31, జులై 2010, శనివారం

అమెరికా అనుభవాలు -23

అమెరికా అనుభవాలు -23
పిల్లలకు ప్రత్యేకం


పిల్లల స్వర్గం  కార్లో రేడియో, ఇంట్లో టీవీ సర్వసాధారణం. అవసరం కూడా. టీవీలో వందకు పైగా చానల్స్. ఇవికాక మరెన్నో పెయిడ్ చానల్స్. తెలుగు చానల్స్ లో కనబడే అభ్యంతరకర – అశ్లీల దృశ్యాలను ఇక్కడ ఎప్పుడూ చూడలేదు. పెయిడ్ చానల్స్ లో ఏమయినా చూపిస్తున్నారేమో తెలియదు. పిల్లలకోసం ప్రత్యేకంగా చానల్స్ వున్నాయి. ఆ కార్యక్రమాలను రూపొందిస్తున్న తీరు ప్రశంసనీయం.


బాధ్యత కలిగిన స్వేచ్చ

 కార్పోరేషన్ ఫర్ పబ్లిక్ బ్రాడ్ కాస్టింగ్ వారు పిల్లల కోసం తయారు చేసి ప్రసారం చేస్తున్న ప్రోగ్రాములు చూస్తుంటే – ఒకానొక కాలంలో మన దేశంలో ‘రేడియో – దూరదర్శన్’ కార్యక్రమాలు గుర్తుకు వచ్చాయి.

ఆకాశవాణి స్టూడియో

 సస్య విప్లవానికి ఆకాశవాణి దోహదపడితే- బాలబాలికలలో, యువజనులలో విజ్ఞాన జ్యోతులు వెలిగించడానికి దూరదర్శన్ కృషి చేసింది. గతంలో దూరదర్శన్ ప్రసారం చేసిన క్విజ్ ప్రోగ్రాములే తమ భవితకు బంగారుబాట వేశాయని ఈనాడు అమెరికాలో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న అనేకమంది చెప్పారు.మరి ఇప్పుడో....

అనేక రకాల ప్రయివేటు చానల్స్ అందుబాటులోకి వచ్చాయి. సర్కారు పెత్తనం లేని రోజులు వచ్చాయని చాలామంది ఈ మార్పుని ఆహ్వానించారు. కానీ వాస్తవానికి జరుగుతున్నదేమిటి? వాణిజ్య ధోరణులు తప్ప – పిల్లలనూ, యువతనూ సరయిన దారిలో నడిపే దిశానిర్దేశనం కానరావడం లేదు. ప్రతి చిన్న అంశం మీదా అప్పటికప్పుడే ఎస్ ఎం ఎస్ ల ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించి ప్రసారం చేస్తున్న చానల్స్ – తమ కార్యక్రమాల గురించి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కానీ పోటా పోటీ పోటీ ప్రపంచంలో ఈ సలహాలు ఎవరి చెవికెక్కుతాయి?

ఇక అమెరికా విషయానికి వస్తే-

బాలలు సమర్ధత కలిగి వ్యక్తులుగా-
వ్యక్తులు బాధ్యత కలిగిన పౌరులుగా-తయారు కావడానికి అవసరమయిన అన్ని అవకాశాలు ఇక్కడ వున్నాయి. అలాగే చెడిపోవడానికి కూడా.


ఆనందమే జీవిత మకరందం


సమాన అవకాశాలతో సమర్ధతకు ఇస్తున్న గుర్తింపువల్ల అభివృద్ధి నిరాటంకంగా సాగుతూ వచ్చింది. పౌరుల సర్వసాధారణ జీవితంలో ప్రభుత్వ ప్రమేయం అతి తక్కువగా వుండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. నేను గతంలో చూసిన సోవియట్ యూనియన్ లో కూడా ( పైగా అది అప్పట్లో ఇనుపతెర దేశంగా పేరుపొందిన దేశం) సాధారణ పౌర జీవితంలో ప్రభుత్వ అనవసర జోక్యం కానరాలేదు. ప్రజలు ప్రభుత్వంపై – ప్రభుత్వ యంత్రాంగంపై ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్తితి లేకుండా చూసారు. అప్పటి సోవియట్ యూనియన్ లో ప్రజలకు నిత్యం తారసపడే ఏకైక ప్రభుత్వ ప్రతినిధి ట్రాఫిక్ పోలీసు. ట్రాఫిక్ రూలుని ఎవరయినా ఉల్లంఘించినప్పుడు చలానాలు వసూలు చేసే సందర్భాలలో వాళ్ళు పౌరులపట్ల యెంత మర్యాదగా వ్యహరిస్తారో కళ్ళారా చూసాను. అమెరికాలో ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై కూడా కానరారు. మన దగ్గర ప్రజలకు అతి చేరువగా వుండే ప్రభుత్వ ప్రతినిధులు – ముఖ్యంగా పట్టణాలలో – ట్రాఫిక్ పోలీసులే. వీరి ప్రవర్తన ఎలా వుంటుందో విడిగా చెప్పాల్సిన పని లేదు.

వీరి తీరు మారేనా ?

 పట్టపగలు – నడి రోడ్డుపై ప్రజలపై జులుం చేస్తూ ముక్కు పిండి, గోళ్ళూడగొట్టి డబ్బులు వసూలు చేసుకునే వీలున్న ఏకైక ప్రభుత్వ వ్యవస్థ కేవలం మన దేశంలోనే వుండడం మన దురదృష్టం.

NOTE: All Images in this blog are copy righted to their respective owners