తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు విధానం (ప్రాసెస్)
మొదలయిందని సుమారుగా నాలుగేళ్ల క్రితం అంటే 2009 డిసెంబర్ తొమ్మిదో
తేదీన నాటి హోం మంత్రి చిదంబరం బహిరంగంగా ప్రకటన చేసిన తరువాత మళ్ళీ ఇన్నేళ్ళకు ఓ
నాలుగు రోజులు ముందుగానే ఈనాటి కేంద్ర హోం మంత్రి షిండే కొద్దిసేపటి క్రితం
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్తీకరణ బిల్లును క్యాబినెట్ ఆమోదించిందని ఇంకో
ప్రకటన చేసారు. దరిమిలా టీవీల్లో చర్చోపచర్చలు అనంతంగా సాగాయి.
‘ఇల్లలుకగానే పండగ కాలేదని, పార్లమెంటులో
బిల్లు పాసయినప్పటి మాట కదోయి నాయనా!’ అంటూ కొందరు పాత
పల్లవినే కొత్తగా ఎత్తుకుంటే, ‘కేంద్ర
కాబినెట్ నిర్ణయంతో తెలంగాణ
రాష్ట్ర ఏర్పాటు జరిగినట్లేగా? ఇంకా
అనుమానాలు ఎవరికైనా వున్నాయా? ఇంకా
మభ్య పెట్టేవారిని ఏమనాలి?’ అంటూ మరికొందరు
డౌటేహులు ప్రశ్నలు గుప్పిస్తున్నారు.
రాష్ట్ర విభజనను మనసారా కోరుకునే వారు తెలంగాణలో
నూటికి తొంభయ్ తొమ్మిది శాతం మంది వుండవచ్చు. అలాగే సమైక్య
రాష్ట్రాన్ని కావాలనుకునేవారు జనాభాలో అధిక సంఖ్యాకులు వుండవచ్చు. ‘ఎలాగయినా పరవాలేదు రాష్ట్రాన్ని చీల్చినా సరే ఇప్పటిమాదిరిగా వుంచినా సరే –
మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి’ అనే వాళ్లు
కనీసం ఒక శాతం అయినా వుంటారు. వోట్ల పండుగలో గుర్తుకువచ్చే ఈమాదిరి
అల్పసంఖ్యాకులు అసలు ఇలాటి సమయాల్లో అసలే గుర్తుకురారు.
రాష్ట్రాన్ని రెండుగా చీల్చాలి. ఓకే. ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. కాదన్నవాడికి
కర్రు కాల్చి వాత పెట్టండి.
రాష్ట్రం సమైక్యంగా వుండాలి. మరీ ఓకే!
కాదుకూడదు అని నిర్ణయాలు తీసుకున్నవారిని సోదిలోకి లేకుండా తరిమి కొట్టండి.
మీచేతిలో వజ్రాయుధం పెట్టుకుని, అట్ట
ఆయుధాలతో ఆటలు ఆడుతున్న రాజకీయనాయకులను చూసి భయపడాల్సిన ఖర్మ మీకేమిటి?
ప్రజాస్వామ్యంలో నాయకులు గొప్పవాళ్ళు కావచ్చు. కానీ
వాళ్ళను గొప్పవాళ్ళను చేస్తున్నది మాత్రం మన జనమే!
(05-12-2013)
