20, నవంబర్ 2020, శుక్రవారం

వాసికెక్కిన వేణుగోపాల్

 “మీది కంభంపాడు కదా!”

చాలా ఏళ్ళ క్రితం  హైదరాబాదులోని ఆర్టీసీ  కళ్యాణమండపం దగ్గర ఉన్న  10 టీవీ స్టూడియోలో ఉదయం డిబేట్ అయిన తర్వాత లిఫ్ట్ వైపు వెడుతుంటే వినపడ్డ పలకరింపు.

పక్కకు తిరిగి చూస్తే నవ్వు మొహంతో కనపడ్డాడు వేణుగోపాల్.

“నా పేరు వాసిరెడ్డి వేణుగోపాల్” అని  పరిచయం చేసుకున్నాడు.

జర్నలిస్టు వేణుగోపాల్ గురించి గొప్ప విషయాలు చాలా విన్నాను కానీ ఎలా ఉంటాడో తెలియదు. అంతటి మనిషిలో ఈ నమ్రత ఏమిటి?

“మీకెలా తెలుసు మాది కంభంపాడు అని?”

నా ప్రశ్నకు ఆయన భళ్ళున నవ్వాడు.

”అదంతా ఓ కధ మరోసారి చెబుతా” అన్నాడు.

మా ఊరు ప్రస్తావన తేగానే నేనే అడిగి ఆయన నెంబరు తీసుకున్నాను.

తర్వాత మళ్ళీ కలిసింది లేదు, ఏదో అప్పుడప్పుడూ ఫోన్లో పలకరింపులు తప్ప.

అలా అలా కాలం గడిచి పోతుండగా మళ్ళీ వేణుగోపాల్ తారసపడ్డాడు. ఈసారి బయట కాదు, ఫేస్ బుక్ లో. అదీ ఓ చేతిలో రోలు, మరో చేతిలో రోకలి పట్టుకుని. వేణు విశ్వరూపాన్ని ఆయన రాతల్లో చూశాను.

ఇంత గొప్పవాడు మా ఊరు గురించి ప్రస్తావించాడు అదేదో తెలుసుకోవాలని మళ్ళీ  నేనే ఫోన్ చేశాను. అప్పుడు తెలిసింది ఆయన కూడా చిన్నప్పుడు కొంత కాలం మా ఊరు కంభంపాడులో గడిపాడని. ఆ వివరాలన్నీ వారి సోదరి వాసిరెడ్డి పద్మగారు ఓ ఉదయం టీవీ చర్చల్లో కనబడి, నా ఆహ్వానం మేరకు మా ఇంటికి వచ్చి మా ఆవిడ ఇచ్చిన కాఫీ తాగుతూ చెప్పారు. వారి అమ్మగారితో కూడా ఫోనులో మాట్లాడించారు.  

ఇక అప్పటినుంచీ ఆయన గురించి తెలుసుకోవడం నా వ్యాపకం అయిపోయింది. ఇదంత పెద్ద కష్టం అనిపించలేదు. ఫేస్  బుక్ లో ఆయన పోస్టింగులు చదివితే చాలు ఏరోజుకారోజు ఆయన దినవారీ వ్యవహారాలన్నీ తెలిసిపోతాయి. ఎక్కడ ఉన్నదీ, ఏం చేస్తున్నదీ ఏ ఊరు ఎప్పుడు వెళ్ళింది, ఏ గుడి వెనక ఏ చరిత్ర వుంది అన్నీ సవివరంగా రాసేవారు. ఏదీ దాచుకునే బాపతు మనిషికాదు. ఏదీ గోప్యం కాదు. అన్నీ బహిరంగమే. అన్నీ బాహటమే. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించేంతగా వుండేది వాసిరెడ్డి వేణుగోపాల్ రాతల తీరు.

కుక్కలంటే ఇష్టం. మొక్కలంటే ఇష్టం. చుట్టుపక్కల వుండే పిల్లలంటే ఇష్టం. వాళ్ళలో  ఒకడై ఆటలాడడం ఇష్టం.

పుస్తకాలంటే ప్రాణం. చదవడం ఇష్టం. చదివింది రాయడం ఇష్టం. రాయడంలో తృప్తిని ఆసాంతం ఆస్వాదించడం ఇష్టం.

ఇన్ని ఇష్టాలు వున్న మనిషి కాబట్టే అందరికీ ఇష్టుడు అయ్యాడు. రోలూ రోకలితో ఫేస్ బుక్ లో చెలరేగిపోయాడు. రోటి పచ్చడి అనేది ఆయన ఇంటి పేరుగా మారేంత స్థాయిలో వాటికి ప్రాచుర్యం కల్పించాడు. ఇదేమంత మామూలు విషయం కాదు. ఒకరకంగా వాటికి బ్రాండ్ ఇమేజ్ తీసుకువచ్చాడు.

వేణుగోపాల్ జర్నలిస్టు అనేవాడికి  ఎడమ కాలి దురద వుండాలని చెప్పేవాడు. తనకు ఆ దురద పుష్కలంగా వుందని నిరూపిస్తూ,  చేసిన ప్రతి ఉద్యోగాన్ని ప్రత్యామ్నాయం చూసుకోకుండానే ఎడమ కాలితో తన్నేసేవాడు. ఇలా ఎన్ని ఉద్యోగాలు ఆయన పాదతాడనానికి గురయ్యాయో నాకైతే లెక్క తెలియదు.

పుస్తకాలమీద ఉన్న పిచ్చిఆపేక్షతో సొంతంగా వాసిరెడ్డి పబ్లికేషన్స్ పెట్టి, వ్యాపార సులువులు తెలియక  రెండు చేతులూ  మోచేతుల దాకా కాల్చుకున్నాడు. కానీ నో రిగ్రెట్స్. ఇష్టంతో చేసే పనిలో కష్టం ఎదురైనా పరవాలేదనే తత్వం.

అలాంటి మనిషిని ఓ జబ్బు వశపరచుకుంది. అలాంటి మనిషిని ఆ జబ్బు కుంగతీసింది. తీశానని అనుకుంది. కానీ వేణు అట్లాంటి ఇట్లాంటి మనిషి కాదని, దానికీ తెలిసివచ్చింది. వేణుని వెంటబెట్టుకుని వెళ్ళడానికి నెలల తరబడి శ్రమించింది. దాని పోరాటం చూసి దయాళువు అయిన వేణు గోపాలే చివరికి లొంగిపోయాడు.

పరిచయం ఉన్న వ్యక్తుల్నీ, ఆయనంటే పడిచచ్చే స్నేహితుల్నీ, ఆడుకున్న పిల్లల్నీ, దాచుకున్న పుస్తకాల్నీ, పెంచుకున్న కుక్కల్నీ, మొక్కల్నీ అందరినీ, అన్నింటినీ బాజాప్తాగా ఒదిలేసి , తన అలవాటు ప్రకారం ఈ లోకాన్ని ఎడంకాలితో తన్నేసి వెళ్ళిపోయాడు వాసిరెడ్డి వేణుగోపాల్.  

ఆ కుక్కల, మొక్కల కన్నీరు తుడిచేది ఎవరు?


(వాసిరెడ్డి  వేణుగోపాల్ సంస్మరణ సంచిక కోసం)

కామెంట్‌లు లేవు: