15, ఆగస్టు 2019, గురువారం

వృద్ధభారతం – భండారు శ్రీనివాసరావు


(Published in SURYA telugu daily on 16-08-2019, Friday)

భారత దేశం  తన డెబ్బయి మూడవ స్వాతంత్రదిన  వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజునే పుట్టిన లక్షలాదిమంది కూడా అదేరోజున డెబ్బయ్యవపడి దాటివుంటారు. ఇన్నేళ్ళ తమ జీవితంలో స్వతంత్ర భారతం తమకేమి ఇచ్చినా, ఇవ్వకున్నా ఈ ముదిమి వయసులో కాసింత ఆసరా కోరుకునే వృద్ధుల సంఖ్య కూడా ఈ దేశంలో తక్కువేమీ కాదు. ఒకరకంగా చూస్తే వృద్ధాప్య సమస్యల విషయంలో కలిగిన వారు, లేనివారు అనే తేడా లేదు.
ఒక వ్యక్తి పరిపూర్ణ జీవితం గడిపాడూ అంటే అతడు బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశలను అనుభవించాడని అర్ధం. కానీ అన్ని దశల్లో మానవజీవితం ఒకే మాదిరిగా సాగడం అనేది ఈ సృష్టిలో సాధ్యం కాని విషయం. అయితే అన్ని దశల్లో కష్టాలు వుంటాయి, సుఖాలూ  వుంటాయి. వీటిని దాటుకుంటూ  రావడమే నిజమైన జీవితానుభవం.
ఈ నాలుగు దశల్లో మధ్యలో రెండింటిని మినహాయిస్తే మిగిలిన  రెండింటిలో తప్పనిసరిగా ఎవరిపైనో ఒకరిపైన  ఆధారపడాల్సిన పరిస్తితే! చిన్నతనంలో  కన్నవారి మీదా, పెద్దతనంలో కన్నపిల్లల మీదా ఆధారపడి నెట్టుకొచ్చే దుస్తితే!       
బాల్యం గురించీ, అందులోని మధురిమ గురించీ అనేకమంది అనేక రకాలుగా కధలు, గాధలు, గేయాలు రాసారు. నిజంగా అదొక అద్భుతమైన అపురూప దశ. కన్నవారికి మినహా తమకంటూ ఓ బాధ్యత అంటూ లేని జీవితభాగం ఇదొక్కటే. తలితండ్రులు ఎవరో తెలియని నిర్భాగ్య దామోదరులని తప్పిస్తే, ఏదొచ్చినా పైనుంచి కంటి రెప్పలా  కనిపెట్టి చూసుకునేవారు ఎల్లవేళలా వెన్నంటి  వుండే దశ కూడా ఇదే.
కౌమార, యవ్వనాలు జీవన పధాన్ని నిర్దేశించే దశలు. ఈ కాలంలో ఎవరి కర్మవారిదే. వాళ్ళ ప్రయత్నాలను బట్టే వారి బతుకులు మలుపు తిరుగుతాయి.
బాధ్యత లేని దశలు ఇవే. బాధ్యతతో మెలగాల్సిన దశలూ ఇవే కావడం  సృష్టిలోని మరో చమత్కారం.
ఇక మిగిలిందీ, బతికుంటే  చివరకు అందరూ చేరాల్సిందీ వృద్ధాప్యదశ ఒక్కటే. చేరేలోగా రాలిపోయే బతుకులు కొన్నయితే, చేరి వాడిపోయే జీవితాలు మరికొన్ని.
ఇవిగో వీటిని గురించే, జీవన సాగరాన్ని ఈదుతూ అంతిమంగా ఓ తీరానికి చేరుకొని అలుపు తీర్చుకుంటున్న వీరిని గురించే ఈనాడు నేను ముచ్చటిస్తున్నది.


2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అరవై ఏళ్ళు పైబడిన వృద్ధుల సంఖ్య పది కోట్ల పైమాటే. గడచిన ఎనిమిదేళ్ళ కాలంలో ఇది మరింత పెరిగి ఉండవచ్చు. దేశ జనాభా నూట పాతిక కోట్ల మందిలో ఇదెంత అనిపించవచ్చు కానీ మిగిలిన నూట పదిహేను కోట్ల మందికీ, వీరికీ తేడా ఏమిటంటే ఇతరుల మీద ఆధార పడి బతుకులు వెళ్ళదీయాల్సిన దుస్తితి. ముందే చెప్పినట్టు ఈ విషయంలో ఉన్నవారనీ, లేనివారనే తేడాలేదు. ఎంతటి సంపన్నులయిన వయో వృద్ధులయినా తమ  పిల్లల మీదనో, లేదా వాళ్ళు ఏర్పాటు చేసిన పనిమనుషులు, ఆయాలు, నర్సుల మీదనో ఆధారపడి బతుకు దొర్లించాల్సిందే! దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు అంటే 1947లో దేశ జనాభా సగటు జీవితకాలం 31 సంవత్సరాలు కాగా 2005 నాటికి అది  64 సంవత్సరాలకు పెరిగింది. ఇప్పటికిమరింత పెరిగివుంటుంది. సందేహం లేదు. అలాగే, మరణాల రేటు వెయ్యి మందికి  45 కాగా, అది   2007 ఆగస్టు  19 వ తేదీ నాటికి కేవలం  ఎనిమిది మందికి పడిపోయింది.
అభివృద్ధి చెందుతున్న మన దేశానికి ఇది చాలా మంచి పురోగతే.  మరణాల సంఖ్య చెప్పుకోదగిన విధంగానే తగ్గింది. జీవిత కాలం బాగా పెరిగింది. అయితే అలా జీవిస్తున్నవారి సుఖ సంతోషాలు ఏమైనా పెరిగాయా? అందరూ సంతోషంగా బతుకులు వెళ్ళదీస్తున్నారా? వారిలో సంతృప్త స్థాయి ఆశించిన స్థాయిలో ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ ‘అవును’ అనే  జవాబు దొరికినప్పుడే మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించగలిగామని గర్వంగా చెప్పుకోవడానికి వీలుపడుతుంది.
మా చిన్నప్పుడు వూళ్ళో చాలామంది వారి పెద్దతనంలో మంచానపడి ఆ  కుక్కి మంచంలోనే శేషజీవితం  గడిపి కన్ను మూయడం చూశాను. అప్పుడు తరచుగా కనబడే ఈ దృశ్యాలు ఈనాడు అరుదుగా కూడా కానరావడం లేదని చెప్పే పరిస్తితి లేదు. అప్పుడూ ఇప్పుడూ రోగాలు వున్నాయి. అయితే ఆ రోజుల్లో అదొక రోగమని తెలియకుండానే చనిపోయేవారు.  ఇప్పుడు ఇంకో రకం దుస్తితి. రోగమని తెలుసు. నయం చేయించుకోవచ్చనీ తెలుసు. కానీ అందుకోసం చేసే ఖర్చుతో ఆ రోగం నయమవుతుందో లేదో తెలియదు కానీ సంసారం మాత్రం ఆర్ధికంగా కునారిల్లి  పడకేస్తుంది.
అయితే, డబ్బు ఒక్కటే ఇప్పటివారి  సమస్య కాదు. అనేక రకాల ఆరోగ్య బీమా సంస్థలు పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చాయి. బీమా చేయించుకునే నాటికి ఉన్న ధీమా ఒక్కసారి ఆసుపత్రి పాలు కాగానే నీరు కారిపోవడం ఖాయం.  అవసరం పడినప్పుడు ఆదుకోవాల్సిన బీమా పాలసి  అవసరంలో ఉన్నవారికి అవసరమైనప్పుడు ఆపన్నహస్తం అందిస్తోందా అంటే అనుమానమే. బీమా కార్డు చేతిలో ఉన్నప్పటికీ వేన్నీళ్ళకు చన్నీళ్ళ తోడు అన్నట్టుగా బీమా కంపెనీ ఇచ్చే సొమ్ముకు అదనంగా  కొంత చేతి చమురు వదిలితే కానీ ఆసుపత్రి నుంచి రోగి కాలు బయట పెట్టలేడు.  
వెనకటి రోజుల్లో చిన్న పిల్లల వైద్యులు అనే బోర్డులు కనబడేవి. ఇప్పుడు అన్ని ఆసుపత్రులలో పెద్దవారికి వైద్యం చేసే నిపుణులు కనబడుతున్నారు.      
పూర్వం ఉమ్మడి కుటుంబాలు వున్నప్పుడు రోగం రొష్టు వస్తే చూసుకోవడానికి ఇంట్లో ఎవరో ఒకరు వుండేవారు. ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా చాలా సంసారాలు ‘ఒంటి రాయి, శొంటికొమ్ము’ అన్నట్టుగా సాగుతున్నాయి. నగరాల్లో పరిస్తితి చెప్పక్కర లేదు. మధ్య తరగతి కుటుంబాల్లో చదువుకున్న పిల్లలు ఉద్యోగాల బాట పట్టి వేరే ఊళ్లకు తరలి వెడుతున్నారు. విదేశాలకు పోయి స్థిరపడే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కాపురాలు మొదలు పెట్టినప్పుడు రెండు గదుల వాటాలో గడిపినవాళ్ళు కూడా ఇప్పుడు మూడు నాలుగు పడక గదుల ఇళ్ళకు మారిపోయారు. అనుకోకుండా ఎవరయినా చుట్టమొచ్చి దిగబడితే ఎక్కడ పడుకోబెట్టాలి, తామెక్కడ నిద్ర చేయాలి అని బిక్కు బిక్కుమంటూ వుండేవాళ్ళు. ఇప్పుడో!  చెప్పుకోవడానికి మూడు బెడ్రూములు వున్నాయి, రోజూ తుడిచి, దులిపి శుభ్రం చేయడం తప్పించి, ఒక్కళ్ళూ వచ్చేవాళ్ళు లేరు అని గొణుక్కు౦టున్నారు.   సంపన్నులు నివసించే ప్రాంతాలలో పెద్ద పెద్ద భవనాలు కనిపిస్తాయి. వాటిల్లో వుండేది బిక్కుబిక్కుమంటూ ఇద్దరు ముసలి వాళ్ళు, వాళ్ళకు తోడుగా ఓ కుక్క, ఓ వాచ్ మన్. పిల్లలు మాత్రం విదేశాల్లో. విశాలమైన భవంతుల్లో ఆరుబయలు జైలు ఖైదీల్లా పెద్దవాళ్ళు. వీళ్ళు అక్కడికి పోలేరు. వాళ్ళు ఇక్కడికి రాలేరు.    
మొన్న మాకు తెలిసిన వృద్ధ దంపతులు ఆసుపత్రికి వెళ్ళారు. వీళ్ళ దగ్గర అన్ని రకాల హెల్త్ కార్డులు వున్నాయి. భార్యకి స్వైన్ ఫ్లూ అన్నారు. విడిగా ఓ విభాగంలో పెట్టారు. మర్నాడు ఆ పెద్దాయన కూడా అడ్డం పడ్డాడు. ఆయనకీ అదే వ్యాధి అని నిర్ధారించారు. కార్డుఉన్న  మనుషులు కనుక ఆసుపత్రి వాళ్ళు వెంటనే చేర్చుకున్నారు. చేర్చుకుంటూ అడిగారు, మీ పిల్లలు ఎవరూ రాలేదా అని. జవాబు చెప్పడానికి ఆయనకి జబ్బుతో పాటు సిగ్గు కూడా అడ్డం వచ్చి వుంటుంది. అబ్బాయి అమెరికాలో. అమ్మాయి ఆస్ట్రేలియాలో. డబ్బుకు కొదవలేదు. కానీ కనిపెట్టి చూసేవారే లేరు. దీన్ని ఖర్మ అనాలా! ప్రాప్తం అనాలా!  

NOTE: Courtesy Image Owner