కొన్ని విషయాలు వింటుంటే నిజమా! అనిపిస్తాయి.
నిజంగా నిజమేనా అన్న అనుమానం కలిగిస్తాయి. నిజమెంతో
నిగ్గుతేల్చే అవకాశం లేనప్పుడు –పోనీ మంచి విషయమే కదా నమ్మేస్తే పోలా అని కూడా
అనిపిస్తుంది. అలాటి నమ్మలేని ఓ నిజం నెట్లో సంచరిస్తోంది. నమ్మితే నమ్మండి.
ఇంతకీ ఆ నమ్మలేని నిజం ఏమిటో తెలుసా?
నిజానికి
ఇందులో నిజమెంతో తెలియదు కాబట్టి ఒక కధలాగానే చెప్పుకుందాం.
అనగనగా
వైద్యరాజ్ అనే వ్యక్తి ఇంట్లో మూడు పురాతన రాతి విగ్రహాలు వుంటూ వచ్చాయి. ఈ
వైద్యరాజ్ మహాశయులవారి వంశ చరిత్ర కూడా
ఘనమైనదే. ఆయన కృష్ణదేవరాయల వంశీకుడు. మూడువందల ఏళ్లనుంచి మైసూరులోని ఆయన గృహంలో ఆ మూడు
పురాతన దేవతా విగ్రహాలు తరతరాలుగా పూజలందుకుంటున్నాయి. నిజానికి అవి రాళ్ళూ కావు.
దేవతా విగ్రహాలు కావు. లెక్కకట్టడానికి సాధ్యం కాని విలువైన వజ్రాలు. ఈ సంగతి
బయటకు పొక్కీపొక్కక ముందే ఆ వజ్రాలను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కారణాలు
తెలవవు కాని ఆ వజ్రాలను ప్రస్తుతం ఓ స్విస్ బ్యాంకులో భద్రపరిచి వుంచారు.
అసలు
ఈ కధలోని అసలు కధ ఇక్కడే మొదలవుతుంది.
ఈ
వజ్రాల విలువను లెక్కకట్టి చూసారు. లెక్కకట్టిన నిపుణులు ఆశ్చర్యంతో నోళ్ళు
వెళ్ళబెట్టారు.
ఈ మూడు
వజ్రాలలో ఒక్కొక్క దాని విలువ ఎంతంటే అమెరికా, ఇంగ్లాండ్ ఈ రెండు దేశాల స్తూల
దేశీయ ఉత్పత్తికంటే ఎక్కువ. వీటిని కొనగలిగిన డబ్బు ప్రపంచ బ్యాంకు దగ్గర కూడా
లేదు.
అంతే
కాదు వీటిల్లో ఒక్క వజ్రం విలువ తీసుకున్నా – ప్రపంచ బ్యాంకు నుంచి మన దేశం
ఇంతవరకు తీసుకున్న అప్పుకు మూడు రెట్లు ఎక్కువ. పది మంది బిల్ గేట్స్ సంపదకు
సమానం. వీటితో ఏడు వర్ధమాన దేశాలను కొనుగోలు చేయవచ్చట. ఇంకో ‘ట’ కూడా వుంది.
వాయిదాల పద్ధతిలో అమ్మితే కొనడానికి సిద్ధం అని ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చిందట.
అయితే మన ప్రధాన మంత్రి గారు మాత్రం ‘ససేమిరా’ అనేసారుట.
మామూలుగా ఇలాటి విషయాలు
చెప్పేవాళ్ళు పలానా పేపర్లో రాశారు చూడలేదా అనేస్తారు. అలాగే ఈ కధ చెబుతున్న
వాళ్లు కూడా 2011 లోనే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ వార్త వేసారు, వీలయితే ఆ
పాత పేపరు తెచ్చుకుని చదువుకోమంటున్నారు.
హిందూ లో కూడా రాశారు చూసుకోమంటున్నారు. స్టార్ టీవీ వాళ్లు ఈ వజ్రాల వ్యవహారం
గురించి ఓ డాక్యుమెంటరీ ప్రసారం చేశారంటున్నారు.
ఇదంతా చదివిన తరువాత ఎప్పుడో
ఏనాడో విన్న ‘ఫారెన్ లాటరీ’ సంగతులేమైనా గుర్తుకువస్తే మాత్రం నా పూచీ లేదు. (30-04-2013)
Note: Courtesy Image Owner
