11, ఏప్రిల్ 2019, గురువారం

ఓటు వేయ తరమా! ఓటు వేసి చూడు! ఓటు వేయగలవా ఓ నరహరి!


నేను రాయబోయేదానికి పై మూడు టైటిల్స్ పనికి వస్తాయని అలాగే ఉంచేశాను.
మిట్ట మధ్యాన్నం పన్నెండు గంటలకు టీవీ చర్చల నుంచి బయట పడి ఇంటికి వెళ్లి మా ఆవిడను తీసుకుని నడకకు ఎక్కువా ఆటోకి తక్కువగా అనిపించే  దూరంలోవున్న పోలింగు  కేంద్రానికి వెళ్లాను. రెండు ఫర్లాంగుల బయటే ఆపేశారు. దిగి నడుచుకుంటూ వెళ్ళాము. తీరా వెళ్ళిన తరవాత స్లిప్పులు పట్టుకు రండి అన్నారు. ఇంట్లో ఇవ్వలేదు అంటే బయట టేబుళ్లు వేసుకుని కూర్చుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అన్నారు. ఆ ఎండలో నడుచుకుంటూ వెడితే ఇక్కడ కాదు పోలింగు కేంద్రానికి అటువైపు ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళండి అన్నారు. ఆపసోపాలు పడుతూ అటు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మొబైల్ యాప్ సాయంతో పోలింగు కేంద్రం నెంబరు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నారు. అలాగే వెళ్లాం. మొబైల్ లో సెల్ డిశ్చార్జ్ అయింది కాసేపు ఆగమన్నారు. ఎండలో నిలబడలేక వాళ్ళు కూర్చున్న కుర్చీల వెనుకనే నిలబడ్డాము. మొత్తం మీద ఓ పదిహేను నిమిషాల తర్వాత మా చీట్లు చేతిలో పెట్టారు. మళ్ళీ పోలింగు కేంద్రానికి వెళ్ళాము. పెద్దగా  జనం లేరు కానీ కొంత క్యూ వుంది. మొత్తానికి మా టర్న్ వచ్చింది. అక్కడి ఉద్యోగి ఎర్రరంగు పెన్ను కింద పడేసుకుని వెతుకుతున్నారు. ఓటరు వేలిపై సిరా చుక్క పెట్టేముందు ఎర్ర పెన్నుతో జాబితాలో మా పేర్లపై సున్నా చుట్టాలిట. అదో నిబంధన అట. ఎట్టకేలకు కొందరి కాళ్ళ కిందకు దొర్లిపోయిన ఆ పెన్ను ఆచూకీ దొరికింది. మేము ముందుకు కదిలాము. మీకు నచ్చిన అభ్యర్ధి పక్కన వున్న నీలం రంగు మీట నొక్కండి. పక్కన వీవీ ఫ్యాట్ లో సరిచూసుకున్న తర్వాతనే బయటకు రండి అని అక్కడి అధికారి చాలా సౌమ్యంగా వివరించారు. పదిహేను నిమిషాల్లోనే ప్రజాస్వామ్య క్రతువులో మేము సైతం  మా సమిధను వేశామన్న తృప్తితో బయట పడ్డాము.
ఈ పని, అంటే పోలింగు కేంద్రం నెంబరు కనుక్కోవడానికి ఇంతటి లాయలాస అక్కర లేదు ఇంట్లోనే ఆన్ లైన్ లో చూసుకోవచ్చు. ఈ సంగతి తెలియక కాదు. రాత్రి ఓ రెండు గంటలు ఆ పనిలోనే వుండి ఇక అది నా వల్ల అయ్యే పని కాదని అర్ధం అయి విరమించుకున్నాను.
వెనకటి రోజుల్లో  ఆయా పార్టీల వాళ్ళు ఈ చీట్లు ఇళ్లకే వచ్చి ఇచ్చి  వెళ్ళేవారు. ఇప్పుడా ఆనవాయితీ పాటిస్తున్నట్టు లేదు. ఏవయినా నిబంధనలు అడ్డు వచ్చాయేమో తెలియదు.
చివరాఖరుగా చెప్పేది ఏమిటంటే పోలింగు కేంద్రం వద్ద అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు కొందరు పలకరించారు. ఓటు విలువ గురించి మీరు టీవీల్లో చెప్పే సంగతులు బాగుంటాయని ఓ కితాబు ఒకటి.
ఓటు వేయడం మీరు చెబుతున్నంత సులువేమీ కాదు అనే అర్ధం అందులో నాకు గోచరించింది. 

2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

నాకీ బాధలేమీ లేవు 🌞; నా పేరు ఓటర్ల జాబితాలో లేదుగా, హ్హ హ్హ 🙁. ఇల్లు మారడం వలన కొత్త ఏరియాకు (ఈ ఊళ్ళోనే) నా ఓటును బదిలీ చేయించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను; బదిలీ జరగలేదు. అంతకు ముందు ఉన్న ఏరియా జాబితాలోని పేరు మాత్రం మాయమయింది. ఏదో ముతక సామెతలాగా తయారయింది నా కేసు.

అజ్ఞాత చెప్పారు...

ఇంతకీ కె ఎ పాల్ కు ఓటు వేశారా లేదా?