20, ఫిబ్రవరి 2015, శుక్రవారం

జర్నలిష్టులకు నో ఎంట్రీ


సచివాలయం - కొన్ని జ్ఞాపకాలు  
1975 నవంబర్ లో నేను హైదరాబాదు ఆకాశవాణిలో విలేకరిగా చేరిన నాటి నుంచి కొన్ని దశాబ్దాలపాటు ఒకటే దినచర్య. నేను వుంటున్న చిక్కడపల్లి నుంచి బయలుదేరి రెండు బస్సులు మారి రేడియో స్టేషన్ కు రెండు  స్టాపుల ముందే, సరోవర్ హోటల్ దగ్గర  దిగిపోయేవాడిని. నేను పనిచేసేది రేడియో స్టేషన్ అయినా నా కార్యస్థానం మాత్రం సచివాలయమే. ఆరోజుల్లో సెక్రెటేరియట్ ప్రధాన ద్వారం, రాజసం ఒలకబోసే ఇనుపకమ్మీలతో ప్రస్తుతం ఫ్లై ఓవర్ మొదలయ్యే ప్రధాన రహదారిలో వుండేది. దాని ఎదురుగా ఆంధ్ర జ్యోతి సిటీ బ్యూరో ఆఫీసు. ఆదిరాజు వేంకటేశ్వర రావు గారు దానికి విలేకరి. ఆంధ్ర జ్యోతి పత్రిక మాత్రం బెజవాడలో అచ్చయ్యేది. ఆయన ఇక్కడనుంచే టెలిప్రింటర్  లో వార్తలు పంపేవాడు. నేను రేడియోలో చేరకముందు ఒకసారి ఆయనతో కలిసి సచివాలయానికి వెళ్లాను. అంతకుముందు ఎప్పుడూ అందులో అడుగు పెట్టిన అనుభవం లేదు. ఆదిరాజు పేరులోనే కాకుండా వేషభాషల్లో  కూడా. ఫుల్ సూటు. నెక్ టై. చేతిలో బ్రీఫ్ కేసు. ఢిల్లీలో ఎక్కువకాలం వుండడం వల్ల అలవడ్డ అలవాట్లు కాబోలు. సచివాలయం గేటు దగ్గర కాపలా మనిషి ఆదిరాజుని చూడగానే రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాడు. అయన వెంట వస్తున్న నన్ను చూసి  కనీసం ఎవరని కూడా అడగలేదు. సిగరెట్ వెలుగుతున్న చేయిని విలాసంగా వూపుతూ ఆదిరాజు లోపలకు వెళ్లాడు. ఆయనతో పాటే నేనూ. ఆ తరువాత రేడియో విలేకరిగా నాకు సచివాలయం మొదటి కార్యస్థానంగా మారిపోయింది. ప్రతి రోజూ ముందు హాజరు అక్కడే. ఆ తరువాతే రేడియో. ఎందుకంటే రేడియో వార్తలకి  అవసరం అయ్యే అధికారిక సమాచారం యావత్తూ అక్కడే దొరికేది. కాలక్రమంలో  గేటు మనిషి నుంచి ముఖ్యమంత్రివరకు అందరితో ముఖపరిచయాలు. ఎక్కడికయినా గేటు (తలుపు) తోసుకుని వెళ్ళగల చనువూ, వెసులుబాటు, వీటికి తోడు రేడియో విలేకరి  అన్న ట్యాగు లైను.
గతంలో ముఖ్యమంత్రుల కార్యాలయం  వున్న పాత (హెరిటేజ్) భవనం వెనుకపక్కనే ప్రెస్ రూమ్. విశాలంగా వుండేది. ఒకటి రెండు సోఫాలు, కుర్చీలు. పక్కనే భోషాణం మాదిరి చిన్న చెక్క బీరువా. అందులో ఫోను. ఈ ఫోను కోసమే చాలామంది వచ్చేవాళ్ళు. ఎందుకంటే అది డైరెక్ట్ ఫోను. సచివాలయం టెలిఫోన్ ఆపరేటర్ తో సంబంధం లేకుండా నేరుగా ఫోను చేసి మాట్లాడుకోవచ్చు. ఆరోజుల్లో చాలామంది సీనియర్ జర్నలిష్టులకు సయితం ఇళ్ళల్లో ఫోన్లు వుండేవి కావు. ఒకరిద్దరికి వున్నా ఆఫీసు బిల్లు కట్టే పద్దతి వుండేది కాదు. అంచేత వార్తా సేకరణకోసం ప్రెస్ రూమ్ ఫోను బాగా పనికి వచ్చేది. పేపర్లవాళ్ల కంటే నాకు బాగా ఉపయోగంగా వుండేది. వాళ్లు వార్త సుదీర్ఘంగా రాయాలి కనుక ఆఫీసులకి వెళ్ళి ఇచ్చేవాళ్ళు. రేడియోకి మూడు ముక్కలాటే కనుక వార్తల టైముకు ముందుగా ఫోను చేసి చెప్పేవాడిని. ప్రెస్ రూములో రేడియో కూడా వుండేది. ఫోనులో చెప్పిన వార్త అప్పటికప్పుడే రేడియోలో రావడం కొంతమందికి ఆశ్చర్యంగా వుండేది.
ప్రెస్ రూములో   టీ, కాఫీలు తెచ్చి పెట్టడానికి ఒక అటెండరు. డెక్కన్ క్రానికల్ కరస్పాండెంట్ సింహం (నరసింహారావు) ఒక సోఫాలో నిద్రపోతూ వుండేవారు. కానీ ఆయనది కాకి నిద్ర. చటుక్కున లేచి కూర్చునే వారు. ప్రెస్ మీట్ లో అవతలవాడు మంత్రికానీ, ముఖ్యమంత్రి కానీ ప్రశ్నలతో సింహం మాదిరిగానే విరుచుకు పడేవాడు. ఈనాడు శాస్త్రి గారు, ఆంధ్ర పత్రిక (ముక్కు) శర్మ గారు, హిందూ రాజేంద్రప్రసాద్   పీ.యస్. సుందరం (ముందు ఆంధ్ర పత్రిక విలేకరి, తరువాత ఇండియన్ ఎక్స్ ప్రెస్ రెసిడెంట్ ఎడిటర్), శ్రీకాంత్ విఠల్, యూఎన్ఐ పార్ధసారధి, పీటీఐ జమాల్, యెన్ ఎస్ ఎస్ లక్ష్మారెడ్డి, కల్యాణి, ఆంధ్ర జ్యోతి వెంకట రావు గారు, ఎన్.ఇన్నయ్య, దామోదరస్వామి, ఉడయవర్లు, ఆంధ్ర ప్రభ నంద్యాల గోపాల్, ఇలా ఎంతో మంది జర్నలిష్టులతో పరిచయాలు బలపడడానికి ప్రెస్ రూమ్ దోహదం చేసింది. జమాల్, కల్యాణి, లక్ష్మారెడ్డి ఎప్పుడూ కలిసి తిరుగుతుండే వారు.  వారి పేర్లలో మొదటి అక్షరాలతో వారిని 'జాకాల్' అని ముద్దు పేరు పెట్టి పిలిచేవాళ్ళు. వీళ్ళల్లో నలుగురయిదుగురు మినహా మిగిలిన వాళ్ళు కాలం చేశారు. చాలా కాలం అయింది కాబట్టి కాస్త మతిమరపు సహజం. ఎవరి పేర్లు అయినా మరచిపోతే క్షంతవ్యుణ్ణి.
అంతా ఒక కుటుంబం మాదిరిగా మధ్యాహ్నం దాకా సచివాలయంలో గడిపి, వార్తలు సేకరించుకుని, తోటి వారితో పంచుకుని, అనుమానాలు వుంటే తీర్చుకుని ఎవరి ఆఫీసులకు వాళ్ళం వెళ్ళేవాళ్ళం. ఈరోజు చాలామంది అడుగుతుంటారు, 'మీరు యెందుకు మార్నింగ్ వాక్ చేయరు' అని. ఎందుకంటే ఒక జీవితానికి సరిపడా నడక  ఆ రోజుల్లో సచివాలయంలోనే  నడిచాను కనుక.  ఒక బ్లాకు నుంచి మరో బ్లాకుకు, ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి, ఎక్కే మెట్లు, దిగే మెట్లు, నడకే, నడక, పరుగే  పరుగు.
ఇప్పుడా ప్రెస్ రూమే లేదు. మేము నడయాడిన పాత భవనాలు లేవు, ఈరోజు మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం తెలంగాణా సచివాలయంలోకి ప్రవేశించడానికి 'జర్నలిష్టులకు నో ఎంట్రీ' అంటున్నారు (ట). సచివాలయంతో మూడు దశాబ్దాల పైచిలుకు అనుబంధం పదేళ్ళ క్రితం పదవీ విరమణ చేసినప్పుడే తెగిపోయింది. జీతభత్యాల విషయంలో ఈనాటి జర్నలిష్టులకు సాటి రాకున్నా, పోలిక లేకున్నా  ఆ రోజుల్లో జర్నలిష్టులుగా పొందిన గౌరవాభిమానాలు మాత్రం వెలకట్టలేనివి. అవే మరపురాని, మరవలేని జ్ఞాపకాలుగా మిగిలాయి. 



ఇక నో ఎంట్రీ సంగతి అంటారా?
రవి కాంచని చోట కవి కాంచును అన్నారు అందుకే. జర్నలిష్టులకు కాస్త పనిభారం పెరుగుతుంది.                  

 (వచ్చే ఆదివారం సూర్య పత్రికకి వ్యాసం రాయడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్న సమయంలో విన్నకోట నరసింహారావు ఈ అంశంపై బ్లాగులో రాయమని సూచించారు. ఈ నాలుగు ముక్కలు అయన చలవే - భండారు శ్రీనివాసరావు) 

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

నా విన్నపాన్ని వెనువెంటనే మన్నించినందులకు ధన్యవాదాలు.