6, ఫిబ్రవరి 2015, శుక్రవారం

ఇల్లాళ్ళ శ్రమకు సుప్రీం కోర్టు గుర్తింపు

(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY IN ITS EDIT PAGE ON 08-02-2015, SUNDAY)

ఇది జరిగి పాతికేళ్ళవుతోంది.
జైవంతిబేన్ జితేంద్ర త్రివేది సాధారణ గృహిణి. ఆర్ధికంగా కుటుంబానికి సాయపడేందుకు ఇంట్లోనే కుట్టు మిషన్ పెట్టుకుని ఇరుగూ పొరుగుకీ దుస్తులు కుట్టుపెడుతూ నెలకు కొంచెం అటూ ఇటూగా మూడువేలు సంపాదించేది. 1990, సెప్టెంబర్ 21 వ తేదీన ఒక రోడ్డుప్రమాదంలో ఆమె కన్ను మూసింది. కేసు విచారించిన ట్రిబ్యునల్ ఆమె భర్తకు, కుమార్తెకు  2,24 000 రూపాయలు పరిహారంగా చెల్లించాలని ప్రమాదానికి కారకులయిన వారిని ఆదేశించింది. ప్రతికక్షులు హైకోర్ట్ ని ఆశ్రయించారు. హైకోర్టు పరిహారాన్ని 2,09400 రూపాయలకు తగ్గించింది. దాంతో మృతురాలి భర్త, ఆమె కుమార్తె కలిసి  అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తలుపు తట్టారు. పాతిక సంవత్సరాలుగా ఆ కుటుంబం చేస్తున్న న్యాయ పోరాటం ఇన్నాల్టికి  ఫలించింది.  పూర్వాపరాలను పరిశీలించిన మీదట,  తొమ్మిది శాతం వడ్డీతో సహా  మొత్తం 6,47000 పరిహారం చెల్లించాలని గతవారం కోర్టు తీర్పు చెప్పింది. మామూలుగా అయితే ఇదో మామూలు వార్తే. అందుకే కాబోలు సుప్రీం తీర్పు అనేక  పత్రికల్లో కానరాలేదు.
తీర్పు ప్రకటిస్తూ, జస్టిస్ భానుమతి,  జస్టిస్ గోపాలగౌడలతో కూడిన ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసింది. అవే ఈ వ్యాసానికి ప్రేరణ.


కుటుంబం కోసం గృహిణి అందించే సేవలు  విలువ కట్టలేవన్నది  ఆ వ్యాఖ్యల తాత్పర్యం. ఇల్లాళ్ళు  చేసే ఇంటెడు  చాకిరీని డబ్బుతో ముడిపెట్టి లెక్కలు కట్టడం సంభావ్యం కాదని సుప్రీం అభిప్రాయపడింది.
మోటారు కారు కిందపడి మరణించిన మహిళకు పరిహారం నిర్దేశించే సమయంలో సాధారణంగా గమనంలోకి తీసుకునే అంశాలతో పాటు ఆమె కుటుంబం కోసం పడే శ్రమను కూడా లెక్కలోకి తీసుకోవాలన్నది అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయం.
ఇలాటి కేసులు విచారించేటప్పుడు,  ప్రమాదాల్లో మరణించిన వ్యక్తులపై వారి కుటుంబ సభ్యులు  ఏమేరకు ఆధారపడి వున్నారు, లేదా వారి మృతి కారణంగా ఆ కుటుంబాలకు ఏమేరకు ఆర్ధిక పరమైన లోటువాటిల్లిందన్న విషయాలు కూడా  కోర్టులు పరిగణన లోకి తీసుకోవడం కద్దు. సరిగ్గా ఈ అంశాన్నే న్యాయమూర్తులు తమ తీర్పులో ప్రస్తావించారు.
'ఇంటిపనిచేసే గృహిణులు గడియారం చూసుకుంటూ పనులు చేయరు. చేసిన పనికి యెంత  గిట్టిందని కూడా లెక్కలు చూసుకోరు.  సమయంతో నిమిత్తం లేకుండా, కాలంతోపాటు పరిగెడుతూ వాళ్లు రోజంతా తమవారికోసం కష్టపడతారు. మొత్తం కుటుంబాన్ని ఇరవై నాలుగుగంటలపాటు కంటికి రెప్పలా కనిపెట్టి చూసుకుంటారు. కాబట్టి వారి మరణంవల్ల కలిగిన లోటును నిర్ధారించే సమయంలో ఈ విషయాలను మనసులో వుంచుకోవాలి'  ఇదీ సుప్రీం తీర్పు తాత్పర్యం.
జస్టిస్ భానుమతి  తమ తీర్పులో ఇంకా ఇలా పేర్కొన్నారు.
'ఇళ్ళల్లో వుంటూనే ఇంటెడు చాకిరీ చేసే ఆడవాళ్ళ శ్రమదమాదులు  మొత్తం ఆర్ధిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. మానవ సమాజాల పురోగతికి (పరోక్షంగా) దోహదం చేస్తాయి.'        
న్యాయమూర్తులు  వెల్లడించిన ఈ  ధర్మ సూత్రాలు ఎన్నదగినవిగా, మెచ్చదగినవిగా  వున్నాయనడంలో ఎలాటి సందేహం లేదు.    
బాధితులకు సంపూర్ణ న్యాయం జరగడానికి న్యాయస్థానాల్లో  ఏండ్లూ పూండ్లూ పట్టిన విషయాన్ని పక్కనపెడితే, ఈ కేసును పురస్కరించుకుని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు భవిష్యత్ పట్ల ఆశలు రేకిస్తున్నాయి. ఇళ్ళల్లో ఆడవారి చాకిరీని గుర్తించి గౌరవించే రోజులు రాబోతున్నాయేమో అనే ఆశను కలిగిస్తున్నాయి.
ఏది ఏమైనా సభ్యసమాజంలో ఆడవారి చాకిరీకి తగిన గుర్తింపు లేదనే మాట వాస్తవం. గుర్తింపు లేకపోగా 'ఇరవై నాలుగ్గంటలు ఇంటి పట్టున పడివుండి వాళ్లు చేసేది ఏముంది ' అని చులకనగా మాట్లాడేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కాబట్టే సుప్రీం వ్యాఖ్యలకు ప్రాధాన్యత పెరిగింది. ఈ అవకాశాన్ని తీసుకుని దేశ వ్యాప్తంగా చర్చ జరగాలి. ఇళ్ళల్లో ఆడవారి సేవలకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపు, గౌరవం దక్కేలా అడుగులు పడాలి.
అయితే ఆ అడుగు వేసేది ఎవరు? వేయించేది ఎవరు?
'కార్యేషు దాసీ, కరణేషు మంత్రి' అంటూ కుటుంబంలో మహిళల  పాత్రను ఓ పక్క  శ్లాఘిస్తూనే,  వారిని శతాబ్దాల తరబడి ఇళ్ళల్లో కట్టు బానిసలుగానే వుంచేసారని కొందరు అంటారు.  స్వాభావికంగానే కుటుంబానికి సంబంధించిన అనేక రకాల పనులను  స్వచ్చందంగా చేయడానికి మహిళలు  మానసికంగా సిద్ధపడి వుండడం వల్లనే వాళ్లు  ఇలా నిస్వార్ధసేవలు అందించగలుగుతున్నారని అనేవారూ వున్నారు.  ఆడా మగా పెంపకం అనేది వివక్షతో కూడుకుని వున్నందువల్ల, చిన్నతనం నుంచి ఆడవారిలో  ఈవిధమైన సేవాతత్వం  జీర్ణించుకుని పోయింది. అయితే ఇలాటి వివక్ష మచ్చుకు కూడా కనిపించని పాశ్చాత్య సమాజాల్లోని మహిళలు  కూడా తల్లులుగా తమ బాధ్యతలను అదనంగా పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాకపొతే,  కాలానుగుణంగా  పిల్లల పెంపకం విషయంలో  ఈనాటి తలితండ్రులు బాధ్యతలు పంచుకుని సర్దుకుపోతున్న విషయం కూడా వాస్తవదూరం కాదు. అయితే, తండ్రి పాత్ర పోషించే మగవారు కొన్ని విషయాల్లో బాధ్యతలను ఒక పరిధిలోనే నిర్వహిస్తున్నారు. ఆడవారి మాదిరిగా అన్ని విషయాల్లో పసిపిల్లల మంచిచెడులను కనిపెట్టి చూడడంలో ఒక అడుగు వెనకే వున్నారు. పసిపిల్లల తల్లులు పారిశుధ్య కార్మికులుగా కూడా సేవలు అందిస్తున్న విషయం ఇక్కడ గమనార్హం. ఉద్యోగాలు చేస్తున్న తలితండ్రులలో కొందరు మగవాళ్ళు తమ అభిజాత్యాలను కొంత పక్కనబెట్టి, ఇలాటి విషయాల్లో కూడా తమ  పిల్లల ఆలనాపాలనా  కనిపెట్టి  చూస్తూన్న సందర్భాలు లేకపోలేదు.  నగరాల్లోని మాల్స్ లో, సినిమా ధియేటర్లలో, రెస్టారెంట్లలో ఈరకమైన అధునాతన సర్దుబాటు  మనస్తత్వం కలిగిన తండ్రులు తారసపడుతూనే వుంటారు. ఈ మార్పు ఆహ్వానించతగ్గదే. అయితే ఇలాటి తండ్రుల సంఖ్య మనదేశంలో పరిమితమనే చెప్పాలి.
కొన్నాళ్ళక్రితం చదివిన ఒక ఆంగ్ల గల్పిక ఈ సందర్భంలో గుర్తుకు వస్తోంది.
విదేశాల్లో నివసిస్తున్న తన పిల్లల దగ్గరికి వెళ్ళి రావడానికి ఓ మహిళ వీసా కోసం కాన్సులేటు కార్యాలయానికి  వెడుతుంది. అక్కడి అధికారి ఆమెను 'మీరెవరు, ఏం చేస్తుంటారు' అని ప్రశ్నిస్తాడు.
'భారతదేశంలో సాధారణ మహిళలు ఏం చేస్తుంటారు?' అనే ప్రశ్నకు సమాధానం ఆమె బదులిచ్చిన పద్దతిలో కనిపిస్తుంది. పనీపాటా లేకుండా రోజులు గడపడం తప్ప ఆడవారికి మరో పని లేదని  పిడివాదం చేసేవారికి రోజంతా ఆడవారు ఇంట్లో ఎన్నెన్ని పనులు చక్కబెడుతుంటారో అర్ధం అయ్యేలా ఆమె జవాబు వుంటుంది. ఒక గృహిణిగా, ఒక  ఇల్లాలిగా, ఒక తల్లిగానే కాకుండా పారిశుధ్యకార్మికురాలిగా, పనికత్తెగా, వంటమనిషిగా, ఇంటి జమాఖర్చులు చూసే ఆడిటర్ గా, పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయురాలిగా, సమాజానికి అవసరమయ్యే బాధ్యతకలిగిన  భావిపౌరులను తయారు చేసి ఇచ్చే సామాజిక కార్యకర్తగా ఒక  సాధారణ మహిళ ఎన్ని పాత్రలు పోషిస్తుందో, పడ్డ శ్రమకు ప్రతిఫలం ఆశించకుండా, పనిగంటలతో నిమిత్తం లేకుండా ఎన్నెన్ని పనులు చక్కబెడుతుందో ఆమె నోటి ద్వారా విన్న ఆ వీసా అధికారి ఆశ్చర్యంతో నోరెళ్ళబెడతాడు.
ఇది కల్పన కావచ్చు కానీ,  ఒక విషయం మాత్రం నిజం.
ఆడవాళ్ళు కుటుంబంకోసం పడే శ్రమకు ఎటువంటి గుర్తింపు కోరుకోరు, ఎలాటి ప్రతిఫలం ఆశించరు. అందుకే వాళ్లు తరతరాలుగా అలాగే వుండిపోతున్నారు. (07-02-2015).
NOTE: Courtesy Image Owner

కామెంట్‌లు లేవు: