30, జులై 2010, శుక్రవారం

అమెరికా అనుభవాలు- 16

అమెరికా అనుభవాలు- 16

నిద్రపోని నగరం

అద్భుతమయిన నగరాలు చాలా వుంటాయి, కానీ లాస్ వెగాస్ మాత్రం అద్భుతాల నగరం.
ఒక అద్భుతాన్ని చూసి ఔరా అని ముక్కున వేలేసుకునే లోపునే మరో అద్భుతం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా జూదాలు ఆడేవారికీ,  'ఆనందమె జీవిత మకరందం' అనీ,  'ఈ భూమ్మీద సుఖపడితే తప్పులేదురా'  అనీ పాటలు పాడుకుంటూ జీవితాన్ని హాయిగా గడపాలనుకునే వారికీ - ఈ నగరం - అలాటి అమాంబాపతు వారి కలల రాజధాని. స్వేచ్చకు పరిమితి లేని ఈ నగరంలో కాసినోలకు (జూదగృహాలకు) చట్టరీత్యా అనుమతి వుంది.


 వ్యభిచారం, నగ్న ప్రదర్శనలను పక్కనపెడితే- వీటిపై ఆసక్తి లేని పర్యాటకులను కూడా విశేషంగా ఆకట్టుకునే ఆకర్షణలు ఇక్కడ ఎన్నో వున్నాయి.ఈ నగరంలో ప్రధాన వీధి ఎంతో విశాలంగా- మరెంతో పొడవుగా అటూఇటూ కళ్ళు బైర్లు కమ్మే విద్యుత్ కాంతులను వెదజల్లే పెద్ద పెద్ద హోటళ్ళతో వెలిగిపోతూవుంటుంది. ఇక్కడి హోటళ్ళన్నీ కాసినోలే. జూదమాడడానికి వివిధ ప్రదేశాలనుంచి, వివిధ దేశాలనుంచి వచ్చిన వారు ఆ హోటళ్ళలో బస చేస్తుంటారు.
 కాసినోలకి క్షణం విరామముండదు. 365 రోజులూ, 24 గంటలూ ఈ కాసినోలు తెరిచే వుంటాయి.


 అర్ధనగ్న సుందరీమణులు జూదమాడే ధర్మరాజులకు రాత్రీ పగలూ తేడా లేకుండా, కాదు కూడదనే వాదు లేకుండా, లేదులేదనే మాట లేకుండా - ఎవరు కోరిన మద్య మాంసాలు వారికి సరఫరా చేస్తూనే వుంటారు.

 నిమిష నిమిషానికీ వేలాది డాలర్లు చేతులు మారుతుంటాయి. తలరాతలు ఘడియ ఘడియకూ మారిపోతుంటాయి. ఆశ ఆడిస్తుంటుంది. దురాశ పీడిస్తుంటుంది. నవాబులు గరీబులు అవుతుంటారు. గరీబులు నవాబులు కావడం చాలా సక్రుత్తుగా జరుగుతుంది. అయినా ఆశ చావదు. పాశం వీడదు. అదో విష చక్రభ్రమణం. అది అలా నిరంతరం సాగిపోతూనే వుంటుంది.

ఇక్కడ ప్రతి హోటల్ ఒక ప్రత్యెక తరహాలో వుంటుంది. లండన్, న్యూయార్క్, పారిస్ – ఇలాటి పేర్లతో ఆయా నగరాలకు నమూనాగా వీటిని నిర్మించారు. న్యూయార్క్ హోటల్లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూడవచ్చు. పారిస్ హోటల్లో ఈఫిల్ టవర్, అలాగే లండన్ హోటల్లో ధేమ్స్ వంతెన యధాతధంగా దర్శనమిస్తాయి. మనలో మాట. అక్కడ ఢిల్లీ హోటల్ కూడా వుంది. అక్కడ తాజ్ మహల్ ని చూడవచ్చు. మేము అక్కడ వున్న మూడు రాత్రులూ – మూడు వేర్వేరు హోటళ్ళలో బస చేసే విధంగా లాల్ ఏర్పాటు చేసాడు.


మొదటిరోజు - సర్కస్ సర్కస్ అనే హోటల్ లో దిగాము. ముప్పయి అంతస్తులతో విశాలమయిన ప్రాంగణంలో వుంది. అందులో కారు పార్కింగ్ కోసం నిర్మించిన భవనమే మన వైపు ఫైవ్ స్టార్ హోటల్ అంత వుంది. అన్నిహోటళ్ళకూ కారు పార్కింగులు ఈ మాదిరిగానే వుంటాయి. కాసినోలోకి మాత్రం చిన్న పిల్లల్ని అనుమతించరు. అందుకని వారి కాలక్షేపం కోసం రోలర్ కోస్టర్, జైంట్ వీల్ మొదలయిన వాటితో హైదరాబాద్ ఎగ్జిబిషన్ అంత ప్రాంగణం ఆ హోటల్లో వుంది. వేటికీ విడిగా ఎంట్రీ టికెట్లు లేవు. కాసినోలతో సహా కొన్ని గంటలపాటు ఆ హోటల్లో తిరిగినా మొత్తం విశేషాలను చూడలేకపోయాము.
మర్నాడు పిరమిడ్ హోటల్లో బస.దీన్ని పిరమిడ్ ఆకారంలో నిర్మించారు. లిఫ్ట్ లు కూడా ఏటవాలుగా కిందికీ పైకీ నడుస్తాయి. హోటల్లో ప్రతి విభాగాన్నీ ఆరబ్ సంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దారు.
అలాగే మరో హోటల్లో - ‘రోము నగరంలో ‘ వున్నామా అనే భ్రాంతి కలుగుతుంది. వీధులు దుకాణాలు అన్నీ ఆ నగరాన్నే గుర్తు చేస్తాయి.
మరో హోటల్లో - పై కప్పు వినీల ఆకాశం మాదిరి కానవస్తుంది. ఆకాశంలో మేఘాలు కదిలిపోతున్న ఫీలింగు.
స్విమ్మింగ్ పూల్స్ ని కూడా ఆయా దేశాల ప్రాచీన వైభవం వెల్లివిరిసేలా నిర్మించిన తీరు అమోఘం.


హోటళ్ల విస్తీర్ణం ఎక్కువ అవడం వల్ల ఒక హోటల్ నుంచి మరో హోటల్ చేరుకునేందుకు ఒంటి స్తంభాలపై ప్రయాణించే ఎలెక్ట్రిక్ రైళ్ళు వున్నాయి.

పర్యాటకులను ఆకర్షించడానికి ప్రతి హోటల్ కూడా తమ ఆరుబయలు ప్రదేశంలో ప్రత్యెక ప్రదర్శనలు నిర్వహిస్తుంది. ఇవన్నీ ఉచితమే. ఒక హోటల్ లో – సంగీతానికీ, విద్యుత్ కాంతులకూ అనుగుణంగా కొన్ని వందల ఎత్తువరకు లయ విన్యాసాలతో ఎగసిపడే వాటర్ ఫౌంటైన్ లను ఏర్పాటు చేస్తే, మరో హోటల్ వారు – నదిలో ప్రయాణించే ఒక నౌక పై దోపిడీ దొంగలు దాడి చేసే దృశ్యాలను నేత్రపర్వంగా ప్రదర్సిస్తారు. మరో హోటల్ లో హఠాత్తుగా కృత్రిమ వర్షం కురవడం చూపించారు. వున్నట్టుండి హోటల్ లాంజ్ లో ఉరుములు మెరుపులతో వాతావరణం మారిపోతుంది. ఆకాశానికి చిల్లులుపడ్డట్టు జోరున వర్షం మొదలవుతుంది. మరోచోట అగ్ని పర్వతం పేలుతుంది. అగ్నికణాలు విరజిమ్ముతూ లావా ఎగజిమ్ముతుంది. ఇవన్నీ కృత్రిమమే. అంతా భ్రాంతియేనా అని పాడుకుంటూ బయటకు రావచ్చు.

ఇంతవరకూ లాస్ వేగాస్ చూడనివారికోసం - అక్కడి స్టార్ హోటళ్ళ చిత్రమాలిక ఇక్కడ పొందుపరుస్తున్నాను.

NOTE: All images in this blog are copy righted to their respective owners