పేరులో ఏముంది? లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పేరులో ఏముంది? లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, జులై 2026, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (348) : భండారు శ్రీనివాసరావు


పేరులో ఏముంది?
బుడుగును 'బుడుగూ' అని పిలుస్తారు బాపూరమణలు.
'బుడ్గూ' అంటాడు గోపాళం
'హారి బుడుగు కన్నా' అంటుంది వాళ్ళమ్మ.
'బుడుగు అసలు పేరు చాలా పొడుగు. అందుకే బుడుగూ అంటాం వాయ్' అంటాడు రమణ గారి జోకుకి కాపీరైట్ తీసుకుంటూ గిరీశం.
'బుడుగా ఏంటి బుడుగు అసయ్యంగా. మడుగూ బుడుగూ. నాకో పేరు లేదా ఆయ్' అంటాడు అగ్నిహోత్రావధాన్లులాగా గయ్యి మంటూ, అసలు బుడుగు.
'ఏంది గురూ! ఈ పేర్ల గోల పొద్దున పొద్దున్నే’ అంటుంది సీగానపెసూనాంబ.
శాల్తీ ఒక్కడే. పేర్లు అనేకం. బుడుగన్నా, కన్నా అన్నా, ఏం గురూ అన్నా, ఏ పేరు పెట్టి పిలిచినా, అసలు ఏ పేరు పెట్టకుండా అరేయ్ ఒరేయ్ అని పిలిచినా, ఎంచక్కా పలుకుతాడు బాపూరమణల బుడుగు లోపల కాస్త ఉడుక్కున్నా.
బుడుగుకే కాదు, పుట్టిన ప్రతివారికీ ఈ పేర్ల తిప్పలు తప్పవు. పుట్టించిన భగవంతుడికి కూడా అనేకానేక పేర్లు. సహస్ర నామాలు, శత సహస్ర నామాలు.
చిన్నప్పుడు నేను పుట్టినప్పుదు నామ నక్షత్రం ప్రకారం పెట్టిన పేరు శ్రీనివాసరావు.
కానీ ఇంట్లో ముద్దు పేరు సీనప్ప.
అలాగే ఆ పేరుతోనే పెరిగాను. పెరిగి పెరిగి పెద్దయి, ఇక పెరగడం చేతకాక ఆంధ్రజ్యోతిలో చేరాను.
చేరిన తరవాత తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు జ్యోతి శ్రీనివాస్ అన్నారు. కావమ్మ గారి మొగుడిలా కామోసు అనుకున్నా. తర్వాత రేడియోలో చేరిన తర్వాత రేడియో శ్రీనివాస్.
ఆ పిమ్మట జీవన స్రవంతి శ్రీనివాస్.
అక్కడితో ఆగిందా.
మాస్కో శ్రీనివాస్.
పెద్ద పత్రికల తాలూకు పిల్ల పత్రికల్లో నా గురించిన ఏదైనా చిన్న వార్త వేయాల్సివస్తే, కంట్రిబ్యూటర్ల పుణ్యమా అని ఇంటి పేరులో వత్తు తీసివేసి బండారు అనీ, భండారి అనీ రకరకాల చిత్ర వధలు.
కొన్నేళ్ళ క్రితం ఒక మీడియా ఫంక్షన్ కు వెళ్లాను.
ఆక్కడ అందరూ నన్ను పలానా టీవీ శ్రీనివాసరావు అనడం మొదలు పెట్టారు. నిజానికి ఒక్కొక్కరు ఓ టీవీ పేరు చెబుతున్నారు. నాకూ ఆ టీవీలకి ఏమీ సంబంధం లేదు, రోజూ పొద్దున్నా సాయంత్రం ఏదో ఒక టీవీ చర్చకు వారాలబ్బాయి మాదిరిగా చర్చలకు వెళ్లి రావడం తప్ప. ఇప్పుడు అదీ లేదు, ఫేస్ బుక్ లో తోచినవి, తోచనివి గిలకడం.
ఇలాగే ప్రతివారికి జీవితం చివరాఖర్లో, చెప్పుకోవడానికి, పిలవడానికి ఎన్నో ఇంటి పేర్లు సిద్ధిస్తాయి.
నా వయసు రేపు ఆగస్టులో ఎనభయ్ నిండుతుంది. ఉద్యోగం చేసే వయసు కాదు, ఎవరన్నా తలచుకుని ఉద్యోగం ఇచ్చే వయసు అంతకంటే కాదు.
అసలు విషయం ఇది కాదు.
జనం నన్ను గుర్తు పడుతున్నారు. గుర్తుపట్టి పలకరిస్తున్నారు ఆప్యాయంగా.
నిరుడు అమెరికా వెళ్ళినప్పుడు మా అబ్బాయి సియాటిల్ లో ఓ ఇండియన్ రెస్టారెంట్ కి డిన్నర్ కి తీసుకువెళ్లాడు. ఒకతను నావైపు దీక్షగా చూసి, ‘మీరు ఫేస్ బుక్ శ్రీనివాస రావు కదా’ అని పలకరించాడు. ‘నన్నెలా గుర్తుపట్టాడు’ అని ఆశ్చర్యపోతూ వుంటే, ఆయనే సందేహ నివృత్తి చేసారు.
' లోగడ టీవీ చర్చల్లో కనపడే వారు, ఇప్పుడు రావడం లేదు. నేను ఫేస్ బుక్ లో మీరు రాసినవి ప్రతీదీ చదువుతుంటాను. మీరు సియాటిల్ వచ్చారని ఫేస్ బుక్ ద్వారానే తెలిసింది. అంచేతే తేలిగ్గా గుర్తు పట్టాను’ అన్నారాయన కరచాలనం చేస్తూ.
అంటే నా సహస్ర గృహ నామావళిలో మరో ఇంటి పేరు ఫేస్ బుక్ శ్రీనివాసరావు చేరిందన్న మాట.
ముప్పయ్యేళ్ళ రేడియో సర్వీసు ఎటు పోయిందో ఏమో, ఫేస్ బుక్ రాతలే పెద్ద పీట వేసుక్కూర్చున్నా యల్లే వుంది. కనిపించివాళ్ళ పలకరింపులన్నీ ఆ పేరు మీదే. ఆ ఖాతాలోనే.
తోక టపా:
ఒకరిని అంటే పడే రోజులు కావివి. అంచేత నామీదే వేసుకుని చెబుతున్నాను.
కొన్నేళ్ళ క్రితం అమెరికా నుంచి మా అబ్బాయి సందీప్ వచ్చాడు. చుట్ట పక్కాలకు, స్నేహితులకు కొన్ని కానుకలు పట్టుకొచ్చాడు. వాటి మీద వున్న ప్రైస్ టాగ్స్ తీసేస్తుంటే నేనన్నాను, ‘అలా వుంచి ఇస్తే తీసుకున్న వాళ్లకు వాటి విలువ తెలుస్తుంది కదా’ అని. వాడన్నాడు, ‘ఏదో గొప్ప కోసం తేలేదు, అభిమానం కొద్దీ తెచ్చాను. అక్కడ టైము లేక తీయలేదు’
నాకేమనాలో తోచలేదు. కానీ భేషజాలకు సంబంధించిన ఒక పాఠాన్ని ఆ రోజు మా వాడి నుంచి నేర్చుకున్నాను.
అదే రోజు సాయంత్రం గుడికి వెళ్ళాము. అక్కడ తిరిగే ఫ్యాన్ల మీదా, వెలిగే ట్యూబ్ లైట్ల మీదా వాటిని విరాళంగా ఇచ్చిన దాతల పేర్లు రాసి వున్నాయి. చేసిన పనిని గొప్పగా చెప్పుకోవడంలో తాపత్రయమే నాకు వాటిలో కనిపించింది. ఆ రోజు నేర్చుకున్న పాఠం మహిమ కాబోలు.
టీవీలో సినిమా వస్తోంది. ‘ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా!’ బందీఖానాలో కొరడా దెబ్బలు తింటూ కంచెర్ల గోపన్న (భక్త రామదాసు) పాడుతున్నాడు. తాను భద్రాద్రి రాముడికి చేయించిన నగలు వాటి ఖరీదు గురించి వివరిస్తున్నాడు.
ఏవిటో ఒకదానికొకటి సంబంధం లేని అంశాలు అనిపిస్తోంది కదూ.
ప్రాజెక్టుల మీదా, పధకాల మీదా ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు నిజానికి ఆయా పాలక పార్టీలది కాదు, పన్నులు కడుతున్న ప్రజలది. కానీ ఆ క్రెడిట్ (పేరు) మాదంటే మాదని వాదులాడుకుంటున్న తీరు సరిగా లేదనిపిస్తుంది.
ప్రజలు చూసి చూసి విసుగెత్తి ఎప్పుడో అప్పుడు, రామదాసు గారు ఎద్దేవా చేసినట్టు, ‘ఎవడబ్బసొమ్మని కులుకుతూ తిరిగేరు’ అని ప్రభుత్వాలని నిలదీయకుండా జాగ్రత్త పడడం మంచిదేమో!
(ఇంకావుంది)

23, ఏప్రిల్ 2021, శుక్రవారం

పేరులో ఏముంది?

 

కొండల మీద, గుట్టల మీద వెలిసిన దేవుడి గుళ్ళకు వెళ్ళడానికి మెట్ల దారులు వుంటాయి. ప్రతి మెట్టు మీద దానికయ్యే ఖర్చు దానం చేసిన వ్యక్తి పేరు చెక్కించే వారు. అంత ప్రచారం అవసరమా అనేది నా సందేహం. ‘వాళ్ళు ప్రచారం కోసం అలా పేర్లు రాయించుకోలేదు, మెట్లెక్కి వెళ్ళే భక్తులు తమ పేర్లను తొక్కుకుంటూ వెడితే పుణ్యం’ అని ఓ వివరణ. సరే! బాగానే వుంది. మరి గుడిలో వుండే పంకాల మీద వాటిని విరాళంగా ఇచ్చిన వారి పేర్లు అవసరమా! ఈ ప్రశ్నకు జవాబు లేదు.

కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదని అంటారు. కానీ రోజులు మారాయి. ప్రధాని/ ముఖ్యమంత్రి సహాయ నిధికి పలానా వారి విరాళం ఇంత అని ట్వీట్ ముందు, ఇవ్వడం తరవాత. అంటే ఏమన్నమాట. ప్రచారం లేకుండా ఏ మంచి పని చేసినా శుద్ధ దండగ అనే వారి సంఖ్య పెరుగుతున్న కాలంలో మనం జీవిస్తున్నాం.

కంచర్ల గోపన్న గారు ఎలాంటి ప్రచార యావ లేకుండా భద్రాచల రాముడికి గుడి కట్టించాడు. భక్త రామదాసుగా మారిన తర్వాత, తానీషా బందికానాలో వేసి పెట్టిన చిత్రహింసలు భరించలేక సీతమ్మ తల్లితో పాటు రామలక్ష్మణులకు, భరత శత్రుఘ్నులకు చేయించిన ఆభరణాలు గుర్తుకు వచ్చి, వాటిని చేయించేందుకు అయిన ఖర్చు అణాపైసలతో(వరహాలు, మొహరీలు) సహా లెక్కలు కట్టి పాటలు పాడుతూ చెప్పిన సంగతి తెలిసిందే.

తిరుమల దేవాలయానికి పునాది రాయి వేసింది ఎవరో తెలియక పోయినా, ఓ చిన్న కాలనీలో కట్టిన ఓ చిన్న గుడికి ఎవరు శంకుస్థాపన చేసారో, ఎవరు ప్రారంభోత్సవం చేసారో తెలిపే ఖరీదైన చలువరాతి ఫలకం గుడి ముఖ ద్వారం కంటే గొప్పగా కనిపించేటట్టు పెట్టడం తెలియని వాళ్ళు లేరు.

ఎవరిదో నాయకుడి పుట్టిన రోజు నాడు ఆసుపత్రులలో రోగులకు పళ్ళు పంచిపెడతారు. మంచి సంగతే.
ఆ ఫోటోలు పత్రికల్లో రావడానికి ఇచ్చే ప్రకటనల డబ్బులతో మరి కొన్ని ఆసుపత్రులలో ఇదే సత్కార్యం చేయవచ్చు కదా అని అడిగితే, ‘అలా ఎలా! పేరూ ఊరూ లేని పనులు చేయడానికి మాకు మరో పని లేదనుకున్నారా’ అన్నట్టు చూస్తారు.

ఇంతెందుకు! ఫేస్ బుక్ లో నేను రాసిన పోస్టును ఎవరో లేపేసి అతడి పేరుతొ పోస్టు చేసుకుంటే నా సొమ్మంతా పోయినట్టు నేనే ఎన్నిసార్లు గగ్గోలు పెట్టలేదు.

పేరులో ఇంత విషయం వుంది కాబట్టే పేరు కోసం ఇన్ని పాట్లు.
ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటారా!

ఆక్సిజన్ ట్యాంకుల సరఫరా ఏర్పాట్లు గురించి వేర్వేరు పార్టీల అభిమానులు పోస్టించిన కధనాలే.
(23-04-2021)