నాలుగేళ్ల నాటి సంకల్పం
కిందటి నెల ఆగస్టు పదిహేడున మొదటి గంట మోగింది.
నేను కూడా గమనించలేదు. ఏడేళ్ల క్రితం ఆగస్టు మూడో వారంలోనే మా ఆవిడ నిర్మల, నా వడిలోనే, నా కళ్ళ ఎదుటే కన్ను మూసింది.
మళ్ళీ అదే ఆగస్టులో అదే రోజుల్లో నేను బాత్ రూమ్ లో జారిపడ్డాను. కోడలు నిషా ఇంట్లో వుండడం వల్ల బతికి బయట పడ్డాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే పదిహేడు రోజులపాటు కంప్యూటర్ ముందు కూర్చోలేదు. కొత్తగా నాలుగు అక్షరాలు కూడా రాయలేదు.
గతంలో ఎన్నోసార్లు రాసినట్టు, ఆగస్టు అంటే ఓ నిర్లిప్తత. ఓ నిస్తేజం. తలుచుకున్నా, తలచుకోకపోయినా మనసును క్లేశపరిచే అనేక జ్ఞాపకాలు. అన్నింటికంటే నేను ఎక్కువ బాధ పడింది, ఆమె చనిపోయిన తేదీని ఎలా మరచిపోయాను అనేది.
బాత్ రూమ్ ఘటన కాకతాళీయం అయినా, నాకెందుకో పై వాడు మొదటి గంట కొట్టాడు అనిపించింది. సరే! జరగాల్సిన కార్యక్రమం, జరగాల్సిన రీతిలో కాకపోయినా తరువాత, తెలుగు తిథుల ప్రకారం సరైన రోజునే జరిపి మమ అనిపించాను. మనసుకు సర్ది చెప్పుకోవడానికి ఆ ఘటన ఒక గుడ్డి కారణం.
దరిమిలా శరీరం బాగానే వున్నా, మనసు మాత్రం ఘనీభవించింది. చాలా మంది మితృలు నా ఆరోగ్యం పట్ల ఆందోళన చెంది ఫోన్లు చేశారు. మెసేజ్ లు పెట్టారు. నేను బాగానే వున్నాను అని నలుగురికీ తెలియడానికి అవే రోజుల్లో హైదరాబాదు ప్రెస్ క్లబ్ నిర్వహించిన అనేక కార్యక్రమాలకు కొద్ది నిమిషాల పాటే అయినా హాజరై, మితృలకు నా మొహం చూపించాను. అయినా చాలా మందికి నా ఆరోగ్యం పట్ల అనుమానాలు అలాగే వున్నాయని నా అనుమానం.
ఇక చీకట్లో చిరుదీపంలా నాలుగేళ్ల నాటి ఓ సంకల్పం ఇదే కాలంలో నెరవేరింది. కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు అంటారు. కానీ చెప్పక తప్పడం లేదు.
మా స్వగ్రామం కంభంపాడులో మండే ఎండల్లో, కాలిపోతున్న రేకుల షెడ్డులో, కనీస దూరంలో విద్యుత్ వెలుగులు కనిపించని ఊరి బయట పొలాల్లో నివసిస్తున్న ఓ వృద్ధుడి కధ అది.
కదల కోసం కంచికి పోనవసరం లేదు, జీవితాల్లోకి తొంగి చూస్తే కనబడతాయి, మనసును ఆర్ద్రం చేసే అనేక కధలు. అలాంటిదే ఇది.
మా స్వగ్రామంలో పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తి కొంత వుంది. వుందని తెలుసు కానీ వాటి ఆజాపజా మా అన్నదమ్ములు నలుగురికి కానీ, అన్నదమ్ముల మగ సంతానం పదిమందికి కానీ ఎవరికీ తెలియదు. కొంచెం తెలిసిన మా మూడో అన్నయ్య అకాలంగా కాలం చేశాడు. అల్లాగే మా పెద్దన్నయ్య కూడా. ఇప్పుడు ఇద్దరం మిగిలాము. చిన్నవాడినైన నాకే డెబ్బయి ఆరు. (నాలుగేళ్ల నాటి మాట) మా రెండో అన్నయ్య ఎనభయ్ కి దగ్గరలో వున్నాడు. ఇక ఆస్తి పాస్తులు గురించి తెలుసుకోవాల్సిన అవసరం మా ఇద్దరికీ ఈ వయసులో ఉంటుందని అనుకోను.
ఈ నేపధ్యంలో మా మూడో అన్నయ్య కొడుకు భండారు రమేశ్ వీటి విషయం తెలుసుకోవాలని నడుం కట్టాడు.
అడ్డదిడ్డంగా పెరిగిన చెట్లూ పుట్టల్ని తొలగించి పొలాలని కొత్తగా సర్వే చేయించే బృహత్తర కార్యక్రమాన్ని ఆ ఏడాది మండే వేసవి ఎండల్లో నెత్తికి ఎత్తుకున్నాడు. ఈ క్రమంలో వాడి కంటికి కనిపించిన ఒక మానవీయ దృశ్యానికి అక్షర రూపం ఇచ్చాడు. అదే ఇది:
“ ఆ వృద్ధుడి పేరు పిండిప్రోలు పిచ్చయ్య. భార్య పేరు పిచ్చమ్మ. వీరికి ఒక కూతురు కూడా ఉంది. ఎదిగిన ఆ అమ్మాయికి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. తల్లీ కూతుళ్లు ఇద్దరూ కూడా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ వుండడంతో తమ ఇళ్ళ మధ్య వాళ్ళు ఉండటానికి గ్రామస్తులు ఇష్టపడ లేదు.
ఈ నేపధ్యంలో వారి మకాము ఊరి బయటకు మారింది. మండుటెండల్లో , చెట్టు నీడ కూడా లేకుండా, ఒక రేకుల షెడ్డు లోనే ఉంటున్నారు. కనీసం తాగడానికి నీళ్లు లేక పోగా, కనుచూపు మేరలో విద్యుత్ వెలుగులు కనిపించవు. పిలిచినా పలికే నాధుడు లేకుండా కటిక చీకట్లో కాలం వెళ్లదీస్తున్నారు. తల్లి కూతుర్లు ఆ రేకుల షెడ్డు దాటి బయటకు రారు, రాలేరు’
25-04-2022 న ఇదంతా వివరంగా ఒక పోస్టులో రాశాను.
ఈ కధ సాంఘిక మాధ్యమంలో కనిపించిన తర్వాత కదలిక మొదలయింది. మా మూడో అన్నయ్య కుమారుడు భండారు రాఘవరావు రెవెన్యూ శాఖలో ఉద్యోగం కనుక, ఊరి పెద్దలను సంప్రదించడం, కొందరు పూనుకుని మా పొలం పక్కనే వున్న ప్రభుత్వ పోరంబోకు (బంజరు) స్థలంలో చిన్న రేకుల షెడ్డు వేసుకునే ఏర్పాటు చేశారు.
ఇది నాలుగేళ్ల నాటి సంగతి. ఆ రోజుల్లో ఒకసారి మా ఊరు వెళ్ళినప్పుడు ఆ కుటుంబం పరిస్థితి కళ్ళారా చూసాను. ఎలాగైనా ఆ ఇంటికి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్న సంకల్పం కలిగింది.
కానీ ఎలా! నేను హైదరాబాదులో వుంటాను. పైగా వాళ్ళు ఉంటున్న షెడ్డు ఊరికి దూరంగా ఎక్కడో పొలాల నడుమ వుంది. దానికి సమీపంలో ఎక్కడా డొమెస్టిక్ కరెంటు లైన్ లేదు. ఇవేవీ ఆలోచించకుండా చేసుకున్న సంకల్పం.
ఈ లోగా ఇటువంటి ఛారిటీ కార్యక్రమాలకు ముందుండే మా రెండో కుమారుడు సంతోష్ 2024 లో హఠాత్తుగా గుండె పోటుతో మరణించాడు.
ఈ నేపధ్యంలో, నాలుగేళ్ల క్రితం పిచ్చయ్య ఇంటికి వెళ్లి, ‘మీ ఇంటికి కరెంటు తెప్పించే బాధ్యత మా కుటుంబానిది’ అని చెప్పివచ్చిన మాట, నోటిమాటగానే మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది.
మూడో అన్నయ్య కుమారుడు భండారు రమేశ్ ఒక మార్గం సూచించాడు. అదే సోలార్ పవర్. విద్యుత్ స్తంభాలు, లైన్ల అవసరం లేకుండా సోలార్ లైట్ బిగిస్తే ఆ కుటుంబానికి అదనపు భారం వుండదు అనే సలహా నాకు నచ్చింది. మా రమేశ్ పూర్తి బాధ్యత తీసుకున్నాడు. కేవలం డబ్బుతో ఏ సంకల్పం నెరవేరదు. పూనుకుని చేసే మనిషి కావాలి. ఆ కష్టం అంతా వాడు పడ్డాడు. మొన్న ఫోన్ చేసి ఆ ఇంట్లో సోలార్ లాంప్ బిగించాము అని రమేశ్ చెప్పినప్పుడు సంతోషం అనిపించింది. ఇందులో నా పాత్ర నామ మాత్రం. కాకపొతే, ‘రేపు చేద్దామని అనుకున్నది ఈ రోజే చెయ్యి’ అనేది నేను నేర్చుకున్న సూత్రం.
(ఇంకావుంది)
(03-09-2026)

