11, సెప్టెంబర్ 2026, శుక్రవారం

తలకెక్కని చరిత్ర పాఠాలు – భండారు శ్రీనివాసరావు

 

నేను పుట్టిన 26 రోజులకు, అంటే 1945 సెప్టెంబరు రెండో తేదీన రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. 1939 సెప్టెంబరు ఒకటిన మొదలైన ఈ మహా సంగ్రామంలో ఒక వైపున గ్రేట్ బ్రిటన్, అమెరికా, సోవియట్ యూనియన్, ఫ్రాన్స్, చైనాలు, మరో వైపు జర్మనీ, ఇటలీ, జపాన్ తమ సర్వశక్తి యుక్తులు ఒడ్డి పోరాడాయి. సుమారు ఆరు నుంచి ఎనిమిది కోట్లమంది ప్రాణాలు బలి తీసుకున్న ఆఖరి ప్రపంచ యుద్ధం ఇదే.
అప్పటి నుంచీ ఇప్పటి వరకూ అనేక చిన్నా పెద్దా యుద్ధాలు జరిగాయి, జరుగుతున్నాయి, కానీ మూడో ప్రపంచ యుద్దానికి దారి తీసే పరిణామాలు చోటుచేసుకోలేదు. అలా అని ఇవి సృష్టించిన మారణ హోమం తక్కువేమీ కాదు.
‘అప్పుడే పుట్టిన బిడ్డవు, ఈ సంగతులన్నీ నీకెలా తెలుసు’ అంటే, తాము పుట్టకముందు చాలా కాలం క్రితం జరిగిన వాటికి తమదైన భాష్యం తాము కళ్ళతో చూసినట్టు కొందరు చెబుతున్నట్టే ఇదీ అనుకోండి. కనీసం నేను అప్పటికి పుట్టాను.
ఈరోజు సెప్టెంబరు 11. సరిగ్గా పాతికేళ్ళ క్రితం ఇదే రోజున అగ్రరాజ్యం అమెరికాకు కళ్ళు తెరిపిళ్ళు పడే దుర్ఘటన జరిగింది.
ఆ రోజు సాయంత్రం రేడియో స్టేషన్ లో వున్నాము. 6.15 కు మొదలయ్యే ప్రాంతీయ వార్తలు ముగిశాయి. మేము తట్టాబుట్టా సర్దుకుని ప్రెస్ క్లబ్ కు బయలుదేరుదాము అనుకునే సమయంలో, ఆస్ట్రేలియా నుంచి ఒక తెలిసిన మనిషి ఫోన్ చేసి ‘మీకు తెలుసా వైట్ హౌస్ మీద ఉగ్రదాడి జరిగిందట’ అన్నాడు.
నేను టెలిప్రింటర్ రూమ్ లోకి పరిగెత్తి PTI, UNI కాపీలు చూశాను. అలాంటి వార్త ఏమీ కనిపించలేదు. మళ్ళీ ఆ పెద్ద మనిషే ఫోన్ చేసి, ‘వైట్ హౌస్ కాదు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని విమానం డీకొట్టింది, ఆ దృశ్యాలు టీవీలో చూపిస్తున్నారు’ అని పెట్టేశాడు. తరువాత నెమ్మది నెమ్మదిగా విషయాలు తెలుస్తూ వచ్చాయి. తెల్లారి అన్ని పత్రికల్లో అవే ఫోటోలు, అవే వార్తలు. ఇక టీవీలో జంట హర్మ్యాలు కూలిపోతున్న దృశ్యాలు.
ప్రపంచంలో తన పెద్దన్న పాత్రకు, పెత్తనానికీ ఎదురులేదని విర్రవీగే అమెరికన్ పాలకులకు 2001 దాడితో తగిలిన తొలిదెబ్బతో తల బొప్పికట్టింది. ఇన్నాళ్ళుగా తన స్వార్ధ ప్రయోజనాలకోసం పెంచి పోషిస్తూ వచ్చిన ఉగ్రవాద భూతం కోరలు సాచి, తననే కబళించడానికి వచ్చిన తరువాత కానీ అగ్రరాజ్యానికి కళ్ళు తెరిపిళ్ళు పడలేదు. ఈ దారుణ అవమానం నుంచి బయటపడేందుకు 9/11 దాడి సృష్టికర్త ఒసామా బిన్ లాడెన్ ను, వెంటాడి, వేటాడి మట్టు పెట్టేంతవరకు అగ్ర రాజ్యానికి కంటి మీద కునుకు లేకుండా పోయింది.
సెప్టెంబర్ దాడి గురించి మీడియాలో జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. దీనికి కారణభూతుడయిన ఒక వ్యక్తి మాత్రం చరిత్ర పుటల్లో కనుమరుగయి పోయాడు. అతడి పేరు మహమ్మద్ అత్తా.
2001, సెప్టెంబర్, 11 వ తేదీన హైజాక్ చేసిన ఓ అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని నడుపుతూ, మన్ హటన్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లో ఒకటయిన ఆకాశ హర్మ్యాన్ని, అదే విమానంతో డీకొట్టి కూల్చివేసి, నేలమట్టం చేసిన ఉగ్రవాది పేరే మహమ్మద్ అత్తా.
అత్తా పుట్టింది ఈజిప్టులో. తనకు ముప్పయ్యేళ్ళు పైబడ్డ తరువాత, ఒక సెప్టెంబర్ మాసంలో, అమెరికాకు చెందిన ఒక అద్భుత కట్టడాన్ని కూల్చబోతున్నానన్న సంగతి, బహుశా 1968 సెప్టెంబర్ లోనే పుట్టిన అత్తాకు తెలిసుండదు.
అత్తా చిన్నప్పటినుంచి మితభాషి. వాళ్ల నాన్న మహమ్మద్ మాటల్లో చెప్పాలంటే జెంటిల్ మన్. తన పనేదో తనది తప్ప ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకునే తత్వం కాదు.
కెయిరో విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ కోర్సు చేశాడు. తరువాత జర్మనీ వెళ్లి హాంబర్గ్ లో అర్బన్ ప్లానింగ్ లో డిగ్రీ తీసుకున్నాడు. హాంబర్గ్ జీవితం అతని జీవన గమనాన్నే మార్చివేసింది. అక్కడ అతడికి ఇస్లాం ఉగ్రవాదులతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారి వల్ల ప్రభావితుడై, వారి ప్రోద్బలంతో ఆఫ్ఘనిస్తాన్ చేరుకొని అక్కడ అల్ ఖయిదా శిక్షణా శిబిరంలో చేరాడు. చివరకి, ఒసామా బిన్ లాడెన్ తనకు ఒప్పగించిన కర్తవ్యాన్ని జయప్రదంగా ముగించి ఆ క్రమంలోనే తన జీవితానికి కూడా ముగింపు వాక్యం పలికాడు.
అత్తా మహమ్మద్ గురించిన మరో ఆసక్తికర కధనం అమెరికా మీడియాలో ప్రాచుర్యం పొందింది.
1986 లో అత్తా తనకు అప్పగించిన బాధ్యతల్లో భాగంగా ఇజ్రాయెల్ లో ఒక బస్సును పేల్చివేసి ఆ దేశపు పోలీసుల చేతికి చిక్కాడు. ఆ తరువాత, 1993 ఓస్లో ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ తన అధీనంలో వున్న రాజకీయ ఖయిదీలనందరినీ విడిచిపెట్టాల్సిన పరిస్తితి వచ్చింది. అయినా, ‘రక్తపు మరకలు’ అంటిన ఉగ్రవాద ఖయిదీలను వొదిలిపెట్టడానికి ఆ దేశం ఓ పట్టాన ఒప్పుకోలేదు. ఆ రోజుల్లో బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడు. వారెన్ క్రిష్టఫర్ విదేశాంగ మంత్రి (సెక్రెటరీ ఆఫ్ స్టేట్). ఖయిదీలనందరినీ విడుదలచేయాలని వారు ఇజ్రాయెల్ పై వొత్తిడి తెచ్చారు. దానితో ఇజ్రాయెల్ జైళ్లలో వున్న రాజకీయ ఖయిదీలనందరినీ విడిచిపెట్టారు. మహమ్మద్ అత్తా కూడా వారిలో ఒకడు.
చూసే కంటిని బట్టి ప్రపంచం కనబడుతుందంటారు. అందుకే, ఉగ్రవాదుల దృష్టిలో అత్తా ఆత్మ బలిదానం చేసిన అమర వీరుడు. అమెరికా దృష్టిలో కరడుగట్టిన ఉగ్రవాది.
దశాబ్దం క్రితం ఈ సంఘటన చోటుచేసుకున్నప్పుడు అమెరికాతో పాటు ప్రపంచం యావత్తు నివ్వెరపోయింది. ఉగ్రవాదం ఎంత భయంకరమయినదో తెలియచెబుతూ, దాన్ని కూకటివేళ్ళతో పెకలించివేయాల్సిన ఆవశ్యకతను గురించి వివిధ దేశాల నాయకులందరూ నొక్కి చెప్పారు. ఈ కర్తవ్య దీక్షకు కట్టుబడివుంటామని వాగ్దానాలు చేశారు. కానీ, ఇన్నేళ్ళ కాలంలో జరిగిందేమిటి? ఉగ్రవాదం మరింతగా జడలు విరబోసుకుని చేస్తున్న కరాళ నృత్యం పదఘట్టనల కింద విశ్వవ్యాప్తంగా అసువులు బాస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతూనే వుంది. ముఖ్యంగా మన దేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉగ్రవాద నిర్మూలన అనేది భరించలేని భారంగా మారింది. ప్రజాసంక్షేమానికి ఖర్చుచేయాల్సిన విలువయిన వనరులను భద్రతా చర్యలకు మళ్ళించాల్సి వస్తోంది.
ఈ హింస ప్రతి హింసలను నిలుపుచేయడానికి కావాల్సింది కేవలం డంబాలతో కూడిన ప్రకటనలు కాదు. రాజకీయ దృఢ నిశ్చయం. కానీ, ఆధిపత్యపు పోరులో కత్తులు దూసుకునేటప్పుడు విచక్షణ పక్కకు తప్పుకుంటుంది. వివక్ష రెక్కలు తొడుక్కుంటుంది. రక్తం మరిగిన పులి రక్తాన్నే కోరుకుంటుంది. ప్రతీకారంతో రగిలిపోయేవారికి శాంతి వచనాలు చెవికెక్కవు.
చరిత్ర ప్రాముఖ్యం తెలిసిన వారు చరిత్ర నుంచి గుణ పాఠాలు నేర్చుకుంటారు. చరిత్ర క్రమంలో ఎదురయ్యే సంఘటనలను గుర్తుచేసుకుని నెమరు వేసుకోవడంతో సరిపుచ్చుకోరు.



(11-09-2026)

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Totally disagree with your views. Instead of sympathising with the victims of the islamic terrorist attack on 11.9.2001, you are blaming USA.

"ఉగ్రవాదుల దృష్టిలో అత్తా ఆత్మ బలిదానం చేసిన అమర వీరుడు. అమెరికా దృష్టిలో కరడుగట్టిన ఉగ్రవాది."

- How can anyone justify a terrorist attack which killed thousands ?

Very bad article written by you.

అజ్ఞాత చెప్పారు...

Communists, leftist sickular journalists want their family members well settled in USA and at the same time blame speak against and criticize USA. Worst form of hypocrisy.