18, నవంబర్ 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (244) : భండారు శ్రీనివాసరావు

 

రేడియోలో కార్యశూరులు
అంకిత భావంతో చేసే పనిలో కష్టం కనిపించదు. దానికి అనురక్తి తోడయితే అలసట అనిపించదు. ఫలితాలు అద్భుతంగా వుంటాయి. ఇలా పనిచేసే కార్యశూరులు ప్రభుత్వ శాఖల్లో చాలా తక్కువ అనే అభిప్రాయం అనేక మందిలో వున్న మాట కూడా వాస్తవం. నేను బహుకాలం పనిచేసిన ఆలిండియా రేడియో సైతం ప్రభుత్వ ఆధ్వర్యంలోనిదే. అయినా కార్యశూరులకు అక్కడ కూడా కొరత లేదని నా అనుభవమే నాకు చెప్పింది. మాతృసంస్థ పట్ల మమకారంతో చెబుతున్న విషయం కాదిది. 26 ఏళ్ళ నాటి సంగతి.
విజయవాడ రేడియో ప్రాంతీయ వార్తావిభాగం న్యూస్ ఎడిటర్ గా సుదీర్ఘ కాలం పనిచేసిన శ్రీ ఎం.వి.ఎస్. ప్రసాద్ స్వానుభవం ఆయన మాటల్లోనే....
"1999 అక్టోబర్ 25.
మధ్యాహ్నం 12 కావస్తూంది.
ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగంలో
అప్పుడే మధ్యాహ్నం వార్తల కోసం టెలిప్రింటర్ చూస్తున్న నేను ఒక వార్త చూసి అదిరిపడ్డాను.
“ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఎస్. రాజేశ్వరరావు గారు కన్నుమూశారు”
ముందు కంగు తిన్నా, మెదడు చురుగ్గా పనిచేసింది.
ఒక్క ఉదుటున డ్యూటీ రూం కు పరుగెత్తి అనౌన్సర్ ఎవరున్నారు? అని అడిగాను.
ఎస్బీఎస్ఎం (చాల చోట్ల సహోద్యోగులను ఇలా పొట్టి పేర్లతో పిలిచే సంప్రదాయం సాధారణ విషయమే) అన్నారు.
అమ్మయ్య! అనుకొని స్టుడియోలోకి పరుగెత్తాను.
రామం గారు రికార్డులు సర్దుకుంటున్నారు.
"సార్! రాజేశ్వరరావు గారు పోయారండి!" అని చెప్పాను.
"అయ్యో!" అన్నారు.
"అర్జెంటుగా ఆయన పాటల పల్లవులు కొన్ని టేపులో ఎక్కించాలి సార్!" అని అభ్యర్ధించాను.
మరోమాట లేకుండా "పదండి" అంటూ నన్ను లైబ్రరీలోకి తీసుకు వెళ్ళారు.
"ఏం పల్లవులు కావాలి?" అన్నారు.
ఏవని చెప్పను? అన్నీ ఆపాతమధురాలే మరి!
సరే, అటు సాంఘికాలు, ఇటు పౌరాణికాలు. ఓ పదిహేను పాటలు కాబోలు గబగబా చెప్పాను.
అంతే వేగంగా ఆయన ఆ రికార్డులు వెతికి తీశారు.
"ఒక్కోపాట పల్లవి మాత్రం చాలు సార్, గ్యాప్ లేకుండా వరసగా టేప్ పైకి ఎక్కించండి" అని కోరాను.
"ఆగండి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అప్పుడెప్పుడో ప్రత్యేక జనరంజనిలో రాజేశ్వరరావు గారి గురించి చెప్పారు కదా, అది కూడా ఇస్తాన"ని దానికోసం గాలించడం మొదలుపెట్టారు.
నేను మళ్ళీ వార్తా విభాగంలోకి పరుగెత్తి న్యూస్ రీడర్ కి "ఈరోజు ఐదు నిమిషాలకు సరిపడా వార్తలు రాయండి, చాలు. మొదటి ఐదు నిమిషాలు నేను రాసిస్తాను" అని చెప్పాను.
సమయం 12-40 దాటింది.
(మా ప్రాంతీయ వార్తలు 1-20 కి మొదలవుతాయి)
గబగబా జ్ఞాపకశక్తిపై ఆధారపడి రాజేశ్వరరావు గారి గురించి, ఆయన పాటల విశిష్టత గురించి రాస్తూ పోయాను.
"సార్ మొదటి సగం వార్తలు ఏవి?" అని అడిగాడు మా న్యూస్ రీడర్.
సమయం ఒంటిగంట దాటింది.
ఇదుగో అంటూ హెడ్ లైన్స్ చెప్పాను.
1-15 అయింది. అయిదే నిమిషాలు మిగిలింది.
ఇద్దరం స్టుడియోలోకి పరుగెత్తాము..
రామం గారు అప్పుడే వచ్చారు, రెండు టేపులతో.
ఒకటి పాటల పల్లవులు, రెండోది బాలు గారి ట్రిబ్యూట్ అని చెప్పారు.
న్యూస్ రీడర్ కి అంతా అయోమయంగా ఉంది.
వార్తలు చదవడం ప్రారంభించాడు.
"ప్రఖ్యాత సంగీత దర్శకులు రాజేశ్వరరావు గారు కన్నుమూశారు" అనగానే నేపథ్యంలో మెల్లగా ఆయన పాటల పల్లవులు మొదలైనాయి, "వినిపించని రాగాలే" అంటూ.
న్యూస్ రీడర్ రాజేశ్వరరావు గారి గురించి చదువుతున్నంతసేపూ అవి కొనసాగాయి.
"రాజేశ్వరరావు గారికి SP బాలసుబ్రహ్మణ్యం నివాళి అర్పిస్తూ" అనగానే బాలు గారి గళం వినిపించాము.
ఒకే వార్త ఇలా ఐదు నిమిషాల పాటు చదవడం చాలా అరుదు.
"వార్తలు సమాప్తం" అనగానే రామం గారికి ధన్యవాదాలు చెప్పి వార్తా విభాగం లోకి వచ్చాను.
ఫోన్ ఆగకుండా మోగుతోంది.
శ్రోతలు అభినందిస్తుంటే నాకూ కన్నీరు ఆగలేదు.
ఈ ఘనత రామం గారిది!
అంత స్వల్ప వ్యవధిలో అన్ని పల్లవులు పేర్చి, వాటికి బాలుగారి నివాళి జతచేర్చి అందించడం ఆయనకు మాత్రమే సాధ్యం!
ఈ వార్తలు విన్న ఓ పత్రికా ప్రముఖుడు "అంత తక్కువ సమయంలో బాలు గారిని ఎలా పట్టుకొని, ట్రిబ్యూట్ సంపాదించారండి?" అంటూ నివ్వెర పోయాడు.
అది దేవరహస్యం అని నవ్వాను!
ఈ వార్తలు విన్న మిత్రులెవరో బాలు గారికి ఫోన్ చేసి "రాజేశ్వరరావు గారికి మీ నివాళి ఇప్పుడే రేడియోలో విన్నాము, చాలా బాగుంది" అని చెప్పేసరికి ఆయన నిర్ఘాంతపోయారు!
తర్వాత నేను కలిసినపుడు, ఈ సంగతి చెప్పి "నీ దుంపతెగ! అదెక్కడ సంపాదించావురా" అని అడిగారు. ఇప్పటిది కాదులెమ్మని చెప్పేసరికి పకాలున నవ్వారు!"
(ఈ వార్తాప్రసార కథానాయకుడు, కార్య సాధకుడు ఏమ్వీఎస్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు)
కింది ఫోటో:
కీర్తిశేషులు ఎస్. రాజేశ్వర రావు



(ఇంకావుంది)

కామెంట్‌లు లేవు: