15, ఏప్రిల్ 2020, బుధవారం

మబ్బుల్లో రాజకీయాలు

(ఎటో వెళ్ళిపోయింది మనసు)
టీవీ చర్చల్లో పాల్గొనే విశ్లేషకులకు వివరంగా మాట్లాడే అవకాశం అరుదుగా లభిస్తుందనేది స్వానుభవం.
‘నువ్వీరోజు గంట చర్చలో మాట్లాడింది నాలుగున్నర నిమిషాలు మాత్రమే’ అని ఒకసారి జ్వాలా లెక్క కట్టి మరీ చెప్పాడు. ఇక ఉండబట్టలేక ఓ టీవీ యాంకరిణితో అన్నాను కూడా, ‘మాట్లాడే చాన్స్ లేకపోతే పీడా పాయె. కనీసం తెరమీద అన్నా కాసేపు కనబడేట్టు చూడండి. మా ఆవిడ అనుమానస్తురాలు కాదు కానీ ప్రతిసారీ ఇలా టీవీ చర్చల పేరుతొ ఇంకెక్కడో తిరిగొస్తున్నానని ఏనాటికయినా అనుమానించే ప్రమాదం లేకపోనూ లేదు’.
నా మాటలో శ్లేష ఆ అమ్మడికి అర్ధమయిందో లేదో నాకు తెలియదు. అంతకంటే గట్టిగా చెప్పడం నాకు రాదు.
ఒక రోజు ఉదయం టీవీ 5 ఛానల్లో ఎక్జిక్యూటివ్ ఎడిటర్ (ఇప్పుడు ఎడిటర్ అయ్యారు) విజయ్ నారాయణ్ న్యూస్ స్కాన్ చర్చాకార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి ఆదివారం ఉదయం వారాలబ్బాయిగా నా హాజరీ అక్కడ. అలా అయిదారేళ్ళు క్రమం తప్పకుండా వెళ్లి వుంటాను. విజయ్ గారికి నా మీద అవ్యాజానురాగమో ఎందుకో తెలియదు కాని ముందు నా చేతనే మాట్లాడిస్తుంటారు. తర్వాత అవకాశం ఇచ్చే ఛాన్స్ రాదు అనేమో!
‘ఏపీ రాజకీయ పరిణామాలపై మీరేమనుకుంటున్నారు?’ అనేది ఆయన అడిగిన ప్రశ్న. బహుశా ఈ ప్రశ్ననే మార్చి మార్చి అనేక డజన్ల పాటు అనేక చర్చల్లో అడిగివుంటారు. నేను పలుమార్లు నా జవాబునే తిరగేసి మరగేసి చెప్పివుంటాను.
“ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పూర్తిగా మబ్బులు కమ్మేశాయి. వాటి చాటున దాగున్న రాజకీయ చిత్రం అస్పష్టంగా కనిపిస్తోంది. ఆకాశంలో మబ్బుల్లోకి చూస్తే వాటిలో ఒకరికి ఏనుగు ఆకారం కనిపిస్తుంది. మరికొందరికి అదే మబ్బులో మరో ఆకారం కనబడుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరికించేవారికి కూడా విభిన్నమైన చిత్రాలు కనబడుతున్నాయి. రాజకీయపు పొరలు తొలగించుకుని చూస్తే వాస్తవమైన రాజకీయ చిత్రం గోచరిస్తుంది”
ఆనాటి చర్చలో నాతోపాటు శ్రీ కుటుంబరావు (టీడీపీ, అమరావతి నుంచి), శ్రీ రఘురాం (బీజేపీ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్లో) పాల్గొన్నారు.



4 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

కర్ర విరగకుండా పాము చావకుండా బలే diplomatic గా చెబుతారండీ మీరు 👌. అసలు మీరు రాజకీయాలకు తగిన వ్యక్తి 🙂.

నీహారిక చెప్పారు...

కర్ర విరగకుండా పాము చావకుండా బలే diplomatic గా చెబుతారండీ మీరు 👌. అసలు మీరు రాజకీయాలకు తగిన వ్యక్తి 🙂
👌👌👌

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ విన్నకోట నరసింహారావు @ నీహారిక : రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎనభయ్ దాటిన తర్వాత కూడా రాజకీయాలు నడిపిన వాళ్ళు నాకు తెలుసు. కానీ 74 ఏళ్ళకు రాజకీయాల్లో చేరి రాణించిన వృత్తాంతాలు మీ ఎరుకలో వుంటే చెప్పండి అలాగే చేస్తాను

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

హ్హ హ్హ, శ్రీనివాస రావు గారు. రాణింపుకు అవకాశమే ఉంటే ఈ వయసులో నేనూ జేరుండేవాడినే.

మీ గురించి నా ఉద్దేశం మీరు అలనాడే / కెరీర్ ప్రారంభంలోనే ఆ రంగం వైపు వెళ్ళుంటే రాణించుండే వారని 🙂🙂.
🙂