11, ఏప్రిల్ 2023, మంగళవారం

సినిమా రివ్యూ కాదు – భండారు శ్రీనివాసరావు

 

ఈ మధ్య ఒక లాయరు మిత్రుడు నాతొ మాట్లాడుతూ విశాఖ కేసు విషయం ప్రస్తావించాడు. విశాఖ అంటే విశాఖపట్నం కాదు. ఒక స్వచ్చంద వేదిక. నేపధ్యం రాజస్తాన్. కధాకాలం 1992. అంటే మూడు దశాబ్దాల పైమాట. ఒక బాల్య వివాహం ఆపడానికి ప్రయత్నించిన భన్వరీదేవి అనే ఒక రాజస్థానీ మహిళను స్థానిక అగ్ర కులస్తులు పగబట్టి ఆమెను మూకుమ్మడి మానభంగం చేస్తారు. షరా మామూలుగానే ఆ కేసు కింది కోర్టుల్లో తిరస్కరణకు గురవుతుంది. విశాఖ అనే స్వచ్చంద వేదిక నేతృత్వంలో అనేక మహిళా సంఘాలు ఏకమై న్యాయ పోరాటం సాగిస్తాయి. చివరకు 1997 ఆగస్టు 13 వ తేదీన దేశపు అత్యున్నత న్యాయస్థానపు ధర్మాసనం ఒక చారిత్రాత్మక తీర్పు ప్రకటిస్తుంది. పని ప్రదేశాల్లో ఆడవారిపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టడానికి సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శిక సూత్రాలను ఆ తీర్పులో వెలువరించింది. చారిత్రాత్మక తీర్పు అనడానికి ఒక కారణం వుంది. విషయంలోని తీవ్రతను గుర్తించిన న్యాయమూర్తులు తీర్పు చివర ఒక ఆదేశాన్ని జారీ చేశారు. సాధారణంగా కోర్టులు తీర్పులు ఇస్తూ అందుకు తగిన శాసనాలను రూపొందించాలని ప్రభుత్వాలకు సూచిస్తాయి. ఈ కేసులో సుప్రీం విభిన్నమైన ఆదేశాన్ని జారీచేసింది. తగిన చట్టం రూపొందించేవరకు సుప్రీం జారీ చేసిన ఈ మార్గదర్శిక సూత్రాలకు చట్ట బద్ధత ఉంటుందని, చట్టాన్ని అమలుచేసినట్టుగానే వాటిని ప్రభుత్వ యంత్రాంగం అమలు చేయాలని ఉత్తర్వు ఇస్తుంది. ఇది ఒక పెద్ద విశేషం.

అయితే, కేంద్రం మాత్రం తనకు సరిపడా సమయం తీసుకుని సుప్రీం సూచనలకు అనుగుణమైన చట్టాన్ని ఆ తరువాత నాలుగేళ్ళకు (2013) రూపొందించి అమల్లోకి తెచ్చింది.

చాలా పకడ్బందీగా తయారుచేసిన ఈ చట్టం కనుక తుచ తప్పకుండా అమలుకు నోచుకుని వుంటే దేశంలో అసహాయులైన మహిళల పరిస్తితి మరింత మెరుగుపడి వుండేదేమో!

(11-04-2023)

10, ఏప్రిల్ 2023, సోమవారం

రేడియో వార్తలు విన్న రాష్ట్రపతి - భండారు శ్రీనివాసరావు


పురుషులలో ఉత్తమ పురుషుల మాదిరిగా జర్నలిష్టులలో హిందూ విలేకరులను అలా పరిగణించే రోజులు నాకు తెలుసు.
అలాంటి ఒకానొక రోజుల్లో హిందూ కరస్పాండెంట్ (ముందు ముందు విలేకరి అంటాను, టైప్ చేయడం ఇబ్బందిగా వుంది) గా పనిచేస్తున్న దాసు కేశవరావు అనే చిన్నగా కనబడే ఈ పెద్దమనిషికి, కొన్ని రోజులపాటు నా చిలిపితనాన్ని భరించాల్సిన పరిస్తితి ఏర్పడింది. దీనికి కారణం ఆ నాటి రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవరెడ్డి.

సంజీవరెడ్డి గారు రాష్ట్రపతి అయిన తర్వాత తొలిసారిగా అనంతపురం వచ్చారు. ఆ పట్టణానికి దగ్గరలోనే వారి స్వగ్రామం ఇల్లూరు వుంది. అనంతపురంలో ఉన్న వారి సొంత ఇల్లు తాత్కాలికంగా రాష్ట్రపతి నిలయం అయింది. అంతటి పెద్దాయన మొదటిసారి సొంతూరు వస్తుంటే పత్రికలు ఊరుకుంటాయా! హైదరాబాదు నుంచి విలేకరులను పంపించాయి. ఇక ఆకాశవాణి సంగతి చెప్పేదేముంది. నేనూ వాలిపోయాను.

అనంతపురంలో మెయిన్ రోడ్డుపైనే ఉన్న హోటల్లో మా బస. చెప్పానుకదా నాకు చిలిపితనం ఓ పాలెక్కువ అని. దాసు కేశవరావు గంగిగోవు లాంటి జర్నలిష్టు. మేమిద్దరం చాలా ఏళ్ళుగా స్నేహితులం. అంచేత నా గోల ఆయన మౌనంగా భరించేవాడు.
ఇద్దరమూ బయటకు పోయేవాళ్ళం. కాసేపు అటూ ఇటూ తిరిగేవాళ్ళం. మధ్యలో ఓ పబ్లిక్ కాల్ ఆఫీసు నుంచి నేను హోటల్ రిసెప్షన్ కు ఫోను చేసేవాడిని.
‘ రాష్ట్రపతి క్యాంప్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నాము. మీ హోటల్లో, కేశవరావు, శ్రీనివాసరావు, హైదరాబాదు జర్నలిష్టులు వుంటే ఒకసారి కనెక్ట్ చేస్తారా! అర్జంటుగా మాట్లాడాలి’ అనే వాడిని.
హోటల్లో అడుగుపెడుతూ ఉండగానే మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ‘మీకోసం ప్రెసిడెంటు గారి ఆఫీసు వాళ్ళు ఫోన్ చేసారు’ అని చెప్పేవాళ్ళు ఆదుర్దాగా.
‘వాళ్ళు అలానే చేస్తారు. అవసరం వుంటే మళ్ళీ వాళ్ళే చేస్తారు, ఏం పర్వాలేదు’ అనేవాడిని నిర్లక్యంగా.
ఈ ట్రిక్కు బాగా పనిచేసింది. ఆ రోజు నుంచీ హోటల్లో మాకు మర్యాదలు పెరిగాయి. ఉదయం సాయంత్రం కనుక్కునేవారు. రూమ్ సర్వీసు బాగు పడింది.
‘ఇది అవసరమా’ అనేది కేశవరావుగారిలోని గంగిగోవు. ‘అవసరమే’ అనేది నాలోని పోట్లగిత్త.

ఒక రోజు ఇల్లూరు ప్రయాణం కట్టాము. ఎందుకంటే సంజీవరెడ్డి గారు అక్కడికి బయలుదేరారు.
ఇల్లూరులో నీలం వారిల్లు పెళ్లివారిల్లులా హడావిడిగా వుంది. తన ఈడువారిని ఆయన ఆప్యాయంగా ‘ఏమప్పా’ అంటూ పేరుపెట్టి పలకరిస్తున్నారు. చిన్నవారితో ఎప్పటి సంగతులో ముచ్చటిస్తున్నారు. వూరు ఊరంతా అక్కడే వుంది.
సాయంత్రం ఆరవుతోంది. నేను వారింటి నుంచే హైదరాబాదు ఫోన్ చేసి వార్త చెప్పాను. రాష్ట్రపతి మకాం చేస్తున్న సందర్భం కాబట్టి వెంటనే లైను కలిపారు. అది మొదటి వార్తగా వస్తుందని నాకు తెలుసు. వెంటనే సంజీవరెడ్డి గారిని ( రాష్ట్రపతి కార్యదర్శి పేరు కూడా సంజీవరెడ్డే. పీ.ఎల్. సంజీవ రెడ్డి గారు. ఐ.ఏ.ఎస్. అధికారి)ని ఒక రేడియో తెప్పించమన్నాను. ఆయన నావైపు అదోలా చూస్తూ రేడియో తెప్పించారు. దాన్ని అక్కడ ఉన్న మైక్ సెట్టుకు కలిపారు.
వార్తలు మొదలయ్యాయి. అంతా నిశ్శబ్దం. రాష్ట్రపతి స్వగ్రామం వచ్చిన వార్తా విశేషాలతో బులెటిన్ మొదలయింది.
ఈ మారుమూల గ్రామంలో వార్త ,అంత త్వరగా రేడియోలో ఎలా వచ్చిందని జనం ఆశ్చర్యంగా గుసగుసలాడుకున్నారు.
నేను ఇప్పటికీ గర్వపడే మరో విషయం ఏమిటంటే, ఆ నాటి శ్రోతల్లో నీలం సంజీవ రెడ్డి గారు కూడా ఒకరు.
ముందు కొంచెం రుసరుసలాడినట్టు కనిపించిన పీ.ఎల్. సంజీవరెడ్డి గారు కూడా ఖుషీ.
భుజం తట్టారు, మెచ్చుకోలుగా

8, ఏప్రిల్ 2023, శనివారం

తెలుసుకోవాలని వుందా!

 ఎప్పుడో యాభయ్ ఏళ్ళ క్రితం బెజవాడ ఆంధ్రజ్యోతిలో చేరినప్పుడు అప్పుడు ఎడిటర్ బాధ్యతలు నిర్వహిస్తున్న నండూరి రామమోహన రావు గారు, ఆయన దగ్గరే సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్న నన్ను అడిగిన ప్రశ్న ఇది.

జర్నలిస్టుగా రాణించాలి అంటే తెలుసుకోవాలనే జిజ్ఞాస వుండాలన్నది ఆయన ప్రశ్నలోని అంతరార్ధం. రాణించడం సంగతి దేవుడికి ఎరుక. కానీ ఏదైనా తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం నండూరి వారి ఉపదేశం కారణంగా అలవడింది. నా ఫేస్ బుక్ రాతల్లో సింహభాగం అలా ఇతరులు చెప్పగా విని రాసినవే.

ఫేస్ బుక్ మిత్రుడు Ramnath Kampamalla వృత్తి రీత్యా జర్నలిస్టు కాకపోయినా ప్రవృత్తి రీత్యా పాత్రికేయుడే. ఆయనలో నాకు నచ్చింది ఏమిటంటే  తెలుసుకోవాలనే ఆసక్తి. ఏది రాసినా క్షుణ్ణంగా తెలుసుకుని రాయాలనేది రాంనాద్ గారి పట్టుదల. అదే ఆయన్ని కొన్ని పర్యాయాలు మా ఇంటికి రప్పించింది. ఈ రాకపోకలు ఇప్పటివి కావు, మా ఆవిడ వున్న రోజుల నుంచి సాగుతున్నవే. ఆయన వస్తే నాకు ఒక సంతోషం. ఆడపిల్లలు లేరనే కొరత మా దంపతులకు వుంది.వుండేది అనాలేమో! ఆయన ఎప్పుడు వచ్చినా పిల్లల్ని వెంటబెట్టుకు తీసుకువస్తారు. ఇద్దరూ  చక్కని చుక్కలు. రీతూ ప్రియ, రియా దేవకి. ఎలిమెంటరీ స్కూలు అనుకుంటా. వచ్చినప్పుడల్లా మీ పేర్లు ఏమిటమ్మా అని అడుగుతా. ప్రతిసారీ ఈ ప్రశ్న ఏమిటి అంటూ నా మతిమరపును ప్రశ్నించకుండా పాపం  బుద్దిగా మైనేమ్ ఈజ్ రీతూ ప్రియ, మై నేమ్ ఈజ్ రియా దేవకి అని ప్రతిసారీ జవాబు చెబుతారు. వచ్చినప్పుడల్లా మా మనుమరాలి మోచేతి పొడుగంత క్యాడ్ బరీస్ చాక్లెట్లు తెస్తారు. వాళ్ళ నాన్నగారు నాతొ మాట్లాడుతూ వుంటే వాళ్ళిద్దరూ మొదటి ఫ్లోర్ లో ఉన్న వాళ్ళ స్కూల్ మేట్ ఇంటికి వెళ్లివస్తారు. ఈలోగా దేశ కాలమాన పరిస్థితుల గురించి మా చర్చలు సాగుతాయి. ఆయనకు తెలుసుకోవాలనే కోరికా, ఎవరైనా ఏదైనా అడిగితే తెలిసింది చెప్పాలనే నా ఆతృత మా  సంభాషణకు ఉపకరిస్తాయి. ఆయన పుణ్యమా అని పాత సంగతులు నెమరు వేసుకోవడం వల్ల తగ్గిపోతున్న నాజ్ఞాపక శక్తి కాసింత మెరుగుపడే అవకాశం వుండడం వల్ల, రామనాద్ రాక నాకే బాగా ఉపయోగం అని చెప్పాలి.

అయితే ఆయన్ని చూసినప్పుడల్లా నాలో కలిగే అసూయ ఇంతా అంతా కాదు. ఇంత మంచి తండ్రిని నేను ఎందుకు కాలేక పోయాననే  బాధ నన్ను వేధిస్తూ వుంటుంది. నా పిల్లలు చిన్నప్పుడు ఏమి అడిగినా నా నుంచి సానుకూల స్పందన వుండేది కాదు. ఎంతసేపూ నా ఫ్రెండ్సూ, వాళ్ళతో కాలక్షేపాలు. ఒక సినిమాకు తీసుకు వెళ్ళడం, ఒక హోటల్ కు తీసుకువెళ్లి వాళ్ళు కోరిన టిఫిన్స్ పెట్టించడం నాకయితే గుర్తు లేదు. రాంనాద్ అలా కాదు. సెలవు దొరకడం తడవు పిల్లల్ని వెంటబెట్టుకుని శిల్పారామాలు, సినిమాలు, హోటళ్ళు ఒకటేమిటి వాళ్ళు తితగని ప్రదేశాలు లేవు. అవన్నీ చెబుతుంటే మా పిల్లలు పెరిగిన తీరు గుర్తుకువచ్చి  మనసులో ఎక్కడో  ముల్లు గుచ్చుకున్న ఫీలింగు.

నేనో బాడ్ ఫాదర్. సందేహం లేదు.  అందుకే రాంనాద్ ని చూస్తే అంత అసూయ.

కింది ఫోటో: ఈ సాయంత్రం వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు తీసిన ఫోటో. Courtesy: Ramnath Kampamalla



(08-04-2023)       

 

 

5, ఏప్రిల్ 2023, బుధవారం

పొగరు కదా దిగాల్సింది

 2017 లో తిరుపతి వెళ్ళినప్పటి ముచ్చట

“అమ్మయ్య! తల బరువు దిగింది”
నాకు నా ఊరడింపు.
“అది సరే! మరి తల పొగరు. దాని సంగతేమిటి?”
ఇల్లాలి ముక్తాయింపు.



4, ఏప్రిల్ 2023, మంగళవారం

మాయ తివాచి – భండారు శ్రీనివాసరావు

(Published in Andhra Prabha on 02-04-2023, SUNDAY)

 

ఈనాటి లోకం యావత్తు కార్పొరేట్ ప్రపంచం చుట్టూ పరిభ్రమిస్తోంది. లోకం పోకడలూ, విలువలు అన్నీ కార్పొరేట్ ప్రపంచానికి అనుగుణంగానే మారిపోతున్నాయి.

ఎదగడానికెందుకురా తొందరా!’ అనే పాటలకు ఈనాటి కార్పొరేట్  ప్రపంచంలో స్తానం లేదు. ఎదుగుదలకు అవకాశం లేని విలువలకు కూడా అందులో చోటు లేదు. ఎంత త్వరగా ఎదగాలన్నదే కార్పొరేట్ సంస్థల ధ్యేయం. అదే బాట వాటిల్లో పనిచేసే బుద్ధి జీవులది కూడా. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదు కదా!

జీవితంలో చకచకా ఎదగడం ఎలా అనే అంశంపై అనేక భాషల్లో అనేక పుస్తకాలు వచ్చాయి. కొందరు కార్పొరేట్ గురువులు ఇదే అంశాన్ని తీసుకుని ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కూడా.

వాళ్ళందరూ చెప్పే బోధనల సారాంశాన్ని క్రోడీకరిస్తే ఇలా వుంటుంది.

విజయం అంటే మాటలు కాదు. చేతలతో కూడిన వ్యవహారం. గెలుపే ధ్యేయంగా పనిచేసేవాడు తనని తాను పెంచుకుని,  భూతద్దంలో దాన్ని మరింత  పెద్దది చేసి చూపుకోగల సామర్ధ్యం కలిగివుండాలి. పనిచేసే సంస్థలోనే కాకుండా బయట కూడా అతగాడి గురించి నలుగురికీ తెలిసి ఉండేలా ప్రచారం చేసుకోగలగాలి. అయితే సొంత డబ్బా కొట్టుకుంటున్నట్టు పైకి తెలియకూడదు. ఆ ప్రచారం చాలా సుతారంగా సాగాలి.. ఇదంత సులభమేమీ కాదు. దీనికి ఎన్నో తెలివితేటలు కావాలి. పెద్ద పెద్ద కంపెనీలే తమ గురించి తాము ప్రచారం చేసుకుంటూ వుండడం మనం చూస్తున్నాం. అలాటప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో జీవిస్తున్న వాళ్ళు కూడా ఈ స్వీయ ప్రచార కార్యక్రమానికి సిద్ధపడే వుండాలి. పువ్వుమీద వాలిన భ్రమరం, పువ్వుకు కూడా తెలియనంత సుకుమారంగా మధువును గ్రోలినట్టు ఈ ఆత్మస్తుతి, పరనింద తంతును అత్యంత నైపుణ్యంతో నిర్వర్తించగలగాలి.



నిన్ను గురించి నువ్వు ఎప్పడూ చెప్పుకోకు. నిజం చెప్పుకుంటే నమ్మేవారెవరూ వుండరు. నీ గురించి అబద్ధాలు చెప్పుకుంటే మాత్రం ఇంకా ఎంతో వుంది, కావాలనే తగ్గించి చెప్పుకుంటున్నారని అనుకుంటారు”.

అయితే ఇది పాతకాలం మాట. కార్పొరేట్ కాలంలో ఇది ఎంతమాత్రం చెల్లుబడి కాదు. ఎందుకంటే, ఇతరుల గురించి నాలుగు మంచి మాటలు చెప్పే మంచితనం కలికానికి కూడా దొరికే కాలం కాదిది. ఫక్తు కలికాలం.  అందుకని ఈ రోజుల్లో  మనకి మనమే పీ.ఆర్.వో. లం అన్నమాట. మన గురించి మనమే ప్రచారం చేసుకోవాలి. అవతల మనిషి నమ్మడం లేదని నమ్మకంగా తెలిసినా సరే, మన గురించి మనమే చెప్పుకుని తీరాల్సిన రోజులివి. ఎదుటివాడు నమ్మినా నమ్మకపోయినా, మన అదృష్టం బాగుంటే ఎదుటివాడి పక్కవాడయినా మన మాటలు నమ్మే ఛాన్స్ వుంటుంది.అది చాలు, ఓ మెట్టు ఎగబాకడానికి”


మిమ్మల్ని మీరే ఒక ఉత్పాదక వస్తువుగా ఊహించుకోండి. మిమ్మల్ని మీరే మార్కెట్ చేసుకోండి. మీరు పనిచేస్తున్న సంస్థలో గానీ, లేదా పనిచేయడానికి అవకాశంవున్న మరో సంస్థలో గానీ నిర్ణయాత్మక పాత్ర పోషించే అధికారులకు మీ గురించి తెలిసే విధంగా ప్రయత్నాలు చేయండి. ఈ విషయంలో వెనుకబడేవాళ్ళు వెనుకనే వుండిపోతారు. ఈ సూత్రం హమేషా గుర్తుంచుకున్నవాళ్ళే ముందుకు పోగలుగుతారు. ఆ ఉన్నతాధికారులు తమ సంస్థలో ఏదయినా ముఖ్యమయిన ఉద్యోగాన్ని భర్తీ చేసే సమయంలో తటాలున మీరు గుర్తుకొచ్చే రీతిలో మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవాలి. లేని పక్షంలో మీరు ఎంత ప్రతిభావంతులన్నది లెక్కలోకి రాదు. వున్న చోటనే వుండిపోతారు. ఈ రకమయిన తెలివితేటలున్నవాళ్ళు మాత్రం సులువుగా మిమ్మల్ని దాటి, నిచ్చెనలెక్కి కెరీర్ లో ఉన్నత స్తానాలకు ఎదిగిపోతారు.  ఇప్పుడున్న కార్పొరేట్ సూత్రాల ప్రకారం ఇవన్నీ నీతిబాహ్యమయిన చర్యలు కాదు. ఒకరకంగా చెప్పాలంటే వీటికి అందరి ఆమోదం వుంది. కాలమాన పరిస్తితులకు అనుగుణంగా మారడం ఈ నాటి నీతి. మారకపోతే, కెరీర్ లో కూడా మార్పు వుండదు. ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు.

మీ గురించి మీరే తెలియచేప్పుకోవడానికి కొన్ని పద్ధతులు వున్నాయి.


మీరు పనిచేసే సంస్థకు అవసరమయ్యే రెండు మూడు ప్రధానమయిన విషయాలను ముందు బాగా ఆకళింపు చేసుకోవాలి. వాటిని గురించి లోతుగా అధ్యయనం చేయాలి. వీలుచిక్కిన ప్రతి సందర్భంలో ఏమాత్రం సంకోచించకుండా వాటిని గురించి మాట్లాడుతుండాలి. సందర్భం, అసందర్భం అని ఆలోచించ కూడదు. వాక్చాతుర్యంతో అందర్నీ కట్టిపడేయాలి. మనం చెబుతున్నదానిని అంతా నమ్ముతున్నారా లేదా అన్న సంశయం పెట్టుకోకూడదు. ధారాళంగా ఒక విషయం గురించి చెప్పగలిగినప్పుడు ఆ మాటల ప్రభావం శ్రోతలపై కొంతకాలం వుంటుంది. విడిపోయిన తరువాత కూడా కొంతమంది వాటిని గురించే మాట్లాడుకుంటారు. మన గురించి వారి అవగాహన కొంత సానుకూలంగా మారడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే మన పట్ల చులకనభావం వున్న వాళ్ళు కూడా పరోక్షంలో మన గురించి మాట్లాడేటప్పుడు వొళ్ళు దగ్గర పెట్టుకోవాల్సివుంటుంది.

అలాగే, సీనియర్ మేనేజ్ మెంట్ వ్యక్తులతో సంభాషించే అవకాశం వచ్చినప్పుడు మీరు ఈ చిట్కాను మరింత ప్రతిభావంతంగా ఉపయోగించుకోవాలి. ఉన్నతాధికారులు తలపెట్టే ప్రాజెక్ట్ లలో స్వచ్చందంగా పాలు పంచుకోవాలి. మీ పనిలో ఎంత చిన్న విజయం సాధించినా మొహమాటపడకుండా ఆ విషయం మొత్తం ప్రపంచానికి చాటిచెప్పుకోవాలి. ఇవన్నీ మీ వ్యక్తిత్వ శోభను మరింత పెంచుతాయి. మీ చుట్టూవున్న వారు మీ పట్ల ఆరాధనాభావం పెంచుకోవడానికి తోడ్పడతాయి.

కెరీర్ గురించి అంతా మరచిపోయిన మాట ఒకటుంది. ‘జీవితంలో సరయిన సమయంలో సరయిన స్తానాన్నిఅందుకోగలగడాన్ని లోగడ కెరీర్ కు అర్ధం గా చెప్పుకునే వారు.


“ఈ నాడు దీని అర్ధం పూర్తిగా మారిపోయింది. ‘సరయిన స్థానం ఏదో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. దాన్ని సంపాదించుకునే పద్ధతులను స్వయంగా నిర్ణయించుకోవాలి. అందుకు అవసరమయ్యే అవకాశాలను కూడా సొంతంగా సృష్టించుకోవాలి. అంతే కానీ సరైన తరుణం అంటూ వృధాగా ఎదురు చూస్తూ ఉన్న విలువైన సమయాన్ని వృధా చేసుకోరాదు.

“ఇప్పటికే మీరు ఇవన్నీ చేసివుంటే, మీరు నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువలో వున్నట్టే లెక్క.

“మాయ తివాచీ మీ చేతికి దొరికినట్టే. దాని మీద కూర్చోవడమే తరువాయి, అదే మిమ్మల్ని మీరు కోరుకున్న శిఖరాలకు చేరుస్తుంది.”

త్వరత్వరగా మెట్లెక్కి ఉన్నత స్థానానికి చేరుకోవాలని తాపత్రయ పడే వారికోసం కార్పొరేట్ గురువులు  ప్రవచించిన ఈ చిట్కాలను ఇప్పుడు రాజకీయ రంగంలోని వారు కూడా ఆశ్రయిస్తున్నారు. తమని గురించి తామే చెప్పుకునే స్వోత్కర్ష,  ప్రస్తుతం వారి ప్రచార అస్త్రాలలో చేరిపోయింది.

చట్టబద్ధం కాని హెచ్చరిక: ఈ రకం కార్పొరేట్ గురువులు చెప్పే చిట్కాలన్నీ  నూటికి నూరుపాళ్లు ఫలితాలు ఇస్తాయని నూటికి నూరు శాతం గేరంటీ లేదు.




(02-04-2023)

 

29, మార్చి 2023, బుధవారం

నాలుగు పదులు దాటిన తెలుగుదేశం – భండారు శ్రీనివాసరావు

 


(మార్చి 29 టీడీపీ ఆవిర్భావ దినోత్సవం)

 

ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి 1982 చాలా ముఖ్యమైన సంవత్సరం. తదనంతర కాలంలో రాష్ట్రం రూపురేఖలు పూర్తిగా మారిపోయే రాజకీయ పరిణామాలకు పునాది పడింది కూడా ఆ ఏడాదిలోనే. 1956 లో ఏర్పడ్డ మొట్టమొదటి భాషాప్రయుక్త  రాష్ట్రాన్ని అప్పటివరకు జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా సాగించిన పాలనకు, తెలుగుదేశం పార్టీ పేరుతొ కొత్తగా ఒక ప్రాంతీయ పార్టీ పెట్టిన నందమూరి తారకరామారావు, చరమ గీతం పాడింది కూడా అదే ఏడాది.

వరసగా ముగ్గురు ముఖ్యమంత్రులను మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే కాంగ్రెస్ అధిష్టానం మార్చడం, ముఖ్యమంత్రి హోదాలో వున్న అంజయ్యను, ఇందిరాగాంధి కుమారుడు రాజీవ్ గాంధి బహిరంగంగా అవమానించడం, ఏళ్ళ తరబడి సాగిన కాంగ్రెస్ పాలనలో అవినీతి, బంధుప్రీతి విచ్చలవిడిగా పెరిగిపోయి, సరైన ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్న సమయంలో ఏర్పడ్డ రాజకీయ శూన్యత,  ఇలాటివన్నీ కొత్తగా రాజకీయ పార్టీ స్థాపించి, సినీ గ్లామరుతో రంగప్రవేశం చేసిన రామారావుకు బాగా కలిసి వచ్చాయి.

 

తెలుగు దేశం పార్టీ పుట్టేనాటికి నాకు ముప్పయ్ ఆరేళ్ళు. ఆ పార్టీలో నాడు కొత్తగా చేరినవాళ్ళలో చాలామంది వయసులో నాకంటే చాలా చాలా చిన్నవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ వయసు కూడా అరవై దాటి వుంటుంది.

ఆ పార్టీ ఆవిర్భావం నాటికి నేను రేడియో విలేకరిగా పనిచేస్తున్నాను. 1982 మార్చి 21 వ తేదీన   రామకృష్ణా సినీ స్టూడియోకి  విలేకరులను పిలిచి,  తాను త్వరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు ఎన్టీ రామారావు ప్రకటించారు. పార్టీ స్వరూప స్వభావాలను గురించి గుచ్చిగుచ్చి ప్రశ్నించినా, వాటికి ఆయన నుంచి జవాబు లేదు. ఊహాజనితమైన వేటికీ సమాధానం చెప్పనని చెప్పేశారు.

అయితే చెప్పే ముహూర్తం త్వరలోనే వచ్చింది. మళ్ళీ విలేకరులకు పిలుపువచ్చింది. ఈసారి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మార్చి 29కలుసుకున్నారు. పెట్టబోయే పార్టీ పేరు “తెలుగుదేశం పార్టీ” అనగానే అందరూ విస్తుపోయారు. ఒక పార్టీకి, అందులోనా ఒక ప్రాంతీయ పార్టీకి దేశం అనే పదం జోడించడం ఏమిటని అనుకున్నారు.

ఇక అక్కడనుంచి ఆయన కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కాదు.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆ పార్టీ ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టిందన్నారు. ఒక తాసీలు ఆఫీసులో గుమాస్తాను బదిలీ చేయాలన్నా ఢిల్లీ అనుమతి కోసం ఎదురుచూపులు చూసే పార్టీ, తెలుగు ప్రజలకు ఏం ఒరగబెడుతుందని ప్రశ్నించారు. ఇప్పటి కాంగ్రెస్ మహాత్మా గాంధీ కాలం నాటి కాంగ్రెస్ యెంత మాత్రం కాదన్నారు. ఇంగ్లీష్ లో ఎన్ని అక్షరాలు వున్నాయో కాంగ్రెస్ అన్ని రకాలుగా చీలిపోయిందని ఎద్దేవా చేసారు.

పార్టీ ప్రచారం కూడా వినూత్న పద్దతిలో సాగింది. ముందు హెలికాప్టర్ పై రాష్ట్రాన్ని చుట్టి రావాలని అనుకున్నారు. కానీ కేంద్రంలోని ప్రభుత్వం హెలికాప్టర్ కు అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ పైనే నెపం వేసారు. పర్యటనల కోసం తమ ఇంట్లో ఓ గరాజులో మూలపడివున్న, ఎప్పుడో ముచ్చట పడి కొనుక్కున్న నల్ల రంగు వ్యాన్ ని బయటకు తీసి కొత్త నగిషీలు చెక్కారు. వ్యాను పైకెక్కి మైకులో ఉపన్యసించడానికి వీలుగా ఏర్పాట్లు చేసారు. ఎన్టీఆర్ భోజనం, పడక అంతా అందులోనే. ఉదయం పూట రోడ్డుపక్కనే స్నానాలు. అంతవరకూ ఇలాటి ప్రచారం ఎరుగని వారికి ఇదంతా వింతగా అనిపించింది. అది ఒక ఆకర్షణగా మారింది.

ఎన్టీఆర్ చైతన్య రధం ఒక గ్రామం చేరే లోగా మరో జీపు ముందుగానే అక్కడికి చేరుకునేది. వేములపల్లి శ్రీ కృష్ణ రాసిన ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా’ అనే పాట, శంకరంబాడి సుందరాచారి రచించిన ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ అనే పాటలను మైకుల్లో వినిపించేవాళ్ళు. వస్తున్నది రామారావు వంటి సుప్రసిద్ధ నటుడు. వేస్తున్నది ఉర్రూతలూగించే ఈ పాటలు. జనాలు విరగబడేవాళ్ళు. వాళ్ళను చూడగానే ఎన్టీఆర్ ప్రసంగం మరింత వేడెక్కేది. ఇక ఈలలూ, చప్పట్లతో ఆ ప్రాంతం మారుమోగిపోయేది.

ఒక్క పత్రిక తప్ప మిగిలిన తెలుగు దినపత్రికలన్నీ అప్పుడు కాస్తో కూస్తో కాంగ్రెస్ అనుకూల వార్తలు రాసేవి. రామారావు సాగిస్తున్న ఈ ప్రచారాన్ని చూసి కాంగ్రెస్ నాయకులు ‘డ్రామారావు’ అని అపహాస్యంగా మాట్లాడేవాళ్ళు. కాంగ్రెస్ నాయకుడు జీ. వెంకటస్వామి ‘అది తెలుగు దేశం కాదు, కమ్మ దేశం’ అంటూ నేరుగా ఆ పార్టీకి కులాన్ని ఆపాదిస్తూ ప్రకటన చేసారు. అప్పుడు కాంగ్రెస్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుని విలేకరులం కలిసి ‘ మీ మామగారి పార్టీలో చేరతారా అని అడిగితే, ‘కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఎన్టీఆర్ పైనే పోటీ చేస్తా’ అని బదులిచ్చారు. ఆ సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో, మరునాడు పత్రికల్లో ‘మామగారిపై పోటీకి రెడీ అంటున్న చంద్రబాబు’ అంటూ ప్రముఖంగా వార్తలు వచ్చాయి.

ప్రచారం ఉధృతం అవుతున్న కొద్దీ కాంగ్రెస్ నాయకులకు తత్వం బోధపడింది. అపజయం తప్పదేమో అనే సందేహం పట్టుకుంది. దీనికి తొలి సూచన నంద్యాలలో జరిగిన ఇందిరాగాంధీ ఎన్నికల ప్రచారంలో కనబడింది. ఆ సభలో మాట్లాడుతూ అప్పటి కాంగ్రెస్ అభ్యర్ధి బొజ్జా వెంకట రెడ్డి, ‘బడుగు బలహీన వర్గాలను కాపుకాసే కాంగ్రెస్ కు ఓటు వేస్తారా, సినిమా వేషాలతో జిమ్మిక్కులు చేసే తెలుగు దేశం పార్టీకి ఓటేస్తారా’ అని అడిగితే, సభకు వచ్చిన వాళ్ళలో చాలామంది మా ఓటు ఎన్టీఆర్ కే అని చెప్పడంతో కాంగ్రెస్ శ్రేణులు నీరసపడిపోయాయి. తిరుపతి ఎన్నికల సభల నాటికి విషయం  ధ్రువ పడింది.

ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వెలువడుతున్నాయి. షాద్ నగర్ నుంచి మొదటి ఫలితం అధికారికంగా వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ పి. శంకరరావు గెలుపొందారు. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. అందువల్ల మిగిలిన అన్నిచోట్లకంటే అక్కడ ఫలితం చాలా ముందుగా వెలువడింది. షాద్ నగర్ నుంచి నేను పంపిన వార్త మధ్యాన్నం, సాయంత్రం వార్తల్లోనూ, ఢిల్లీ నుంచి ప్రసారం అయ్యే ఆరుగంటల ఇంగ్లీష్ వార్తల్లోనూ ప్రముఖంగా వచ్చింది. తరువాత చాలా సేపటి వరకు ఎటువంటి సమాచారం ఎక్కడి నుంచి లేదు. టీడీపీ అభ్యర్ధులు చాలా చోట్ల ఆధిక్యతలో వున్నట్టు అనధికారికంగా తెలుస్తున్నా, అప్పటి నిబంధనలు అనుసరించి ప్రసారం చేయడం సాధ్యపడలేదు. కావాలనే రేడియోలో వార్తలు తొక్కిపడుతున్నారని ఆ పార్టీ అభిమానుల్లో సందేహాలు కలిగాయి. కొందరు రేడియో స్టేషన్ దగ్గర ఆందోళనకు దిగారు కూడా. విషయం వివరించి చెప్పడంతో శాంతించారు.

అదే రాత్రి ఫలితాలు చాలావరకు తెలిసిపోయాయి. ప్రభుత్వం స్థాపించడానికి అవసరం అయ్యే మెజారిటీ టీడీపీకి అప్పటికే లభించింది. ఎన్టీఆర్ ని కలిసి ఆయన స్పందన రికార్డు చేయడానికి స్కూటరు మీద ఆబిడ్స్ నివాసానికి వెళ్లాను. వాకబు చేస్తే ఆయన అప్పటికే నిద్రకు ఉపక్రమించారని తెలిసింది.

దటీజ్ ఎన్టీఆర్.

రాష్ట్రమంతా సంబరాలు జరుగుతుంటే ఆయన మాత్రం ఆయన అలవాటు ప్రకారం వేళకు నిద్రపోయారు.

మరునాడు అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి విజయభాస్కర రెడ్డి రాజీనామా చేశారు. ఆయన స్పందన విచిత్రం అనిపించింది.

కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ తుడిచిపెట్టుకునిపోదు. చూస్తుండండి, మళ్ళీ అధికారంలోకి వస్తుంది”

అప్పుడు భేషజం అనిపించిన ఆయన మాటలు ఆరేళ్ళ తరువాత నిజమయ్యాయి. 1989 లో కాంగ్రెస్ పార్టీ, టీడీపీని ఓడించి మళ్ళీ అధికార పగ్గాలు చేపట్టింది. తిరిగి అయిదేళ్ళలోనే అధికారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీది  కుటుంబ పాలన అంటూ దుమ్మెత్తి పోసిందో అదే దిక్కుగా పయనించడం రాజకీయ చమత్కారం.

టీడీపి సంస్థాపక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి  ఎన్టీఆర్ తాను  జీవించి వుండగా, రెండు ఆగస్టు సంక్షోభాలను ఎదుర్కున్నారు. రెండు సందర్భాలలోను  ఆయన  ముఖ్యమంత్రి పదవి కోల్పోయారు. దానికి కారణం స్వంత పార్టీ మనుషులే. మొదటిసారి నాదెండ్ల ఎపిసోడ్ లో ఎన్టీఆర్ సాగించిన ఉద్యమాన్ని ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంగా అభివర్ణించిన పత్రికలు,, అదే పద్దతిలో పురుడు పోసుకున్న రెండో ఆగస్టు సంక్షోభాన్ని మాత్రం దుష్ట శక్తుల నుంచి టీడీపీని కాపాడే ఉద్యమంగా కితాబు ఇవ్వడం మారిన రాజకీయాలకు, మీడియా విలువలకు అద్దం పట్టింది.   

రాష్ట్ర విభజన తర్వాత  నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని  అయిదేళ్లు పాలించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, మరో ప్రాంతీయ పార్టీ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ చేతిలో ఘోర పరాజయానికి గురై, ఇటీవలికాలంలో సాధించిన విజయాలతో ఇప్పుడిప్పుడే  తేరుకుంటోంది. పార్టీకి పునర్‌వైభవం సిద్ధిస్తుందా లేదా అనే సంగతి రానున్న ఏడాదిలో తేలిపోతుంది.

(29-03-2023)

 

26, మార్చి 2023, ఆదివారం

ఉరిశిక్షకు ప్రత్యామ్నాయం లేదా? – భండారు శ్రీనివాసరావు

  

(Published in Andhra Prabha today, 26-03-2023, SUNDAY)


ఈ ప్రశ్న వేసింది సామాన్యులు కాదు, ఏకంగా  దేశ సర్వోన్నత న్యాయ స్థానం అయిన  సుప్రీం కోర్టు ధర్మాసనం. 

గత  మంగళవారం వారం అంటే మార్చి 21 న ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పీ.ఎస్. నరసింహంలతో కూడిన ధర్మాసనం ఉరిశిక్షకు ప్రత్యామ్నాయం గురించి పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

మరణ శిక్ష పడిన దోషులకు నొప్పి తెలియకుండా చనిపోయే అవకాశం కల్పించాలని అర్థిస్తూ దాఖలైన పిల్ దీనికి ప్రాతిపదిక.

దీనిపై స్పందిస్తూ మెడకు ఉరితాడు బిగించి చంపేసే క్రూరమైన పద్దతి కాకుండా తక్కువ నొప్పితో మరణ దండన అమలుచేసే ఇతర విధానాలపై వివరాలను సేకరించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

దీనికి ఓ నేపధ్యం వుంది. 

చాలా సంవత్సరాల క్రితం మరణ శిక్షను రద్దు చేయాలనే ప్రతిపాదన గురించి లా కమిషన్ సుదీర్ఘ కాలం అధ్యయనం చేసి ఒక నివేదిక సమర్పించింది.

ఉరిశిక్ష స్థానంలో, తుపాకీతో కాల్చడం, విషపు ఇంజెక్షన్ ఇవ్వడం, ఎలక్ట్రిక్ కుర్చీలో కూర్చోబెట్టి విద్యుత్ఘాతం లేదా గ్యాస్ ఛాంబర్ లో వుంచి ప్రాణం తీయడం వంటి ప్రత్యామ్నాయ శిక్షలను ఆ నివేదికలో పొందుపరిచారు. అనేక ఇతర దేశాల్లో ఉరి వేసి చంపే పద్దతికి క్రమంగా స్వస్తి చెబుతున్న విషయాన్ని లా కమిషన్ గుర్తు చేసింది.   

స్పందించిన ధర్మాసనం ఈ అంశాలతో ఏకీభవించలేదు. తక్కువ నొప్పి అనేది ఇక్కడ ప్రశ్నే కాదని అంటూ, సైన్స్ ఏం చెబుతోంది అన్నదే ప్రధానం అని పేర్కొన్నది. విషపు ఇంజెక్షన్ ఇవ్వడం, తుపాకీతో కాల్చడం కూడా క్రూరమైన చర్యే అని చీఫ్ జస్టిస్ చంద్ర చూడ్ అభిప్రాయపడ్డారు. మరణ దండన ఏ పద్దతిలో అమలు చేయాలనేది తాము ప్రభుత్వానికి చెప్పలేమని అన్నారు. ఉరివేసి చంపడం వల్ల కలిగే ప్రభావాలపై ఏదైనా శాస్త్రీయ అధ్యయనం వుంటే దాన్ని తీసుకు రావాలని అటార్నీ జనరల్ ను ఆదేశించారు.  ఈ విషయంలో నిపుణుల కమిటీ ఏర్పాటును పరిశీలిస్తామని విచారణను వాయిదా వేశారు.

మరణ దండనలను ఏ రూపంలో విధించినా వాటిని అమలు చేయడం మానవ హక్కులను ఉల్లంఘించడమే అని, మరణ శిక్షలను రద్దు చేయాలని ఒక వర్గం నుంచి ఒత్తిడి చాలాకాలంగా వుంది. దీనిపై అనేక వ్యాసాలే కాదు, నవలలు, సినిమాలు కూడా వచ్చాయి.   

ప్రాణం తీయడం ఎంత పాపమో, ప్రాణం తీసుకోవడం కూడా మహాపాపం అనే భావం సాధారణ ప్రజల్లో వుంది. ఆత్మహత్య మహాపాతకం అని శాస్త్రాలు చెబుతాయి.  ఆత్మహత్యకు ప్రయత్నించడం శిక్షార్హమైన నేరంగా చట్టం కూడా  పేర్కొంటోంది. ఈ నేపధ్యంలో ఉరిశిక్షవిధించే విధానానికి స్వస్తి చెప్పాలని కేంద్ర లా కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఉగ్రవాద సంబంధమైన కేసులు మినహా మిగిలిన సందర్భాల్లో మరణ శిక్షను వెంటనే రద్దు చేయాలని కమిషన్ కోరింది. అత్యంత అరుదయిన కేసుల్లోను ఉరిశిక్ష రద్దు చేయాలన్నది కమిషన్ అభిప్రాయం. ఉరిశిక్ష అనేది రాజ్యాంగపరంగా చూసినప్పుడు నిలబడదని స్పష్టం చేసింది. 

సరే! ఇది కేవలం సిఫారసు మాత్రమే  కాబట్టి ఇది చట్ట రూపం దాల్చి, మరణ దండనకు నూకలు చెల్లడానికి మరి కొంత కాలం పట్టే అవకాశం వుంది. ఈ సిఫారసులపై ప్రజాప్రయోజన వ్యాజ్యాల కారణంగా మరింత ఆలస్యం అయినా  ఆశ్చర్యం లేదు.

ఈ సందర్భంలో గతాన్ని నెమరు వేసుకోవడం అవసరమే.

ఎనిమిదేళ్ల క్రితం అనుకుంటాను ఇదే అత్యున్నత న్యాయస్థానం మరో కేసులో ఒక సంచలన నిర్ణయం వెలువరించింది. తమ మతాచారం ప్రకారం ప్రాయోపవేశ దీక్ష స్వీకరించి ఎటువంటి ఆహారం తీసుకోకుండా మరణం కోసం నిరీక్షించే పద్దతి, ఖచ్చితంగా ఆత్మహత్య కిందికే వస్తుందని రాజస్థాన్ హైకోర్టు నిర్ధారించడాన్ని సవాలు చేస్తూ, కొందరు జైనమత విశ్వాసులు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. హైకోర్టు తీర్పు తమ మత విశ్వాసుల ప్రాధమిక హక్కులను ఉల్లంఘించేదిగా వుందని, రాజ్యాంగంలో పొందుపరచిన లౌకిక సూత్రాలకు విరుద్ధంగా వుందని పిటీషనర్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వాదనలు విని, రాజస్థాన్ హైకోర్టు తీర్పు అమలు కాకుండా నిలుపు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.  

ఉరిశిక్ష పడ్డ నేరస్తులు కూడా ఏదో ఒకవిధంగా ఆ శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అలాటిది జైన మతస్తులు తమ మతాచారం ప్రకారం స్వచ్చంద మరణం కోరుకోవడమే కాకుండా దాన్ని ఒక హక్కుగా భావించడం ఆ మతం గురించి అవగాహన లేనివారికి కొంత విడ్డూరంగానే అనిపిస్తుంది. జైనుల జీవన విధానంలో అహింసను పరమధర్మంగా భావిస్తారు. ఉపవాస దీక్ష ద్వారా మరణం పొందడం జైన మతంలో ఒక సాంప్రదాయం. దాన్ని ‘సంథారా’ అంటారు. రాజస్థాన్ హైకోర్టు ఈ సాంప్రదాయాన్ని నేరపూరిత చర్యగా పరిగణించడం సరికాదన్న అభిప్రాయాన్ని సుప్రీం ధర్మాసనం వ్యక్తం చేసింది. హైకోర్టు ఈ నిర్ధారణకు వచ్చేముందు జైన మత గురువులు, మత పెద్దల అభిప్రాయం తీసుకుని వుండాల్సిందని పేర్కొన్నది. ఒక మతాచారం కనుక సర్వోన్నత న్యాయ స్థానం ఈ విషయంలో ఇటువంటి నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. ఒక పక్క లా కమిషన్ మరణశిక్షను రద్దు చేయాలని సిఫారసు చేస్తే మరోపక్క స్వచ్చంద మరణాలకు మతాచారం ప్రాతిపదికగా సుప్రీం పచ్చ జెండా ఊపడం ఒకే రోజున జరగడం కాకతాళీయం కావచ్చు. 

ఈ స్వచ్చంద మరణాలు మనకు భీష్ముడి కాలంనుంచి ఎరుకే. పూర్వం యుద్ధాల్లో రాజపుత్ర సంతతికి చెందిన రాజులు వీరమరణం చెందినప్పుడు, రాణీవాసపు స్త్రీలు పరాయి మూకల చెరలో చిక్కకుండా చితి పేర్పించుకుని ఆత్మాహుతి చేసుకున్న సందర్భాలు చరిత్ర పుటల్లో కానవస్తాయి. ఆత్మగౌరవం నిలుపుకోవడం కోసం ప్రాణ త్యాగాలు చేసిన సంఘటనలు రోమన్ చరిత్రలో కూడా వున్నాయి. యుద్ధంలో మరణం అనివార్యం అని భావించినప్పుడు రోమన్ సైనికులు తమకు తాముగా ప్రాణాలు తీసుకునే వాళ్ళు. 

జపాన్ లో ఓ సాంప్రదాయం వుండేది. దాన్ని ‘హరకిరి’ అంటారు. ‘హరాకిరీ’ అనేవాళ్ళు కూడా వున్నారు. సమాజంలో కులీన కుటుంబాలకు చెందిన వాళ్ళు రాజాగ్రహానికి గురై, మరణశిక్ష పడ్డప్పుడు, ఆ అవమాన భారం భరించ లేక, తమకు తామే ఈ శిక్ష విధించుకుని ప్రాణాలు తీసుకునేవారు. జపానీయుల భాషలో ’హర’ అంటే ‘పొట్ట’. ‘కిరి’ అంటే కోసుకోవడం. పేగులు చీల్చుకునేలా పొట్టను కోసుకుని ఆత్మహత్య చేసుకోవడాన్ని ‘హర కిరి’ అంటారు. కాలక్రమంలో ఈ పదాలకు అర్ధం మారిపోయింది. ఆత్మహననాలకు, ఆత్మహత్యలకు ఇప్పుడిది పర్యాయపదం అయింది.

విదేశాల్లో కొన్ని క్రైస్తవ మఠాలకు సంబంధించిన సన్యాసులు నేల మాళిగల్లో వుండిపోయి సమాధి స్తితికి చేరుకునేవారు. 

ఈ రకంగా ప్రాణాలు తీసుకోవడం అనేది మన దేశంలో పూర్వం నుంచి మహా పాపంగా పురాణాలు, ఇతిహాసాలు పేర్కొంటున్నాయి. అకాల మరణం లేని దీర్ఘాయువు కోరుకోవడం ‘చమకం’ లో వుంది. ‘జీవంతు శరదాం శతం’ అంటే వందేళ్ళు బతకాలని కోరుకునే వారు. ఆశీర్వచనాల్లో కూడా ‘ ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధిరస్తు’ అంటూ ఆయువుకే మొదటి పీట. 

బలవంతంగా ప్రాణం తీసుకున్న సంఘటనలు విన్నప్పుడు మనస్సు చివుక్కు మంటుంది. ప్రాణం ఉన్నంతవరకు జీవించాలి కాని, ప్రాణం తీసుకుని ఉసురు తీసుకోవడం ఏరకంగా చూసినా సమర్ధనీయం కాదనిపిస్తుంది. 

నిజానికి ప్రాణత్యాగం అనేది మామూలు విషయం కాదు. అందుకే శత్రువులనుచి రహస్యాలు రాబట్టేవారు అంతిమంగా ‘ప్రాణాలు దక్కవంటూ’ హెచ్చరించడం అనేక సినిమాల్లో సాధారణం. 

లక్ష్యం యెంత ఉన్నతమైనదైనా దాన్ని సాధించి తీరడానికి బతికి వుండాలి కాని, ఆ క్రమంలో నిండు ప్రాణాలు తీసుకోవడం వల్ల ఆ లక్ష్య సాధనను కళ్ళారా చూసే మహత్తర అవకాశాన్ని చేజేతులా కోల్పోతారు. 

కాబట్టి ఆత్మహత్య అనేది తుట్టతుది మార్గం కూడా కాదు. అసలది మార్గమే కాదు.

తోకటపా: ఎల్లాగు ఇందులో జైనుల ప్రసక్తి వచ్చింది కాబట్టి వారికి సంబంధించిన ఒక అంశంతో దీన్ని ముగిస్తాను.

పూర్వం కార్డులు, కవర్లు రాజ్యమేలే రోజుల్లో రాసుకునే ప్రతి ఉత్తరం ‘తప్పులున్న క్షమించగలరు’ అనే అభ్యర్ధనతో ముగిసేది.

సంఘజీవనంలో తెలిసో, తెలియకో, మాటలతోనో, చేతలతోనో సాటివారిని నొప్పించడానికి అవకాశాలెక్కువ. అందుకే, నాగరీకం బాగా ముదిరిన ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు , రోజువారీగా అనేక పర్యాయాలు ‘సారీ’ అనే పదాన్ని ఉదారంగా వాడుతుంటారు. అలాగే రష్యన్లు కూడా మాట మాట్లాడితే ‘ఇజ్వెనీచ్ పజాలుస్త’ (సారీ ప్లీజ్) అంటారు. అసలు క్షమించమని కోరడం, క్షమాగుణం కలిగివుండడం భారతీయ సంప్రదాయాల్లో భాగం. కానీ అన్ని సంప్రదాయాల్లాగే ఇదీ కాలక్రమేణా కనుమరుగు అవుతోంది. కాకపోతే, కాలు తొక్కి ‘సారీ’ చెప్పేవాళ్ళ సంఖ్య మాత్రం పెరుగుతోంది.

చర్చికి వెళ్లి కన్ఫెషన్ బాక్స్ లో నిలబడి, చేసిన తప్పులను దేవుడికి నివేదింఛి, క్షమాపణలు కోరే సంప్రదాయం క్రైస్తవుల్లో వుంది.

క్షమాపణలు అర్దించే ఒక విధానం  జైన మతంలో కూడా వుంది. దీని వాళ్లు ‘మిచ్చామి దుఖఃడం’ అని పిలుస్తారు. భాద్రపద మాసం నాలుగో రోజు అంటే వినాయక చవితి రోజున జైన మత విశ్వాసులు దీన్ని పాటిస్తారు. ‘మిచ్చామి దుఖఃడం’ అనేది ప్రాకృతంలో ఒక పదబంధం.

'మిచ్చామి' అంటే మరచిపోవడం, మన్నించడం అని అర్ధం.

'దుఖఃడం' అంటే దుష్కృత్యాలు. చేసిన చెడ్డ పనులు అని తాత్పర్యం. 

జైనులు ప్రాయూషణ పర్వ కాలంలో ఎనిమిదో రోజున, భాద్రపద శుద్ద చవితి నాడు ఒకరికొకరు ‘నేను చేసిన తప్పులను మన్నించండి’ అని మనవి చేసుకుంటారు. అంతకు ముందు ఏడాది కాలంలో తాము ఇతరులపట్ల చేసిన అపరాధాలకు క్షమాపణలు అర్ధిస్తారు. ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా ఈ తంతు కొనసాగుతుంది. 

మంచి ఆచారం కదా!