30, నవంబర్ 2020, సోమవారం

మా భారతి అక్కయ్య - భండారు శ్రీనివాసరావు

 

పదకొండు మంది సంతానంలో ఆడపిల్లల్లో ఆమె చిన్నది. మగపిల్లల్లో నేను చిన్న వాడిని. అంతే అంతవరకే పోలిక. ఆమె వ్యక్తిత్వం ముందు నేనో పిపీలికాన్ని.

రేడియో డ్యూటీ మీద బెజవాడ వెళ్ళినప్పుడు,   గాంధీ నగరం లోని వాళ్ళింట్లోనే వారాల తరబడి నా ఆల్ మకాం.

 పొద్దున్నే రేడియో స్టేషన్ కారు వచ్చేది. నేను తలుపులు తీసుకుని బాత్ రూమ్ కి వెడుతుంటే బయట బండెడు అంట్ల గిన్నెలు, ఎంగిలి కంచాలు. అంటే అంతమంది జనం రాత్రి ఆ ఇంట్లో భోజనాలు చేశారన్న మాట. పక్కనే మా బావగారి పూజా రూము. అప్పటికే ఆమె  లేచి ఆ గది శుభ్రం చేసి పూజకు కావాల్సిన సంభారాలన్నీ సిద్ధం చేసిపెట్టి  నాకు కాఫీ కలిపి ఇచ్చేది. ఇంత పనీ తాను ఒంటి చేత్తో  సంభాలించేది. 

ఈ  బక్కపలచటి ఈ మనిషిలో అంతటి శక్తి ఎక్కడిది ? ఈ ప్రశ్నకి నాకు తెలిసి ఒకటే జవాబు. 

కుటుంబం పట్ల ఆమెకున్న కమిట్ మెంట్. ఈ పదానికి ఆమెకు అర్ధం తెలుసని అనుకోవడం లేదు. కానీ దానికి నిలువెత్తు నిదర్శనం మాత్రం  ఇదిగో ఈ కుర్చీలో కూర్చున్న మా అక్కయ్యే.భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్టు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఒక గృహిణిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా ఇన్నేళ్ళుగా శరీరం సహకరించినా లేకపోయినా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చింది. 

దానికి గుర్తింపే ఇదిగో ఈ ఉత్సవం. ఈ పండగ. 

ఈ అదృష్టం ప్రతి తల్లికీ లభించాలంటే  రమేష్, సురేష్, పరేష్, సతీష్, రాజేష్ వంటి కుమారులు,  పద్మ, , స్వర్ణ , విజయలక్ష్మి,  సౌజన్య,  నీరజ వంటి కోడళ్ళు కావాలి. అదంత సులభం కాదు. 

ఈ శుభసందర్భంలో మా అక్కయ్యకు పాద నమస్కారాలు. అందరికీ అభినందనలు. పిల్లలకు ఆశీస్సులు.

నాకు సంబంధించి ఒక్కటే లోటు. మా ఆవిడ వున్నట్టయితే ఇదంతా చూసి ఆమె ఆనందానికి అవధులు వుండేవి కావు. (29-11-2020)

కామెంట్‌లు లేవు: