మూడేళ్ళ కిందటి
ముచ్చట.
లండన్ నగరంలోని
భూగర్భ మార్గంలో వెళ్ళే మెట్రో (ట్యూబు) రైల్లో ఇరవై ఏడేళ్ళ భారతీయ యువతి ప్రయాణం చేస్తోంది. వెంట భర్త,
వొళ్ళో మూడు నెలల పసి పిల్లాడు వున్నారు. అదే రైల్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి
ఆమెను చూసి పలకరింపుగా నవ్వాడు. తన వొడిలో వున్న పిల్లవాడిని చూస్తూ 'చాలా
ముద్దొస్తున్నాడు మీ బాబు' అన్నాడు. ఆమె ఆయన్ని తేరిపార చూసింది. ఎక్కడో చూసినట్టు
అనిపిస్తున్న ఆ పెద్ద మనిషిని ఎక్కడ చూసింది చప్పున గుర్తురాలేదు. పక్కన వున్న
భర్తను అడిగింది, ఆయన ఎవరని. అప్పటిదాకా ఆయన్ని గమనించని ఆవిడ భర్త ఒక్క క్షణం
విభ్రమానికి గురయ్యాడు. వెంటనే అన్నాడు, 'ఆయన
ఎవ్వరా! బ్రిటిష్ ప్రధాన మంత్రి డేవిడ్ కేమెరాన్!'
'చాల్లే నీ
పరిహాసం. ప్రధాని రైల్లో ఎందుకు వస్తాడు. నన్ను వెర్రిదాన్ని చేయాలని చూడకు'
అందామె మొగుడితో.
'అయితే నువ్వే
వెళ్లి అడుగు' అనేశాడు సంభాషణ ముగిస్తూ.
ఆమె ముందుకు కదిలి
వెళ్లి మొహమాట పడుతూనే అడిగింది, 'మీరు ప్రధాని డేవిడ్ కేమెరాన్ కదా!' అని.
'అవును' అన్నాడు
ఆయన, నిలబడి చదువుతున్న పేపర్ ని మడుస్తూ.
'నేనో అర్జంటు
మీటింగుకు వెళ్ళాలి. కారులో సమయం పట్టేట్టు వుంది. మెట్రోలో అయితే త్వరగా చేరుకోవచ్చనిపించి
రైలెక్కాను' అన్నాడాయన చిరునవ్వుతో. ప్రధాని వెంట ఒక బాడీ గార్డు వుండడం
గమనించింది ఆమె.
'ఇది తను పుట్టిన
భారత దేశంలో సాధ్యమా?' అన్న ప్రశ్న ఆమె మెదడును తొలిచేసింది.
ఢిల్లీలో, ముంబై లో
రైళ్ళలో తిరిగిన అనుభవం ఆమెకు వుంది. కానీ లండన్ రైల్లో ఇలాటి అరుదయిన అనుభవం
ఎదురుకాగలదని తాను ఎన్నడూ ఊహించలేదని చెప్పినట్టు
ఆమెను ఉటంకిస్తూ డైలీ మిర్రర్ పత్రిక ఒక కధనాన్ని ప్రచురించింది.
చూసి నేర్చుకోవాలని
అంటారు మరి.
చూస్తాం, చదువుతాం
కాని, నేర్చుకోవడం అంత వీజీ ఏమీ కాదు.
Note: Courtesy Image Owner