6, ఆగస్టు 2019, మంగళవారం

కాశ్మీర్ : నమ్మలేని నిజాలు


పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలి అంటూ  దశాబ్దాల తరబడి  నాన్చుతూ వస్తున్న ఓ మొండి  సమస్యకి ముగింపు పలుకుతూ  ప్రధాని మోడీ చివరికి ఆ గంట కట్టారు. అయితే ఇది ముగింపా లేక మరో సమస్య పురుడు పోసుకోవడానికి ప్రారంభమా అనేది కాలమే చెప్పాలి.  
నా చిన్నప్పుడు కాశ్మీర్ అంటే భూతల స్వర్గం అనేవారు. పెరిగి పెద్దయ్యే సరికి అది భూతాల స్వర్గం అవుతుందని ఆరోజుల్లో ఎవరూ అనుకోలేదు.  కాశ్మీర్ అంటే మంచు ముంచెత్తే లోయలు. కాశ్మీర్ అంటే అందమైన సరస్సులు.  కాశ్మీర్ అంటే కనువిందు చేసే ప్రకృతి. కాశ్మీర్ అంటే జీవితంలో ఏదో ఒక రోజు చూసితీరాలని అనిపించే ఇహలోక స్వర్గం. తీరని ఆ కోరిక తీర్చుకోవడం కోసమేమో తెలియదు,  కాశ్మీర్ అందచందాలను ఆరబోసే హిందీ చలన చిత్రాలను, ఆ భాష అర్ధం కానివాళ్ళు కూడా విరగబడి చూసేవాళ్ళు. ఒకప్పుడు కాశ్మీర్ అన్నా, దాన్నే  ఇప్పుడు కష్మీర్ అంటున్నా అది నిజంగా భూతల స్వర్గమే.
‘భారత ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ, కాశ్మీర్ ప్రధాన మంత్రి షేక్ అబ్దుల్లాతో భేటీ’ అనే వార్త చిన్నప్పుడు పత్రికల్లో  చదివినప్పుడు, ‘ఇదేమిటి కాశ్మీర్ భారత్ లో లేదా, దానికి వేరే ప్రధానమంత్రి ఏమిటి?’ అనే సందేహాలు పొటమరించేవి.
కాశ్మీర్ చరిత్రే కాదు, ఏ ప్రాంతపు చరిత్ర అయినా ఆయా కాలాల్లో నివసించిన లేదా వాటిని గురించి అధ్యయనం చేసిన చరిత్రకారులు రాసిన  పుస్తకాల ద్వారా మాత్రమే తెలుసుకోవడానికి వీలుంటుంది. అంతమాత్రాన అది నూటికి నూరుపాళ్ళు వాస్తవమైన చరిత్ర అని అనుకోలేము. రాసేవారి మనోభావాలుబట్టి, వారి వారి భావజాలాన్నిబట్టి కొంత వక్రీకరణ చోటుచేసుకునే వీలుంటుంది. అవి చదివేవాళ్ళు కూడా వారి వారి అభిప్రాయాలకు తగ్గట్టుగానే చరిత్ర గురించిన అభిప్రాయాలను ఏర్పరచుకునే అవకాశం వుంటుంది. భావితరాల వారు ఇదే  నిజమైన చరిత్ర అని అపోహపడే ప్రమాదం కూడా వుంటుంది. కానీ ఇంతకూ మించి మనం చరిత్రను అవగతం చేసుకునే  వీలు ప్రస్తుతానికి లేదు. ఈ విషయం గమనంలో ఉంచుకుని చరిత్రను అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తే అపార్ధాలకు తావుండదు.
స్వతంత్ర భారత చరిత్రలో జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇద్దరికీ అత్యంత విలువైన స్థానం వుంది. స్వతంత్ర భారత రూపకల్పనలో ఎవరూ కాదనలేని స్థానం వారిద్దరిదీ. ఇరువురూ ఒకే రాజకీయ పార్టీకి చెందినా వారయినా వారి ఆలోచనా రీతులు విభిన్నం. ఆ నాటి పరిస్తితుల నేపధ్యంలో చరిత్రను అర్ధం చేసుకోకుండా, కేవలం వ్యక్తి ఆరాధన కారణంతో విశ్లేషించుకుంటే మిగిలేది చరిత్ర కాదు, కేవలం ఊహాగానభరితమైన కధాకధనం మాత్రమే. విచిత్రం ఏమిటంటే నెహ్రూను అభిమానించేవారు వారు పటేల్ పట్ల కూడా అదే విధమైన ఆరాధనభావంతో వుంటారు. అలాగే పటేల్ అభిమానులు కూడా నెహ్రూను ప్రేమిస్తారు. అయితే రాజకీయాల కోణం నుంచి చూస్తే వారికీ వీరికీ చుక్కెదురు. నెహ్రూ విధానాలను వ్యతిరేకించేవారు పటేల్ ను కారణం లేకుండానే అభిమానిస్తారు. ఒక రకంగా సినీ నటుల అభిమానులు ప్రదర్శించే గుడ్డి అభిమానం అనుకోవచ్చేమో!
ఈఇరువురు నాయకులను గురించి అనేక గ్రంధాలు వెలువడ్డాయి. కొన్ని వారి సమకాలీనులు రాసినవి. మరికొన్ని వారి తదనంతర కాలంలో అధ్యయనం చేసి రాసినవి. ముందే చెప్పినట్టు వారిపట్ల రచయితలకు ఉన్న సహజసిద్ధమైన అభిమానపు ఛాయలు వాటిల్లో తొంగిచూడడంలో ఆశ్చర్యం లేదు.
పాకిస్తాన్ కనుక  హైదరాబాద్ డెక్కన్ (నాటి నిజాం సంస్థానం) పేరెత్తకుండా వుంటే,  కాశ్మీర్ ను పాక్  కు వదిలేసేందుకు  పటేల్ సుముఖత వ్యక్తం చేసారని కాశ్మీర్ నేత సైఫుద్దీన్ సోజ్, ‘కాశ్మీర్, గ్లింప్స్ ఆఫ్ హిస్టరీ అండ్ ది స్టొరీ ఆఫ్ స్ట్రగుల్’ అనే  పుస్తకంలో రాసారు.
ఆ ప్రకారం పటేల్ చేసిన ప్రతిపాదనను పాకీస్తాన్ లో కాశ్మీర్ వ్యవహారాలు కనిపెట్టి చూసే హయత్ ఖాన్ కు బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటెన్ అందించారు.  పాకీస్తాన్ హైదరాబాద్ డెక్కన్  పేరెత్తకుండా వుంటే  కాశ్మీర్ ను పాక్  కు ఇచ్చేందుకు సిద్ధమేనని పటేల్ షరతు పెట్టారన్నది ఆ ప్రతిపాదన.
హయత్ ఖాన్ దాన్ని అప్పటి పాక్ ప్రధాని లియాకత్ ఆలీఖాన్ కు చేరవేశారు.
‘కాశ్మీర్ కోసం, అక్కడి బండరాళ్ళ కోసం పంజాబ్ కంటే విశాలమైన హైదరాబాద్ డెక్కన్  వదులుకునేందుకు నేనేమీ పిచ్చివాడిని కాదు’ అన్నది  లియాఖత్ స్పందన.
కాశ్మీర్ ను వదులుకునేందుకు  తొలిరోజుల్లో పటేల్ సుముఖంగానే ఉండేవారని ఆయన దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా  పనిచేసిన వీపీ మీనన్ చెప్పారు.
భారత దేశం, పాకీస్తాన్ ఈ రెంటిలో దేనిలో చేరతారో  తేల్చుకోండని  వల్లభాయ్ పటేల్, 1947 జూన్  3వ తేదీన ఆనాడు దేశంలో లెక్కకు మిక్కిలిగా ఉన్న స్వదేశీ సంస్థానాధీసులకు రాసిన లేఖలో  ఓ అవకాశం ఇచ్చారని ‘ఇంటిగ్రేషన్  ఆఫ్ ఇండియన్ స్టేట్స్’ అనే పేరుతొ రాసిన ఓ పుస్తకంలో మీనన్  పేర్కొన్నారు.
రాజ్ మోహన్ గాంధి ‘పటేల్ ఏ లైఫ్’ అనే పేరుతొ పుస్తకం రాసారు. అందులో పటేల్ గురించి పేర్కొన్న కొన్ని విషయాలు:
1947 అక్టోబర్  26 న నెహ్రూ నివాసంలో ఒక  సమావేశం జరిగింది. మహరాజా హరిసింగ్ దూతగా వచ్చిన  మెహర్ చాంద్ మహాజన్ కాశ్మీర్ రాజు తరపున  భారత్ సైనిక సాయాన్ని అర్ధించారు. ఇందుకు  భారత్ అంగీకరించని పక్షంలో పాకీస్తాన్ సాయం కోరాల్సివస్తుందని కూడా మెహర్ చాంద్ చెప్పారు.  ఆ మాట నెహ్రూకు విపరీతమైన కోపం తెప్పించింది. ‘అలా అయితే తక్షణం వెళ్ళిపొమ్మని ఆ దూతని ఆదేశించారు. సర్దార్ పటేల్ ఆ సమయలో కలగచేసుకుని ‘మహాజన్! మీరు పాకిస్తాన్ తో కలవడం లేదు’ అని హామీ ఇచ్చారు. (అంటే భారత్ మీరు అడిగిన సాయం చేయడానికి సిద్ధంగా వుంది  అనే అర్ధం అందులో వుందని రాజ్ మోహన్ గాంధి అభిప్రాయం)
కాశ్మీర్ పట్ల పటేల్ కు పెద్ద ఆసక్తి లేదని తెలిపే మరో ఉదంతాన్ని గుజరాతీ చరిత్రకారుడు, రచయిత అయిన ఊర్విష్ కొఠారి బీబీసీ ప్రతినిధికి వెల్లడించారు. ‘సచో మానస్ సాచి వాట్’ అనే పేరుతొ గుజరాతీలో ఊర్విష్ కొఠారి ఒక పుస్తకం రాసారు. అందులో పేర్కొన్న కొన్ని విషయాలను ఆ రచయిత బీబీసీతో పంచుకున్నారు.
“కాశ్మీర్ లో ముస్లిం జనాభా ఎక్కువ. భౌగోళికంగా చూసినా ఆ ప్రాంతం  పాకిస్తాన్ కు దాపులో వుంది. అంచేత భారత్ లో  కాశ్మీర్ విలీనం పట్ల  పటేల్ కు పెద్దగా  ఆసక్తి లేదు. అయితే స్వయానా కాశ్మీరీ అయిన నెహ్రూకు మాత్రం కాశ్మీర్ ను  భారత్ లో కలపాలనే కోరిక బలంగా  వుండేది. పైగా మహారాజా హరి సింగ్ , షేక్ అబ్దుల్లా ఇద్దరూ నెహ్రూకు మంచి స్నేహితులు. కాశ్మీర్ విషయంలో అవసరానికి మించి నెహ్రూ సున్నితంగా, ఉదారంగా వ్యవహరించడానికి అదో కారణం  అంటారు ఊర్విష్.
ముందే చెప్పినట్టు ఈ పుస్తకాల్లో రాసినవన్నీ అక్షర సత్యాలని భావించలేము. ఆ రోజుల్లో అంటే నెహ్రూ శకంలో వల్లభాయ్ పటేల్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు జరిగాయన్నది కొందరి వాదన.
భారత్ లో కాశ్మీర్ విలీనం జరిగి ఏండ్లూ పూ౦డ్లూ గడిచిపోయాయి. ఇందుకు సంబంధించిన వివరాలు, పత్రాలు భారత పార్లమెంటు గ్రంధాలయంలో దొరికే అవకాశం వుంది.
అయితే ఈనాటి వేగయుగంలో అంతటి ఓపికా తీరికా ఉన్నవారు తక్కువ. కాబట్టి నమ్మినా నమ్మకపోయినా కొన్ని పుస్తకాల్లో రాసిన విషయాలనే ప్రామాణికంగా తీసుకోవాల్సి వస్తోంది. 

2 వ్యాఖ్యలు:

Zilebi చెప్పారు...


ఏదో తూ తూ మంత్రంగా వ్రాసిన టపాలా వుంది గాని‌ భండారు వారి డెప్త్ కనబడటం లేదు టపాలో :)జిలేబి

అజ్ఞాత చెప్పారు...

The shameless sickulars and traitors like chidambaram , Ramachandra Guha, should hang their heads in shame. One should appreciate jyotiraditya scindia, dwivedi and other same Congress leaders. It is a historic decision.