27, నవంబర్ 2025, గురువారం

ఎమ్మెల్యే అయి పది రోజులు కూడా కాలేదు, అప్పుడే....

 

మాది పేరుకు జూబిలీ హిల్స్ నియోజకవర్గం. కానీ ఎక్కువగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు, దిగువ మధ్య తరగతి వాళ్ళు నివసించే ప్రాంతాలు ఈ నియోజక వర్గంలో అనేకం వున్నాయి.

మూడు రోజుల క్రితం, నేను నివాసం వుండే (దీనికి అనేక పేర్లు వున్నాయి, ఎల్లారెడ్డి గూడా, ఇంజినీర్స్ కాలనీ, యూసుఫ్ గూడా వగైరా వగైరా) మధుబన్ అపార్ట్ మెంట్ సమీపంలో రాత్రివేళ బుల్ డోజర్లు పనిచేస్తున్న చప్పుడు వినిపించింది. ఈ ఏరియాలో హైడ్రా రంగనాద్ గారికి ఏమవసరం వచ్చిందా అనుకున్నాను.

తెల్లారి చూస్తే, మా రోడ్డు మొత్తం తవ్వేసారు. తవ్విన కాంక్రీటు/ తారు  పెళ్లలు ఒక పక్క గుట్టలు గుట్టలుగా పడి వున్నాయి. విచారిస్తే తెలిసింది ఏమిటంటే పాత రోడ్డు స్థానంలో కొత్త రోడ్డ్డు వేస్తున్నారని. వినగానే సంతోషం వేసింది. ఇన్నాల్టికి ఈ రోడ్డుకు మోక్షం కలిగిందని.

కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికయిన నవీన్ యాదవ్ గారు, పదవిలోకి వచ్చి పది రోజులు కూడా గడవకముందే పనులు మొదలు పెట్టడం, అభివృద్ధి పనులకు స్వీకారం చుట్టడం చూసి స్థానికులు కూడా సంతోషించినట్టు కనిపించింది.

అయితే, రోడ్డు తవ్విపోసినంత తేలిక కాదు, కొత్త రోడ్డు నిర్మించడం. తప్పకుండా కొంత సమయం తీసుకుంటుంది. అయితే ఎంత సమయం తీసుకుంటుంది  అనే విషయంలో స్పష్టత లేదు. రోడ్డు తవ్వే కాంట్రాక్టరు  తన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. రోడ్డు వేసే వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు. చెప్పా పెట్టకుండా రాత్రికి రాత్రే రోడ్డు తవ్వేయడంతో అపార్ట్ మెంట్లలో నివసించే వారి వాహనాలు బయటకు పోయే వీలు లేకుండా పోయింది. అత్యవసర వైద్యం కోసం వెళ్ళాల్సి వస్తే, అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ముందుగా చెప్పివుంటే ఎవరి ముందు జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవడానికి వీలుండేది.

అభివృద్ధి పనులకు ఎవ్వరూ అడ్డం రారు. కానీ పౌరుల అవసరాలు కూడా గమనించి ముందస్తు సమాచారం ఇచ్చి వుంటే బాగుండేది. విద్యుచ్ఛక్తి శాఖ వాళ్ళు కరెంటు సరఫరాలో ఆటంకాలు ఎదురయితే, వినియోగదారులకు ఫోనులో ముందస్తు సమాచారం ఇస్తున్నట్టుగానే ఇలాంటి రోడ్డు తవ్వకాల విషయంలో చేయవచ్చు.

సమాచార లోపం వల్ల పౌరుల్లో అసహనం కలిగితే దాన్ని తప్పు పట్టలేము కదా!

(25-11-2025)  

 

ఈ పోస్టు పెట్టి రెండు రోజులు కూడా కాలేదు, కానీ ఎవరో చూసారు.

 

మా వీధిలో కొత్త రోడ్డు నిర్మాణానికి వున్న పాత రోడ్డును రాత్రి రాత్రి తవ్వి పోశారని మొన్ననే ఒక పోస్టు పెట్టాను. కొండ నాలుక్కి మందేస్తే అన్న చందాన అవుతుందేమో అనే భయసందేహాలు కూడా వ్యక్తం చేశాను. గత రాత్రి పదకొండు గంటలకు కూడా పరిస్థితిలో మార్పులేదు.

చిత్రం!  మళ్ళీ అర్ధరాత్రి చప్పుళ్ళు. తెల్లారి చూస్తే చిత్రం మారిపోయింది. రోడ్డు తవ్వి  గుట్టలు గుట్టలుగా పోసిన కంకర, కాంక్రీటు పెళ్లలు అన్నీ మాయం. పాపం రాత్రంతా పని చేసి నట్టున్నారు. మొత్తం మీద రోడ్డు నడకకు అనుకూలంగా మారింది.  రెండు మూడు రోజుల్లో పని పూర్తవుతుందని అక్కడ పనులు చూస్తూ రాత్రంతా నిద్ర లేక కునికిపాట్లు పడుతున్న సూపర్ వైజర్ చెప్పాడు.  

ఫేస్ బుక్ పోస్టులను సంబంధిత అధికారులు, నాయకులు  చూస్తుంటారా! ఏమో!

చూసినా చూడకపోయినా రోడ్డు ఒక రూపానికి వస్తోంది.

సంబంధిత అధికారులకు, సిబ్బందికి మరీ ముఖ్యంగా మహిళా కూలీలకు కృతజ్ఞతలు.  చంటి పిల్లల తల్లులు తమ పిల్లల్ని అక్కడే ఆటలకు వదిలేసి రోడ్డు మరమ్మతు కూలీ పనులు చేస్తున్న వారిని చూస్తుంటే, మన బాటల రాతలు  సరిచేస్తున్న వారి బతుకు బాటలు ఎప్పుడు బాగుపడతాయో అని బాధ వేసింది. వారికి చేతులెత్తి నమస్కరించి వచ్చేశాను.

కింది ఫోటోలు:

మొన్నటి రోడ్డు పరిస్థితి, నేటి రోడ్డు స్థితి:  



మొన్న 


నేడు 



 

 

(27-11-2025)          

కామెంట్‌లు లేవు: