దేశంలో కాంగ్రెస్ పరిస్తితి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దేశంలో కాంగ్రెస్ పరిస్తితి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

వరస కుంభ కోణాలతో కుదేలవుతున్న కాంగ్రెస్ – భండారు శ్రీనివాసరావు


వరస కుంభ కోణాలతో కుదేలవుతున్న కాంగ్రెస్ – భండారు శ్రీనివాసరావు

కేంద్రంలో యుపీఏ సర్కారు వరసగా రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన ఆనందం ఆ కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ కు ఎన్నో ఎంతో కాలం మిగిలివుండేట్టు లేదు. వెలుగు చూస్తున్న వరస కుంభకోణాలు, మచ్చలేని ప్రధానిగా ముద్రపడిన మన్మోహన్ సింగ్ ని మానసికంగా బాగా కుంగదీస్తున్నాయి. బీహారుతో మొదలయిన కాంగ్రెస్ వ్యతిరేక ప్రజా తీర్పులు, 2014 ఎన్నికల తరవాత, రాహుల్ గాంధీని భావి భారత ప్రధానిగా చూడాలనుకునేవారి ఆశలపై నీళ్ళు చల్లుతున్నాయి. దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి ఏకైక కంచుకోటగా మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ లో – రాజశేఖరరెడ్డి మరణం తదుపరి సంభవిస్తున్న పరిణామాలు – ఆ పార్టీ భవిష్యత్తుకు పెనుసవాలుగా మారిపోతూవుండడం పార్టీ అధినేత్రి సోనియాను కలవరపెడుతున్న సంగతి బహిరంగ రహస్యం. ఏకంగా పార్టీ అధినాయకురాలినే సవాలు చేస్తూ, కొరకరాని కొయ్యగా తయారయిన జగన్ మోహనరెడ్డిని అడ్డుకోవడం కోసం తీసుకుంటున్న చర్యలు, నూటపాతికేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి శోభస్కరంగా లేవని ఆ పార్టీవారే దవడలు నొక్కుకుంటున్నారు. చిరంజీవి పార్టీని విలీనం చేసుకోవడం ద్వారా జగన్ ని నేరుగా డీకొట్టగల జనాకర్షణ స్తాయి కలిగిన నాయకుడిని రాష్ట్ర విభాగానికి సమకూర్చిపెట్టామన్న అల్ప సంతోషం మాత్రమే కాంగ్రెస్ పార్టీకి మిగిలింది. ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినంతవరకు కాంగ్రెస్ పరిస్తితి సజావుగా లేదన్న విషయం ఆ పార్టీ నాయకులకు తెలియదని అనుకోలేము. కాకపొతే, నష్టనివారణకు తీసుకుంటున్న చర్యలు సర్వజనామోదం పొందే రీతిలో లేవనే చెప్పాలి. పైపెచ్చు పరిష్కారం దిశగా వేస్తున్న అడుగులు కొత్త సమస్యలకు ఊపిరి పోస్తున్నాయి. చిరంజీవి పార్టీని తమలో కలుపుకునే క్రమంలో వేసిన ఎత్తులు పార్టీ రాజకీయ పరిణతిని సూచిస్తున్నాయని అంచనా వేసుకున్న అధిష్టానం మరి కొన్ని విలీనాలకు తెర తీయబోతున్నట్టు వెలువడిన కొత్త ఊహాగానాలు సరికొత్త చర్చలకు తలుపులు తెరిచాయి. సిద్ధాంతాలతో నిమిత్తం లేకుండా, ఎన్నికల తరవాత కుదుర్చుకునే పొత్తులతో, అధికారమే పరమావధిగా గద్దె ఎక్కాలని అనుకున్నప్పుడు, అన్ని పార్టీలను కలుపుకుని సీట్ల దామాషా ప్రాతిపదికపై, అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాలలో జాతీయ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది కదా అని భావించే వారు కూడా లేకపోలేదు.

ఇక ప్రధాని మన్మోహన్ విషయం తీసుకుంటే, ఆయనలో మొదటిసారి వున్న ధీమంతం ఇప్పుడు కానరావడం లేదు. అణు ఒప్పందం విషయంలో వామపక్షాల డిమాండ్లను, బెదరింపులను లెక్కచేయకుండా ఎదురొడ్డి నిలచిన వైఖరిని ఇంకా ప్రజలు మరచిపోలేదు. ఆయనది అధికార దాహం కాదనీ, అవకాశవాద రాజకీయం అంతకంటే కాదనీ ప్రజలు నమ్మారు. అలాగే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలోని ముఖ్య మంత్రులను ఏదో ఒక సాకు చూపి ఇంటికి పంపే పాత పద్ధతులకు సోనియా గాంధీ స్వస్తి పలికిందని మరో సంకేతాన్ని ప్రజల్లోకి పంపడంలో కూడా ఆ పార్టీ చాలావరకు మెరుగయిన ఫలితాలు సాధించింది. కాంగ్రెస్ లో వచ్చిన ఈ రకమయిన మార్పు స్వాభావికమయినదనీ, కాంగ్రెస్ నిజంగానే మారిపోయిందనీ నమ్మి గత ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీనే నెత్తిన పెట్టుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు జరిగిన ఎన్నికల్లో కూడా ఓటర్లపై ‘మన్మోహన్ – సోనియా’ ప్రభావం గణనీయంగా వుందని, వై ఎస్సార్ వ్యతిరేకులు గణాంకాలతో సహా ఇటీవలి కాలంలో పదేపదే ఉద్ఘాటించడానికి ఇది ఉపయోగపడింది కూడా.

అయితే, కేంద్రంలో రెండోసారి అధికారం లోకి వచ్చిన తరవాత, క్రమేపీ యూ పీ ఏ సంకీర్ణం లో రంగులు మారడం మొదలయింది. జట్టులోని వారంతా ఎవరికి వారు నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం ఎలాగా అనే యావ పెరిగిపోయి, అవినీతి కూపంలోకి దిగజారడంలో పోటీపడడం ప్రారంభించారు. ఫలితం, ఒలింపిక్ క్రీడల ఏర్పాటు పేరుతొ కోట్ల రూపాయలు చేతులు మారడం. టూజీ స్పెక్ట్రం కేటాయింపుల్లో లక్షల కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వ ఖజానాకు సాక్షాత్తూ పాలకులే గండి కొట్టారని ఆరోపణలు వెల్లువెత్తడం. స్వాతంత్రం వచ్చిన తరవాత వెలుగు చూసిన కుంభకోణాలు అన్నిటిలో ఇదే అతి పెద్దదని సర్వోన్నత న్యాయస్తానం పేర్కొనడాన్ని బట్టి చూస్తే, ఈ విషయంలో యూ పీ ఏ సర్కారుకు అంటిన మకిలి ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. జట్టులోని వారు చేసే పనులకు బాధ్యత, జట్టుకు నాయకత్వం వహించేవారికి కూడా కొద్దో గొప్పో వుంటుందనడం నైతికంగా చూస్తే సహజమే. అయితే, ఆ నాయకుడు మన్మోహన్ సింగ్ వంటి సచ్చీలి కావడం వల్ల నేరుగా ఈ కుంభకోణాలతో ఆయనకు ప్రమేయం వుందని ఆరోపించలేని పరిస్తితి. కానీ, ఈ పరిణామాలు ఆయనకు కలత కలిగించాయనడంలో మాత్రం సందేహం లేదు.

ఈ వివాదం పై చెలరేగిన రగడ అంతా ఇంతా కాదు. సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని(జే పీ సీ) ఏర్పాటు చేసి విచారణ జరపాలన్న డిమాండ్ తో ప్రతిపక్షాలన్నీ ఏకమై నిరుడు చివర్లో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలను స్తంభింప చేసాయి. రాజకీయాల వాసన అంతగా పట్టని ప్రధాని మన్మోహన్ సింగ్, జే పీ సీ విషయంలో కొంత మెత్తబడ్డా- కాంగ్రెస్ రాజకీయ సలహాదారులు ఒప్పుకోలేదు. అయితే, ఆ దరిమిలా చోటుచేసుకున్న పరిణామాల నేపధ్యంలో జే పీ సీ అంశంపై సోనియా కూడా ఓ మెట్టు దిగిన దాఖలాలు కానవస్తున్నాయి. ‘టూ జీ స్పెక్ట్రం’ వ్యవహారంలో సంబంధిత కేంద్ర మంత్రి, డీ ఎం కే కు చెందిన రాజా రాజీనామా చేయడం, అతడిని అరెస్ట్ చేయడం, బడ్జెట్ సమావేశాలు త్వరలో జరగనుండడం - వీటన్నిటినీ దృష్టిలో వుంచుకుని కాంగ్రెస్ అధిష్టానం జే పీ సీ విషయంలో ప్రతిపక్షాల డిమాండుకు తలవొగ్గే వీలుంది. అంతేకాకుండా , సుప్రీంకోర్టు వేస్తున్న చురకలు సయితం కేంద్ర ప్రభుత్వంపై వొత్తిడి పెంచుతున్నాయి. సీ బీ ఐ ఈ కేసును స్వేచ్చగా దర్యాప్తుచేయాలనీ, కుబేరులనీ, కార్పోరేట్ దిగ్గజాలనీ వెనకాడకుండా అందరినీ ప్రశ్నించి నిజాన్ని నిగ్గు తేల్చాలనీ సుప్రీం కోర్టు ధర్మాసనం గత గురువారం కేంద్ర దర్యాప్తు సంస్తను ఆదేశించింది. అంతే కాకుండా, విచారణకు ఎలాటి అడ్డంకులు కలగకుండా ఈ కేసుకు సంబంధించి దేశంలో ఇతర న్యాయస్తానాలేవీ ఎటువంటి ఆదేశాలు జారీ చేయకుండా నిషేధం విధించింది. ఈ రకమయిన వ్యాఖ్యలు, ఆదేశాలు ప్రభుత్వాన్ని సహజంగానే ఇరకాటంలో పడేస్తాయి. అదే జరుగుతోంది కూడా.

పులి మీది పుట్రలా మరో స్పెక్ట్రం వివాదం తెర మీదకు వచ్చింది. ఎస్ బాండ్ కేటాయింపుల్లో ఒక ప్రైవేటు సంస్తకు లాభం కలిగేలా విధాన లోపాలు జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. ఓ పక్క ‘టూ జీ స్పెక్ట్రం’ విషయం నానుతుండగానే, మరో పక్క అలాటిదే మరో వివాదం మెడకు చుట్టుకోవడం మన్మోహన్ సర్కారుని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.’ టూ జీ’ అనుభవంతో తలబొప్పి కట్టిన సర్కారు ఈ విషయం లో కాలయాపన చేయకుండా ఈ అంశాన్ని కూలంకషంగా సమీక్షించేందుకు కేంద్ర కేబినేట్ మాజీ కార్యదర్శి చతుర్వేది నేతృత్వంలో ఒక ఉన్నత స్తాయి కమిటీని వెంటనే నియమించింది. ఒక నెలలో నివేదిక సమర్పించాలని కమిటీని కోరింది.
పోతే, స్విస్ బాంకుల్లో మూలుగుతున్న నల్ల డబ్బు వ్యవహారం కూడా కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ బాంకుల్లో డబ్బు దాచుకున్న వారి వివరాలను బహిర్గతం చేయాలన్న వొత్తిడి నానాటికీ పెరుగుతోంది. స్విస్ బాంకు ల్లో భారత కుబేరులు దాచుకున్న నల్లడబ్బును తిరిగి దేశంలోకి తీసుకురావడానికి అంతర్జాతీయ ఒప్పందాలు అడ్డుపడుతున్నాయన్న వాదనను ప్రజలు విశ్వసిస్తున్నట్టు లేదు.
యూ పీ ఏ సంకీర్ణ ప్రభుత్వ సారధిగా వున్న మన్మోహన్ సింగ్ నీతీ నిజాయితీలను గురించిన సందేహాలు ఎవరికీ లేకపోయినా వరసగా బయట పడుతున్న కుంభకోణాలు చూస్తున్నవారు, ఆయన ఏదో విధంగా వీటికి అడ్డుకట్ట వేయగలిగితే బాగుండుననే అనుకుంటున్నారు. సంకీర్ణ ప్రభుత్వాలలో సహజంగా వుండే పరిమితులు ముందరి కాళ్ళకు బంధాలు వేస్తుండవచ్చు. పోతే, ఒకటివెంట మరొకటిగా ఇలా కుంభకోణాలు బయట పడుతూ వుండడానికి పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు కూడా కారణం కావచ్చు. మన్మోహన్ సింగ్ కు వ్యతిరేకంగా కొందరు పార్టీలోని పెద్దలే పనికట్టుకుని పనిచేస్తున్నారన్నది తెలిసికూడా ఏమీ చేయలేని అసమర్ధ స్తితిలో కాంగ్రెస్ పార్టీ వుండడం మరో విషాదం. (11-02-2011)