16, ఫిబ్రవరి 2015, సోమవారం

తెలిసిన కేసీఆర్ లో తెలియని కేసీఆర్

(Published by 'SURYA' telugu daily on Tuesday,17-02-2015)
(ఫిబ్రవరి పదిహేడు - తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం)
కేసీఆర్ ని దగ్గరగా చూసి పదేళ్లు గడిచి వుంటాయి. 2004 లో దూరదర్శన్ లో పనిచేసేటప్పుడు,  కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు గురించి చెప్పడానికి అనుకుంటా,  బంజారా హిల్స్ లో వున్న ఆయన ఇంట్లో పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కలిసిన గుర్తు. మధ్యలో కొంత ఎడం వచ్చింది కాని నేను మాస్కో వెళ్లక మునుపు కేసీఆర్,  ఎన్టీయార్ క్యాబినెట్ లో రవాణా శాఖ  మంత్రిగా వున్నప్పుడు, రేడియో విలేకరిగా  తరచుగా కలుస్తూ వుండే మంత్రులలో ఆయన ఒకరు. సచివాలయంలో ముఖ్యమంత్రి  పేషీ వుండే సమతబ్లాక్ పక్కనే మరో పాత భవనం వుండేది. అందులో వుండేది కేసీఆర్  కార్యాలయం. అదిప్పుడు లేదు. కూల్చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసివచ్చిన రాజకీయ ప్రముఖులు విలేకరులతో  మాట్లాడే 'మీడియా పాయింటు' ప్రస్తుతం ఆ ప్రదేశంలో వున్నట్టుంది.
అదలా వుంచితే, మళ్ళీ కేసీఆర్ ని దగ్గరగా గమనించే అవకాశం నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు వచ్చింది. తెలంగాణా జర్నలిష్టుల ఫోరం కేసీఆర్ తో  ముఖాముఖి సమావేశం (మీట్ ది ప్రెస్) ఏర్పాటు చేసింది.
రావాల్సిందని నిర్వాహకుల నుంచి ఆహ్వానం.
'ప్రెస్ మీట్ అవగానే కేసీఆర్ కొందరితో కొందరితో పిచ్చాపాటీగా మాట్లాడతారు. తప్పకుండా రండి అని ఆహ్వానానికి కొసరు.
జర్నలిష్టుగా  రిటైర్ అయిన తరువాత ఇలా ఎవరి ప్రెస్ కాన్ఫరెన్స్ లకు వెళ్ళలేదు. ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేకించి పిలిస్తే తప్ప. ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. 'మీట్ ది ప్రెస్' కాబట్టి బయలుదేరి వెళ్లాను.

హాలు నిండి కిటకిటలాడుతోంది. అందరూ తెలియకపోయినా మా తరం జర్నలిస్టులు కొందరు కలిశారు. ఇంతలో ఇతర టీ.ఆర్.ఎస్. నాయకులను వెంటబెట్టుకుని కేసీఆర్ వచ్చారు. ముందు వరసలో వున్న జర్నలిస్టులను పలకరిస్తూ నాతో  కూడా కరచాలనం చేసారు. ఓ క్షణం తేరిపార చూసినట్టు అనిపించింది కాని గుర్తు పట్టినట్టులేదు అనుకున్నాను.
సరే! ఆయన వేదిక మీదకు వెళ్ళి  తన అలవాటు ప్రకారం  సుదీర్ఘంగా ప్రసంగించారు. రాజకీయ నాయకులు అంతసేపు మాట్లాడితే కాస్త భరించడం కష్టం. కాని ఆయన చెప్పిన విషయాలు, వాటిల్లో తొంగి చూసిన విషయ పరిజ్ఞానం, తొట్రు పడకుండా, తడుముకోకుండా, అసహనానికి గురికాకుండా విలేకరుల ప్రశ్నలకు జవాబులు ఇచ్చిన తీరు సభికులను కట్టి పడేశాయి. 'సభికులు' అని ఎందుకు అంటున్నానంటే అది విలేకరుల సమావేశంలా లేదు. ఓ మోస్తరు బహిరంగ సభలా వుంది. గిట్టని వాళ్ళు ఆయన్ని మాటల మాంత్రికుడుఅంటుంటారు కాని నిజంగా ఆయన మాటల్ని మంత్రించి వొదలడంలో దిట్ట. ఆయన చెప్పిందంతా తిరిగి రాయాలంటే ఓ గ్రంధం అవుతుంది. 'తెలంగాణా కల నెరవేరిననాడు ఆ కొత్త రాష్ట్రాన్ని ఎలా తీర్చి దిద్దబోతున్న'దీ ఆయన సవివరంగా చెప్పారు. వినడానికి అంతా కల మాదిరిగానే వుంది. నూతన తెలంగాణా ఆవిష్కృతం అయ్యే క్రమంలో ఆయన చెప్పిన విషయాలు ఒక రకంగా -  ఏదో ఒక సందర్భంలో ఆయన చెప్పినవే అయినా వాటన్నిటిని ఆయన గుది  గుచ్చి చెప్పిన తీరు, అదంతా టీవీల్లో  ప్రత్యక్షప్రసారంలో చూస్తున్న బెజవాడ  మిత్రుడు ఒకరు  ఎస్.ఎం.ఎస్. పంపారు. 'కేసీఆర్  ఓ అయిదేళ్ళు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి, ఇప్పుడు చెబుతున్నట్టుగా  యావత్ ఆంద్రప్రదేశ్ ని అభివృద్ధి చేసివుంటే ఇప్పుడీ (విభజన) గొడవలే ఉండేవి కావ'న్నది దాని సారాంశం.  కానీ, అప్పటికే రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయింది. ఎన్నికలే తరువాయి.
నాటి సభలో కేసీఆర్ అనేక విషయాలను స్పృశించారు. అవన్నీ ఇక్కడ అప్రస్తుతం.  కాని 'విడిపోతే భద్రాచలం సంగతేమిటి?' అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు జవాబుగా చరిత్రలోని ఒక వృత్తాంతాన్ని ఆయన ఆసక్తికరంగా వివరించారు.
"వెనుక  అది (భద్రాచలం) తెలంగాణాలోనే వుండేది. భక్త రామదాసును బందిఖానాలో వేసింది అప్పటి గోలకొండ కోటలోనే. పొతే, భద్రాచలానికి పొరుగున బ్రిటిష్ ఇండియాలోని వైజాగ్ ప్రాంతంలో ఒక ముష్కరుడు గ్రామాలమీద పడి దోపిడీలు చేస్తుంటే బ్రిటన్ సాయుధ సాయాన్ని కోరడం, వాళ్ళు  ఆ దోపిడీదారుడి నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించడం, చేసిన సాయానికి కృతజ్ఞతగా నవాబు గారు  గోదావరి ఆవల వైపువున్న ప్రాంతాన్ని వారికి దఖలు పరచడం  అంతా ఓ కధ మాదిరిగా చెప్పుకుంటూ వచ్చారు. ఇదంతా వినడానికి చాలా ఆసక్తిగా అనిపించింది. అదే కేసీఆర్ ప్రత్యేకత.
సమావేశం ముగిసే సరికి చాలా పొద్దు పోయింది. ఆయన ఆప్యాయంగా భోజనానికి వెంటబెట్టుకుని పోయారు. పక్కపక్కనే కూర్చుని భోజనం. అది హోటల్ అయినా అందర్నీ చక్కగా కనుక్కున్నారు. ఆయనకు రాజకీయ గురువు అయిన  యన్టీయార్ గారిదీ ఇదే మనస్తత్వం. అతిధులను  స్వయంగా కనుక్కుంటూ, కొసరి కొసరి వడ్డించి  మరీ తినిపించేవారు.
హోటల్లో ఏవేవో పదార్ధాలు కేసీఆర్ కి వడ్డించబోతే, 'వద్దు ఇంత అన్నం, పప్పూ పట్టుకు రమ్మ'న్నారు. సింపుల్ భోజనం. భోజనం చేస్తుండగా  ఆయనకు నేనెవరో క్రమంగా గుర్తుకువచ్చినట్టు వుంది. పక్కనే కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడారు. అనేక ముచ్చట్లు చెప్పారు. ఇదంతా ఆయన ముఖ్యమంత్రి కాకపూర్వం. అయిన తరువాత ఎన్నడూ కలిసింది లేదు. ఆ అవసరమూ రాలేదు. అయితే, టీవీల్లో ఆయన ప్రసంగాలు వింటున్నప్పుడు, పత్రికల్లో ఆయన గురించిన కధనాలు చదువుతున్నప్పుడు కేసీఆర్ మారిన దాఖలాలు ఏమీ కనబడడం లేదు.
అయినా ఆయన మునుపటి మనిషి కాదనే వాళ్లు వున్నారు. ఒకప్పుడు కాదని తోసిరాజన్నవాళ్ళను దగ్గరకి తీసిన సందర్భాలు, స్వవచన ఘాతుకంగా అనిపించే ప్రకటనలను వారు ఉదహరిస్తుంటారు. ఉదాహరణకు ఒకప్పుడు మోడీ గారి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదట్లో ఆయన పట్టించుకున్న దాఖలా లేదు. ఇప్పుడు అదే అంశాన్ని తన ప్రాధాన్యతల జాబితాలో చేర్చారు. భద్రాచలం ముంపు మండలాలు, రామోజీ స్టూడియో సందర్శన, కేంద్రంతో ఇటీవలి కాలంలో మెరుగు పరచుకుంటున్న సంబంధాలు ఇలా అనేకం.


ఆకాశ రహదారులు, వంద అంతస్తుల భవనాలు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, సచివాలయం తరలింపు ఒకటా రెండా, రోజుకొక ఆలోచన, పూటకొక పధకం. 'ఇవన్నీ సాధ్యమా?' అనే వారికి  ఆయన సమాధానం ఒక్కటే. 'చూస్తుండండి చేసి చూపిస్తాను' అని.   
ఎవరెన్ని విమర్శలు చేసినా, వ్యాఖ్యానాలు చేసినా ఆయన లెక్క చేసే రకం కాదు. 'బంగారు తెలంగాణా కల సాకారం చేయడానికి ఏమైనా చేస్తా, ఏమైనా చెబుతా' అనే ఒకే ఒక్క మాటతో ప్రత్యర్ధుల వాదనలను పూర్వపక్షం చేయడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధంగానే వుంటారు. ఒకరకంగా ఇది కేసీఆర్ బలమూ, బలహీనత రెండూ.
ముఖ్యమంత్రిగా అయన వ్యవహార శైలి విభిన్నంగా వుంటుందని ఆయనతో పనిచేసే అధికారులు చెబుతుంటారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఏదైనా రాష్ట్ర వ్యవహారం చర్చించాలని అనిపిస్తే చాలు, అధికారులతో ప్రమేయం లేకుండా ఆయనే స్వయంగా ఫోనులో మాట్లాడేస్తుంటారు.
అందుకే కేసీఆర్ మాకు బాగా తెలుసు అనేవారికి కూడా వారికి తెలియని అనేక కోణాలు ఆయనలో వున్నాయి.
అదే కేసీఆర్ ప్రత్యేకత.
ఫిబ్రవరి పదిహేడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టిన రోజు. వారికి శుభాకాంక్షలు. తెలంగాణా రాష్ట్రం తొలి పుట్టిన రోజునాటికయినా ఆయన కంటున్న 'బంగారు తెలంగాణా'  కలల్లో కొన్నయినా నెరవేరాలని కోరుకుందాం. (16-=02-2015)          

                                    

1 కామెంట్‌:

శ్యామలీయం చెప్పారు...

భండారువారూ, మీరు అపార్థం చేసుకోనంటే ఒక మాట అంటాను. ప్రజలకు అప్పుడైనా ఎప్పుడైనా కావలసినది మాటల మాంత్రికులు కాదు - తప్పకుండా కావలసినది చేతల మాంత్రికులు.