28, ఏప్రిల్ 2019, ఆదివారం

ఏపీ - వింత పుంతల రాజకీయం


అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతోంది?
ఈ నెల పదకొండో తేదీన ఎన్నికలు జరిగాయి. సీళ్లు వేసి స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచిన ఈవీఎం లలో ఓటర్ల తీర్పు భద్రంగా వుంది. ఆ రోజు నుంచి నలభయ్ నాలుగో రోజున అంటే వచ్చే నెల ఇరవై మూడో తేదీన వాటిని వెలుపలకు తీసి ఓట్లు లెక్కించి ఫలితాలు అధికారికంగా ప్రకటిస్తారు.
ఇదీ జరగాల్సిన విధి విధానం. కానీ జరుగుతున్నది ఏమిటి?
పోలింగ్ పూర్వపు రాజకీయ వాతావరణమే  పోలింగ్  అనంతరం కూడా కొనసాగుతోంది. అసలక్కడ ఎన్నికలు జరిగాయా లేక ముందు ముందు జరగబోతున్నాయా అనే రీతిలో ఆయా రాజకీయ పార్టీల ఉపన్యాసాలు, వ్యాఖ్యలు, విమర్శలు ఆరోపణలు అవిచ్చిన్నంగా సాగిపోతున్నాయి.  న్యాయమూర్తి తన తీర్పును రిజర్వ్ చేసినట్టు ప్రకటించిన తరువాత కూడా న్యాయవాదులు తమ వాదప్రతివాదాలు కొనసాగిస్తున్న పద్దతిలో ప్రజాతీర్పు ఖరారు ఆయన తర్వాత సైతం ప్రజల తీర్పును కోరే రీతిలో రాజకీయ పార్టీల మాటలు, చేతలు సాగుతున్నాయి.
అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికలు సవ్యంగా జరగలేదని ఆరోపించడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు. ఎన్నికల ఏర్పాట్ల పట్ల సహజంగా అసంతృప్తి వ్యక్తం చేయాల్సిన ప్రధాన ప్రతిపక్షం ఆ విషయంలో నోరు మెదపక పోవడం కూడా బహుశా ఇదే మొదటిసారేమో!
ఎన్నికల కోడ్ అమల్లో వున్నప్పుడు అధికారులను ఆ స్థానాల నుంచి తాత్కాలికంగా తప్పించడం మొదటిసారి కాదు. గతంలో డీజీపీలను మార్చిన సందర్భాలు వున్నాయి. ఈసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేతాను   పక్కన బెట్టి మరో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్.వీ. సుబ్రహ్మణ్యం ను  ఆస్థానంలో నియమించడం వివాదాస్పదం అయి కూర్చుంది. నీతి నిజాయితీ, నిబద్ధతల విషయంలో ఈ ఇద్దరు అధికారులు ఎవరికీ తీసిపోరు. కానీ కొత్త సీఎస్ తమ ప్రభుత్వానికి అనుకూలుడు కారు అనే అనుమానం పాలకపక్షం టీడీపీ నాయకుల్లో వుంది. స్వయాన ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడే ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేసి ఆ అధికారిని అనకూడని మాట అన్నారు. అధికారులతో పేచీ పెట్టుకోవడం  చంద్రబాబు స్వభావం కాదని ఆయన్ని బాగా ఎరిగిన వాళ్ళు చెబుతారు. ఏదో నోరు జారింది అనుకోవడానికి వీల్లేకుండా ఆయన ఆ వ్యాఖ్యను పదేపదే పునరుద్ఘాటిస్తూ పోతున్నారు.ఇక టీడీపీ పార్టీ నాయకుల సంగతి చెప్పేది ఏముంది? నాయకుడే ఆ వ్యాఖ్యను సమర్దిస్తున్నప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? మరో రెండు సమిధలు వేసి ఆ వివాదాగ్ని చల్లారకుండా చూస్తున్నారు.
అటూ ఇటూ రాజకీయమే అయినప్పుడు వివాదాలు పెరుగుతూ పోతాయే కాని అవి సమసిపోయే సమస్యే వుండదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు పరిష్కారం కంటే వివాదం కొనసాగింపునే ఎక్కువగా కోరుకుంటాయి.
ఈ క్రమంలో వెలుగులోకి వచ్చినవే వీవీ పాట్ల లెక్కింపు, స్ట్రాంగ్ రూముల భద్రత, మరి కొందరు అధికారులను మార్చాలనే డిమాండ్లు. మామూలుగా అయితే ఇవి పెద్ద వివాదాంశాలు కాదు. వీవీ పాట్ల విషయంలో సర్వోన్నత న్యాయ స్థానం ఆదేశమే వుంది. స్ట్రాంగ్ రూముల భద్రత పట్ల సందేహాలు సహేతుకమనిపించుకోవు. ఈవిషయంలో ఏవైనా అనుమానాలు వుంటే అవి ప్రతిపక్షాలకు వుండాలి. విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ లో పరిస్తితి భిన్నంగా వుంది. అక్కడ పాలకపక్షం అయిన టీడీపీ వీటిని వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతిపక్షం, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కలిసి  కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి తమకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలను ఎండగట్టే క్రమంలో ఈ సందేహాలు వ్యక్తం చేస్తున్నామన్నది ఆ పార్టీ వాదనగా వుంది.  
ఈ సారి ఎన్నికల కోడ్ అమల్లో వుండే సమయం ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘంగా ఉన్నమాట వాస్తవమే. దాదాపు మండలం పాటు పాలక పక్షం కానీ, మంత్రులు ముఖ్యమంత్రి ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదనే నియమాన్ని సాంప్రదాయంగా పాటిస్తూ వస్తున్నారు. అయితే ఇంత సుదీర్ఘ కాలం సమీక్షలు, నిర్ణయాలు తీసుకోలేని పరిస్తితిని ఏ మేరకు అనుమతించాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాల పరిమితి ముగియనప్పుడు ప్రజాసమస్యల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకోకుండా వుండడం సాధ్యమయ్యే విషయమేనా అన్నది పాలకపక్షానికి వస్తున్న ధర్మసందేహం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసలు అన్ని అధికారాలు కలిగిన ముఖ్యమంత్రా లేక ఆపద్ధర్మ ముఖ్యమంత్రా అనే చర్చ కూడా మొదలయింది. రాజ్యాంగం ప్రకారం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పేర్కొనేందుకు అవకాశం  లేదు. సరే!మరి ఆయన పూర్వం మాదిరిగా అంటే కోడ్ అమల్లోకి రాక ముందు మాదిరిగా అన్ని నిర్ణయాలు తీసుకోవడం, అధికారులతో సమీక్షలు నిర్వహించడం సరైనదేనా అంటే చప్పున కాదని జవాబు చెప్పే పరిస్తితి లేదు.
ప్రస్తుతం చంద్రబాబునాయుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాని మాట వాస్తవమే కాని ఆయన కానీ ఆ మాటకు ఏ ముఖ్యమంత్రి అయినా సరే పాటించాల్సిన ధర్మం ఒకటుంది. ఈ ధర్మాలు నిబంధనావళిలో వుండవు. పాలకులు ఎవరికి వారు ధర్మనిష్టతో పాటించాల్సిన ధర్మాలు కొన్ని వుంటాయి.  పోలింగు పూర్తయి, ప్రజాతీర్పు వెలువడక పూర్వం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో వున్న సమయంలో ఏ  మేరకు సమీక్షలు చేయవచ్చు, ఏ మేరకు నిర్ణయాలు తీసుకోవచ్చు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అనేది వారికి వారే నిర్ణయించుకోవాలని ధర్మం చెబుతుంది. అది పాటించినంత కాలం ఎవరూ ఆ నిర్ణయాలను తప్పుపట్టే పరిస్తితి ఏర్పడదు. సుదీర్ఘ పాలనానుభవం కలిగిన చంద్రబాబునాయుడికి ఎన్నికల నిబంధనలు  ఏమి చెబుతున్నాయో తెలియవని అనుకోలేం. బహుశా ఈ ఎరుక కలిగిన మనిషి కనుకనే ముందుగా ప్రకటించిన లేదా మీడియాలో వచ్చిన శాంతిభద్రతల వంటి కొన్ని సమీక్షలను రద్దు చేసుకున్నారని కూడా అనుకోవాలి.
అయితే రాజకీయ నాయకులు కొందరికి సర్వం తెలిసినా రాజకీయాల కోసం కొన్ని మాటలు చెప్పక తప్పదు. అందుకే ఆయన కానీ, ఆయన సహచరులు కానీ ఈ సమీక్షల విషయాన్ని ఒక పెద్ద అంశంగా మార్చి చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారేమో!
ముందే చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు బాగాలేవనే చెప్పాలి. అధికారంలోకి రావడం ఎలా, వచ్చిన అధికారాన్ని మరో మారు దక్కించుకోవడం ఎలా అనే  రాజకీయ శక్తుల నడుమ సాగుతున్న పోరాటంలో విలువలు వెనక్కి పోయాయి. ధర్మబద్ధంగా విజయాన్ని కైవసం చేసుకోవడం అనేదాన్ని పక్కన బెట్టి    ఏ విధంగానయినా సరే గెలిచి తీరాలి అనే పట్టుదలలు, పంతాలు పెరిగిపోవడం వల్లనే ఇన్ని రకాల రాజకీయపుటెత్తులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు. పన్నుగడలు, పన్నాగాలు.
ఇది అవసరమా అంటే, మీకూ నాకూ కాకపోవచ్చు, కానీ  రాజకీయులకు అవసరమే!                  

2 కామెంట్‌లు:

సూర్య చెప్పారు...

@"అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికలు సవ్యంగా జరగలేదని ఆరోపించడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు. ఎన్నికల ఏర్పాట్ల పట్ల సహజంగా అసంతృప్తి వ్యక్తం చేయాల్సిన ప్రధాన ప్రతిపక్షం ఆ విషయంలో నోరు మెదపక పోవడం కూడా బహుశా ఇదే మొదటిసారేమో!"
ఎన్నికలు నిర్వహించింది అధికార పార్టీయో ప్రతిపక్ష పార్టీయో కాదు. కేంద్రం లో ఉన్న మరో వ్యవస్థ. అలాంటపుడు అనుమానాలు ఎవరికైనా రావచ్చు.
AP లో కనీసం ప్రతిపక్షం ఉంది. తెలంగాణలో అదికూడా లేనట్లుందే!!

Jai Gottimukkala చెప్పారు...

ఓడిపోతామన్న భయం పట్టుకుంటే రకరకాల ఆరోపణలు మొదలు అవుతాయి. గోరంతలు కొండంతలు చేయడానికి కుల మీడియా ఉండనే ఉంది.