11, జూన్ 2018, సోమవారం

అలా దేశాలు చుట్టి వద్దాం రండి! – భండారు శ్రీనివాసరావు



నూట యాభయ్ రూపాయలతో చూపిస్తా రండంటున్నారు రాజేష్ వేమూరి.
నాకు సంతోషం అనిపించి ఆ ప్రయాణం ఇవ్వాళే మొదలెట్టాను. ఇంకా పోలండులోనే వున్నాను. చూడాల్సినవి ఇంకా చాలా వున్నాయి. జర్మనీ, స్వీడన్, ఇటలీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, జెక్ రిపబ్లిక్, ఇంకా మనకు ఆట్టే తెలియని, నోరు తిరగని మరో దేశం లిచ్టేన్ స్టెయిన్. 
కాకపోతే చదువరికీ అద్భుతమైన అనుభూతిని రాజేష్ కల్పించింది తాను రాసిన ‘ నా ఐరోపా యాత్ర’ అనే 184 పేజీల పుస్తకం ద్వారా. (నాకు ఈ మాత్రం ఖర్చు కూడా లేకుండా వేమూరి రాజేష్ ఆ పుస్తకాన్ని కొరియర్ ద్వారా నాకు ఈరోజు పంపారు. వారికి కృతజ్ఞతలు) 
నిజానికి వీటిల్లో చాలా దేశాలను నా కళ్ళతో చూసే బంగారు అవకాశం మూడు దశాబ్దాల క్రితమే నేను మాస్కో రేడియోలో ఉన్నప్పుడే లభించింది. కానీ ప్రతి హాలిడేకి నేను స్వదేశాన్నే ఎంచుకోవడం వల్ల దాన్ని కోల్పోయాను. సోవియట్ యూనియన్ రోజుల్లో ఈ దేశాల్లో చాలా వరకు రష్యా మిత్ర దేశాలు. విమానాల్లోనే కాకుండా రైల్లో వెళ్లి తిరిగివచ్చే దేశాలు. పలానా రోజుల్లో పలానా దేశం వెళ్లి వద్దామని అనుకుంటున్నట్టు రేడియో వాళ్లకి చెబితే చాలు యావత్తు కుటుంబానికి వాళ్ళే రైలు టిక్కెట్లు, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసేవాళ్ళు. అందుకు వసూలు చేసే డబ్బు కూడా నామమాత్రం. అప్పుడు చూడని ఈ దేశాల్ని ఇదిగో ఇలా చూడగలుగుతున్నాను. ఆయన ఎంత వివరంగా రాశారంటే రాజేష్ వెంట మనమూ తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది.
వెనకటి రోజుల్లో విదేశీ ప్రయాణం అంటే ఒక అపురూపం. ఇప్పుడలా కాదు, ఉద్యోగాలకోసం బయట దేశాలకు వెళ్ళేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అమెరికా వంటి దేశాల సంగతి చెప్పక్కర లేదు. పొతే ఇదిగో ఇలా యూరోపియన్ దేశాలకు వెళ్ళే పర్యాటకులకు కొదవ లేదు కానీ, ఉద్యోగాలు, ఉపాధుల నిమిత్తం పోయేవారు ఇంకా అరుదే.
విదేశాలను పొగడడం అంటే మన దేశాన్ని చిన్న బుచ్చడం కాదని రచయితే ఒక చోట చెప్పారు. అయితే ఘన చరిత్ర గురించి చెప్పుకుంటే సరిపోదు. దాన్ని పదిల పరచుకోవడం కూడా తెలియాలి. ఉదాహరణకు లండన్ మ్యూజియంలో అమరావతి శిల్పాలను ఒక ఫ్లోరు నిండా ప్రదర్శనకు ఉంచారు. అలాగే, ప్యారిస్ లోని గుయ్ మెట్ మ్యూజియలో ఘంటసాల తవ్వకాల్లో పడిన మూడు శిల్పాలను, ఊరి పేరు వివరాలతో సహా భద్రపరిచారు. అవన్నీ అక్కడ పదిలంగా వున్నందుకు సంతోష పడాలా, పోగొట్టుకున్నందుకు ఖేదపడాలా!
పోలండు, జర్మనీ వంటి దేశాలు మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో పూర్తిగా ధ్వంసం అయి, మళ్ళీ స్వయం కృషితో కోలుకుని బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యాయి. ఆ క్రమంలో అవి ఏనాడూ తమ దీన స్తితిని ప్రపంచానికి చాటుకోలేదు. ఆ తరవాత స్వాతంత్రం వచ్చిన మన దేశాన్ని వాటితో పోల్చుకోగలమా! అక్కడా రాజకీయ పార్టీలు వున్నాయి. అవీ రాజకీయం చేస్తాయి. కానీ అభివృద్ధిని పణం పెట్టికాదు.
ఈ పుస్తకం రాసిన రాజేష్ వేమూరికి అభినందనలు.
(నా ఐరోపా యాత్ర, రచయిత : రాజేష్ వేమూరి, ప్రచురణ: మన ఘంటసాల ప్రచురణలు, ప్రతులకు: +919182272551

3 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

. . . . అవన్నీ అక్కడ పదిలంగా వున్నందుకు సంతోష పడాలా, పోగొట్టుకున్నందుకు ఖేదపడాలా! . . .

ఏమీ ఖేదపడకుండా మనం పూర్వం చిద్విలాసంగా పోగొట్టుకున్న వన్నీ అక్కడ పదిలంగా వున్నందుకు సంతోషపడాలండి. మనంగాని భల్లూకంపట్టు పట్టి వీదోచితంగా పోరాడి అవి మళ్ళా మనదేశానికి తెచ్చేసుకుంటే అవి మనం కాలగర్భంలో కలిపేస్తాం సుమీ అని గ్రహించి మనపరిస్థితికి మనం తప్పక ఖేదపడాలండి.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@శ్యామలీయం:నిజమే. మనవాళ్ళు గుడినీ, గుడిలో లింగాన్ని మాయం చేయగల జాదూలు.

అజ్ఞాత చెప్పారు...

పొద్దున లేస్తే, నెహ్రూ కుటుంబం అంటూ పిచ్చి కుక్కల్లా ఎగిరే వాల్లు.. ఆర్ ఎస్ ఎస్ ని, మోడీని అంటే మాత్రం కేసులు పెట్టడానికి పరిగెడతారు. దీని మీద ఒక పోష్టు పెట్టండి