15, అక్టోబర్ 2016, శనివారం

ఇల్లు అలికారు, పండగ జరగాలి


సూటిగా.....సుతిమెత్తగా.....
(Published in SURYA telugu daily on 16-10-2016, SUNDAY)

జూన్ 2 2014, అక్టోబర్ 11, 2016.
ఈ  రెండు తేదీలకు తెలంగాణా చరిత్ర పుటల్లో ప్రముఖ స్థానం వుంటుంది. చారిత్రిక సందర్భాలకు  ఆనవాళ్ళుగా  మిగిలివుంటాయి.   మొదటిది  తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినం  కాగా,  రెండోది నూతన తెలంగాణా స్వరూపాన్ని మార్చిన కొత్త జిల్లాల ఆవిర్భావ దినోత్సవం.  
కొత్త జిల్లాల ఏర్పాటుతో  దసరా పండుగనాడు నవ  తెలంగాణా  నూతన  స్వరూపం  ఆవిష్కృతమైంది. పది జిల్లాల తెలంగాణా ముప్పై ఒక్క జిల్లాల తెలంగాణాగా విస్తృతమైంది. విజయదశమి పర్వదినం ఈ  వేడుకకు వేదిక అయింది. రెండున్నర ఏళ్ళక్రితం ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రం   బాహ్య సరిహద్దులు మార్చుకోకుండానే అంతర్గత స్వరూపాన్ని గుర్తు పట్టలేనంతగా మార్చుకుంది. పరిపాలనను ప్రజలకు చేరువ చేయడానికి ఉద్దేశించిన ఈ కొత్త ప్రయత్నం కొత్త ఆశలను చిగురింప చేస్తోంది. ఆశలకు ఊపిరులూదాలంటే,  చేసిన దానికన్నా చేయాల్సింది ఎక్కువ వుంటుంది. ప్రభుత్వానికి నిజమైన సవాలు ఇప్పటినుంచే మొదలవుతుంది. చక్కటి ప్రయత్నం మరింత చక్కటి ఫలితాలు ఇచ్చేలా చేయాల్సిన బృహత్తర బాధ్యత కేసీఆర్ సర్కారుపై వుంది. చేసి చూపెడతాం అంటున్నారు. అంతకంటే  కావాల్సింది  ఏముంటుంది  కనుక.  
కోడలు కంటానంటే వద్దనే అత్త వుంటుందా?
ప్రజలూ అంతే! ప్రభుత్వాలు మంచి చేయాలే కానీ ఆహ్వానించి, ఆదరించే  మంచితనం వారిలో పుష్కలంగా వుంది.
సరే! యధావిధిగా రాజకీయాలు కూడా ఇందులో చొరబడ్డాయి. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం శాస్త్రీయ దృష్టి ప్రదర్శించలేదు అన్నది ప్రతిపక్షాల ప్రధాన విమర్శ. అంతా రూల్  బుక్  ప్రకారమే చేశామన్నది ప్రభుత్వ వాదన. ఈ రెండింటిలో వాస్తవం లేకపోలేదు.
విభజన పద్దతిగా జరగలేదని, ప్రజల సదుపాయం గమనంలో పెట్టుకోలేదనీ, మండలాల చేర్పులు,కూర్పులు సవ్యంగా జరగలేదని, కొన్ని జిల్లాలను ఎక్కువ జిల్లాలను చేయడం, మరి కొన్ని పెద్ద జిల్లాలను పెద్ద మార్పులు చేయకుండా అలాగే కొనసాగించడం ఇందుకు నిదర్శనమని ప్రతిపక్షాల ఆరోపణ.
అందర్నీ సంప్రదించే చేశామని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను అడిగామని, ప్రజలనుంచి కూడా సూచనలు, సలహాలు స్వీకరించామని, భారీ కసరత్తు చేసిన తరువాతనే నిర్ణయాలు తీసుకున్నామని సర్కారు ఉద్ఘాటన. ప్రతిపక్షాలు అడిగిన రీతిలో ముందు అనుకున్నదానికంటే అదనపు జిల్లాలు ఏర్పాటు చేయడం ఇందుకు దృష్టాంతం అన్నది ప్రభుత్వ వివరణ.
ఒక విషయంలో మాత్రం రెండు పక్షాల మధ్య ఏకాభిప్రాయం వుంది. అదేమిటంటే కొత్త జిల్లాల అవసరాన్ని ఉభయులు కాదనడం లేదు. కొత్త  జిల్లాల ఏర్పాటును ఎవరూ వ్యతిరేకించడం లేదు. సమస్య అల్లా విభజన చేసిన తీరు పట్లనే.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కూడా ఇదే ప్రశ్న తలెత్తింది. అయితే అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే  రాష్ట్ర  విభజనకు రాజ్యాంగ సవరణ అవసరం. జిల్లాల ఏర్పాటుకు అంతటి సంక్లిష్ట ప్రక్రియ అవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవచ్చు. తీసుకున్న నిర్ణయాలను మార్చుకోవచ్చు. కాబట్టి నిర్ణయంలో మంచి చెడులే తప్పించి జరిగిన తీరు పట్ల అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిర్ణయాన్ని అందరూ ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఇక పెద్దగా తర్కవితర్కాలు అనవసరం.
పొతే, జిల్లాలు అధిక సంఖ్యలో ఏర్పాటు చేయడం వల్ల పరిపాలనకు సంబంధించి వెసులుబాట్లు పెరుగుతాయి. జిల్లా, మండల కేంద్రాలు సుదూరంగా వుంటే, ప్రభుత్వంతో తమ పనులు చక్కబెట్టుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లోని వాళ్ళు తమ రోజువారీ పనిపాట్లను పక్కన బెట్టి ఎక్కువ దూరాలకు వెళ్లి రావాల్సిన ప్రయాస తగ్గుతుంది. అలాగే  ప్రభుత్వ అధికారులు కూడా  ప్రజల అవసరాలను దగ్గర నుంచి గమనించి వ్యవహారాలను సరిదిద్దడానికి వీలుంటుంది. ప్రత్యేకించి, సంక్షేమ పధకాల అమలు తీరును సమర్ధవంతంగా పర్యవేక్షించడానికి వీలుచిక్కుతుంది. అధికారులు అందుబాటులో వుండడం అనేది ప్రజలకు కలిసి వచ్చే విషయమే. శాంతి భద్రతల  పరిరక్షణ విషయంలో కూడా చిన్న జిల్లాల సూత్రం ప్రయోజనకారిగా వుంటుంది.
కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయానికి అంతటి సానుకూల స్పందన రావడానికి ఈ కారణాలు దోహదం చేశాయని చెప్పవచ్చు.           
పది జిల్లాలను ముప్పయ్యొక్క జిల్లాలను చేస్తూ నిర్ణయం తీసుకోవడం సులభం కావచ్చేమో కాని, దాన్ని అమలుచేయడం అనేది అంత తేలిక కాదు. తగినంత మంది అధికారులు కావాలి, వారికి తగినంత మంది సిబ్బంది కావాలి,  అవసరమైన కార్యాలయ భవనాలు కావాలి, వసతులు కావాలి, వాహనాలు కావాలి. ఇలా ఈ ‘కావాలి’ అనే జాబితా చాలా పెద్దది. ఇందుకు ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసింది.
కొత్త జిల్లాల ఏర్పాటుకు సుముహూర్తం నిర్ణయించారు. అప్పటికల్లా విధుల్లో చేరడానికి జిల్లా కలెక్టర్లను ఎంపిక చేశారు. కొత్త కమీషనరేట్లకు పోలీసు కమీషనర్లు,  జిల్లా పోలీసు కార్యాలయాలకు ఎస్పీలు, జాయింటు కలెక్టర్లు, మండల స్థాయిలో  తహస్లిల్దారు స్థాయి అధికారులను   పోస్టింగులతో సహా సిద్ధం చేశారు. కార్యాలయ భవనాలు, వాహనాలు ఇతర సదుపాయాలు అనుకున్న ఘడియకు అనుకున్న చోట ఏర్పాటు చేసారు. ఇవన్నీ జరగాలంటే రాజకీయ సంకల్పానికి బ్యూరోకాట్ల సహకారం కావాలి. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ చక్కటి సమన్వయంతో చేసిన కృషి వల్లనే ఇది సాధ్యపడింది.  
అయితే, ఇల్లలుకగానే పండుగ కాదన్నట్టు, కొత్త జిల్లాల ఏర్పాటుతోనే సుపరిపాలన ప్రజల ముంగిట్లోకి వచ్చినట్టు కాదు. అధికారులు ప్రజలకు దగ్గరగా వుండడంతోటే సామాన్యుల  సమస్యలు తీరవు. పరిపాలన వికేంద్రీకరణతో పాటు అధికార వికేంద్రీకరణ కూడా జరగాలి. తగిన అధికారాలు లేని అధికారి యెంత దగ్గరగా వుంటేమాత్రం ప్రజలకు  ఏం లాభం?
ప్రజా ప్రభుత్వాలు, వాటి అధినేతలు గమనంలో వుంచుకోవాల్సిన కఠోర వాస్తవం ఇది. (15-10-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:  98491 30595


     







2 కామెంట్‌లు:

M KAMESWARA SARMA చెప్పారు...

MLA ఏడుకొండలు సినిమా గుర్తుకొస్తోంది అంటున్నారు నా స్నేహితులు మాత్రం. అందరూ డిప్యూటీ సీఎం లే, అన్నట్లుగా, అన్ని ఊళ్లు జిల్లా రాజధానులు, మండల రాజధానులు, రెవిన్యూ డివిజన్ లు. పల్లెలంటే, పాత కాలంలో ఉండేవి అనుకోవాలేమో

యంకె శర్మ

అజ్ఞాత చెప్పారు...

ఎవరికైనా గుర్తుందా? మహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఒక సినిమా వచ్చింది చాలా కాలం క్రిందట. చచ్చిన తుగ్లక్ పురావస్తువారి తవ్వకాల్లో ప్రాణంతో బయటపడి, ఆ అద్భుతం కారణంగా మనకు ప్రథాని అవుతాడు. ఆయన నియమించుకొన్న మంత్రివర్గంలో మంత్రుల సఖ్మ అక్షరాలా 365. వాళ్ళకు కొన్నాళ్ళకు బోరుకొట్టి మేమేం‌పని చేయాలి అని అడిగితే, "రోజుకొకడుగా మీలొ పుట్టిన రోజులు చేసుకోండి - అ పుట్టిన రోజుకు మిగతామంత్రులు హాజరు కండి" అని ఆర్డరు వేస్తాడు తుగ్లక్ ప్రథాని.

తెలంగాణాలో పరిపాలనకూడా కెసీఆర్ ఒక్కరి నిర్ణయాలమీదే నడిచేది. మిగతావి ఉత్సవవిగ్రహాలే. పైగా అందులో మూడైతే ఆయన జనానాలోనివేను.