18, సెప్టెంబర్ 2022, ఆదివారం

అందరు చేస్తున్నది అదే! - భండారు శ్రీనివాసరావు

 (Published in Andhra Prabha daily today Sunday 18-09-2022)

కీర్తిశేషులు, మాజీ గవర్నర్ జనరల్ శ్రీ సి. రాజగోపాలాచారి ఆంగ్లంలో తిరగరాసిన రాజాజీ మహాభారతంలో కృష్ణ భగవానుడి నోటివెంట వెలువడిన మాటల్లో మంచివాళ్ల మౌనం గురించిన ప్రసక్తి వుంది.
(“Silence is connivance,
Connivance is betrayal,
Betrayal is sin,
Sin is punishable offence”)
స్వేచ్చానువాదం చేస్తే, రాజాజీ రాసిన ఆంగ్ల వాక్యాలకు తెలుగులో భావం దగ్గర దగ్గరగా ఇలా వుంటుంది.
“అవసరమైన సందర్భాలలో మౌనంగా వుండడం అనేది ఒక రకంగా లాలూచీనే.
లాలూచీ అంటే దగా
దగా అంటే పాపం
పాపం శిక్షార్హం”
కురుక్షేత్ర మహాసంగ్రామంలో ధనుంజయ ధనుర్విముక్త శస్త్రాలతో తీవ్రంగా గాయపడి, మరణం తధ్యమని నిర్ధారించుకున్న పిదప, ఇచ్చామరణం అనే వరం ఉన్న కారణంగా అంపశయ్యపై ఆఖరి రోజులు గడిపిన భీష్ముడు ఎనలేని మనోవేదనతో కుమిలిపోయిన సందర్భాన్ని రాజాజీ ఇలా అభివర్ణిస్తారు.
“తనొక మహావీరుడు. తెలిసి తెలిసీ ఏనాడూ ఎలాంటి దుష్ట కార్యం తలపెట్టలేదు. పొరబాటున కూడా పాపానికి ఒడిగట్టలేదు. ఇతరుల రాజ్యంపై కన్ను వేయలేదు. పరకాంతను చెరబట్టడం సరే కలలో సయితం ఏ కాంత పొందునూ కోరని ఆజన్మ బ్రహ్మచారిని.
“ఇలాంటి నాకేల ఈ దుస్తితి?
“పగలల్లా రణన్నినాదాలు. చతురంగబలాల ప్రళయ భీకర గర్జనలు. పొద్దువాలే సమయంకల్లా నాటి యుద్ధ పరిసమాప్తి. వల్లకాడులా మారిన రణభూమిలో ఎల్లెడలా శవాల గుట్టలు. ఆత్మీయుల ఆక్రందనలు. కొసప్రాణంతో మిగిలిన సైనికులు, తమ ప్రాణాలు కాపాడండంటూ చేసే హృదయ విదారక రోదనలు. అసువులు బాసిన అమరుల పార్ధివ శరీరాలను కడుపారా ఆరగించడానికి ఆకాశంలో గిరికీలు కొట్టే రాబందుల రెక్కల చప్పుళ్ళు. ఆ నిశిరాత్రి సమయంలో చెవులు చిల్లులు పడేలా నక్కల ఊళలు.
ఒళ్ళు జలదరించే ఇటువంటి దారుణ దృశ్యాల నడుమ, నిదురలేని రాత్రులు గడపాల్సిన స్తితి. ఈ దుస్తితి పగవాళ్ళకు కూడా రాకూడదు.
“కురుపాండవ వంశాలకే కాదు, యావత్ కురుసామ్రాజ్యానికి పరిరక్షకుడిగా, సకల శస్త్రాస్త్రవిద్యలలో ఆరితేరినవాడిగా, సమస్త ధర్మశాస్త్రాలు పుణికిపుచ్చుకున్నవాడిగా, త్యాగానికి మారుపేరుగా, ఆడిన మాట తప్పనివాడిగా, శత్రువుకు వెన్ను చూపని వీరాధివీరుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తన కడసారి ఘడియలు ఈ విధంగా గడుస్తాయని ఏనాడూ అనుకోలేదే. ఎందుకిలా జరిగింది? నేను చేసిన పాపం ఏమిటి?”
అంటూ కుమిలిపోతున్న భీష్ముడి అంతరంగ వేదనకు కృష్ణుడు ఇచ్చిన సమాధానమే పైన రాసిన వాక్యాలు.
“ధృతరాష్ట్రుడి నిండుకొలువులో దుర్యోధనాదులు పాంచాలిని వివస్త్రను చేసే సందర్భంలో, తనను కాపాడమని ఆ అబల కోరినదెవరినో గుర్తున్నది కదా గాంగేయా! భీష్మ, ద్రోణ, అశ్వద్ధామ, కృపాచార్యులను. ఎందుకంటే మీరు సర్వధర్మాలను ఎరిగిన వారు. ఏది మంచిదో, ఏది చెడో నిర్భయంగా చెప్పగలిగిన సమర్ధులు. సర్వశక్తిమంతులు కూడా. అప్పటి ఆనాటి మీ మౌనం ఎంతటి అనర్ధానికి కారణం అయిందో ఇప్పటికయినా తెలిసి వచ్చిందా!”
సరే! ఇది మహాభారత కాలం నాటి కృష్ణ ఉవాచ.
ఈనాడు కూడా సమాజంలోని అనేక వర్గాల్లో ఈ విషయంపై విస్తృత చర్చే జరుగుతోంది. ప్రస్తుతం జాతి జనులు అనుభవిస్తున్న అనేకానేక కష్ట నష్టాలకు, వాటిల్లుతున్న అనర్ధాలకు మంచివాళ్ళ మౌనమే కారణం అన్న వాదన మీడియాలో, ప్రత్యేకించి సోషల్ మీడియాలో సాగుతోంది.
సమాజంలో మంచివాళ్ళు, ముఖ్యంగా మేధావులు అనే బుద్ధిజీవులు (మంచివాళ్ళందరూ మేధావులు కారు, మేధావులందరూ మంచివాళ్ళు కారు అని వాదించే వర్గం ఒకటుంది. అది వేరే సంగతి) మౌనాన్ని ఆశ్రయిస్తున్నారని, ఈ వర్గాలు నోరు మెదిపి దిశానిర్దేశం చేయగలిగితే, ప్రజలను సరైన ఆలోచనాపధంలో పెట్టగలిగితే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయనీ ఈ వాదనల సారాంశం. సమాజాన్ని పట్టి పీడిస్తున్న రాజకీయ అవినీతి పట్ల స్పందించాల్సిన విధంగా మేధావులు వ్యవహరించకపోవడం వల్లనే ప్రజలు అవినీతి, లంచగొండితనం వంటి సాంఘిక రుగ్మతల పట్ల నిర్లిప్తంగా ఉంటున్నారని ఆ సారాంశంలో దాగున్న భావం.
అనేకానేక రాజకీయ అవినీతులు, అధికార దుర్వినియోగాల విషయాల్లో, విశ్లేషకులు, మేధావులు తగు విధంగా స్పందించక పోవడం వల్ల, సాధారణ ప్రజల్లో కూడా అవినీతి ఒక చర్చనీయాంశం లేదా ఒక ప్రాధాన్యత కలిగిన విషయం కాకుండా పోతోందని వాదించే వారు సమాజంలో చాలామంది కనబడతారు. దానికి కారణం ఒక్కటే. ఆ విమర్శలు చేసేవారికి కూడా తగిన నైతిక బలం లేకపోవడమే. ఎక్కువ, తక్కువ అనే తేడాను మినహాయిస్తే, అవినీతికి ఎవరూ అతీతులు కాకపోవడమే. అందువల్లనే సాధారణ ప్రజల్లో సయితం 'అవకాశం దొరికితే అందరూ అందరే ' అన్న భావం నానాటికీ ప్రబలుతోంది. 'బర్రెలు తినే వాడికంటే గొర్రెలు తినేవాడు మేలుకదా' అంటే అది వేరే సంగతి.
నీతికీ, అవినీతికీ నడుమ పైకి కనబడని చిన్న గీత మాత్రమే విభజనరేఖ. ఓ మోస్తరు దుర్వినియోగం కొందరి దృష్టిలో నీతి బాహ్యం కాదు. ప్రభుత్వం అధికారులకు, సిబ్బందికి సమకూర్చే ఫోన్లూ, కార్లూ ఇందుకు ఉదాహరణ.
ప్రభుత్వ వాహనాల దుర్వినియోగం గురించి యెంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
తప్పును తప్పు అని చెప్పాలి అంటే అలాంటి తప్పు చేయనివాడు అయివుంటేనే ఆ చెప్పినదానికి సాధికారికత, విశ్వసనీయత వుంటాయి. అందరూ అవే తప్పులు చేసేవారే అయితే ఇక తప్పొప్పులు చెప్పేదెవరు?
గతంలో పత్రికలు కొంతవరకు ఈ తీర్పరి పాత్ర పోషించేవి. సంపాదకీయ వ్యాఖ్యలకు చాలా విలువ వుండేది. ఉన్నతాధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు సయితం పత్రికల వార్తలకు, సలహాలకు, సూచనలకు తగిన ప్రాముఖ్యత ఇచ్చేవారు.
మీడియా రంగప్రవేశం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వార్తలకు కూడా రంగూ రుచీ వాసనా వచ్చేసాయి.
వార్తకు ప్రాణం పొయ్యడం కంటే తమ మనుగడే ముఖ్యం అనుకున్నప్పుడు, మీడియా ద్వారా సాధించాల్సిందీ, సంపాదించాల్సిందీ ఇంకేదో వుందనుకున్నప్పుడు, స్వేచ్చకు అర్ధమే పూర్తిగా మారిపోతుంది. అదే జరుగుతోంది.
మేధావులు, బుద్ధిజీవులు, మంచివాళ్ళు ఏ పేరుతో పిలిస్తేనేమి, అయితేనేం, వాళ్ళు వర్తమాన సామాజిక అంశాల పట్ల తగు విధంగా స్పందించకపోవడానికి ప్రధాన కారణం వారిలో ఎంతోకొంత నైతిక బలం కొరవడడం ఒక కారణం అయితే, మంచి చెప్పి మాటలు పడడం కంటే, నాడు కురుసభలో భీష్మాదుల మాదిరిగా మౌనాన్ని ఆశ్రయించడం మంచిదనే భావన ప్రబలడం మరో కారణం.
ఉపశృతి:
పక్కవారు చేస్తేనే దుర్వినియోగం అనడానికి ఓ చిన్న జోక్ చెప్పుకుందాం.
గుండె గుభిల్లుమనేలా ఫోను బిల్లు వచ్చింది. నెలనెలా పెరిగిపోతున్న ఫోను బిల్లు గురించి మాట్లాడడానికి ఇంట్లోవున్న నలుగుర్నీ పిలిచాడు ఇంటి యజమాని.
తండ్రి: ఇంతంత బిల్లులు వస్తే ఎలా? నన్ను చూడండి. నేను ఆఫీసులో ఫోను తప్ప ఇంట్లో ఫోనే వాడను. మరి ఇది ఎవరి పని?
భార్య: పగలల్లా నేనూ ఆఫీసులోనే కదా వుండేది. నేనూ మీలాగే అక్కడకిపోయే ఫోన్లు చేస్తుంటాను.
కొడుకు: ఇంటి ఫోను ముట్టుకునే అవసరం నాకేమిటి? నాకు కంపెనీ ఇచ్చిన మొబైల్ వుంది.
పనిపిల్ల: అందరం చేస్తున్నది అదే కదా. ఇక గొడవెందుకు?
(పనిపిల్లకు పనిచేసే ఇల్లే ఆఫీసు కదా!)





(18-09-2022)