29, జులై 2010, గురువారం

అమెరికా అనుభవాలు – 6

అమెరికా అనుభవాలు – 6

విస్తట్లో అన్నీ వున్నా .........

సుఖంగా బతకాలనుకునే మనిషికి ఏమేమి అవసరమో అవన్నీ ఇక్కడ అందుబాటులోకి తెచ్చుకున్నారు.పరిశుభ్రమయిన గాలి - పరిశుద్ధమయిన నీరు – ఎల్లెడలా పచ్చదనం – అద్దాల్లా మెరిసిపోయే రోడ్లు - పొగలేని వాహనాలు – పొందికయిన ఇళ్లు – సమృద్ధిగా సాగునీరు, తాగు నీరు – పుష్కలంగా కరెంట్ సరఫరా- మంచి చదువులు చదువుకోవడానికీ, చదివిన చదువును సద్వినియోగం చేసుకోవడానికీ సరయిన అవకాశాలు – అన్ని హంగులూ సదుపాయాలు వున్న విద్యాసంస్తలు – పరిమితులులేని వ్యక్తి స్వేచ్చ – ఆడా మగా తేడాలు తెలియని జీవన విధానం – ప్రపంచ వాణిజ్యంలో తిరుగులేని డాలర్ వెలుగులు – ఇవన్నీ అమెరికన్ల జీవన స్తాయిని ఎంతగానో పెంచుకుంటూ వెళ్ళాయి. సువిశాల నైసర్గిక స్వరూపం – తక్కువ జనాభా – పుష్కలమయిన సహజ వనరులు – ఇవి కూడా సుసంపన్న అమెరికా ఆవిర్భావానికి దోహదం చేసివుండవచ్చు. అయితే కష్టపడి పని చేసే పౌరుల మనస్తత్వం – సాధారణ జన జీవితంలో నీతీ నిజాయితీ – ఇవి కూడా అమెరికా సౌభాగ్యానికి కారణాలుగా చెప్పుకోవచ్చు.
  సుఖంగా బతకడం ఒక్కటే కాదు – ఇంకెంతో – మరెంతో సుఖంగా బతకాలంటే ఏమి చెయ్యాలో వాళ్లకు బాగా తెలుసు. అందుకే వర్తమాన మానవ జీవితాలను ఎంతగానో ప్రభావితం చేసిన – ఇంకా చేస్తున్నఅనేకానేక ఉపకరణాలను వాళ్ళు కనుక్కోగలిగారు.


(దొంగతనానికి వెళ్ళే వాళ్ళు కూడా నెట్ ద్వారా సమాచారం తెలుసుకోగలుగుతున్నారన్నది పై ఫోటో లో వున్న చమత్కారం)

 దైనందిక జీవితంలో సుఖమయ జీవనానికి కావాల్సిన వస్తు సామాగ్రిని అమెరికన్లు తయారు చేసిన వార్తలను గతంలో వర్ధమాన దేశాల వార్తా పత్రికలు పుంఖాను పుంఖాలుగా ప్రచురించిన విషయం చాలా మందికి గుర్తుండే వుంటుంది.


 తమ దేశ రక్షణ వ్యవస్థ కోసం ఎంతో పరిశోధనలు చేసి రూపకల్పన చేసుకున్న ఇంటర్నెట్ ని సయితం పౌరులందరికీ అందుబాటులోకి తెచ్చి వారి జీవన శైలినే సమూలంగా మార్చివేసిన ఘనత అమెరికాదే.

అయితే - ఏమిటట .....

అయితే ఏమిటి?


ఇప్పుడు అనేకమంది అమెరికన్ల మనసులో నలుగుతున్న ప్రశ్న ఇది.
అవును అన్నీ వున్నాయి. కానీ వున్నదేదో లేకుండా పోయింది. వుండాల్సింది ఏమిటో కానరాకుండా పోయింది. అది లేకుండా ఇవన్నీ వుండి ఏమిటి లాభం?


సహజమయిన మానవ సంబంధాలు మచ్చుకు కూడా మిగలకుండా పోతున్నాయి. ఈ బంధాలు,అనుబంధాలు ఒక వయస్సు వచ్చే వరకే పరిమితమవుతున్నాయి. కన్నవారిని తలచుకోవడానికీ, ఏడాదిలో కనీసం ఒక్కమారయినా వారిని కలుసుకోవడానికీ – ‘ధన్యవాదాల దినం’ ( THANKS GIVING DAY ) పాటించాల్సిన పరిస్తితులు ఏర్పడ్డాయి. కన్నవారు – తాము కన్నవారితో కలిసివుంటే ఒక ‘వార్త ’ గా చెప్పుకునే రోజులు వచ్చాయి.స్పోక్స్ మన్  రివ్యూ

సియాటిల్ కి దాదాపు మూడువందల మైళ్ల దూరంలో వున్న స్పోకెన్ నగరం నుంచి స్పోక్స్ మన్ రివ్యూ అనే ఈ పత్రిక 125 సంవత్సరాలకు పైగా ప్రచురితమవుతూ వస్తోంది. లోగడ హైదరాబాదు ఆలిండియా రేడియోలో నా సహోద్యోగిగా పనిచేసిన పవని విజయ లక్ష్మి – ఆమె భర్త బాలాజీ ఉద్యోగరీత్యా ఆ నగరంలో మూడేళ్లుగా వుంటున్నారు. నేను అమెరికా వచ్చిన సంగతి తెలుసుకుని వాళ్ళ వూరు రావాల్సిందని పదే పదే ఫోన్లు చేస్తూ వుండడంతో ఒకరోజు నేను మా ఆవిడను తీసుకుని స్పోకేన్ కు వెళ్ళాను. అక్కడ వాళ్ళు కొనుక్కున్న ఇల్లు చూడ ముచ్చటగావుంది. అంతకు ముందే బాలాజీ తలిదండ్రులు హైదరాబాద్ నుంచి వచ్చి కొడుకూ కోడలి దగ్గర ఆరు నెలలు వుండి తిరిగి ఇండియాకు వెళ్లారు. వేరు కాపురం పెట్టుకున్న కొడుకు దగ్గర తలిదండ్రులు అన్ని నెలలు గడపడం అక్కడి అమెరికన్లకు ఎంతో వింతగా అనిపించింది. ఆ నోటా ఈ నోటా పడి ఈ సంగతి స్పోక్స్ మన్ రివ్యూ
 పత్రిక విలేఖరి రెబెక్కా నప్పీ చెవిన పడింది.ఇంకేముంది ఆమె అమాంతం విజయలక్ష్మి అడ్రసు కనుక్కుని ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేసి మొత్తం ఫామిలీ ఫొటోలతో సహా మొదటి పుటలో ప్రచురించింది. రెబెక్క ఆ పత్రికకు ఇంటరాక్టివ్ ఎడిటర్ గా కూడా పనిచేస్తున్నారు. నేను ఆలిండియా రేడియో విలేకరినని తెలుసుకున్న మీదట ఆమె  స్పోక్స్ మన్  రివ్యూ పత్రిక కార్యాలయానికి ఆహ్వానించారు.


 డౌన్ టౌన్ రివర్ సైడ్ ఎవేన్యూ లో అనేక అంతస్తులలో వున్న ఈ పత్రిక భవనం అతి పురాతనమయినది. చారిత్రిక అవశేషాలు దెబ్బతినకుండా భవనం లోపల ఇంటీరియర్ ను మాత్రం ఫైవ్ స్టార్ హోటల్ మాదిరిగా అధునాతనంగా తీర్చిదిద్దారు. సుమారు నూరేళ్ళ నాటి లిఫ్ట్ దగ్గర నిలబడి ఫోటోలు దిగాము. రెబెక్క మమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానించి వివిధ విభాగాలకు తీసుకువెళ్ళి అక్కడ పనిచేస్తున్న జర్నలిష్టులను పరిచయం చేసారు.


 అంతే కాకుండా ఎడిటోరియల్ స్టాఫ్ మీటింగ్ లో కూర్చోబెట్టి ‘జర్నలిస్ట్ ఫ్రెండ్ ఫ్రం ఇండియా’ అని పరిచయం చేసిన తీరు మరిచిపోలేనిది. పత్రిక చీఫ్ ఎడిటర్ ఎలాటి భేషజం ప్రదర్శించకుండా చక్కని హాస్యోక్తులతో కూడిన ప్రొఫెషనల్ సీరియస్ నెస్ తో సమావేశాన్ని రక్తి కట్టించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా వివిధ ప్రాంతాల విలేకరులతో మాట్లాడి ఏ వార్తకు ఆ రోజు ఎలాటి ప్రాధాన్యం ఇవ్వాలో అందరితో చర్చించి నిర్ణయించడంతో ఆ సమావేశం ముగిసింది. తరవాత చివరి అంతస్తులో వున్న కాంటీన్ కు వెళ్లి కాఫీలు కలుపుకు తాగాము. అక్కడ మేడ మీద పెద్ద పెద్ద గుడ్లగూబ పక్షుల బొమ్మలు కనిపించాయి. మన వైపు వీధి వాకిళ్ళ వద్ద కనిపించే సింహాల బొమ్మల మాదిరిగా వున్నాయి. క్షుద్ర శక్తులు ప్రవేశించకుండా ఈ బొమ్మలు కాపాడుతాయని తమ పూర్వీకులు నమ్మేవారని రెబెక్క చెప్పారు.

NOTE: All images in this blog are copy righted to their respective owners

2 వ్యాఖ్యలు:

Afsar చెప్పారు...

శ్రీనివాస రావు గారు:


మీ అనుభవాలు బాగున్నాయి. మరిన్ని అనుభవాల కొసం ఎదురు చూస్తూ...

అఫ్సర్
www.afsartelugu.blogspot.com

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

Thank you very much Afasar garu