5, మార్చి 2014, బుధవారం

నోరి మధురబాబు ఇక లేరు



నోరి మధురబాబు ఇక లేరంటూ ఈ ఉదయమే దుర్గ ప్రసాద్ నుంచి మెసేజ్. కొద్దికాలంగా అస్వస్తులుగా వుంటున్న శ్రీ మధురబాబుతో మా కుటుంబానికి చాలా సన్నిహిత సాన్నిహిత్యం. అమెరికాలో సుప్రసిద్ధ కేన్సర్ వైద్యులు డాక్టర్ నోరి, శ్రీ మధురబాబు సోదరులు. స్టేట్ బాంక్ జనరల్ మేనేజర్ గా ఆయన పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఆయన ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదట ఏర్పాటు చేసిన నాగార్జున గ్రామీణ బాంక్ కు శ్రీ మధురబాబు మొట్టమొదటి చైర్మన్. అప్పటినుంచి ఆయనతో ఏర్పడ్డ చక్కని పరిచయం ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను.


(కీర్తిశేషులు మధురబాబు) 

4, మార్చి 2014, మంగళవారం

పెద్ద గీత ముందు చిన్నగీత ఈ జీవితం


వాళ్ల ఆఫీసుదగ్గర పెద్ద వర్షం పడుతోందని ఎవరో నెట్లో పెట్టారు. వెళ్ళి తలుపు తెరిచాను. విసిరి కొట్టినట్టు జల్లు. మొహం చేత్తో తుడుచుకుంటూ బయటకు చూసాను. నాలుగంతస్తుల పైనుంచి పరికిస్తుంటే  నిలబడి చూడాలనిపించేంత అందంగా కురుస్తోంది వర్షం.


ఫోను చప్పుడయింది. 'కింద వున్నాం పైకి వస్తున్నాం' అన్న మెసేజి. లోపలకు వెళ్ళి టవల్ తో మొహం తుడుచుకుని హాల్లోకి వచ్చాను. ఈలోపలే పైకి వచ్చిన  టీవీ  సిబ్బంది వాళ్ల ఏర్పాట్లు వాళ్లు చేసుకుంటున్నారు. కరెంటు పోయిన సంగతి కూడా తెలియలేదు ఇన్వర్టర్ వుండడం వల్ల. లైటింగ్ సెట్ చేసుకుంటూ వుండగానే పెద్ద శబ్దంతో ఫోకస్ బల్బు పేలిపోయింది. బాల్కనీ వెలుతురులోనే వాళ్లు మునిసిపల్ ఎన్నికలమీద 'బైట్' తీసుకు వెళ్ళిపోయారు. ఇంతలో పనిమనిషి ఆయాసపడుతూ వచ్చింది. లిఫ్ట్ లేదేమో నాలుగు అంతస్తులు మెట్లెక్కి వచ్చినట్టుంది. కాస్త ముందు వచ్చివుంటే బాగుండేది అనుకుంటున్నాను. ఇంతలో ఆవిడే నోరు విప్పింది. 'పాడు వర్షం పాడువర్షం. మొత్తం ఇల్లంతా కొల్లేరు చేసింది. పక్కబట్టలు, బియ్యపు మూట అన్నీ తడిసి ముద్దయ్యాయి. కాలంకాని కాలంలో ఈ పాడు వర్షం మా ప్రాణం తీయడానికే వచ్చింది"
కాసేపటి  క్రితం హాయిగా  అనిపించిన వాతావరణం 'మదిలో, గదిలో' ఒక్కసారిగా మారిపోయింది.
నిజమే పెద్ద గీత ముందు చిన్నగీత ఈ జీవితం.

పాతికేళ్ళనాటి మాస్కో - 12

నదిపై పిల్లల  ఫుట్ బాల్  ఆట 
నీళ్ళపై నడయాడగల యోగపురుషులున్న పుణ్య భూమి గా పేరుగాంచిన భారత దేశంనుంచి వెళ్ళిన మేము - మాస్కోలో 'నదిపై ఫుట్ బాల్ ఆడుతున్న పిల్లల'ను కళ్ళారా చూసాము.
ఉత్తర ధృవానికి చేరువగా వుండడం వల్ల, మాస్కోలో ఉష్ణోగ్రతలు సున్నాకంటే ముప్పయి నలభై డిగ్రీలు తక్కువగా వుంటాయి. ఈ చల్లదనానికి మాస్కో నగరం మధ్యలో పాయలుగా పారే మాస్కవా నదిలో నీళ్ళు గడ్డకట్టుకు పోతాయి. కాంక్రీటు మాదిరిగా గట్టిపడిన ఆ నది ఉపరితలం పిల్లలకు ఆట మైదానంగా మారిపోతుంది. ఇక దానిపై ఫుట్ బాల్ ఆటలేనా, స్కేటింగ్ లేనా, ఓహ్! అది చూసి తీరాల్సిన దృశ్యం.


(మంచులో మంచి దుస్తుల్లో సంతోష్ భండారు)


సాధారణంగా మనవైపు ముసురు పట్టినప్పుడు, చల్లగాలులు వీస్తున్నప్పుడు చంటి పిల్లలను బయట తిప్పడానికి సంకోచిస్తాము. కానీ అక్కడ అలా కాదు. ఒక పక్క మంచు నిలబడి కురుస్తూనే వుంటుంది. మరో పక్క నెలలు నిండని శిశువులను సయితం చలి దుస్తుల్లో 'ప్యాక్' చేసి ఆరుబయట వొదిలేసి తల్లులు 'షాపింగ్' చేస్తుంటారు. అది చూస్తూ 'మన దేశం నుంచి వెళ్ళిన తల్లులు' ఇలా ఎలా ? అన్న ప్రశ్నలు వేసుకుని సతమతమౌతుంటారు.
తుమ్మి చిరంజీవ
అలా అని - తుమ్మని వాళ్ళూ , పడిసం పట్టని వాళ్ళూ అసలే లేరని కాదు. మనదగ్గర పల్లెల్లో ఇప్పటికీ పిల్లలు తుమ్మినప్పుడు దగ్గరున్న పెద్దవాళ్ళు వాళ్ళ నెత్తిపై తట్టి 'చిరంజీవ! చిరంజీవ!!' అని అంటూ వుండడం కద్దు. అలాగే అక్కడ కూడా ఎవరయినా తుమ్మగానే పక్కనున్నవాళ్ళు ' బూజ్ ద్దరోవా '( బహుశా దీనికి అర్ధం వెయ్యేళ్ళు బతకమని కాబోలు) అంటుంటారు. మోడరన్ అమ్మాయిల మాటేమోగాని పాత తరం మనుషులు ఇప్పటికీ చిన్న చిన్న నలతలకు ఇళ్ళల్లోనే చిట్కా వైద్యాలు చేస్తుంటారని పిలిపెంకో దంపతులు చెబుతుండేవాళ్ళు.
భోజనాలకు కటకట




పిలిపెంకో ఓసారి పట్టుపట్టి మమ్మల్ని లెనిన్ గ్రాడ్ రైల్లో తీసుకువెళ్ళాడు. అక్కడ పట్టుమని రెండు రాత్రులు కూడా గడపలేదు. ఎప్పుడు వెళ్లి ఇంట్లో పడదామా అన్న ఆరాటంతోనే సరిపోయింది. ఆ నగరంలో చూడాల్సినవి ఎన్నోవున్నాయి. కానీ తినకుండా తిరగడం అన్నదే సమస్యగా మారింది.



 శాఖాహారులకు హోటళ్ళలో తినడానికి ఏమీ దొరకదు. ముతక బియ్యంతో పొడి పొడిగా వండిన అన్నంపై ఉప్పూ మిరియప్పొడి చల్లుకు తినాలి. పెరుగు కాదు కానీ పెరుగు లాంటిది 'కిఫీర్'   దొరుకుతుంది. దానితో సరిపెట్టుకుని భోజనం అయిందనుకోవాలి. అలాగని మాంసాహారులకు రుచికరంగా అన్నీ దొరుకుతాయని అనుకోనక్కరలేదు. ఉడికించిన కోడిగుడ్లు మినహా మిగిలినవేవీ మనవైపునుంచి వెళ్ళిన వాళ్లకు అంతగా రుచిస్తాయనుకోవడానికి లేదు. మాంసాన్ని ఉప్పునీళ్ళల్లో ఉడికించి అదేమాదిరిగా సర్వ్ చేస్తారు. ఉప్పుకారాలు దట్టించి, నూనెల్లో వేయించి వేయిన్నొక్క రకాలుగా వంటలు వండుకుని తినే అలవాటు వున్న వాళ్లకు ఆ తిండి సయించడం కష్టమే. అందుకే అక్కడికి వ్యాపారపు పనులమీదనో లేక ఇండో సోవియట్ సాంస్కృతిక సంఘం ఆహ్వానం మేరకో వచ్చినవాళ్ళు భోజనానికి కటకట పడుతుంటారు.అలా వచ్చినవాళ్ళు మొదటి రోజు అక్కడి హోటళ్లు, బస ఏర్పాట్లు చూసి పరవాలేదనుకుంటారు. విందుల్లో మందు తప్ప ఇష్టపడి తినదగిన భోజనం కనబడక పోవడంతో- ఆకలి ఎరుగని దేశంలో వాళ్లకు ఆకలి కష్టాలు మొదలవుతాయి.

(భోజనానికి బస్సు వేసుకువచ్చిన అతిధులతో మా ఇల్లు ఎలా కళకళ లాడిందన్న ముచ్చట మరోసారి)

ఏం చేయాలి?


‘అమ్మా! పెరుగు ఎలా వస్తుంది’
‘ఏవిటే అర్ధంలేని ప్రశ్నలు మీ అన్నయ్య లాగా. పాలు కాచి పెరుగు తోడు పెడితే పెరుగు వస్తుంది’
‘మరి తోడు పెట్టడానికి పెరుగు ఎక్కడినుంచి వస్తుంది?’
‘ఏవండీ నన్ను పనిచేసుకోనీకుండా చంటిది ప్రశ్నలతో చంపేస్తోంది. కాస్త దీన్ని దగ్గరకు తీసుకోండి’
చలపతి ఆలోచనలో పడ్డాడు. తన చిన్నతనంలో తనకు ఇన్ని అనుమానాలు వచ్చేవా?
వచ్చేవి. కానీ వాటిని విసుక్కోకుండా తీర్చేందుకు బామ్మా తాతయ్యా వుండేవారు.

తాతయ్య వేలు పట్టుకుని తాను బడికి వెళ్ళేవాడు. ఇప్పుడో! తన పిల్లల్ని ‘ఆటో అంకుల్’ స్కూలుకు ‘తోలుకు’ పోతున్నాడు.
బామ్మ పొద్దుగుంకుతుండగానే గోరుముద్దలు తినిపించి, వొళ్ళో పండుకోబెట్టుకుని చిచ్చెకొడుతూ ‘అనగనగా ఒక రాజు కధలు’ చెప్పేది. ఇప్పుడో! పిల్లలు తమ గదిలో కంప్యూటర్ ముందు కూర్చుని ‘గేములు’ ఆడుకుంటున్నారు.
చిన్నప్పుడు తనకు చిన్నగా వొళ్ళు వెచ్చబడ్డా బామ్మా తాతయ్యా పెద్దగా గిలగిలలాడిపోయేవాళ్ళు. ఆడుకుంటూ కిందపడి మోకాలు చెక్కుకుపోతే అప్పుడు బామ్మ పడే ఆదుర్దా చూసితీరాలి. ఇప్పుడు అంతటి ప్రేమ పిల్లలపై తమకూ వున్నా చూపించే తీరికలేని జీవితాలు తమ ఇద్దరివీ. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులే. సాయంత్రం ఇంటికి చేరేసరికి వున్న కాస్త వోపిక వొండుకు తినడానికే సరిపోతుంది.
తాను తన పిల్లలకు అన్నీ అమర్చాడు. మంచి స్కూల్లో చేర్పించాడు. విడిగా వారిద్దరికీ పడక గది ఏర్పాటు చేసాడు. కొంచెం ఖర్చయినా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాడు. వారం విడిచి వారం మల్టీప్లెక్స్ సినిమాలు చూపిస్తాడు. ఖరీదయిన రెస్టారెంటు తీసుకువెడతాడు. ఇక అరుణ మాట చెప్పనక్కరలేదు. ఇంట్లో వున్న కాసేపు ఆమెకు పిల్లల తోడిదే లోకం.
అయినా ఎక్కడో ఏదో లోపం జరుగుతుందోన్న అనుమానం. తాము ఆఫీసులనుంచి ఇంటికి వచ్చేవరకు వాళ్ళిద్దరూ పక్కింటి ఆంటీ ఇంట్లో వుంటారు. తాము కనబడగానే వాళ్ళ కళ్ళల్లో కనబడే వెలుగు చూసినప్పుడు ‘లోపం’ గురించిన ఆ అనుమానం పెనుభూతంగా మారి భయపెడుతుంది. కానీ, అవసరం అనుమానాలను అణచిపెడుతుంది.
అమ్మానాన్నా ఎక్కడో వుంటారు. నెలకు ఇంత అని క్రమం తప్పకుండా డబ్బు పంపుతూనే ఉంటాడు. తెచ్చి తమ దగ్గరే అట్టిపెట్టుకునే ఆలోచన వచ్చినా ఇంకేదో ఆలోచన పట్టి ఆపుతుంది.
కానీ పిల్లలు ఏదో కోల్పోతున్నారు. బామ్మా తాతల ఆప్యాయత. అది తాము పూడ్చలేనిది.
వాళ్లకు మేధో వికాసం కలిగించే కంప్యూటర్లు ఇస్తే సరిపోతుందా? మానసిక స్వాంతన కలిగించే బామ్మా తాతల ప్రేమను అందివ్వాలా?
ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి?

అబ్రకదబ్ర (అనే కాశీపట్నం చూడరా బాబూ)


"ముఖ్యమంత్రి కాగానే చరిత్రను మార్చే సంతకాలు చేస్తా!" - వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి
"ముఖ్యమంత్రి అవగానే సీమాంధ్రను సింగపూర్ చేసేస్తా!" - చంద్రబాబు నాయుడు
"తెలంగాణా రాష్ట్రంలో హెలికాఫ్టర్ అంబులెన్సులు ఏర్పాటుచేస్తా! ఆదిలాబాదును బంగారు తునకగా మారుస్తా!" " - కేసీఆర్
"సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తాం" - కేంద్ర మంత్రి జై రామ్ రమేష్ 


Photo courtesy: Image Owner 

జంపు జిలానీలు


ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయాల్లో తరచుగా వినబడుతున్న మాట:
"ఈరోజు ప్లస్సెంత ? మైనస్ యెంత?"


ఈ ఫోటో తియ్యడానికి కెమెరా ఎక్కడ పెట్టాలి?


Photo Courtesy Image Owner