1975 జులై నెలలో ఒక రోజు. లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
1975 జులై నెలలో ఒక రోజు. లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, జులై 2026, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (338) : భండారు శ్రీనివాసరావు

 

1975 జులై నెలలో ఒక రోజు.
“ఏం ఉద్యోగాలండీ! ఒక ఇల్లు పట్టదు, ఇల్లాలు పట్టదు. నిండు నెలల మనిషిని ఇంట్లో ఒంటరిగా వదిలేసి, నైట్ డ్యూటీలు ఏమిటి చోద్యం కాకపోతే! వెళ్ళండి! వెళ్లి చూడండి, అమెరికన్ ఆస్పత్రిలో రాత్రి మీ ఆవిడ డెలివరీ అయింది. మగపిల్లాడు. అర్ధరాత్రి నొప్పులు వస్తే నేనే తీసుకువెళ్ళాను’ అంటున్నారు మా ఇల్లుగలావిడ రమణి గారు, తెల్లారకముందే మా తలుపు కొట్టి లేపుతూ.
నాకు నిద్ర మత్తు దిగిపోయింది. బెజవాడ బందరు రోడ్డు ఆంధ్రజ్యోతిలో నైట్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి ఇంట్లో మా ఆవిడ నిర్మల కనిపించలేదు. నొప్పులు వచ్చే రోజులు. పక్క ఇంట్లో రమణి గారింట్లో పడుకుందేమో అనుకున్నా. పెద్ద పిల్లాడు సందీప్ ని దాదాపు వాళ్ళే పెంచుతున్నారు, నెలలు నిండిన మా ఆవిడకు కాస్త ఉపశమనంగా వుంటుందని. రమణి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు. వాళ్ళూ చిన్నవాళ్లే! అంచేత, రెండేళ్ల ఈడువాడయిన సందీప్ ని బాగా ముద్దు చేసేవాళ్ళు. ఎక్కువసేపు వాళ్ళ ఇంట్లోనే వుండేవాడు. వాళ్లకు ఒక పెద్ద ఆల్సేషియన్ కుక్క వుండేది. వాడికి బెస్ట్ ఫ్రెండ్.
లేచి హడావిడిగా తయారై రిక్షా చేసుకుని అమెరికన్ ఆసుపత్రికి వెళ్లాను. జనరల్ వార్డులో ఒక మంచం మీద పడుకుని వుంది. నన్ను చూసి నీరసంగా నవ్వింది. కళ్ళతోనే సైగ చేసి చూపించింది, పక్కన బొద్దుగా వున్న పసివాడిని. ‘అయ్యో మళ్ళీ మగపిల్లవాడేనా!’ అనబోయి తమాయించుకున్నాను. ఒక మగ, ఒక ఆడపిల్ల అయితే చాలనుకున్నాము. మా ఇద్దరికీ ఆడపిల్లలంటే ఇష్టం. కానీ దైవ నిర్ణయం వేరేగా వుంది.
సండేనాడు పుట్టాడు కనుక పెద్ద వాడిని సందీప్ అనే పీరుతో పిలిచేవాడిని. ప్రత్యేకంగా బారసాలలు, నామకరణాలు లేవు. మా పెళ్ళే గుళ్ళో పెళ్లి. ఇక ఇలాంటి వేడుకలకు ఆస్కారమే లేదు.
ఎప్పుడూ ఆనందంగా వుండాలనే నా ఫిలాసఫీకి అనుగుణంగా రెండో వాడికి సంతోష్ అనే పేరు పెట్టాను. ఈ పేర్ల విషయంలో ఎలాంటి పట్టింపులు పెట్టుకోలేదు. ఎవరినీ సంప్రదించలేదు. జాతకాలు రాయించలేదు.
రెండో వాడు పుట్టిన తర్వాత కొన్ని నెలలకే నాకు హైదరాబాదు ఆలిండియా రేడియోలో ఉద్యోగం వచ్చింది.
పెట్టే బేడా సర్దుకుని హైదరాబాదు చేరాము. అప్పటికే మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు స్టేట్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ గా అక్కడ పనిచేస్తున్నారు. అశోక్ నగర్ లో బ్యాంకు వాళ్ళు ఇచ్చిన ఒక పెద్ద ఇంట్లో వుంటున్నారు. మాకు ఇల్లు దొరికేంతవరకు వాళ్ళింట్లోనే మా మకాము. వాళ్లకి అందరూ మగపిల్లలు. జవహర్, సుభాష్, లాల్ బహదూర్, రాజేంద్ర ప్రసాద్. జాతీయ నాయకుల పేర్లు. వీళ్ళకి తోడు మా ఇద్దరు పిల్లలు. ఇల్లు ఎప్పుడు సందడి సందడిగా వుండేది.
తర్వాత చిక్కడ పల్లి త్యాగరాయ గానసభ సభ దగ్గర మాకు ఓ రెండు గదుల వాటా అద్దెకు దొరికింది. అక్కడికి మారిపోయాము.
పిల్లల్ని కొంచెం దగ్గరలో వున్న సెంట్ ఆంథోనీ స్కూల్లో చేర్పించాము. డొనేషన్ అడగకుండా రేడియోలో నా ఉద్యోగం పనికొచ్చింది. అయితే ఒక విషయంలో నాకూ స్కూలు వాళ్లకు చిన్న పేచీ వచ్చింది. దరఖాస్తు పత్రంలో కులం అనే కాలమ్ నింపడానికి నేను సుతారమూ ఒప్పుకోలేదు. చివరికి ప్రిన్సిపాల్ గ్రెగరీ రెడ్డి గారే ఒక మెట్టు దిగి అడ్మిషన్ ఇచ్చారు. స్కూలు స్థాయి నుంచే మా పిల్లలు తమ కులం ఏదో తెలియకుండా పెరిగారు.
మాస్కోలో నా ఉద్యోగం నాకు ఎందుకు పనికిరాకపోయినా పిల్లలు ఇద్దరికీ కలిసి వచ్చింది. ఒక అంతర్జాతీయ వాతావరణంలో ఎదగడం జీవితంలో ఎదుగుదలకు వారికి బాగా తోడ్పడింది. పెద్ద గొప్ప డిగ్రీలు లేకపోయినా మంచి ఉద్యోగాలే సంపాదించుకున్నారు. వారి నెల జీతాలతో పోలిస్తే నా ఏడాది జీతం చాలా తక్కువ.
పెద్దవాడు సందీప్ కి పెళ్లి కాగానే ఇన్ఫో సిస్ లో ఉద్యోగం వచ్చింది. వాళ్లది ప్రేమ వివాహమే. కంపెనీ వాళ్ళే అమెరికా పంపించారు.
రెండో వాడు సంతోష్ కూడా పుణేలో ఒక మంచి ఎం ఎన్ సీ లో ఉద్యోగం. కానీ ఒక చట్రంలో ఇమిడే రకం కాదు. ఏదో చేయాలని, ఏదేదో సాధించాలని తాపత్రయం.
బంగారం లాంటి ఉద్యోగం వదిలిపెట్టి హైదరాబాదులో మై ఆఫీసు డాట్ కాం అనే కంపెనీ పెట్టాడు. స్నేహితులే సాయం చేశారు. నేను ఒక్క రూపాయి ఇవ్వలేదు, ఇవ్వడానికి నా దగ్గర ఏమైనా ఉంటేగా. ‘అమ్మా! నాన్న నా ప్రయత్నానికి అడ్డు చెప్పలేదు, అదే ఆయన నాకు చేసిన సాయం’ అనేవారు వాళ్ళ అమ్మతో.
అనుకూలమైన భార్య వచ్చింది. అదే వాడి అదృష్టం. వాడి పెళ్లి కూడా వాడి ఇష్టం ప్రకారమే జరిగింది. మా పనల్లా ఎందుకు ఇలా చేశారు అని కోపడి అక్షింతలు వేయకుండా, ఆశీర్వదించి నెత్తి మీద అక్షింతలు వేయడమే. మా పెళ్లి కూడా అలా జరిగిందే కదా!
పిల్లలిద్దరికీ నా చేతిలో వున్నది కూడా చేయలేకపోయాను. అయినా వాళ్ళు తమంతట తాము పైకి వచ్చారు, ఎప్పుడు నా మీద ఎలాంటి నెపం మోపకుండా. తల్లి చనిపోయినప్పుడు కూడా వాళ్ళే యావత్తు భారం మోశారు. నేను నిమిత్తమాత్రుడిగా మౌనంగా చూస్తూ వుండి పోయాను.
రెండోవాడికి వాళ్ళ అమ్మ అంటే అపరితమైన ప్రేమ. మా కాపురంలో ఆర్ధికంగా ఎన్ని బాధలు పడిందీ కళ్ళారా చూసాడు.
‘చూస్తుండు, ఒకనాడు నువ్వు మహారాణీలా వుండేలా చూస్తాను’ అనే వాడు.
బహుశా ఇక్కడ చేయలేనిది స్వర్గంలో చేసి చూపిద్దామని అనుకున్నాడేమో, తల్లి చనిపోయిన కొన్నేళ్ళకే, వాడూ అక్కడికే వెళ్ళిపోయాడు.
దేవుడికి మాత్రం తెలియదా తనకు దగ్గరి వారెవ్వరో! అందుకే వాళ్ళిద్దరినీ తన దగ్గరకు చేర్చుకున్నాడు.
“సంతోష్! నువ్వూ అమ్మా ఇద్దరూ ఒకే తేదీన పుట్టారు. తను ఫిబ్రవరి తొమ్మిది, నువ్వు జులై తొమ్మిది. చెట్టంత పెరిగి చల్లగా చూసుకుంటావని కన్న కలలు కల్లలు అయ్యాయి. అయినా నీ చేతిలో ఏముంది?
“ఈరోజు, జులై తొమ్మిది. నీ పుట్టినరోజు. నీకు శుభాకాంక్షలు. నువ్వు ఎక్కడ వున్నావో తెలియదు కానీ, అక్కడినుంచే నీ చిన్నారి ముద్దులపట్టి జీవికను ఆశీర్వదించు. నీ ఫోటో చూడగానే నాన్న, నాన్న అంటుంది.
“నువ్వెలా మరచిపోతావ్!”








(ఇంకావుంది)