మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు రిటైర్ అయిన తర్వాత శేష జీవితం పుట్టపర్తిలో గడిపారు. ఆయన ఎందుకలాంటి నిర్ణయం తీసుకున్నారో నాకయితే ఇప్పటికీ అర్ధం కాదు.
హైదరాబాదులో వరుసగా అయిదుగురు ముఖ్యమంత్రులకు పీఆర్వోగా, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా, సమాచార శాఖ డైరెక్టర్ గా పెద్ద హోదాల్లో పనిచేసిన ఆయన, ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం, ఒక వయసు వచ్చిన తర్వాత వానప్రస్థాశ్రమం మాదిరిగా అన్నీ వదులుకుంటూ అక్కడికి చేరాడేమో అనిపిస్తుంది.
ఒకసారి హైదరాబాదు నుంచి పుట్టపర్తి వెళ్ళాము.
ప్రధాన వీధిలో ఆశ్రమానికి కొంచెం దూరంగా ఓ చిన్న డాబా ఇల్లు. ఇరుకు దారి. చిన్న చిన్న మెట్లెక్కి వెళ్ళాలి. ఒకటే గది. అందులోనే ఓ పక్కగా గ్యాస్ స్టవ్. వంట సామాను.
ఊరుఊరంతా ఎక్కడ చూసినా సత్య సాయిబాబా ఫోటోలు. చిత్రం! మా అన్నయ్య, వదిన వుంటున్న గదిలో ఒక్కటీ లేదు.
ఒకప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసేటప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారి పరమహంస గారితో సన్నిహిత పరిచయం. వారికి బాబాగారు సన్నిహితులు. ఆశ్రమం లోపల కాటేజీ సంపాదించుకోవడం పెద్ద పని కాదు. కానీ అలాంటివి అన్నయ్యకు ఇష్టం వుండవు.
ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా మా అన్నయ్యా, వదిన నడిచే తిరిగేవారు.
ఇలా అవసరాలు తగ్గించుకుంటూ, అనవసరాలను వదిలించుకుంటూ జీవితం గడపడానికి ఎంతో మానసిక పరిణితి వుండాలి.
సాయంకాలం ఆశ్రమంలో భజనకు వెళ్ళే వాళ్ళు. ముందు వరసలో కూచునే వీలు వున్నా, కావాలని వెళ్లి చిట్టచివర గోడనానుకుని కూచునేవాడు. బాబాని కలుసుకోగల అవకాశాలు ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ ఆ ప్రయత్నం చేయలేదు.
భజన సమయం మినహాయిస్తే పగలూ రాత్రీ ఆ గదిలో కింద కూచుని, కాలు మీద కాలు వేసుకుని, తొడమీద కాగితాల బొత్తి పెట్టుకుని అనేక ఆధ్యాత్మిక పత్రికలకు వ్యాసాలు రాస్తుండే వాడు. దగ్గరలోని ఓ దుకాణంలో కాగితాలు కొంటూ వుండే వాడు. ఒకసారి ఆ షాపువాడు ఎవరితోనో అంటుంటే ఆ మాటలు మా వదిన చెవిలో పడ్డాయి.
“ఎవరండీ ఈయన. ఎప్పుడు వచ్చినా దస్తాలకు దస్తాలు కొనుక్కుని వెడతారు.”
అసలు సాయిగీతతో కదా మొదలు పెట్టింది. పుట్టపర్తిలో వున్నప్పుడు అన్నయ్య రాసిన అనేక రచనల్లో ఇదొకటి. దీనికి కొంత పూర్వ రంగం వుంది.
భగవాన్ సత్య సాయి బాబా తన జీవిత కాలంలో చేసిన అనేకానేక అనుగ్రహ భాషణల్లో జాలువారిన హితోక్తులను, సూక్తులను అంశాల వారీగా వడపోసి, ఒక్క చోట గుదిగుచ్చి, భగవద్గీతలో మాదిరిగా అధ్యాయాలుగా విడగొట్టి టీకా టిప్పణి (టీక అంటే ఒక పదానికి గల అర్థం. టిప్పణి అంటే టీకకు టీక. అంటే అర్థాన్ని మరింత వివరించి సుబోధకం చేయడమన్నమాట) తో సహా తయారు చేసిన బృహత్ గ్రంధం అది. నిజానికి బృహత్తర కార్యక్రమం. బాబా గారి ప్రసంగాల టేపులు తెప్పించుకుని వినాలి. వింటూ నోట్స్ రాసుకోవాలి. వాటిని ఓ క్రమంలో అమర్చుకోవాలి. ప్రూఫులు కూడా దిద్దుకుని మేలు ప్రతి సిద్ధం చేసుకోవాలి.
ఇంత ప్రయత్నం సాగిన తర్వాత కూడా పడ్డ శ్రమ అంతా బూడిదలో పన్నీరు అయ్యే అవకాశాలు హెచ్చుగా వున్నాయి.
బాబా గురించి లేదా ఇతరులు రాసిన రచనలు సత్యసాయి ట్రస్టు ప్రచురించాలి అంటే వాటికి బాబా గారి ఆమోదం వుండి తీరాలి.
అందుకోసం పరమ హంస గారు చాలా శ్రమపడి ఆ పుస్తకాన్ని డీటీపీ చేయించి, కవర్ పేజీతో సహా డమ్మీ కాపీని తయారు చేయించి, ఒక రోజు భజన ముగించి బాబా విశ్రాంతి మందిరంలోకి వెళ్ళే సమయంలో ఆ డమ్మీ కాపీని బాబా చేతుల్లో ఉంచారు. బాబా ఆ పుస్తకంలో కొన్ని పుటలు పైపైన చూస్తూ, ఏమీ చెప్పకుండా దాన్ని తీసుకుని గదిలోకి వెళ్ళిపోయారు. అంతే!
మళ్ళీ బాబా ఆ ప్రసక్తి తెచ్చే వరకు ఆ ప్రస్తావన ఆయన ముందుకు తెచ్చే వీలుండదు.
రోజులు గడిచిపోతున్నాయి కానీ బాబా దాన్ని గురించి మాట్లాడక పోవడంతో ఇక అది వెలుగు చూసే అవకాశం లేదు అని నిరుత్సాహ పడుతున్న సమయంలో, హఠాత్తుగా ఒక రోజు బాబా ఆ పుస్తకం డమ్మీ కాపీని పరమహంస గారికి ఇచ్చి, ‘వేరెవరో ఎందుకు మనమే దీన్ని ప్రింట్ చేద్దాం’ అన్నారు. ఆ విధంగా సాయి లీల పుస్తకాన్ని సత్యసాయి పబ్లికేషన్స్ వారే ప్రచురించారు. బాబా నోటి వెంట వెలువడిన సూక్తులు కాబట్టి అన్నయ్య ఆ పుస్తకం మీద కనీసం సంకలన కర్త అనికూడా తన పేరు వేసుకోవడానికి సమ్మతించలేదు. సాయిగీత ప్రతులన్నీ అమ్ముడు పోయాయి. ఆసక్తి కలిగినవారికోసం దాని లింక్ vedamu.org అనే వెబ్ సైట్ లో ఉంచినట్టు పరమహంస గారు చెప్పారు.
ఆధ్యాత్మిక విషయాల్లో అన్నయ్య అనురక్తిని గమనించి సత్య సాయి పబ్లికేషన్స్ వారు ప్రచురించే సనాతన సారధి బాధ్యతలు అప్పగించాలని కొన్ని ప్రయత్నాలు జరిగినా, దానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. రాయడం అనే బాధ్యత తప్పిస్తే వేరే బాధ్యతలు మోసే ఆసక్తి తనకు లేదని చెప్పారు. బాబాని చూడడానికి పుట్టపర్తికి వచ్చే విదేశీయులకు తెలుగు నేర్పే బాధ్యతను అన్నయ్య స్వచ్చందంగా నెత్తికి ఎత్తుకున్నారని, ఇంగ్లీష్ తెలిసిన తమకు ఇంగ్లీష్ లోనే తెలుగు నేర్పేందుకు ఆయన ఎంచుకున్న పద్దతులను ఒక విదేశీ మహిళ డాక్యుమెంట్ చేసింది కూడా.
విషాదం ఏమిటంటే, భౌతికపరమైన సంపదలను ఆయన కూడబెట్టలేదు, దాచుకోలేదు. అలాగే ఆధ్యాత్మిక పరమైన రచనలు ఎన్నో చేసి వాటిని కూడా దాచుకోలేదు.
నేటి భౌతిక ప్రమాణాల ప్రకారం నిర్ధనుడుగా దాటిపోవడం బాధ్యతారాహిత్యమే కావచ్చు. నైతిక విలువల కోణంలో చూస్తే అది తప్పనిపించదు. ఆయన చూపించి వెళ్ళిన దారిలో మేము కొంత దూరం నడవగలిగినా జన్మధన్యమే.
కాకతాళీయమే కావచ్చు, 480 పేజీల సాయిగీత పుస్తకంలో ఆఖరి వాక్యం ఇలా రాశాడు:
శ్రీరస్తు! శుభమస్తు! విజయోస్తు! ‘సాయి’జ్య సాయుజ్య ప్రాప్తిరస్తు!
ఒకరోజు పరమహంస గారు వాళ్ళ ఇంటికి వచ్చారని మా అన్నయ్య కొడుకు రఘు ఫోన్ చేస్తే అక్కడికి వెళ్లి వస్తున్నప్పుడు ఒక వ్యక్తి కనిపించి పలకరించాడు. నేను సహజంగానే గుర్తు పట్టలేదు. అతడు గతంలో సీ ఎం పేషీలో పనిచేసేవాడట. ‘పర్వతాలరావు గారు ఎలా వున్నారు. పెద్దవారై వుంటారు. బాగున్నారా’ అని అడిగాడు. చనిపోయి దాదాపు ఇరవై ఏళ్ళు కావస్తున్నా, ఆయన చనిపోయిన సంగతే చాలామందికి తెలియదు. అంటే ఆయన మరణించలేదన్న మాట. అతడే ఈ వ్యాసానికి స్పూర్తి.
1 కామెంట్:
మీ జీరోయిజం లో ఆయన హీరోయిజం ఎందుకండీ ఇరికించారు?
కామెంట్‌ను పోస్ట్ చేయండి