24, నవంబర్ 2020, మంగళవారం

వెస్ట్ బెంగాల్ లో బీజేపీ వ్యూహం

 మోడీ షా ద్వయం నాయకత్వంలోని బీజేపీ ఏ ఎన్నికను అయినా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అది పంచాయతీ ఎన్నిక కావచ్చు, పార్లమెంటు ఎన్నికలు కావచ్చు.  ఈ నాయకత్వానికి ఒక గమ్యం వుంది. దాన్ని చేరుకోవడానికి వీలైన మార్గాలను నిరంతరం అన్వేషిస్తూనే వుంటుంది. లక్ష్య సాధన అనేదే ప్రధానం. మిగిలినవి అన్నీ అనుకున్నది సాధించడానికి ఎన్నుకునే మార్గాలే. ఇందుకు ఆ పార్టీ తొందర పడదు. నిదానంగానే అయినా సరే ధ్యేయాన్ని నెరవేర్చుకోవడమే ముఖ్యం. ఇప్పటికిప్పుడు అధికారాన్ని సొంతం చేసుకోవాలనే ఆత్రుత లేదు. అలా అని వచ్చేనాటికే అధికారం చేతికి వస్తుందిలే అని కాడి కింద పారేసి దిక్కులు చూసే వ్యవహారం కాదు.

ఇలాంటి బహుముఖ వ్యూహాలతో సాగే పార్టీకి ఎప్పుడో ఒకప్పుడు విజయం సిద్ధించక మానదు. దాన్ని సుస్తిరం చేసుకోవడం మరో దశ.

ఏ రాజకీయ పార్టీకి అయినా గెలుపును మించిన ఆనందం వుండదు. అదో టానిక్కు లాంటిది.

నిరుడు వెస్ట్ బెంగాల్ లోకసభ ఎన్నికల్లో బీజేపీకి ఈ టానిక్ లభించింది. కనీవినీ ఎరుగని రీతిలో మొత్తం నలభయ్ రెండు స్థానాల్లో పద్దెనిమిది గెలుచుకుని విజయబావుటా ఎగురవేసింది.  

అయితే మరో ఆరు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో  ఇలాంటి విజయం సాధ్యమవుతుందా! పోటీ తృణమూల్ కాంగ్రెస్ తో. బెంగాల్ ని కంచుకోట చేసుకుని రికార్డు కాలం పాలించిన కమ్యూనిస్తులనే మమత దీదీ పక్కకు నెట్టేసింది. ఇక అక్కడ జరిగేది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో వున్న తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోటీ. మిగిలిన పార్టీలు ఏవీ ప్రభావం చూపగల పరిస్థితిలో లేవు.

నిరుడు సాధించిన విజయోత్సాహంతో ఉన్న బీజేపీ ఈ సారి అన్ని అవకాశాలను వాడుకుంటుంది. రాష్ట్రంలో ఒక్క పోలింగు బూతును కూడా వదిలిపెట్టవద్దని ఇటీవలే ఆ పార్టీ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేసం చేసారు. అలా అని తృణమూల్ ప్రభావాన్ని కానీ రాష్ట్రంపై ఆ పార్టీకి వున్న పట్టును కానీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి స్థానిక అంశాలకు ప్రాధాన్యత వుంటుంది. అమిత్ షా ఈ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు, రాజకీయంగా కూడా బీజేపీకి బెంగాల్ లో పాగా వేయడం కీలకం. కాబట్టి సమస్త  శక్తి యుక్తులను, రాజకీయ ఎత్తుగడలను, పట్టు విడుపులను ఉపయోగిస్తుంది. రెండు ప్రధానమైన వామపక్ష వ్యతిరేక పార్టీలు నువ్వా నేనా అనే రీతిలో పోటీ పడడం వల్ల ఓట్లు చీలి కమ్యూనిస్ట్ పార్టీలకు కొంత ప్రయోజనం కలగొచ్చని భావించే వాళ్ళు కూడా వున్నారు. కానీ ఇది వాస్తవం కాకపోవచ్చు.   

పొతే, కాంగ్రెస్. ఒకప్పుడు ఈ పార్టీకి చెందిన అగ్రనాయకులు చాలామంది కాంగ్రెస్ వారే. ప్రణబ్ ముఖర్జీ లాంటి వాళ్ళు రాష్ట్రపతి కూడా కాగలిగారు. కానీ సొంత రాష్ట్రంలో ఆ పార్టీకి కార్యాలయాలు తప్పిస్తే గట్టి నాయకులు, కార్యకర్తలు లేకుండా పోయారు. జాతీయ పార్టీగా కాంగ్రెస్ అధినాయకత్వం స్వయంకృతాపరాధం ఇది. స్థానిక నాయకత్వాలను ఎదగనీయకుండా చేయడం వల్ల అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలు పుట్టుకు వచ్చాయి.  అవి బలపడ్డాయి కానీ కాంగ్రెస్ నీరసించి పోయింది.

ఇప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్న బీజేపీ కూడా కాంగ్రెస్ అనుభవాన్ని గుర్తు పెట్టుకుంటే మంచిది.

కామెంట్‌లు లేవు: