ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు
హెల్మెట్ ధారణను నిర్బంధం చేయడంతో సామాన్య
ప్రజలనుంచే కాకుండా జర్నలిస్టుల నుంచి కూడా నిరసనలు మొదలయ్యాయి. కే.ఎస్. వ్యాస్
గారు ట్రాఫిక్ డీసీపీ. చాలా సమర్దుడయిన పోలీసు అధికారి. హెల్మెట్ నిబంధనను అమలు చేసే విషయంలో కొత్త
పుంతలు తొక్కారు. ప్రధాన కూడళ్ళలో ప్రత్యెకంగా పోలీసు బృందాలను ఏర్పాటు చేసి
హెల్మెట్ లేని వాళ్ళను మోటారు సైకిళ్ళపై వెంటాడి పట్టుకుని జరిమానాలు వేయడం మొదలు
పెట్టారు. ఇది జనంలో చాలా అసహనానికి దారితీసింది. ఇంటలిజెన్స్ చీఫ్ హెచ్ జే
దొరగారికీ, పోలీసు కమీషనర్ టీ ఎస్ రావు గారికీ విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది.
ఎందుకంటే రామారావుగారికి చెప్పగల ధైర్యం ఎవ్వరికీ లేదు. ఒకరోజు పొద్దున్నే నేను
జూబిలీ హిల్స్ లోని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పోయి హెల్మెట్ విషయంలో
జర్నలిస్టులు పడుతున్న ఇబ్బందులు గురించి
చెప్పాను. వారు విధి నిర్వహణలో భాగంగా ప్రతిరోజూ అనేక చోట్లకు వెళ్ళాల్సి
ఉంటుందని, అసలే చాలీచాలని జీతాలతో వెళ్ళదీస్తున్న వారికి – హెల్మెట్ పోయినా, లేదా
ఎక్కడయినా మరచిపోయినా అంతంత డబ్బులు పోసి
కొనుక్కోవడం కష్టంగా ఉంటుందని చెప్పాను. ఆయన అంతా విని దొరగారికి ఫోను చేసి,
ఏదయినా చేయొచ్చేమో చూడమని చెప్పారు.
బహుశా ఆ మరునాడే అనుకుంటాను. 1987 జులై 14 వ తేదీ. ప్రస్తుత ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి
తండ్రి, మాజీ మంత్రి, అప్పటి శాసనసభ్యులు అయిన ఎన్. అమర్
నాధ రెడ్డి గారు అకస్మాత్తుగా మరణించడంతో అసెంబ్లీ వాయిదా పడింది. రేడియో వార్తలకు
ఇంకా చాలా వ్యవధానం వుండడంతో ఆంద్రభూమిలో పనిచేసే నా మిత్రుడు సూర్యప్రకాష్ ను ఇంట్లో
దింపడానికి స్కూటర్ మీద విజయనగర్ కాలనీకి బయలుదేరాను. మధ్యలో ట్రాఫిక్ పోలీసు హెల్మెట్
లేదని ఆపాడు. దగ్గరలో వున్న హుమాయూన్ నగర్ పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్ళాడు. నా
వెంట వచ్చిన సూర్యప్రకాష్ ఇంటికి వెళ్లి, నన్ను పోలీసులు పట్టుకుపోయిన విషయం ఇతర జర్నలిస్టులకు
తెలియచేసాడు. అంతే! బిలబిల మంటూ అనేకమంది పాత్రికేయ సోదరులు అక్కడికి చేరుకొని
పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు మొదలు పెట్టారు. నేను లోపల పోలీసు స్టేషన్ లో
ఉన్నందువల్ల గమనించలేకపోయాను కానీ తరువాత తెలిసినదేమిటంటే చాలామంది సీనియర్
పాత్రికేయులు కూడా అక్కడికి వచ్చి నాకు మద్దతుగా నిలిచారని. వారిలో హిందూ
రాజేంద్రప్రసాద్, ఎక్స్ ప్రెస్ సుందరం, జ్యోతి వెంకట్రావు, క్రానికల్ రబీంద్ర
నాథ్, సింహం, కన్నన్, పేట్రియాట్ ప్రభాకరరావు, న్యూస్
టైం కే.శ్రీనివాసరెడ్డి (ఇప్పుదు రెసిడెంట్ ఎడిటర్ హిందూ, బెంగుళూర్ ఎడిషన్) జర్నలిస్ట్ యూనియన్ నాయకులు కే. శ్రీనివాసరెడ్డి,
దేవులపల్లి అమర్, కే.లక్ష్మారెడ్డి, నందిరాజు రాధాకృష్ణ, లక్ష్మీ ప్రసాద్, నర్సింగరావు ఒకరా
ఇద్దరా హైదరాబాదులో పేరుమోసిన పాత్రికేయులందరూ హుమాయూన్ నగర్ పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు.
పరిస్తితిలోని తీవ్రత పోలీసులకు కూడా అర్ధం అయింది.
(హుమాయూన్ నగర్ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేసున్న జర్నలిస్టులు)
మొత్తం మీద జర్నలిస్టుల ఆందోళన కారణంగా ఉన్నతాధికారులు
జోక్యం చేసుకోవడంతో నన్ను విడిచిపెట్టారు.
కానీ మరునాడు విలేకరులు అసెంబ్లీ
కార్యకలాపాలను బహిష్కరించారు. ప్రెస్ గ్యాలరీ ఖాళీగా వుండడం గమనించి స్పీకర్ జీ.
నారాయణ రావు సభను వాయిదా వేసారు. అప్పుడు ముఖ్యమంత్రి రామారావు గారు వెంటనే స్పందించారు. సంఘటనతో సంబంధం వున్న
పోలీసు అధికారిని బదిలీ చేసారు. న్యాయ విచారణకు ఆదేశించారు. కొత్తగా
హోమ్ మంత్రి బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కోడెల శివప్రసాద్
రావుకు ఈ పరిణామాలు సహజంగానే ఇబ్బందికరంగా పరిణమించాయి. హెల్మెట్ నిబంధనను
ప్రభుత్వం ఎత్తివేయలేదు కాని దాన్ని అమలు చేసే పద్ధతిలో కొంత ఉదార వైఖరి చోటు
చేసుకుంది. ఈ నడుమలో నాకు మాస్కో రేడియోలో ఉద్యోగం రావడం, నేను కుటుంబంతో సహా
సోవియట్ యూనియన్ వెళ్ళిపోవడం జరిగింది.
దరిమిలా ఈ హెల్మెట్ అంశం రాజకీయ రంగును పులుముకుంది. తదుపరి
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానాలలో హెల్మెట్ రద్దు అంశం కూడా చేర్చారు.
ఆఎన్నికల్లో టీడీపీ వోడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే జరిగిన విజయోత్సవ సభలో హెల్మెట్ నిబంధనను రద్దు చేస్తున్నట్టు సభికుల హర్షధ్వానాల మధ్య
ప్రకటించారని ఆయనకు పీ ఆర్ ఓ గా పనిచేసిన జ్వాలా నరసింహారావు మాస్కోలో వున్న నాకు ఫోనులో
తెలియచేసాడు.
వాహనదారులకు రక్షణ కవచంలా ఉపయోగపడే హెల్మెట్
విషయంలో జర్నలిస్టులు ఇంత గొడవ పడడం సబబా
అన్న విమర్శలు కూడా వినపడ్డాయి. ఆ పూర్వాపరాలు మరో సారి. (05-07-2013)
