11, నవంబర్ 2025, మంగళవారం

ఓటు వేసే విధము మార్చండి

 

 


ఎల్లారెడ్డి గూడా మా ఇంటి నుంచి జూబిలీ హిల్స్ లోని మా అన్నయ్య ఇంటికి వెళ్ళడానికి ఉబెర్/రాపిడో బుక్ చేస్తే కాసేపు డ్రైవర్ల వెతుకులాటతో పొద్దు పుచ్చి, మీ కెప్టెన్ వస్తున్నాడు, పికప్ పాయింటు దగ్గర రెడీగా వుండండి’ అని మెసేజ్ వస్తుంది. రూట్ మ్యాప్  చూస్తే ఆ వచ్చే కారు ఫిలిం నగర్ లో బయలుదేరినట్టు కనిపిస్తుంది. ఆ కారు బొమ్మ కాసేపు ముందుకు, కాసేపు వెనక్కు తిరిగి కొంత దూరం కూడా రాక మునుపే ఆ డ్రైవర్ కేన్సిల్ చేసుకుని మరో డ్రైవర్ వస్తున్నట్టు ఇంకో  మెసేజ్. ఇక ఇతగాడు వచ్చేది మాదాపూర్ నుంచి. నేను వెళ్ళాల్సింది జూబిలీ హిల్స్ కి. ఈనాటి ఐ ఏ శకంలో కూడా కారు బుక్ చేసినప్పుడు దగ్గర లోని వెహికిల్ డ్రవర్ ను కనెక్ట్ చేసే విధానాన్ని కనుక్కోలేక పోవడం విచారకరం.

ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే ఈరోజు వెళ్లి ఓటు వేయాలి. మా ఇంటికి పాతిక గజాల దూరంలో ఒక పోలింగ్ కేంద్రం వుంది. నాకు అలాట్ చేసింది దూరంగా వున్న కేంద్రం. నడకకు ఎక్కువ, ఆటోకి తక్కువ. ఆటోలో పొతే సగం దూరంలో ఆపి ‘నడిచి వెళ్ళండి, ముందుకు పోవడానికి వీల్లేదు’ అన్నాడు రోడ్డుకు అడ్డంగా కట్టిన బారికేడ్లు చూపిస్తూ.  ఉసూరుమంటూ ఎండలో నడిచి వెళ్లాను. ఓటు వేసి వచ్చేటప్పుడు అదీ దొరకలేదు.

ఎన్నికల సంఘం మంచి ఏర్పాట్లే చేసింది. అయితే, ఇంటికి దగ్గరలో పోలింగు కేంద్రం వుంటే వృద్ధులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో ఓటు వేయడానికి  ఉత్సాహం చూపుతారు. నియోజక వర్గం ఒకటే అయినప్పుడు ఆయా ఇళ్లకు దగ్గరలోని పోలింగు కేంద్రాలను కేటాయించడం ఈ కంప్యూటర్ యుగంలో గొప్ప విషయం ఏమీ కాదు.

‘రండి. మీ ఓటు హక్కు ఉపయోగించుకోండి. ప్రజాస్వామ్య క్రతువులో పాల్గొనండి అని’ విజ్ఞప్తులు చేసే ఎన్నికల అధికారులు ఈ విషయంలో కూడా కొంత శ్రద్ధ చూపితే బాగుంటుంది.

(11-11-2025)       

కామెంట్‌లు లేవు: