ఊసరవెల్లులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఊసరవెల్లులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, అక్టోబర్ 2014, శుక్రవారం

ఊసరవెల్లులు

  

‘పెద్దయ్యాక ఏమవుదామనుకుంటున్నావు?’  అనేది చిన్నప్పుడు స్కూల్లో అడిగే ప్రశ్న.
‘తెలుగు మాస్టారు’ ఠకీమని సమాధానం.
ప్రశ్న అడిగిన లెక్కల మాస్టారుకి ఎక్కడ కాలాలో అక్కడే కాలేది. తరువాత ఏదో తప్పువెతికి పట్టుకోవడం, చెయ్యి చాపమనడం, చాచిన చేతిని తిరగేయించడం,  దానిమీద డష్టరు తిరగేయడం - అది వేరే కధ.



తమదగ్గర  చదువుకునే పిల్లల్లో ఐ.ఏ.ఎస్. లు ఎంతమంది అవుతారన్నది వారికొచ్చిన  డౌటేహం కావచ్చు. వాళ్ళల్లో రాజకీయనాయకులు, జర్నలిస్టులు కొంతమంది అయినా కాకపోతారా అనే నమ్మకం కావచ్చు. అందుకే కాబోలు,  పిల్లలకు   వక్తృత్వపోటీలు పెట్టి, ‘కలం గొప్పదా? కత్తి గొప్పదా?’ – ‘అణ్వస్త్రాలు కావాలా?  అన్నవస్త్రాలు కావాలా?’ అని ప్రతి అంశానికి అనుకూలంగా ప్రతికూలంగా రెండు విధాలుగా చెప్పించేవారు. అప్పుడర్ధంయ్యేది కాదు కానీ ఇప్పుడు టీవీ చర్చల తీరుతెన్నులు, రాజకీయ నాయకుల ప్రకటనలు గమనిస్తుంటే  అందులోని తత్వం  నెమ్మది నెమ్మదిగా తలకెక్కుతోంది. విషయం ఒకటే అయినా, తమ పార్టీకి అనుకూలంగా, ప్రతిపక్షానికి వ్యతిరేకంగా  ఎలా మాటలు తిరగేసి మాట్లాడొచ్చు అనే దానిలో అందరూ  మాస్టర్స్ డిగ్రీ సాధించేశారు. నరం లేని నాలుక ఏవిధంగానయినా మాట్లాడుతుందంటారు చూడండి. అలా రాజకీయ నాయకులు ‘మొన్న ఏం మాట్లాడాం, నిన్న ఏం చెప్పాం’ అన్నదానితో నిమిత్తం లేకుండా ‘ఈరోజు చెప్పిందే ఫైనల్’ అన్న పద్ధతిలో  బల్లగుద్ది వాదిస్తున్న విధం చూస్తుంటే 'రాజకీయాల్లో సోషలిజం, కమ్యూనిజం, క్యాపిటలిజం   కాకరకాయా ఏమీలేదు వొట్టి అవకాశవాదం తప్ప' అని  అనిపిస్తే ఆశ్చర్యపోవాల్సింది ఏమీ వుండదు. అలాగే, నిన్న కప్పుకున్న పార్టీ కండువా తెల్లారేకల్లా మార్చేసి అందుకు తగ్గట్టుగా మాటల ఘాటు పెంచడం చూస్తేమాత్రం ఆశ్చర్యపోకా  తప్పదు. విశ్వనాధవారు అన్నట్టు ఇదో వైచిత్రం. 

NOTE: Courtesy Image Owner