రాముడి కుమారుడు దశరధుడు
‘నేను పుట్టడానికి కొన్ని నెలల ముందు నుండే నన్ను చంపడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ దుర్మార్గానికి పూనుకుంది కూడా నా కన్నతల్లే కావడం విధి విచిత్రం’
‘కాబోయే కథకులకు కావాల్సిన చిట్కాలు’ అనే పేరుతో, కొత్త రచయితలకు మార్గనిర్దేశం చేస్తూ కీర్తిశేషులు, సుప్రసిద్ధ కవి, విమర్శకుడు ఆరుద్ర రాసిన ఒక వ్యాస సంపుటి ఈ విధంగా మొదలవుతుంది. కధ ఎత్తుగడ ఎలావుండాలి, తొలి వాక్యంతోనే పాఠకులను యెలా ఆకట్టుకోవాలి అనే అంశానికి ఉదాహరణగా ఆయన ఈ రెండు వాక్యాలను ఉటంకించారు.
పుట్టడానికి ముందే చంపే ప్రయత్నం అంటే ‘అబార్షన్’ అనుకోవాలి. తల్లే దానికి పూనుకున్నదంటే పెళ్లి కాకుండానే ఆమె గర్భవతి అని అర్ధం. ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోవాల్సిన పాపాయే ఈ మాటలు చెబుతోందంటే అబార్షన్ విఫలమయిందని భావం. రెండు చిన్న వాక్యాలలో ఇంత కధను ఇమడ్చగలిగితే ఇక ఆ కధ పట్ల పాఠకుల ఆసక్తి అపరిమితంగా పెరిగిపోయే అవకాశం కూడా అంతే వుంటుంది. ఏమంటారు?
ఏమంటాం. చెప్పింది వింటాం. చెప్పినవారు అలాంటి ఇలాంటి మనిషి కాదాయె. సాక్షాత్తు సరస్వతీ సంపన్నుడు ఆరుద్ర.
కధలు రాయాలని, కవిత్వం గిలకాలని ఒక వయసులో కోరుకోని వారుండరు. మరీ ముఖ్యంగా ప్రాయంలో వున్న మగపిల్లలకు తోటి ఆడపిల్లలను త్వరగా ఆకట్టుకోవడానికి రచయిత అనే ట్యాగ్ లైన్ బాగా ఉపకరిస్తుంది.
పత్రికల్లో వచ్చే కధలు, కాకరకాయలకే ఇంత డిమాండ్ వుంటే ఆబాలగోపాలాన్ని ఆకర్షించే సినిమా కధలకు ఎంత గిరాకీ వుండాలి? అయితే ఎంతమంది అందర్నీ ఆకట్టుకునే రచనలు చేయగలరు.
తెనుగు భాగవతం రాసిన పోతన్నగారేమన్నారు? తాను ఎలా రాశాను అని చెప్పారు?
“విబుధజనుల వలన, విన్నంత, కన్నంత, తెలియవచ్చినంత తేటపరుతు” అన్నారు.
అంతటి పరమ భాగవతోత్తముడు ఎంత వినయంగా చెప్పారు. పెద్దలు చెప్పింది విని, ఆకళింపు చేసుకుని, (పాఠకులకు) తేటతెల్లం చేస్తాను అన్నారు. ఎంత గొప్పమాట.
అంటే ఏమిటి? కేవలం రాయాలనే కోరిక చాలదు. విషయం చెప్పగలిగిన పెద్దలు దొరకాలి. వాళ్ళు చెప్పింది వినాలి. తర్వాతనే కాగితం మీద కలం పెట్టాలి.
ఈ విషయ ప్రస్తావనకు ఒక కారణం వుంది.
వృత్తి రీత్యా సీనియర్ ఐ.పి.ఎస్. అధికారి, ప్రవృత్తి రీత్యా రచయిత, మా మేనకోడలు శారద భర్త అయిన శ్రీ రావులపాటి సీతారామారావు, సినీ రచయిత, దర్శకుడు దశరధ్ రాసిన కథారచన పుస్తకంపై రాసిన ఒక మంచి పలుకును ఫేస్ బుక్ లో చదివాను.
సీతారామారావుగారి మాటల్లో:
“This small but resourceful book contains bigger ideas in first having a good story and then quality screen play to launch a purposeful but acceptable film. As writer of some standing, I learnt many a lesson and for my further writings, I sincerely try to fit in your ideas.”
ఒక రచయిత రచనను, మరో రచయిత హృదయపూర్వకంగా ప్రశంసించడం ఆహ్వానించ తగ్గ పరిణామం.
సినిమా పరిశ్రమని 24 CRAFTS గా పేర్కొంటూ వుంటారు. వీటిల్లో చాలా వాటిల్లో ప్రవేశించడానికి తగిన శిక్షణా సంస్థలు వున్నాయి. చక్కని సినిమా కధని రాసుకుని, తగిన స్క్రీన్ ప్లే రాయడానికి శిక్షణ ఇచ్చే సంస్థలు కానీ వాటిని గురించి తెలియచెప్పే తెలుగు పుస్తకాలు కానీ వున్న దాఖలా నాకు తెలిసి లేవు.
అలనాడు పోతనా మాత్యులు చెప్పినదీ, ఒకనాడు ఆరుద్ర గారు చెప్పినదీ, ఈ రెంటికీ కూడా దశరధ్ రాసిన కథారచన అనే పుస్తకం ఉపకరిస్తుందని నేను నమ్ముతున్నాను.
సరే! రాముడి కుమారుడు దశరధుడు. ఈ మతలబు ఏమిటంటారా!
ఈ సినీ దర్శక, రచయిత దశరద్ ఎవరంటే, ఖమ్మంలో నేను రిక్కాబజార్ స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో నా క్లాస్ మేట్ కొండపల్లి రామచంద్రం కుమారుడు. నాగార్జున హీరోగా నటించిన సంతోషం సినిమాతో ప్రాచుర్యం పొందిన డైరెక్టర్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి