18, అక్టోబర్ 2013, శుక్రవారం

రావూరి భరద్వాజ గారు ఇక లేరు



జ్ఞానపీఠం అవార్డ్ గ్రహీత రావూరి భరద్వాజ గారు హైదరాబాదులో స్వల్ప అస్వస్థత అనంతరం కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు.  సమయాభావంవల్ల  - ఆయనకు జ్ఞానపీఠం  అవార్డ్ వచ్చిన సందర్భంలో రాసిన ఈ చిన్ని రచనను ఆయనకు నివాళిగా అర్పిస్తున్నాను     

రావూరి భరద్వాజ గారు  ఇంత పొడవు గడ్డం  పెంచనప్పుడే కాదు అసలు గడ్డం ఏదీ లేనప్పుడు కూడా నాకు తెలుసు. రేడియోలో పనిచేస్తున్నప్పుడు విలక్షణ వ్యక్తిత్వం కలిగిన ఈ మహా రచయితతో సన్నిహిత పరిచయం వుండేది. నా చిన్నతనంలోనే ఆయన రాసిన 'పాకుడురాళ్ళు' నవల సీరియల్ గా వస్తున్న రోజుల్లోనే నన్నెంతో ఆకర్షించింది. తరువాతి కాలంలో భరద్వాజ గారితో ఆకాశవాణిలో కలసిపనిచేసే మరో అదృష్టం లభించింది. జ్ఞానపీఠం అవార్డ్ ఆయన స్థాయికి చిన్నదని చెప్పను కాని ఆలస్యంగా వచ్చిందని మాత్రం చెప్పగలను. మా గురువుగారికి మనఃపూర్వక అభినందనలు - భండారు శ్రీనివాసరావు  


(కీర్తిశేషులు రావూరి భరద్వాజ)

జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయిన రావూరు భరద్వాజ (పూర్వాశ్రమంలో రావూరు శరభాచారి) గురించి 
మరో చిన్న జ్ఞాపకం: 
మొగ్గతొడిగిన ఎర్రగులాబి - తెలుగు అనువాదం : రావూరు భరద్వాజ 
జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయిన రావూరు భరద్వాజ (పూర్వాశ్రమంలో రావూరు శరభాచారి) గురించి 
మరో చిన్న జ్ఞాపకం: 
మొగ్గతొడిగిన ఎర్రగులాబి - తెలుగు అనువాదం : రావూరు భరద్వాజ 

ఈ పుస్తకం వెనుక చిన్న కధ చెప్పుకోవడం నాకు తెలుసు. రాజకీయ నాయకుల్లో నెహ్రూ ఒక్కరినే అమితంగా అభిమానించే సుప్రసిద్ధ జర్నలిస్టు కేయే అబ్బాస్, నెహ్రూ అనంతరం ఆయన బిడ్డ ఇందిర ప్రధాని కాగానే 'Return of the RED ROSE' అనే పేరుతొ ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని 'మొగ్గ తొడిగిన ఎర్రగులాబి' పేరుతొ శ్రీ రావూరి భరద్వాజ తెలుగులోకి అనువదించారు. శ్రీమతి గాంధి హైదరాబాదు వచ్చినప్పుడు, అప్పుడు రేడియోలో పనిచేస్తున్న భరద్వాజ గారే స్వయంగా తాను అనువదించిన ఈ పుస్తకాన్ని శ్రీమతి ఇందిరాగాంధీకి బహుకరించారు. ఆవిడ అంతకుముందు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా వున్నప్పుడు రేడియోలో (అప్పటికి దూరదర్శన్ లేదు) పనిచేస్తున్న స్టాఫ్ ఆర్టిస్టుల ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలతో సమానం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రేడియోలో స్టాఫ్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న భరద్వాజ గారు ఆమె చేసిన ఈ మేలుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ పుస్తకాన్ని ఆమెకు అందచేసారు.
మొగ్గతొడిగిన ఎర్రగులాబి - కె.ఎ.అబ్బాస్‌
వెల: 100 రూపాయలు
తెలుగు అనువాదం : రావూరి భరద్వాజ
ప్రచురణ: ఎమెస్కో బుక్స్
(
భారతదేశంలోనూ, ప్రపంచంలోనూ క్రమానుగతంగా వచ్చిన విప్లవాత్మకమైన అభివృద్ధి, ఆయా సందర్భాలలో శ్రీమతి ఇందిరాగాంధీని ప్రభావితం చేసిన సంఘటనలు, ఆమెను తీర్చిదిద్ది వ్యక్తిత్వాన్ని రూపొందింపజేసిన సంఘటనలూ తీసుకొని ఆమెను ఇందులో పరిచయం చేయడం జరిగింది- ప్రకాశకులు)





బాబోయ్! టీవీ!! (టాగ్ లైన్ : ఎవర్నీ ఉద్దేశించింది కాదు)



“ఈరోజు మీదే. కుమ్మేసుకోండి” అన్నాడు గుర్నాధం.
గుర్నాధం నాకు రెండేళ్ళ నుంచి పరిచయం. వాళ్ల టీవీ ప్రోగ్రాం కు వెళ్ళినప్పుడల్లా మంచిగా ఆప్యాయంగా పలకరిస్తాడు. అతని నోట ఎప్పుడూ ఇలాటి అపభ్రంశపు మాటలు వినలేదు. ఇవ్వాలేమిటి ఇలా!  అందుకే ఆ మాట వినబడనట్టు నటిస్తూ స్టుడియో లోపలకు నడిచాను. ఆ వాతావరణం నాకు కొత్త కాదు. లైట్లూ, మూవింగ్ కెమెరాలు, కెమెరామన్లు(టింగ్లీష్) ఏదీ, ఎవరూ కొత్త కాదు. కాకపొతే ఆరోజు నేను నిర్వహించే పాత్రే కొత్తది.
ఆరోజు జర్నలిష్టుల దినం అట. అందుకని కొత్తగా వుంటుందని, కాస్త కొత్తదనం చూపించాలని  నాకీ కొత్త అవతారం ఇచ్చి ఆరోజు వార్తా విశ్లేషణ కార్యక్రమం నిర్వహించమన్నారు. అంటే ‘యాంఖరయ్య’ పాత్ర అన్నమాట. రోజూ కూర్చుండే ప్రదేశమే అయినా కుర్చీ మారింది. చెవులకు ఏవో తగిలించి కూర్చోబెట్టారు. రేడియోలో నాలుగయిదు స్టేషన్లు కలిసినట్టు ఏవేవో నానారకాల ధ్వనులు కలగాపులగంగా వినీవినబడనట్టు వినబడుతున్నాయి. మైక్ టెస్టులు అయి, పత్రికావార్తల పఠనం పూర్తయి మొదటి ‘బ్రేకు’ పడినప్పుడు అతిధులు ఒక్కొక్కరుగా వచ్చి కూర్చున్నారు. నాలుగు పార్టీలకు చెందిన వాళ్లు వాళ్లు. కాకపోతే ఇటీవలి కాలంలో సంభవించిన రాజకీయ పరిణామాల కారణంగా వాళ్ళలో ఒకళ్ళిద్దరు ఈ మధ్యనే పార్టీలు మారడమే కాకుండా ఇన్నాళ్ళుగా కత్తులు దూస్తూ వచ్చిన పార్తీల్లోకే స్వగృహ ప్రవేశం చేశారు. ఇన్నాళ్ళుగా విశ్లేషక పాత్ర కాబట్టి వాళ్లు ఎన్ని పార్టీలు ఎన్నిసార్లు మారినా నాకొచ్చిన ఇబ్బంది ఏమీలేదు. ఎవరి పద్యాలు (వాదాలు) వాళ్లు పాడేవారు. పార్టీ మారిన వాళ్లు కాస్త జాగ్రత్తగా వొళ్ళు దగ్గరపెట్టుకుని కొత్త పార్టీ వాళ్లు రాసిచ్చిన పాత పాటల్నే ఆలపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ కొత్త వేషంలో వున్న నేను,  వాళ్లు ఇప్పుడు ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ముందు అర్ధం చేసుకుని ఆపైన వాళ్ళను ప్రశ్నలు అడగాలి. పార్టీ మారిన వాళ్ళను సరిగా గుర్తుపట్టలేకపోతే వాళ్లకు వచ్చే కొత్త నష్టం ఏమీ లేకపోవచ్చుకానీ నన్ను నమ్ముకుని పెట్టుకున్న ప్రోగ్రాం అభాసు పాలు అయ్యే అవకాశం వుంటుంది. కాబట్టి వొళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన మహత్తర బాధ్యత నా మీదకే వచ్చిపడింది. అంచేత, ముందు  వొళ్ళూ, ఆ తరువాత  గొంతూ సర్దుకుని,  కుర్చీలో కాస్త వొంగి కూర్చుని (లేకపోతే యాంఖర్ అనుకోరేమో అని లోపల అనుమానం) నంగిగా పలకరింపుల చిరునవ్వులు రువ్వాను.
చెవులో జోరీగలాగా లోపలనుంచి ప్రోగ్రాం వాళ్లు రొదచేస్తున్నా పట్టించుకోకుండా ఫలానా వాళ్లు ఫలానా ఫలానా పార్టీలవాళ్ళు అంటూ పరిచయం చేయబోయి తొట్రుపడి ఒక పేరుకు మరో పార్టీ పేరు చెప్పి  మరో పేరుకు ఇంకో  పార్టీ పేరు చెప్పి ఆ తరువాత తీరిగ్గా  నాలిక్కరుచుకున్నాను. వాళ్లకు నేను చేసిన తప్పేమిటో తెలిసింది. కాని, కన్నంలో తేలు కుట్టిన దొంగలల్లే మిన్నకుండిపోయారు.
సరే! ప్రోగ్రాం మొదలయింది.
“మొన్న ఢిల్లీలో....” మొదలు పెట్టాను.
తెదేపా ప్రతినిధి అడ్డుకున్నాడు.
‘ఏం జరిగింది ఢిల్లీలో. మా నాయకుడు అంత పెద్ద వయస్సులో కూడా అంత పెద్ద వయస్సును కూడా లెక్క చేయకుండా అంతమంది తెలుగువారి....”
“తెలుగువారి ... అసలు తెలుగువారి గురించి మాట్లాడే నైతిక హక్కు ....” వైకాపా ప్రతినిధి అందుకున్నాడు.
“మీరు మాట్లాడుతుంటే నేను మారు మాట్లాడకుండా విన్నాను. అలాగే...”
“అసలు నేను మాట్లాడింది ఎక్కడ ? ...ముందు మీరే కదా మా నాయకుడు అంటూ మాలావు గింజుకున్నారు.”
“ఆ మాటకు వస్తే తెలుగువారి గురించి, ఆ మాటకు వస్తే యావత్ ప్రజలు గురించి, వారి కష్టాలు గురించి వారి నష్టాలు గురించి మాట్లాడే ఏకైక హక్కు శ్రేమతి ఇందిరారాగాంది కుటుంబానికి చెందిన వారి కోడలు శ్రీమతి సోనియా గాంధీ గారి మార్గ దర్శకత్వంలోనూ,  వారి కుమారుడు, భావిభారత ఆశాజ్యోతి, కాబోయే ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనూ  నిద్రాహారాలు లేకుండా, అహరహమూ  శ్రమిస్తున్న ఒక్క కాంగ్రెస్ పార్టీకే వున్నదని  నేను మనవిచేసుకుంటూ ఇంకా ఇంకా  చెప్పెదేమిటంటే ....” కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం  ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ మహిళా నాయకురాలు నోరువిప్పి మళ్ళీ మూయడం మరిచిపోయి మాట్లాడడం మొదలెట్టారు.
“ఏమిటి మీకున్న హక్కు ?  ప్రజలపేరు చెబుతూ ఆ ప్రజాధనాన్ని కొల్లగొట్టడమా? స్కాముల్లో వరల్డ్ రికార్డ్ నెలకొల్పడమా ? ఏమిటి మీకున్న హక్కు ?”
“ఎవరో కొల్లగొట్టారని చెప్పే హక్కు మీకెక్కడిది? కొల్లగొట్టింది మీరందరూ. కొల్లగొట్టబడింది మేము. వుంటే గింటే, అయితే గియితే ఆ తరతరాల హక్కు,   ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక తరాలుగా పోరాటం చేస్తున్న మాది”  టీ ఆర్ఎస్ ఆయన అందుకున్నాడు.   
చెవిలో ఏదో చెబుతున్నారు. ఎవరో శ్రోత లైన్లో వున్నారని.
పరిస్తితిని కాపాడడానికి ఇదే అదను.
“ఒక్క నిమిషం  ఆగండి. కరీంనగర్ నుంచి వరహాలరావు గారు లైన్లో వున్నారు” అనేసి మానిటర్ వైపు చూసి అందులో నా మొహం కనబడడం లేదని నిర్ధారించుకుని ఎదురుగా పెట్టిన గ్లాసులోని నీళ్ళను చుక్క మిగలకుండా తాగేశాను.
ఇంతలో వరహాలరావు గారి కంఠం వినబడింది.
“ముందాయనకు చెప్పండి. నాపేరు వరహాలరావు కాదు. రత్నాకరరాజు. మా వూరు కరీం నగర్ కాదు కాశీబుగ్గ”
“ఓహో! అలాగా ! నాకు కొత్త కదండీ . అందుకని కొత్తగా చెప్పాలనుకుని కొత్త పేరు కొత్త వూరు చెప్పాను. ఇంతకీ రావుగారు... అదే అదే రాజు గారు మీరు ఎవర్ని యేమని అడగాలనుకుంటున్నారు?”
“నేను ఎవర్ని, యేమని అడగాలని అనుకుని లైన్లోకి రాలేదండి. అసలీ ప్రోగ్రాముల వల్ల ఏం సాధించాలని అనుకుంటున్నారో మీరు చెప్పండి.”
ఒక్క రోజు భాగోతానికి మూతి మీసాలు పోయాయన్నట్టు ఈఒక్క రోజు యాంఖర్ వేషం యెందుకు కట్టానురా అనుకుంటు నాలో నేనే మధన పడుతుంటే చెవుల్లో ‘బ్రేక్ చెప్పండి. ఆలస్యం అయితే ఎడ్వర్టైజ్ మెంటు వాళ్ళతో గోల” అని వినబడడంతో అమ్మయ్య అనుకుని “ఇప్పుడొక చిన్న విరామం’ అంటూ పెద్ద బ్రేక్ ఇచ్చేసాను.
ఆపేసిన తరువాత కూడా ఫ్యాన్ కాసేపు తిరిగినట్టు ఆ తరువాత కూడా వారి వాదప్రతివాదాలు కొనసాగుతూనే వున్నాయి.
ఈ మధ్యలో మా ఆవిడ గొంతు.
అదెలా. ఆవిడ ఎక్కడికయినా ఎప్పుడయినా రావచ్చుకాని చెప్పాపెట్టకుండా ఇలా వెంటపడి స్టుడియోలకి కూడా వస్తుంటే యెలా?
“ఏమండీ ఏమైంది ఎందుకలా చెమటలు పట్టాయి. లేచి నీళ్ళు తాగండి” అంటోంది.
అయ్యో ఇదంతా కలా!
అయ్యో ఏమిటి అపభ్రంశంగా! అమ్మయ్య అనుకోవాలి కాని.  

(18-10-2013)

17, అక్టోబర్ 2013, గురువారం

'కర్సర్'కి కోపం వచ్చింది

కంప్యూటర్లో కర్సర్ కి కోపం వచ్చి భగ భగా మండిపోతోంది. ఒకసారి నొక్కిచూడండి. మీకే తెలుస్తుంది.
  
http://www.flamingcursor.com/

ఏరిన ముత్యాలు


పొద్దున్న ఆరుగంటలు.
లేవాలంటే బద్ధకం. ఓ అయిదు నిమిషాలు కళ్ళుమూసుకుని తెరిస్తే చాలు అదేమి  చిత్రమో! గడియారంలో టైం ఏడు గంటలు చూపెడుతుంటుంది. సరే!  పడుతూ లేస్తూ  ఆఫీసుకు వెడతాం. సమయం పన్నెండు. ఒకటో రెండో  ఫైళ్ళు చూస్తామో లేదో నిద్ర ముంచుకొస్తుంది. దాన్నికాదని యెలా! పోనీ మన ఆఫీసే కదా అని  అలా అయిదంటే  అయిదే నిమిషాలు కళ్ళుమూసుకుంటాం. కళ్ళు తెరిచి చూస్తే  అదే గడియారం. టైం మాత్రం ఒక్క నిమిషం కూడా ముందుకు జరగదు.


మహా మాయ అంటే ఇదే కాబోలు 

‘మూర్కుడితో వాదం పెట్టుకోవడంవల్ల నిరూపితమయ్యే నిజం ఏమిటి?’
‘ఒక్కరు కాదు ఇద్దరు మూర్కులు వున్నారని.’

‘నా చిన్నప్పుడు లైట్లు లేకపోతే చీకటిని చూస్తే భయం వేసేది. ఇప్పుడు కరెంటు బిల్లు చూస్తుంటే లైట్లంటే భయం వేస్తోంది.’

‘చుట్టూవున్నవాళ్లను చూసి బెదిరిపోనక్కరలేదు. వాళ్లు  చెడ్డవాళ్లనుకోండి. అదీ  మంచిదే. అలాటివాళ్లవల్ల జీవితానికి  సరిపడా పాఠాలు నేర్చేసుకోవచ్చు.
మంచివాళ్లనుకోండి. మరీ మంచిది. బోలెడు  అనుభవం సంపాదించుకోవచ్చు.
కాబట్టి నీతి ఏమిటంటే!
అందరితో మంచిగా వుండండి’

(సాగతీసిన ఇంగ్లీష్ జోకులు  ఆధారంగా) 
17-10-2013            

పూర్వజన్మసుకృతం


అదృష్టరేఖ  అంటుంటారు. అదేదో నాకు జెర్రిపోతు మందాన వున్నట్టుంది.
పొద్దున్న ఓ చానెల్ చర్చకు వెళ్ళి ఇంటికివచ్చి పడుకుంటే మాగన్నుగా నిద్రపట్టింది. ఈ అరవై ఎనిమిదేళ్ళ వయస్సులో ఈ ప్రభాత భేరీలు యెందుకంటూ మా ఆవిడ సన్నాయి నొక్కులు. కానీ చాపల్యం అలాటిది మరి.  అది  ఆవిడకు అర్ధం కాదులే అని నేనే పెద్దమనసు చేసుకుని ఆవిడను  అర్ధం చేసుకుంటూ వుంటాను.
ఇంతలో ఫోను గణగణ. ఆ చప్పుడు విని ఎన్నాళ్ళు అయిందో అనిపించింది. ఎందుకంటే అది లాండ్ లైన్. ఇంట్లో ఒక అలంకార వస్తువుగా అలా మన్నుతిన్న పాములా పడి వుంటుంది. ఒకప్పుడు దాని వైభోగం యెలా వుండేదో చెబితే ఈనాటి సెల్ ఫోన్లకు ఒక పట్టాన అర్ధం కాదేమో.
“నేను వరూధిని మాట్లాడుతున్నాను’ అవతలనుంచి వినబడింది. అసలే నిద్ర మత్తేమో ‘వూ చెప్పండి’ అన్నాను అతి మామూలుగా.
“మీరు రాసిన పుస్తకం చదివానండి. చాలా బాగుంది”
“ఓహో! అలానా థాంక్స్”
“రోజూ ఎన్నో పుస్తకాలు చదువుతూ వుంటాం  కాని మాస్కో గురించి మీరు రాసిన విషయాలు చాలా బాగున్నాయి. పుస్తకం పేరు కూడా. మార్పు చూసిన కళ్ళు. భలేగా వుంది. అది చెబుదాం అనే ఫోను చేస్తున్నాను.”
ఎవరీవిడ అని ఆలోచిస్తూ కొంత మౌనంగా వున్నాను.
నా మౌనాన్ని ఆవిడ అర్ధం చేసుకున్నట్టున్నారు.
“మొన్న జానకీరాణి ఫంక్షన్ లో మీ పుస్తకం నా చేతికి వచ్చింది. ఆవిడ బలవంతంవల్ల అక్కడికి వచ్చాను. మంచిదే అయింది. మీ పుస్తకం చదివే అవకాశం దొరికింది”
అమ్మబాబోయ్! ఆ వరూధిని గారా! కొడవటిగంటి కుటుంబరావు గారి భార్యతోనా ఇప్పటిదాకా ఇలా మాట్లాడుతున్నది? నిద్రమత్తు ఒక్క పెట్టున వొదిలిపోయింది. మంచం మీద నిటారుగా లేచి కూర్చున్నాను. ఈ పొరబాటు  దిద్దుకోవడం యెలా!
ఆవిడ మాట్లాడుతూనే వున్నారు.
‘నేను మా అమ్మాయి, అల్లుడి దగ్గర కొండాపూర్ లో వుంటున్నాను. పుస్తకంలో మీ అడ్రసు చూసాను.  అమీర్ పేటకి చాలా దగ్గర్లో వుంటున్నట్టున్నారు. మేము లోగడ అక్కడే వుండేవాళ్ళం”
కొడవటిగంటి గారి సాన్నిహిత్యమో తెలవదు, ఆయన సాహిత్యాన్ని ఆస్వాదించిన ఫలితమో తెలవదు. ఆవిడ స్వరం అమృతం సేవించినట్టుగా అతి మధురంగా వుంది. కుసుమ కోమలంగా వుంది. తొంభై రెండేళ్లు దాటిన మనిషిలా లేదు. (తొంభై మూడేళ్లకు తక్కువ వుండవు అంటారు మా డి. వెంకట్రామయ్యగారు ఆవిడ గురించిన వివరాలు చెబుతూ. అంత వయస్సులో ఇంత శ్రద్ధగా ఓ పుస్తకం చదివి ఆ రచయితకు ఫోను చేసి మాట్లాడే సంస్కారం గురించి ఆయన ఎంతగానో మెచ్చుకున్నారు). అది తలచుకోగానే,  అయిదున్నర అడుగుల పైన మరికొన్ని అంగుళాల పొడవుండే మనిషిని కాస్తా ఓ మరుగుజ్జుగా మారిపోయాను.
ఆవిడ చాలా సేపు మాట్లాడారు. చాలా విషయాలు చెప్పారు. కొడవటిగంటి కుటుంబరావుగారి గురించీ, వారి అబ్బాయి రోహిణీప్రసాద్ గురించీ  (ఏడాది అయిందనుకుంటాను ఆయన పోయి), అమ్మాయి శాంత సుందరి గురించీ, వారి అమ్మగారు కొమ్మూరి పద్మావతి గురించీ, వారికి దగ్గర బంధువు, సాహితీ సింధువు అయిన ‘చలం’గారి గురించీ. ఇక తురగా జానకీరాణి గారి సంగతి సరేసరి.
నిజంగా ఈరోజు భలే మంచి రోజు.    
అంతటి పెద్ద మనిషి నాతొ ఫోనులో మాట్లాడ్డమే ఓ అదృష్టం అనుకుంటే, నేను  రాసిన ఓ పుస్తకాన్ని గురించి ఆవిడ మెచ్చుకోవడం.  నిజంగా ఇది నాకు అయాచితంగా లభించిన మరో గొప్ప  అవార్డ్.
అందుకే అన్నాను. ‘పూర్వజన్మ సుకృతం’ అని. అదీ  మరో మాట దొరక్క.  పూర్వజన్మలమీద నమ్మకం లేకపోయినా ‘సుకృతం’ మీద మాత్రం నాకున్న  విశ్వాసం మరింత ఇనుమడించింది. అంతేకాదు.
ఎదిగినకొద్దీ వొదిగివుండడంలో వున్న గొప్పతనం ఏమిటో మరోమారు తెలిసివచ్చింది.
జీవితంలో గొప్పవారుకావడం గొప్ప విషయం కాకపోవచ్చు. కానీ ఆ గొప్పతనాన్ని నిలబెట్టుకోవడమే నిజమైన గొప్పతనం.
హాట్స్ ఆఫ్ వరూధిని గారు.
(17-10-2013)

14, అక్టోబర్ 2013, సోమవారం

Jayaprakash narayan for constructive journalism

The Hindu 
JP for constructive journalism

SPECIAL CORRESPONDENT
SHARE • PRINT • T+ 
Journalism is a glorious profession that inspires people when scribes write analytical pieces with constructive criticism and helps society, said Lok Satta Party president and MLA Dr. Jayaprakash Narayan.
At a function organised by the Turaga Foundation, he addressed the gathering after giving away an award of excellence instituted in the name of Late Turaga Krishnamohan Rao, journalist and writer, to senior journalist Bhandaru Srinivasa Rao. Mr. Narayan said while the print media had been steadfast in the discharge of its duties and AIR had always played a constructive role, the television channels had a lot to improve. Except in times of political emergencies or during natural calamities, when he admitted to watching television, he said the content left much to be desired. Acknowledging the recognition, Mr. Srinivasa Rao said it was not an award but one that he considered a reward given to him in the name of one of his favourite humorous writers, Turaga Krishnamohan Rao.
Award of excellence instituted in the name of Late Turaga Krishnamohan Rao given away to Bhandaru Srinivasa Rao, a senior journalist who worked for the All India Radio



(From L to R - Sudhama, Jayaprakash Narayan, Smt.Turaga Janaki Rani,Bhandaru Srinivas Rao,Smt.Bhandaru Nirmala Devi,ABK Prasad, Jwala Narasimha Rao)

TURAGA AWARD