ఇది ఇప్పటి మాట కాదు. మూడు దశాబ్దాల కిందటి సంగతి. ఈ రోజుల్లో అయితే ఇలాంటి అనుభవాలకు ఆస్కారమే లేదు.
“ఏమండీ ఆయన గారు వచ్చారు, మళ్ళీ ఏదైనా సమస్య వచ్చిందేమో!!”
పదవుతున్నా ఇంకా పడక సీనులోనే వున్న నాతో మా ఆవిడ వచ్చి చెప్పింది.
బయటకు వచ్చి చూస్తే ఆయనే. మొహం వాడిపోయినట్టు వుంది. మనిషి దిగాలుగా వున్నాడు.
పేరుకు పెద్ద అధికారి. పైగా సీనియర్ ఐ.ఏ.ఎస్. మా ఇంటికి వచ్చి నాకోసం ఎదురు చూడడం ఏమిటి చిత్రం కాకపోతే!
నిమిషాల్లో తయారై, ఆటోలో ఆయన్ని తీసుకుని వెళ్ళాల్సిన వాళ్ళ దగ్గరికి తీసుకు వెళ్ళాను. ఆయన్ని బయట కూర్చోబెట్టి లోపల చెప్పాల్సిన వాళ్లకు ఆయన గురించి చెప్పాను.
‘నువ్వు ఇంతగా చెప్పాలా శ్రీనివాసరావ్ ఆయన గురించి. నాకు బాగా తెలుసు. నిజాయితీపరుడు. తన డ్యూటీ శ్రద్ధగా చేస్తాడు. కానీ..”
“ఆ కానీ ఏమిటో నాకూ తెలుసండీ. మీరు ఆయన అడిగిన పోస్టు ఇస్తే, రేపు నేను వెళ్లి ఆయన్ని కలిసినా ఎవరు నువ్వు అన్నట్టే చూస్తారు. ఫోన్ చేసినా రెస్పాన్స్ వుండదు. మళ్ళీ బదిలీ అయిన దాకా నేనెవరన్నది ఆయనకు గుర్తు కూడా వుండదు. ఏ పని చేయాలన్నా రూలు బుక్కే వేదం. మీరే కాదు, ముఖ్యమంత్రి చెప్పినా వినే రకం కాదు. నిజంగా ఇలాంటి అధికారులే కావాలి. అందుకే వెంట బెట్టి తీసుకువచ్చాను. ఇక మీ ఇష్టం” అనేశాను.
“నేనూ అదే చెబుతున్నా! ఇక నీ ఇష్టం. ఈసారి చేస్తాను. ఆరు నెలల్లో మళ్ళీ నువ్వే వస్తావు, ఆయన సంగతి చూడమని. రూలు బుక్కు అంటూ ఎక్కడా ఇమిడే రకం కాదు. ఎవరి మాటా వినే రకం కాదు.” అన్నాడా మంత్రిగారు.
మూడు రోజుల్లో ఆయన కోరుకున్న పోస్టు దొరికింది. నాకు తెలుసు దొరుకుతుందని. మరో విషయం కూడా తెలుసు తిరిగి బదిలీ అయ్యేదాకా నేను ఎవరన్నది ఆయనకు గుర్తు కూడా ఉండదని.
నాకు ఆ అధికారి జిల్లా కలెక్టర్ గా వున్నప్పటి నుంచి తెలుసు. ఆయన నిజాయితీ గురించి, చేసిన మంచి పనులు గురించీ ఆ జిల్లాలోని బీదాబిక్కీ బాహాటంగా చెప్పుకోవడం కూడా నాకు తెలుసు. తర్వాత కొంత కాలానికి హైదరాబాదు బదిలీ పై వచ్చారు.
నారాయణ గూడాలో మాకు దూరపు చుట్టం, మా ఆవిడకి దగ్గరి స్నేహితురాలు అయిన లేడీ డాక్టరు గారికి ఓ నర్సింగ్ హోం వుండేది. తాము వుంటున్న విజయ నగర్ కాలనీ నుంచి రెండు సిటీ బస్సులు మారి ఈ అయ్యేఎస్ అధికారి భార్య, డాక్టరుకు చూపించుకోవడానికి వచ్చేవారు. అక్కడ మా ఆవిడకి పరిచయం ఆమె గారు కూడా. ఆవిడ నిరాడంబరత గురించి మా ఆవిడే చెప్పింది. ఆయన్ని గురించి విన్నది కరక్టే అనే అభిప్రాయం కలిగింది.
ఇలాంటి నిజాయితీ కలిగిన మంచి అధికారులు వుంటేనే ప్రజలకు మంచిది అని కోరుకునే వాడిని కనుక, ఆయన నన్ను పట్టించుకున్నాడా లేదా అనే విషయాన్ని పట్టించుకునే వాడిని కాదు.
పొతే, ఇంత నిబద్ధత కలిగిన అధికారికి పోస్టింగుల మీద ఈ వ్యామోహం ఏమిటి అనే అనుమానం తొలుస్తూ వుండేది.
ఒకసారి బదిలీ అయినప్పుడు ఆయనే చెప్పారు ఇలా.
“సాయం చేయగలిగిన, అదీ అవసరంలో వున్న పేదవారికి సహాయపడగలిగిన పోస్టులో వుంటే చేయగలిగింది చేస్తాను. కలక్టరుగా వున్నప్పుడు ఆ స్వేచ్ఛ వుండేది కొంతవరకు. కానీ సచివాలయానికి వచ్చిన తర్వాత అలా కుదరదు. ఎవరికీ ఉపయోగపడలేని పోస్టులో వేస్తె, గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుని జీతం తీసుకుకోవడం తప్పిస్తే ఏం చేయగలను చెప్పు”
“అది సరే! మీకు సాయం చేసిన పై వారి మాట, కనీసం అప్పుడప్పుడైనా చెవిన పెడితే, మీ గురించి అలా మాట్లాడరు కదా!”
“సరి సరి భలే మాట చెప్పావు. వాళ్ళ మాటలు వినడం మొదలు పెడితే నాచేత వాళ్ళు చేయించేవి పనులు కాదు, అకృత్యాలు”
(ఆ అధికారి ఎవరన్నది ముఖ్యం అనుకోను. ఆయనిప్పుడు జీవించి కూడా లేరు. సర్వీసులో ఉన్న రోజుల్లో తోటి అయ్యే ఎస్సులు ఆయనకీ పెట్టిన పేరు పిచ్చోడు)
(ఇంకా వుంది)
2 కామెంట్‌లు:
Hope or wish we will have more officers of this type.
Such self declared sincere officers are in fact a liability for any post. They don't fit in any team. Minister correctly assessed him. When he needs good posting he unabashedly approached you. Hypocrisy.
కామెంట్‌ను పోస్ట్ చేయండి