12, డిసెంబర్ 2013, గురువారం
11, డిసెంబర్ 2013, బుధవారం
అరవైలో ఇరవై రావాలంటే
పల్లెటూళ్ళకో, అడవులకో వెళ్ళినప్పుడు చూడండి.
వందేళ్ళు దాటిన చెట్లు వేల సంఖ్యలో కానవస్తాయి. కానీ నూరేళ్ళు నిండిన మనుషులు
మాత్రం నూటికో కోటికో ఒకరిద్దరు మాత్రమే కనిపిస్తారు. అంటే ఏమిటన్నమాట. మనిషికి
నూరేళ్ళ జీవితం అని రాసిపెట్టి వున్నా ఎక్కువమంది బతికేది మాత్రం ఎక్కువలో ఎక్కువ
ఎనభై తొంభయ్ ఏళ్ళే! కాబట్టి అరవై దాటగానే మొదటి బెల్లు కొట్టినట్టు అనుకోవాలి. మరో
పదిహేను ఇరవై దాటుతుంటే రెండో బెల్లు. మూడో దానికోసం ఎదురు చూడ్డం అర్ధం లేని పని.
అంటే నిరాశగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు. జీవితం ఇప్పుడే ప్రారంభం అయిందనుకోవాలి.
అప్పుడే ఎలాటి బాకీ లేకుండా అనుకున్నవన్నీ చేసుకుంటూ పోవచ్చు. మొత్తం జీవితమంతా పద్దతీ
పాడూ లేకుండా గడిపేశామనుకునేవాళ్లు కూడా చక్కగా మళ్ళీ ప్లాను చేసుకుని బతకొచ్చు. ఈ
బతకడం మనకోసం అనుకోవాలి. అప్పుడే ఈ బతుకు కొనసాగింపు వల్ల ఇతరులకు ఇబ్బందులు
చాలావరకు తగ్గించిన వాళ్ళం అవుతాము.
అలాగే ‘యావలు’ తగ్గించుకోవాలి. చైనా సామెత చెప్పినట్టు
ఎన్నివేల ఎకరాల పంట భూములువున్నా, ఎన్ని క్వింటాళ్ళ ధాన్యం పండించినా నోట్లోకి
వెళ్ళేవి నాలుగు ముద్దలే. ఎన్ని అంతస్తుల భవనాలు ఎన్నెన్ని వున్నా రాత్రివేళ
నిదురించడానికి అవసరం అయ్యేది ఆరుగజాల జాగానే.
తినడానికి తగిన తిండి, అవసరం అయిన మేరకు డబ్బులు
వుంటే ఇక చింతను చెంతకు రానివ్వకూడదు. మార్చలేని విషయాలను మార్చే ప్రయత్నం
మానుకోవాలి. విషయాలను ఏమార్చే పద్దతులు మానుకుంటే అంతకు మించింది ఈ వయస్సులో మరోటి
వుండదు.
మన సంతోషం మనది. మన ఆలోచనలు మనవి. అవి యెంత
మంచివి అయితే అంత మంచిని చేస్తాయి. అంత హాయిని కలిగిస్తాయి.
చూస్తుండగానే ఒక రోజు గడిచిపోతుంది. ఆయుస్సులో ఒక
రోజు తగ్గిపోతుంది.
అదే హాయిగా ఒక రోజు గడిపామనుకోండి. ఒక రోజు ఆయువు
పెరుగుతుంది.
మనసును ప్రశాంతంగా వుంచుకుంటే కొన్ని రోగాలు కూడా మటుమాయం
అయిపోతాయని చెబుతారు. ఇందులో నిజమెంతో తెలుకోవడానికి ఎవరూ అక్కరలేదు. మీకు మీరు చాలు.
(ఇంగ్లీష్ లోకి
అనువదించిన చైనీస్ వ్యాసాన్ని ఒక మిత్రుడు మెయిల్ చేశారు. దానికిది
స్వేచ్చానువాదం. వారికి కృతజ్ఞతలు) NOTE: Courtesy Image Owner
లేబుళ్లు:
అరవైలో ఇరవై రావాలంటే
7, డిసెంబర్ 2013, శనివారం
నవ్వుకు దిష్టి తగిలింది
నిన్న కాక మొన్న ఏవీఎస్
మళ్ళీ ఈరోజు ధర్మవరపు సుబ్రహ్మణ్యం
ఇలాటి నవ్వులరేడులు అందరూ నవ్వుల్ని మనకు
వొదిలేసి నవ్వుకుంటూ అలా వెళ్ళిపోతున్నారు. ఇదొక విషాదం.
సుబ్రహ్మణ్యం గారు తెలియనివాళ్ళు వుండరు. కానీ
ఆయనతో మా పరిచయం యెలా జరిగిందో గుర్తులేదు కానీ ఆ పరిచయం అలా పెరిగిపోయి మా
కుటుంబాల్లో అందరికీ గుర్తుండి పోయింది. నేనూ జ్వాలా ఆయనతో చేసిన అసంఖ్యాక ‘సాయంకాలక్షేపాలు’
ఇంకా కళ్ళల్లో సుడులు తిరుగుతూనే వున్నాయి. ఆయన సినిమాల్లో చూపించిన హాస్యం చూసి
జనమంతా కడుపుబ్బానవ్వుకున్నారు. కానీ హాస్య నటులు తెర మీదే కాదు నలుగురితో
కూర్చున్నప్పుడు కూడా నవ్వుల పువ్వులు పూయించగలరని జంధ్యాల, ధర్మవరపు నిరూపించారు.
ఇంత చిన్న వయస్సులోనే అంతటి నవ్వుల చక్రవర్తులు అందరినుంచి
సెలవు తీసుకుంటూ వున్నారంటే ఎక్కడో ఏ లోకంలోనో నవ్వులు తక్కువయ్యాయని అనుకోవాలి.
అందుకే కాబోలు ఈ అర్ధాంతర, హడావుడి ప్రయాణాలు.
మిత్రుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి నా
శ్రద్ధాంజలి
(07-12-2013)
లేబుళ్లు:
ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇక లేరు
కలగంటి కలగంటి
'నిన్న
కలలో ఒక పెద్ద తప్పు
చేసాను"
ఏకాంబరం తన మిత్రుడితో బాధ పడుతూ చెప్పాడు.
'కలలో
తప్పు చేసావా? అదెలా!' ఆశ్చర్యపోతూ అడిగాడు స్నేహితుడు.
'కలకంటూ స్వర్గానికి
వెళ్లాను.
ఇంద్రుడు తన చేతులతో స్వయంగా నాకు తేనీరు కలిపి తీసుకువచ్చారు.
‘ఇలాగే తాగుతావా? వేడి చేసి తీసుకురానా’ అని అడిగారు.
‘నేనలాగే తాగి
ఉండవచ్చుకదా. కానీ వేడిచేసి తెమ్మన్నా’ను.
‘ఆయన వెచ్చబెట్టి తెచ్చేలోగా మెలకువ వచ్చేసింది.'
బాధ పడ్డాడు ఏకాంబరం.
చాలామంది ఇంతే.
కలలోకూడా తమ గుణం మార్చుకోరు.6, డిసెంబర్ 2013, శుక్రవారం
నిర్ణయం తరువాత కావాల్సింది సంయమనం
సంయమనానికి ముందు వెనుకలు లేని మాట నిజమే. కానీ,
ఒక నిర్ణయం అయిపోయిన తరువాత, దాన్ని తిరగరాయడం అసాధ్యం అని తెలిసిన తరువాత సమాధానపడి
సంయమనంతో మిగిలిన అంశాలను చక్కబరుచుకోవడం అన్నది వివేకవంతుల లక్షణం. కానీ ఆవేశకావేశాలు
ముసురుకున్నప్పుడు వివేకం కళ్ళు మూసుకోవడం సహజాతిసహజం.
రాష్ట్ర విభజన గురించిన నిర్ణయం జరిగిపోయింది. నిర్ణయం
తప్పా వొప్పా అన్నది భవిష్యత్తు తేలుస్తుంది. బ్రిటిష్ వాళ్లు మనకు స్వతంత్రం
ఇవ్వకుండా వుంటే బాగుండేదని అనే వాళ్లు నిన్న మొన్నటిదాకా వున్నారు. వాళ్ల సంఖ్య
ఇప్పుడు తగ్గిపోయి వుంటుంది.
నేను ఎన్నో సార్లు టీవీ చర్చల్లో చెప్పాను. మళ్ళీ
చెబుతున్నాను. విభజన అన్నప్పుడు కొందరు మోదపడడం, మరి కొందరు ఖేదపడడం తప్పదు.
ఒకప్పుడు అఖండ భారతంగా వున్న భరత ఖండం, ఖండ
ఖండాలయింది. అనేక దేశాలుగా విడిపోయింది.
ఒక విషయం గుర్తు పెట్టుకోండి. రాష్ట్రాన్ని
విభజించాలని కాకుండా ఎట్టి పరిస్థితుల్లో అయినా కలిపే వుంచాలని నిర్ణయం తీసుకుని
వున్నట్టయితే – ఇప్పుడు గొంతెత్తి విమర్శిస్తున్నవాళ్ల పల్లవి పూర్తిగా మారిపోయి
వుండేది. అలాగే రాష్ట్ర విభజన నిర్ణయాన్ని స్వాగతిస్తూ జేజేలు పలుకుతున్నవాళ్ళు,
నిర్ణయం ఎదురు తిరిగి వుంటే తీసుకున్నవాళ్ళ జేజెమ్మలను శాపనార్ధాలు
పెడుతుండేవాళ్ళు.
వేదాంతం చెబుతున్నానని కాదు. కానున్నది కాకమానదు.
కానిది కానే కాదు. ‘అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని’ అనే కవి వాక్యం ఇక్కడ స్మరణీయం.
నేను మొదటి నుంచీ చెబుతూ
వస్తున్నది ఒకటే. 1969 లోనో, 1972 లోనో
రాష్ట్ర విభజన జరిగివుంటే ఈపాటికి ఈ రెండు రాష్ట్రాలు కౌలాలంపూర్, సింగపూర్ మాదిరిగా
అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థను శాసిస్తూ వుండేవి. కానీ ఈ ఆలోచన వొలికిపోయిన పాల
మాదిరి. ఆనాడు అత్త అడ్డుపడింది. ఈనాడు కోడలు దారి తెరిచింది. ఇటుపక్కా, అటు పక్కా
అనుకుంటూ వున్నట్టు అయిన ఆలస్యానికి కానీ,
జరుగుతున్న తొందరపాటుకు కానీ ఆ ఇద్దరికీ పూచీ లేకపోవడమే ఇందులో విచిత్రం. ఇదే
రాజకీయం అంటే!(06-12-2013)
లేబుళ్లు:
ఆంధ్రప్రదేశ్ విభజన
ఈ ఏడు ‘తాతయ్య తద్దినం’ లేదా?
భండారు వారి వంశానికి ‘జాతీయ పర్వదినం’ అంటూ
వుంటే అది తిధుల ప్రకారం ఈరోజే. కొన్ని
దశాబ్దాల నుంచి క్రమం తప్పకుండా ప్రతి ఏటా ఈరోజు ‘తాతయ్య తద్దినం’ అంటూ
ఎక్కడెక్కడినుంచో అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు పిల్లాపాపతో కలసి రెక్కలుకట్టుకుని మా వూళ్ళో వాలిపోయేవాళ్ళు. ఆయన
(మా నాన్నగారు భండారు రాఘవరావు గారు) పోయి అరవై ఏళ్ళు దాటింది. నాకప్పటికి అటూఇటూ
కాని వయసు. బయట వూళ్ళో వుండి చదువుకోవడం వల్ల మా నాన్న రూపు అస్సలు గుర్తులేదు. ఆయన
చనిపోవడానికి కొన్ని రోజులముందు, మంచానపడ్డ స్తితిలో ఆయన్ని మా బావగారొకరు
ఫోటో తీసారు. ఆ ఫోటో మా ఇంటి
వరండాలో చాలా ఏళ్ళు అలాగే వుంది. పాత కాలపు కెమేరాతో తీసిన ఆ ఫోటోలో గుర్తుపట్టి,
గుర్తుంచుకోగలిగిన పోలికలేవీ కనిపించేవి కాదు. అందువల్ల మా నాన్న నాకు
సంబంధించినంతవరకు ఓ జ్ఞాపకం మాత్రమే. కాకపొతే, మా పెద్దన్నయ్యగారితో కలసి తద్దినం
పెట్టేవాడి తమ్ముడి పాత్రలో యాభయ్ సంవత్సరాలకు పైగా వొదిగిపోయాను. తాతయ్య ఎవరో తెలియకపోయినా ఆడామగా
తేడా లేకుండా ఆయన వారసత్వ సంతానం అందరికీ ఏటా మా వూళ్ళో పెట్టే మా నాన్నగారి
తద్దినం మాత్రం బాగా గుర్తుండి పోయింది. పెళ్ళికి తరలివెళ్ళినట్టు అంతా బళ్ళు
కట్టుకుని ఎంతెంతో దూరాలనుంచి తరలివచ్చేవాళ్ళు. పేరుకు తద్దినం అయినా వూళ్ళో వుండే
మా మూడో అన్నయ్య కార్యదక్షత కారణంగా అదొక వేడుకలా జరిగిపోయేది. అందుకే ‘పర్వదినం’
అనేది.
ఇన్నేళ్ళుగా ఒక్క నాగా లేకుండా సాగుతూ వచ్చిన ఈ
వేడుకకు ఈ ఏడాది బ్రేకులు పడ్డాయి. అనివార్యమైన పరిస్థితుల్లో తద్దినం పెట్టడానికి
బదులు శాస్త్రంలో చెప్పినట్టుగా పితృదేవతలకు తర్పణాలు వొదిలి తృప్తి
పడాల్సివస్తోంది. ఈ విషయంలో నా అశక్తతను ఈ ఏడాది అందరూ మన్నిస్తారని అనుకుంటున్నాను.
–భండారు శ్రీనివాసరావు (07-12-2013)
లేబుళ్లు:
ఈ ఏడు ‘తాతయ్య తద్దినం’ లేదా?
5, డిసెంబర్ 2013, గురువారం
పీర్లు గుండాన పడ్డాయి
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు విధానం (ప్రాసెస్)
మొదలయిందని సుమారుగా నాలుగేళ్ల క్రితం అంటే 2009 డిసెంబర్ తొమ్మిదో
తేదీన నాటి హోం మంత్రి చిదంబరం బహిరంగంగా ప్రకటన చేసిన తరువాత మళ్ళీ ఇన్నేళ్ళకు ఓ
నాలుగు రోజులు ముందుగానే ఈనాటి కేంద్ర హోం మంత్రి షిండే కొద్దిసేపటి క్రితం
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్తీకరణ బిల్లును క్యాబినెట్ ఆమోదించిందని ఇంకో
ప్రకటన చేసారు. దరిమిలా టీవీల్లో చర్చోపచర్చలు అనంతంగా సాగాయి.
‘ఇల్లలుకగానే పండగ కాలేదని, పార్లమెంటులో
బిల్లు పాసయినప్పటి మాట కదోయి నాయనా!’ అంటూ కొందరు పాత
పల్లవినే కొత్తగా ఎత్తుకుంటే, ‘కేంద్ర
కాబినెట్ నిర్ణయంతో తెలంగాణ
రాష్ట్ర ఏర్పాటు జరిగినట్లేగా? ఇంకా
అనుమానాలు ఎవరికైనా వున్నాయా? ఇంకా
మభ్య పెట్టేవారిని ఏమనాలి?’ అంటూ మరికొందరు
డౌటేహులు ప్రశ్నలు గుప్పిస్తున్నారు.
రాష్ట్ర విభజనను మనసారా కోరుకునే వారు తెలంగాణలో
నూటికి తొంభయ్ తొమ్మిది శాతం మంది వుండవచ్చు. అలాగే సమైక్య
రాష్ట్రాన్ని కావాలనుకునేవారు జనాభాలో అధిక సంఖ్యాకులు వుండవచ్చు. ‘ఎలాగయినా పరవాలేదు రాష్ట్రాన్ని చీల్చినా సరే ఇప్పటిమాదిరిగా వుంచినా సరే –
మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి’ అనే వాళ్లు
కనీసం ఒక శాతం అయినా వుంటారు. వోట్ల పండుగలో గుర్తుకువచ్చే ఈమాదిరి
అల్పసంఖ్యాకులు అసలు ఇలాటి సమయాల్లో అసలే గుర్తుకురారు.
రాష్ట్రాన్ని రెండుగా చీల్చాలి. ఓకే. ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. కాదన్నవాడికి
కర్రు కాల్చి వాత పెట్టండి.
రాష్ట్రం సమైక్యంగా వుండాలి. మరీ ఓకే!
కాదుకూడదు అని నిర్ణయాలు తీసుకున్నవారిని సోదిలోకి లేకుండా తరిమి కొట్టండి.
మీచేతిలో వజ్రాయుధం పెట్టుకుని, అట్ట
ఆయుధాలతో ఆటలు ఆడుతున్న రాజకీయనాయకులను చూసి భయపడాల్సిన ఖర్మ మీకేమిటి?
ప్రజాస్వామ్యంలో నాయకులు గొప్పవాళ్ళు కావచ్చు. కానీ
వాళ్ళను గొప్పవాళ్ళను చేస్తున్నది మాత్రం మన జనమే!
(05-12-2013)
లేబుళ్లు:
రాష్ట్ర విభజన - కేంద్ర క్యాబినెట్ ఆమోదం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)



