాగా చదువుకున్నది. లోకజ్ఞానం బాగా వున్నది.

ఆమె ఇలా చెప్పింది.

“బ్రహ్మ దేవుడు సృష్టి కార్యం నిర్వర్తిస్తూ ఒక స్త్రీ మూర్తిని తయారు చేశాడు. ఆ బొమ్మకు ప్రాణం పోసేముందు స్త్రీ జాతికి కొన్ని ప్రత్యేకతలు కల్పించాలనుకున్నాడు.

“సంసార భారాన్ని తేలిగ్గా మోయగల శక్తిని ఆమె చేతులకు ఇచ్చాడు. అదే సమయంలో కుటుంబ సభ్యులకు ఎలాటి ఇబ్బంది లేకుండా చూడగల మానసిక మృదుత్వాన్ని ప్రసాదించాడు.

“నవమాసాలు మోసి, ప్రాణాలనే పణంగా పెట్టి మరో జీవిని ఈ లోకంలోకి తీసుకురాగల ఆత్మ స్తైర్యాన్ని అనుగ్రహించాడు.

“అంతేకాదు, అంత కష్టపడి కన్న, కన్న పిల్లలే పెరిగి పెద్దయిన తరువాత వారి నుంచి ఎదురయ్యే దూషణ భూషణ తిరస్కారాలను భరించగల హృదయ వైశాల్యాన్ని వరంగా ఇచ్చాడు.

“కుటుంబంలో సమస్యలు ఎదురయినప్పుడు అందరూ పట్టనట్టు వొదిలేసి వెడుతున్నా అన్నీ తన నెత్తిన వేసుకుని సంసార నావను ఓ దరిచేర్చగల నిగ్రహాన్ని అనుగ్రహించాడు.

“ఇంట్లో ఏఒక్కరికి వొంట్లో బాగా లేకపోయినా ఏమాత్రం విసుక్కోకుండా రేయింబవళ్ళు సేవ చేసే మంచి మనసును ఆమె పరం చేసాడు.

“పిల్లలు విసుక్కున్నా, మాటలతో చేతలతో మనసును గాయపరచినా వారిని ప్రేమించి లాలించే హృదయాన్ని ఇచ్చాడు.

“కట్టుకున్నవాడు ఎన్ని తప్పులు చేసినా ఉదారంగా మన్నించి మరచిపోగల మనసును ఇచ్చాడు.

“సంసారంలో ఎన్ని వొడిదుడుకులు ఎదురయినా ఎదుర్కుంటూ భర్త వెంట నడవగల ధీమంతాన్ని ఆమె సొంతం చేశాడు.

“ఇన్ని ఇచ్చిన ఆ భగవంతుడు, ‘కన్నీరు’ ను కూడా వరంగా అనుగ్రహించాడు.

“కన్నీరు ఆడవారి సొంతం. తమకు అవసరమయినప్పుడల్లా కన్నీరు పెట్టుకుని తమ మనసులోని భారాన్ని దింపుకుంటారు. కష్టాలతో, క్లేశాలతో కల్మషమయిన మనసును శుభ్రం చేసుకోవడానికి వారికి ఉపయోగపడే నీరే ఈ కన్నీరు. కన్నీరు పెట్టుకోవడానికి కారణాలు చెప్పాల్సిన అవసరం కానీ హేతువులు చూపించాల్సిన అగత్యం కానీ ఆడవారికి లేదు.

“చూడు గోపాలం. ప్రేమను నింపుకున్న వారి హృదయానికి ప్రధాన కవాటాలు వారి కంటిలోని ఈ కన్నీటి చుక్కలే.”

టీచరు చెప్పింది గోపాలానికి కొంత అర్ధం అయింది. కొంత కాలేదు.

కానీ, ప్రపంచంలోని మగవాళ్లకు మాత్రం ఎప్పటికీ అర్ధం కాదు. ఆ అవసరం కూడా వారికి లేదు.

7, మార్చి 2014, శుక్రవారం

వార్త - వ్యాఖ్య


'ప్రత్యర్ధుల విమర్శలపై నేను వ్యాఖ్యానించను. అది వారి విజ్ఞతకే వొదిలిపెడుతున్నాను. కాకపొతే ఒకటి సుష్పష్టం. ఆ విమర్శలు వారి  అజ్ఞానానికి, అవగాహనారాహిత్యానికి  నిదర్శనం" - షరా మామూలు రాజకీయుల షరా మామూలు స్పందన.   
'ఇతరులని పన్నెత్తు మాట అనడం మా ఇంటావంటా లేదనిచెబుతుంటే వినిపించుకోవేమిట్రా నెల తక్కువ వెధవా!' - వ్యాఖ్య


పాతికేళ్ళ నాటి మాస్కో - 18






మా ఇంటికి పెద్ద దూరం కాదు కానీ, ఒక మోస్తరు దూరంలో 'రష్యన్ సర్కస్' వుంది. కానీ టికెట్స్ దొరకడం చాలా కష్టం. దాన్ని చూడాలంటే కనీసం మూడు నెలలముందు నుంచే ప్రయత్నం ప్రారంభించాలి. అయితే మాస్కో రేడియోలో పనిచేస్తున్న విదేశీయులకోసం ఒక సౌలభ్యం వుంది. ఎన్ని టిక్కెట్లు కావాలో తెలియచేస్తే వాళ్లే తెప్పించి పెడతారు. అల్లా ఒకరోజు రష్యన్ సర్కస్ చూసే అవకాశం లభించింది.

రష్యన్ సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయిన రష్యన్ సర్కస్ -కేధరిన్ ది గ్రేట్ - కాలం నుంచే వుంది. ఇంగ్లీష్ భాష తెలియని రష్యాలో - రష్యన్ సర్కస్ ఆవిర్భావానికి  ఒక ఇంగ్లీష్ పౌరుడే కొంత మేరకు దోహద పడడం ఒక విశేషం. చార్లెస్ హగెస్ అనే ఆంగ్లేయుడు - కేధరిన్ ది గ్రేట్ క్వీన్  రాణి గారి సమక్షంలో ఒక చక్కని ప్రదర్సన ఇచ్చాడట. దాంతో ముచ్చట పడిపోయిన రాణి గారు- అతగాడికోసం రెండు సర్కస్ డేరాలు నిర్మించి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారట. రాణి తలచుకుంటే డేరాలకు కొదవేముంది. అతడికోసం సెంట్ పీటర్స్ బర్గ్ - కమ్యూనిస్టుల ఏలుబడిలో 'లెనిన్ గ్రాడ్' గా పేరుమార్చుకుని - మళ్ళీ తదనంతర కాలంలో తిరిగి సెంట్ పీటర్స్ బర్గ్ అన్న పాత పేరుకు మారిన నగరంలో - సర్కస్ డేరాలు నిర్మించి పెట్టారు. కొన్నేళ్ళ తరవాత ఆ ఇంగ్లీష్ దొరవారు ఇంగ్లాండ్ కు వెళ్ళిపోయాడు కానీ అతడి బృందంలోని సభ్యులు మాత్రం రష్యన్ల ఆదరాభిమానాలకు కట్టుబడిపోయి ఆ దేశంలోనే వుండిపోయారు. అలా చిగురించిన రష్యన్ సర్కస్ వట వృక్షం మాదిరిగా విస్తరించి సోవియట్ల కాలంలో ఖండాంతర ఖ్యాతిని సముపార్జించుకుంది. తొంభయ్యవ దశకం దాకా ఒక వెలుగు వెలిగి - ఇటీవలనే తన నూట యిరయవ్వవ వార్షికోత్సవం కూడా జరుపుకుంది.



గ్రేట్ మాస్కో స్టేట్ సర్కస్ ని 1971  లో మాస్కోలోని వేర్నాద్ స్కీ ప్రాస్పెక్ట్ లో ప్రారంభించారు. 3400 మంది వసతిగా కూర్చుని తిలకించగల విశాలమయిన ఎయిర్ కండిషన్ డేరాను నిర్మించారు. దీని ఎత్తు 36 మీటర్లు. ఇందులో అయిదు ఎరీనాలు వున్నాయి. సర్కస్ జరిగే ప్రధాన వేదికకు 18 మీటర్లు దిగువన వీటిని ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి - ఈ ఎరీనాలు ఒక దాని వెంట మరొకటి పైకి వస్తాయి. అందువల్ల అట్టే వ్యవధానం లేకుండా - రంగ స్తలాల రూపురేఖలు వాటంతట అవే మారిపోతుంటాయి. మన వైపు సురభి కంపెని నాటక ప్రదర్శనల మాదిరిగా.


రష్యన్ సర్కస్ చూడకుండానే ఇండియాకు తిరిగివచ్చేస్తామేమో అన్న బెంగ ఆవిధంగా తీరిపోయింది. సర్కస్ నుంచి తిరిగివస్తుంటే దోవలో ఒక సినిమా హాలు కనబడింది. టికెట్ లు కొనుక్కుని లోపలకు వెళ్లి చూద్దుము కదా - అది మన శంకరాభరణం.


 పాటలన్నిటినీ యధాతధంగా తెలుగులో ఉంచేసి, సంభాషణలను మాత్రం రష్యన్ లోకి డబ్ చేశారు. 'ఆకలేసిన బిడ్డ అమ్మా అని ఒకరకంగా అంటుంది ...' అంటూ శంకరాభరణం శంకర శాస్త్రి (సోమయాజులు గారి) నోట రష్యన్ పలుకులు వినబడుతుంటే చెప్పరాని ఆనందం వేసింది. రష్యాలో డబ్బింగ్ పట్ల యెంత శ్రద్ధ తీసుకుంటారో ఈ సినిమా చూస్తె తెలుస్తుంది. తెలుగు శంకరాభరణం సినిమా లో నటించిన నటీ నటుల గాత్రానికి తగిన స్వరం కలిగిన డబ్బింగ్ కళాకారులనే ఎంపిక చేయడం వల్ల- సోమయాజులు గారు, ఆ సినిమా లో నటించిన తదితరులు అచ్చు రష్యన్ లో మాట్లాడుతున్నారా అన్న అనుభూతి కలిగింది.

 సినిమా చూసి ఇంటికి రాగానే మద్రాసులో వున్న నా క్లాసుమేటు, ఆ చిత్రానికి సంభాషణలు రాసిన జంధ్యాలకు ఫోన్ చేసి చెప్పేవరకు ఉగ్గబట్టుకోలేక పోయాను.ఒకే రోజున అయాచితంగా లభించిన ఈ రెండు అవకాశాలు మా మాస్కో జీవితంలో మరచిపోలేని మధుర అనుభవాలు.

(రాజీవ్ గాంధీని తలచుకుంటూ కంట తడిపెట్టిన రష్యన్ వృద్ధ మహిళ గురించి ఇంకోసారి)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.