24, సెప్టెంబర్ 2022, శనివారం

సిఫారసు లేని దర్శనం మహా భేషుగ్గా జరిగింది. అయితే....

 


మనం ఎన్ని పాట్లుపడి ముందస్తు ఏర్పాట్లు చేసుకుని తిరుమల వెళ్ళినా మనకు ఎలాంటి  దర్శనం రాసిపెట్టి వుందో అదే  స్వామి అనుగ్రహిస్తాడని పీవీ ఆర్కే ప్రసాద్ గారు ఎప్పుడో రాసారు.  అంచేత తిరుపతి విమానం ఎక్కడానికి ముందే దేవుడిని కోరుకుంది అదే సులభతరమైన మంచి దర్శన భాగ్యం కలిగించమని. గత బుధవారం నాడు మిత్రుడు సూర్య కలిసినప్పుడు తిరుపతి అంశం ప్రస్తావనకు వచ్చింది.

మీరు వస్తాను అంటే నేను రెడీ. అయితే ఒకే ఒక్క షరతు.

దర్శనం, వసతి ఇలా ఏ విషయంలోనూ ఎవరి సిఫారసు కోరవద్దు. ఆడవాళ్ళతో ప్రయాణం కాదు కాబట్టి ఎలాగో సర్దుకుపోదాం

ఈ మధ్య ఎవరో చెప్పారు. ఆన్ లైన్లో శ్రీ వాణి ట్రస్టు టిక్కెట్లు కొంటే దర్శనం అకామడేషన్ వాళ్ళే ఏర్పాటు చేస్తారని.

ఇదేదో బాగుందనుకుని  మర్నాడే చెరి పదివేల అయిదు వందలు, వసతి కోసం వెయ్యి రూపాయలు కాషన్ డిపాజిట్ కింద మరో వెయ్యి చెల్లించి యాత్రకు కావాల్సిన రెండు ప్రధాన అంశాలపై ఎవరి మీద దేనికి ఆధారపడే అవకాశం లేకుండా చూసుకున్నాము.  

శ్రీ వాణి (Sri Venkateswara Aalaya Nirmana) ట్రస్టు టిక్కెట్లు కనుక స్వామివారి మూల విరాట్ వున్న గర్భాలయం గడప వరకు వెళ్లి దర్శనం చేసుకున్నాము. తోపులాటలు, నెట్టడాలు, వగైరాలు లేవు.  విగ్రహం ముందు నిలబెట్టి శఠారి ఇచ్చారు. స్వామి ప్రసాదం అంటూ ఒక పండు చేతిలో పెట్టారు. బయటకి వచ్చి వెలుతురులో చూస్తే అదో చిన్న సైజు  బత్తాయి కాయ. మహా ప్రసాదం అనుకున్నాము. ఆ దేవదేవుడు నా  వేడుకోలు చెవిన పెట్టాడు అని సంతోష పడ్డాను.
సులభంగా చక్కటి దర్శనం అయితే అయింది కానీ, ఆ తర్వాత పట్టపగలే చుక్కలు చూపించారు దేవస్థానం వారు. ఆ ప్రయాస ఇంతా అంతా కాదు. ఆ దెబ్బకు హైదరాబాదు వచ్చిన తర్వాత కూడా రెండు రోజులు మంచానికి అంటుకు పోయాను. కరోనా ముమ్మరంగా ఉన్నరోజుల్లో కూడా జిర్రున చీది ఎరుగని నేను ఈ తిరుపతి యాత్రలో పడిన ప్రయాసకు వడదెబ్బ తగిలి అడ్డం పడ్డాను. అందుకే రోజూ పోస్టుల మీద పోస్టులు పెట్టే వాడిని రెండు మూడు రోజులుగా కంప్యూటర్ ముందు కూచోలేక పోయాను.

“దర్శనం భేషుగ్గా జరిగింది, అయితే....” అని శీర్షిక పెట్టడానికి కారణం ఏమిటన్నది  మరో పోస్టు పెడతాను.

అయితే ఆ చెప్పబోయేది అంతా దేవస్థానం ఉన్నతాధికారుల కోసం. వాళ్ళు చూస్తారా లేదా అనేది నాకు అనవసరం.

“మంచి దర్శనం ఇప్పించు స్వామి” అనే నా మొర ఆ దేవదేవుడే విన్నాడు.  అధికారులు పట్టించుకున్నా లేకపోయినా నేను పట్టించుకోను.

ధర్మారెడ్డి గారు! ఓసారి నాతొ వస్తారా అక్కడ పరిస్త్తితులు ఎలా వున్నాయో మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను ఆ పోస్టు ద్వారా.

(24-09-2022)  

   

      

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

హమ్మయ్య ! మీ ద్వారా ఆ స్వామి వారు ధర్మారెడ్డి & కో వార్ల కళ్ళు‌తెరిపిస్తారని ఆశిస్తా.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

తిరుపతిలో యాత్రలో “చుక్కలు” కనబడకపోతే ఎలాగండీ?

“సిఫారసు లేని దర్శనం” అని ఎలా అంటారండి? శ్రీవాణి ట్రస్ట్ వారి సౌజన్యం కదా, మరి అదే సిఫారసు అంటే.

సిఫార్సు లేకపోవడం అంటే (నా అభిప్రాయంలో) ఆ ట్రస్టు వారు, ఆర్ టి సి వారు, రైల్వే వారి పాకేజ్ కాదు …. మీరే ప్రయాణం టికెట్ కొనుక్కుని, తిరుపతిలో దిగిన తరువాత బస వెదుక్కుని (అప్పటికప్పుడో లేదా ఆన్-లైన్లో బుక్ చేసుకునో), తరువాత కొండ పైకి వెళ్ళి ధర్మదర్శనమో మరోటో క్యూలో నిలబడి ఆ సిబ్బందితో తోయించుకోకుండా దర్శనం చేసుకుంటే ….. అద్గదీ అదీ సిఫార్సు లేని దర్శనం అంటే. శ్రీనాథుడు అన్నట్లు “పస గాన వచ్చెడెన్”. 🙂🙂

అజ్ఞాత చెప్పారు...

మీ అభిప్రాయం సరికాదు. పదివేల రూపాయలు టిక్కెట్ కొనుక్కొని దర్శనం చేసుకోవడం సిఫార్సు కిందికి రాదు.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

గర్భగుడి గడప వరకు కూడా తీసుకు వెళ్ళగలిగేటటువంటి ప్రత్యేక స్ధాయి కలిగిన శ్రీవాణి ట్రస్ట్ వారి టిక్కెట్టు ముక్కనే ఓ రకంగా సిఫారసు పత్రం కోవలోకి తీసుకోవచ్చు ….. అని నా కవిహృదయం.

శ్యామలీయం చెప్పారు...

పిండి కొద్దీ రొట్టె - డబ్బు కొద్దీ దర్శనం - పలుకుబడి కొద్దీ వైభోగం.
రాజకీయ నాయకులు, సినీప్రముఖులు , క్రీడారంగప్రముఖలు వ్యాపారదిగ్గజాలు వీరికి మహారాజ సత్కారం. అధికా‌రులకు రాజసత్కారం. సామాన్య జనానికి వీలునుబట్టి ఏదో దర్శనం లాంటిది. అంతా కాలప్రభావం.

అజ్ఞాత చెప్పారు...

పది వేలు గడప దాకా :)

ఆ పైన వన్నిటికి‌ షరా మామూల్

ఇంతకీ నెక్స్ట్ టపా ఎప్పుడు ?