12, నవంబర్ 2012, సోమవారం

ఎంతెంత దూరం? ఇంకెంత దూరం? - భండారు శ్రీనివాసరావు


ఎంతెంత దూరం? ఇంకెంత దూరం?  - భండారు శ్రీనివాసరావు

టీఆర్ఎస్ అధినేత  కె.చంద్రశేఖరరావుకు మళ్ళీ కోపం వచ్చింది. ఢిల్లీ పిలిపించి, రోజుల తరబడి చర్చించి పిదప  మొండి చెయ్యి చూపించిన చేతి పార్టీ నాయకులపై  ఆయన నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్ ను నమ్మి మోసపోయామని, ఇక నమ్మే ప్రసక్తి లేదనీ, ఎన్నికల్లోనే అమీతుమీ తేల్చుకుని తెలంగాణాను సాధించుకుంటామనీ పార్టీ మేధోమధనం అనంతరం ఆయన  తేల్చిచెప్పారు. ఉగ్ర నరసింహావతారం ఎత్తి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడం ద్వారా తెలంగాణా తదాఖా చూపుతామని హెచ్చరించారు.  వంద అసెంబ్లీ సీట్లు, పదిహేను లోకసభ స్థానాలు టీ.ఆర్.ఎస్. తనకు తానుగా గెలుచుకుంటే ఢిల్లీ దిగివచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని తమ చేతులో పెడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇక ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని మరో విధాన ప్రకటన చేశారు. అనుభవం మీద తత్వం బోధపడడమంటే ఇదే కాబోలు.
కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే  తెలంగాణా విషయంలో చేసిన ప్రకటన మరో రకంగా వుంది. అనుకూల ప్రతికూల వర్గాలు ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకోవడానికి వీలుగా కూడా  వుంది.  ఇన్నేళ్ళు ఆగిన వాళ్లు మరికొన్ని నెలలు ఆగలేరా అని ఒక ప్రశ్నాస్త్రాన్ని ఆయన విభజన వాదులపై సంధించారు. పరిష్కార  ఘడియ రోజుల్లో కాకపోయినా కొన్ని నెలల్లో వుందని ఆ మాటలకు కొందరు భాష్యం చెబుతుంటే,  పరిష్కార మార్గాన్ని చెబితే స్వాగతిస్తామని చెప్పడం ద్వారా తాము ఇంతవరకు ఎలాటి పరిష్కారాన్ని కనుగొనలేదన్న నిజాన్ని చెప్పకనే చెప్పారని మరికొందరు అన్వయాలు అద్దుతున్నారు.
కేంద్ర మంత్రి చేసిన ప్రకటన, అసలు  విషయాన్ని మరింత గందరగోళపరిచేదిగా వున్నప్పటికీ, తెలంగాణా పట్ల కేంద్రం ఇంకా ఒక స్పష్టమయిన అవగాహనకు రాలేదన్న స్పష్టమయిన సంకేతం ఇచ్చేదిగా వుండడం విశేషం.       
మరోపక్క  మాజీ జీ పీసీసీ అధ్యక్షుడు కేశవరావు ఇంకో సంచలన ప్రకటన చేశారు. తెలంగాణా విషయంలో కాంగ్రెస్ అధినేత్రికి చివరాఖరు లేఖ రాయబోతున్నామని హెచ్చరిస్తూనే, డిసెంబర్ 9 లోగా   రాష్ట్ర విభజన విషయంలో తమ అభీష్టానికి అనుగుణంగా అధిష్టానం సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకం తమకుందని సన్నాయి నొక్కులు నొక్కారు. ఒకటి రెండు రోజుల్లో బహిర్గతం చేసే ఆ లేఖలో తమ భవిష్యత్ కార్యాచరణను స్పష్టం చేస్తామని కూడా ముక్తాయింపు ఇచ్చారు. ఇవి పైకి విలేఖరులకు చెప్పిన మాటలు. పత్రికల్లో  వెలువడ్డ అభిజ్ఞవర్గాల కధనాలు మరింత ఘాటుగా వున్నాయి.
తెలంగాణా ఏర్పాటు విషయంలో రాజీలేని పోరాటానికి సిద్ధపడుతున్నట్టు ఆ కధనాలు వెల్లడిస్తున్నాయి. ఈ చివరి ప్రయత్నం పట్ల కూడా అధినేత్రి  సానుకూలంగా స్పందించక పోతే వేర్పాటును కోరుకునే సంఘాలు, సంస్థలతో కలసి ఒక ఫ్రంటు ఏర్పాటు చేసే అంశాన్ని సైతం ఆ ప్రాంతపు కాంగ్రెస్ ఎంపీలు తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు ఆ వార్తలు పేర్కొంటున్నాయి.           
కేంద్ర హోం మంత్రి చెప్పిన దాని ప్రకారం తెలంగాణా  అంశానికి సంబంధించిన సమస్త  వివరాలు కేంద్ర ప్రభుత్వం వద్ద వున్నాయి. అన్ని  వివరాలు సిద్ధంగా వున్నప్పుడు నిర్ణయం తీసుకోవడంలో జాగు చేస్తున్నారంటే ఢిల్లీ వారికి కావాల్సింది ఈ సంఖ్యలు, అంకెలు కాదని అర్ధమైపోతున్నది.  వారికి కావాల్సింది  రెండేళ్ళ లోపు  జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అవసరమయిన పార్లమెంటు సభ్యులను రాష్ట్రం నుంచి తగు మోతాదులో గెలిపించుకోవడానికి ఏమి చేస్తే సాధ్యపడుతుంది అన్నది మాత్రమే. తెలంగాణా ఇవ్వడం ద్వారా అది వీలుపడుతుందని తెలిసిన మరుక్షణం ప్రత్యేక రాష్ట్రం  ఏర్పాటుకు కాంగ్రెస్ పచ్చ జండా వూపుతుంది. ఇందులో సందేహం లేదు. మరో సంగతి. తెలంగాణా ఏర్పాటు ద్వారా వొనగూడే రాజకీయ లబ్ది పూర్తిగా తన ఖాతాలోకే రావాలని  కూడా కాంగ్రెస్ కోరుకుంటే తప్పు పట్టాల్సింది ఏమీ వుండదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఈ దృక్కోణం నుంచే పావులు కదుపుతుంది. తెలంగాణా విషయంలో ఇంత తాత్సారానికి బహుశా  ఇదే కారణం అయివుంటుంది. తీసుకోవాల్సింది రాజకీయ నిర్ణయం అయినప్పుడు ఉద్యమాల ద్వారా లక్ష్య సాధనకు పోరాడుతున్న పార్టీలను  లెక్క చేయాల్సిన అవసరం ఏమిటన్నది వారి వ్యూహ కర్తల ఆలోచన కావచ్చు.
సరే! మరికొన్ని నెలలు వేచి చూడాల్సిందని కేంద్ర మంత్రి ఒక ఉచిత సలహా ఇచ్చారు బాగానే వుంది. కాని, తెలంగాణా అంశం కారణంగా రాష్ట్రంలో కుంటుపడ్డ పాలన సంగతి ఏమిటి? పాలన కుంటుపడడం వల్ల కలిగే విపరీత పరిణామాల ప్రభావం పరిపాలించే పాలకులు, ఉన్నతాధికారుల దినవారీ   వ్యక్తిగత జీవితాలపై  వెంటనే పడే అవకాశాలు లేని అస్తవ్యస్త  వ్యవస్థ మనది. అందుకే పాలన కుంటుపడ్డా పాలకులు నిమ్మకు నీరెత్తినట్టు వుండడానికి కారణం ఇదే. కానీ పాలితుల పరిస్తితి మరోరకంగా వుంటుంది. నిధుల లేమి కారణంగానో, ఇతరేతర కారణాలతోనో   ప్రభుత్వం అమలు చేయాల్సిన పధకాలు జాప్యం కావడంవల్ల వాటిల్లే ఇబ్బందులకు జనం ఇప్పటికే అలవాటు పడిపోయారు. కానీ  వ్యక్తిగత సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ప్రభుత్వానికి పెట్టుకున్న అర్జీలు నెలల తరబడి పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ లో పడిపోతే దానివల్ల ప్రజలు  పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అందుకే,  రాజకీయ సంక్షోభ పరిష్కారం పట్ల ఎక్కువ దృష్టి పెట్టాల్సిరావడంవల్ల పాలన  కొంత మేరకు  మందగించిందనే   సర్కారు   సాకులను ప్రజలు జీర్ణించుకుని అర్ధం చేసుకోవడం కష్టం.
రాష్ట్ర విభజన అనేది సున్నితమైన, సంక్లిష్టమయిన సమస్య అని అంగీకరించే వారు కూడా ఈ సమస్యకు సత్వర పరిష్కారం కోరుకుంటున్నారని భావించడం సత్య దూరం కాదు. ఎందుకంటె, ఈ సమస్యను ఏళ్లతరబడి నానుస్తూ పోవడం వల్ల మరింత జటిలం కావడం మినహా మరే  ప్రయోజనం వుండదని అందరూ అర్ధం చేసుకునే రోజులు దగ్గరపడ్డాయి. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు చేయాలన్న అభిలాష ఆ ప్రాంతపు ప్రజల్లో నాలుగు దశాబ్దాలకుపైగా వేళ్ళూనుకుని  పాతుకుపోయివున్న ప్రగాఢ  కోరిక. అప్పటినుంచి ఇప్పటివరకు వారి  ఆకాంక్షలో ఎటువంటి మార్పు వచ్చివుండక పోవచ్చు. కానీ, పరిణామక్రమంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వీస్తున్న నూతన ఆర్ధిక సంస్కరణల పవనాల ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ పై  కూడా పడడంలో ఆశ్చర్యం లేదు. ప్రాంతాలను దాటుకుని పెట్టుబడులు ప్రవహించాయి. సంస్కరణల వల్ల సంస్కృతి బీటలు వారింది. సంపాదనే లక్ష్యంగా మారి విలువలు వెనక్కు పోయాయి. మానవ సంబంధాలు మరుగున పడి ఆర్ధిక సంబంధాలు యాంత్రిక జీవన రంగ స్తల  యవనిక పైకి వచ్చాయి. మూడు దశాబ్దాల క్రితం ఉద్యమాలు చెలరేగినప్పుడు - చదువుల విలువ తెలిసిన వారు అప్పట్లో ఉన్నతవర్గాల్లో మాత్రమే వుండేవారు. ఇప్పుడా పరిస్తితి పూర్తిగా మారి బడుగు బలహీన వర్గాలు  సైతం విద్యవల్ల లభించే సాంఘిక గౌరవంలోని రుచిని ఆస్వాదించడం మొదలయింది.
విద్యకు తగిన ఉద్యోగాలు, ఉద్యోగాలకు తగిన ఆర్జన ఇవన్నీ గౌరవప్రదమయిన జీవితాలకు పునాదులు వేయడంతో సమాజ స్వరూప స్వభావాల్లోనే సమూల మార్పులకు  బీజాలు పడ్డాయి. పిల్లలను పెద్ద చదువులు చదివించాలన్న తపన  తలితండ్రుల్లో పెరిగిపోయింది. బీదా గొప్పా తారతమ్యం లేకుండా  వానయినా వంగడయినా పిల్లలను క్రమం తప్పకుండా బడులకు పంపడం అలవాటుగా మారిపోయింది. నలభయ్ ఏళ్ళ క్రితం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ చెలరేగిన ఉద్యమంలో చాలాకాలం విద్యాసంస్తలు పనిచేయలేదు. కలిగిన వాళ్లు బయటి ప్రదేశాలకు పిల్లలను పంపి చదివించుకున్నారు. లేనివాళ్ళు బడులు నడవకపోవడమే  అవకాశంగా తీసుకుని తమ  పిల్లలను కూలీ పనుల్లో పెట్టి వారి చదువుకు స్వస్తి చెప్పారు. ఇందుకు వారిని  తప్పు పట్టాల్సిన పని లేదు. ఎందుకంటె వారి ఆర్ధిక నేపధ్యం అలాటిది మరి.
మరి ఇప్పుడో. ఒక్క పూట కూడా  బడికి  ఎగనామం పెట్టే వీలు లేదు. పరీక్షల సీజను మొదలయిందంటే చాలు తలితండ్రులే  ఆఫీసులకు సెలవు పెట్టి తమ పిల్లలను చదివిస్తున్న రోజులివి. పెళ్ళిళ్ళు పేరంటాల జోలికి పోకుండా పిల్లల చదువులకే పెద్దపీట వేసే తలితండ్రులే ఈనాడు  లెక్కకు మిక్కిలి కానవస్తారు. అలాగే, ప్రయివేటు ఉద్యోగులు.  వాళ్లు ఆఫీసులకు రావడం  ఒక్క నిమిషం ఆలశ్యం అయినా అందువల్ల వాటిల్లే నష్టాన్ని రూపాయల్లో లెక్కలు వేసుకుని, వారిని  తమ వాహనాల్లో ఇళ్లనుంచి సకాలంలో  ఆఫీసులకు  తరలించే కొత్త యాజమాన్య వర్గాలు తయారయ్యాయి. ఉరుకులు పరుగులతో జీవితాలు పరుగులు తీస్తున్నాయి. వేగమయ జీవితాలతో కాలంతో పరిగెత్తే కొత్త సమాజం ఆవిష్కృత మవుతోంది.
ఈ వాస్తవాలను ఉదహరిస్తున్నది ఉద్యమకారుల ఉద్దేశ్యాలను  శంకించడానికో, ప్రజాస్వామ్య హక్కులను హేళన చేయడానికో కాదు. మారిన  పరిస్తితులకు అనుగుణంగా జీవన శైలిని మార్చుకోవడం అన్నది అనాదిగా వస్తోంది. స్వాతంత్రోద్యమ సమయంలో అనుసరించిన పద్దతులు  ఆనాటి స్తితిగతులకు తగినట్టుగా వుండవచ్చు. ఈ నాటి పరిస్థితులు, అవసరాలకు తగినట్టుగా ఆందోళనల స్వరూపాలు మారితీరాలనే  వాదన సర్వత్రా ప్రబలుతోంది. ఈ  వాస్తవాన్ని గమనించి నడుచుకుంటే ప్రజల మన్నన, మద్దతు మరింత ఎక్కువగా లభిస్తాయి.
తెలంగాణా రావాలని మనసా వాచా కర్మణా కోరుకునే వాళ్లు ఎందరో వున్నారు. కానీ వారిలో చాలా మందికి  నోరూ వాయీ లేదు. తెలంగాణా కోసం పార్టీలు , సంఘాలు పెట్టి పోరాడుతున్న వారూ వున్నారు. మీడియా ద్వారా మాట్లాడే అవకాశం వీరికున్నట్టుగా నోరు లేని మూగ జీవులకు  లేదు. ఆయా పార్టీలు, సంఘాలు చేసే ప్రతిదానినీ సమర్ధించని వారిని తెలంగాణా వ్యతిరేకులుగా ముద్ర వేయడం సరికాదు. చిన్న విషయాన్ని కూడా గోరంతను కొండంత చేసి యాగీ చెయ్యడం సభ్యత అనిపించుకోదు. తెలంగాణాను ఎవరు యెంత గట్టిగా కోరుకుంటున్నారో వద్దని అనుకునేవారు కూడా అంత గట్టిగానే కోరుకుంటూ వుండవచ్చు.  అది వారికున్న ప్రజాస్వామిక హక్కు. లక్ష్య శుద్ధి వున్నంతకాలం ఫలితంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వీరిని వారూ వారిని వీరూ ఆడిపోసుకుంటూ మీడియాలో మాటల యుద్ధాలు చేసుకుంటూ పోవడం వల్ల ఉద్యమ స్పూర్తి పలచబడే అవకాశం వుంటుంది. గమ్యం చేరుకునే  క్రమంలో ఎవరో అడ్డం పడుతున్నారని అనుకుంటే మాత్రం పోరాడేవారిలోనే  పోరాటపటిమ కొరవడుతోందనే అపోహలకు ఆస్కారం కలుగుతుంది. 
వెనకటికి ఇంట్లో అమ్ముమ్మలు పిల్లలకు చెప్పే కధల్లో ఓ ముసలమ్మ బావి గట్టుమీద కూర్చుని సూదిలో దారం ఎక్కిస్తుంటే సూది బావిలో పడిపోతుంది. కొడుతూ కధ వింటున్న పిల్లలు అంటారు. బావిలో పడ్డ సూది  అంటే వస్తుందా అని కధ చెప్పే అమ్ముమ్మ ప్రశ్న వేస్తుంది.  అది అర్ధం కాని పిల్లలు ఆ!అంటారు. ఆ!అంటే వస్తుందా అని మరో ప్రశ్న. ఆ కధ ఎప్పటికీ పూర్తవదు, ఈ లోగా కధ వినే పిల్లలు ఎంచక్కా నిద్రలోకి జారుకుంటారు. (12-11-2012)

3 కామెంట్‌లు:

Saahitya Abhimaani చెప్పారు...

ఎంతెంత దూరం? ఇంకెంత దూరం? ఏమిటండీ మరీనూ, ఇంకెంత దూరం-అనుకున్న పదవి దొరికినంత దూరం అంతకంటే దూరం ఉంటుందంటారా.

I am sure 1969 is getting repeated and the ultimate loser is the common man who got incited and gave away his precious time and effort.

I hope atleast People shed their sheep like mentality and realise what the so called Leaders are doing and put an end to the same old scene being repeated over and over.

Unknown చెప్పారు...

There is a major difference here when compared with 1969. During 2009, the dream of Telangana was almost realized but for few Seema-Andhra Politico-Factionists and Politico-Barons.

This unexpected treachery has lead the movement to this far. But don't worry, 2014 will be the dday for Telangana.

అజ్ఞాత చెప్పారు...

Who is worrying?! Infact, it is entertaining. :D

KCR is going to transform from present Varaha to Narasimha. A long way .... to become human, anyway. :P :))