25, సెప్టెంబర్ 2022, ఆదివారం
జనారణ్య రోదనం – భండారు శ్రీనివాసరావు
24, సెప్టెంబర్ 2022, శనివారం
సిఫారసు లేని దర్శనం మహా భేషుగ్గా జరిగింది. అయితే....
మనం ఎన్ని పాట్లుపడి ముందస్తు ఏర్పాట్లు చేసుకుని
తిరుమల వెళ్ళినా మనకు ఎలాంటి దర్శనం రాసిపెట్టి
వుందో అదే స్వామి అనుగ్రహిస్తాడని పీవీ
ఆర్కే ప్రసాద్ గారు ఎప్పుడో రాసారు. అంచేత
తిరుపతి విమానం ఎక్కడానికి ముందే దేవుడిని కోరుకుంది అదే సులభతరమైన మంచి దర్శన
భాగ్యం కలిగించమని. గత బుధవారం నాడు మిత్రుడు సూర్య కలిసినప్పుడు తిరుపతి అంశం
ప్రస్తావనకు వచ్చింది.
“మీరు
వస్తాను అంటే నేను రెడీ. అయితే ఒకే ఒక్క షరతు.
దర్శనం, వసతి ఇలా ఏ విషయంలోనూ ఎవరి సిఫారసు కోరవద్దు.
ఆడవాళ్ళతో ప్రయాణం కాదు కాబట్టి ఎలాగో సర్దుకుపోదాం”
ఈ మధ్య ఎవరో చెప్పారు. ఆన్ లైన్లో శ్రీ వాణి
ట్రస్టు టిక్కెట్లు కొంటే దర్శనం అకామడేషన్ వాళ్ళే ఏర్పాటు చేస్తారని.
ఇదేదో బాగుందనుకుని మర్నాడే చెరి పదివేల అయిదు వందలు, వసతి కోసం
వెయ్యి రూపాయలు కాషన్ డిపాజిట్ కింద మరో వెయ్యి చెల్లించి యాత్రకు కావాల్సిన రెండు
ప్రధాన అంశాలపై ఎవరి మీద దేనికి ఆధారపడే అవకాశం లేకుండా చూసుకున్నాము.
శ్రీ వాణి (Sri Venkateswara Aalaya Nirmana) ట్రస్టు
టిక్కెట్లు కనుక స్వామివారి మూల విరాట్ వున్న గర్భాలయం గడప వరకు వెళ్లి దర్శనం
చేసుకున్నాము. తోపులాటలు, నెట్టడాలు,
వగైరాలు లేవు. విగ్రహం ముందు నిలబెట్టి శఠారి
ఇచ్చారు. స్వామి ప్రసాదం అంటూ ఒక పండు చేతిలో పెట్టారు. బయటకి వచ్చి వెలుతురులో
చూస్తే అదో చిన్న సైజు బత్తాయి కాయ. మహా
ప్రసాదం అనుకున్నాము. ఆ దేవదేవుడు నా వేడుకోలు చెవిన పెట్టాడు అని సంతోష పడ్డాను.
సులభంగా చక్కటి దర్శనం అయితే అయింది కానీ, ఆ
తర్వాత పట్టపగలే చుక్కలు చూపించారు దేవస్థానం వారు. ఆ ప్రయాస ఇంతా అంతా కాదు. ఆ
దెబ్బకు హైదరాబాదు వచ్చిన తర్వాత కూడా రెండు రోజులు మంచానికి అంటుకు పోయాను. కరోనా
ముమ్మరంగా ఉన్నరోజుల్లో కూడా జిర్రున చీది ఎరుగని నేను ఈ తిరుపతి యాత్రలో పడిన
ప్రయాసకు వడదెబ్బ తగిలి అడ్డం పడ్డాను. అందుకే రోజూ పోస్టుల మీద పోస్టులు పెట్టే
వాడిని రెండు మూడు రోజులుగా కంప్యూటర్ ముందు కూచోలేక పోయాను.
“దర్శనం భేషుగ్గా జరిగింది, అయితే....”
అని శీర్షిక పెట్టడానికి కారణం ఏమిటన్నది మరో పోస్టు పెడతాను.
అయితే ఆ చెప్పబోయేది అంతా దేవస్థానం
ఉన్నతాధికారుల కోసం. వాళ్ళు చూస్తారా లేదా అనేది నాకు అనవసరం.
“మంచి దర్శనం ఇప్పించు స్వామి” అనే నా మొర ఆ
దేవదేవుడే విన్నాడు. అధికారులు పట్టించుకున్నా
లేకపోయినా నేను పట్టించుకోను.
ధర్మారెడ్డి గారు! ఓసారి నాతొ వస్తారా అక్కడ
పరిస్త్తితులు ఎలా వున్నాయో మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను ఆ పోస్టు ద్వారా.
(24-09-2022)
20, సెప్టెంబర్ 2022, మంగళవారం
ఆడవాళ్ళూ! శతకోటి దణ్ణాలు ! ( ఈ ఒక్కరోజే సుమా!)
నెల అంటే ముప్పయి
రోజులు అని సెలవిచ్చాడు గతంలో హైదరాబాదు వచ్చిన ఓ కేంద్ర మంత్రి. ప్రస్తుతం మాజీ
అనుకోండి. అల్లాగే ఏడాదికి అక్షరాలా మూడువందల అరవై అయిదు రోజులు అంటే కాదు కాదు
ఇంకా ఎక్కువే అంటున్నారు కొందరు. ఆ సంఖ్య ఎల్లాగూ మారదు కాబట్టి ఒక్కో రోజుకూ
రెండో మూడో పేర్లు తగిలించేస్తున్నారు ఈ మధ్య ఆ మరికొందరు. ఆ లెక్కన ఇవ్వాళ
అంటే సెప్టెంబరు ఇరవయ్యో తేదీని ‘భార్యల్ని ప్రశంసించే రోజు’ పొమ్మన్నారు. దానికి సోషల్
మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. ‘ఈ ఒక్క రోజూ కట్టుకున్న ఇల్లాలిని మాటల్తో
పొగిడి, మిగిలిన మూడువందల అరవై నాలుగు రోజులూ షరా మామూలుగా అష్టోత్తరాలతో
వేధిస్తే పోలా’ అనుకునేవాళ్లు కూడా ఉండవచ్చు. ‘ఆ మాత్రం దానికి ఈ ఒక్క రోజూ
మొగుడితో పొగిడించుకుని, ఏడాది పొడుగునా అనరాని మాటలు పడుతూ వుండడం ఏమంత భాగ్యం’ అని ముక్కు చీత్తూ
మధన పడే మగువలకూ తక్కువలేదు. ఇది ఇక్కడ ఒదిలి అసలు ఈ ‘కొత్త రోజు ‘కధాకమామిషూ’
ఏంటో చూద్దాం.
కొన్నేళ్ళ క్రితం ఒక
ఆంగ్ల దినపత్రిక ఈ ‘దినం’ అనగా ‘భార్యల్ని ప్రశంసించే దినం’ ప్రచార బాధ్యతని
తన భుజాలకు ఎత్తుకుంది. మక్కికి మక్కి కాకుండా తెలుగులో సాగదీస్తే అది ఇలా
సాగుతుంది.
‘హల్లో! ఎలా
వున్నావు. మీ ఆవిడ ఎలా వుంది?’
‘మా ఆవిడా! ఓకేరా!’
‘ఏమిటీ జస్ట్
ఓకేనా! అంతేనా!’
‘..........’
‘చాలా ఆశ్చర్యంగా
వుందే! ఆవిడ అంటే ఎవరనుకున్నావు. నీ అర్ధాంగి. మీ ఇంటి దీపం. ఉదయం అందరికంటే
ఇంట్లో ముందు నిద్ర లేచేది ఆవిడే. ఇంట్లో అందరూ నిద్ర మంచం ఎక్కిన తరువాత అన్నీ
సర్దుకుని నిద్రపోయే మనిషి కూడా ఆవిడే! నువ్వు తొడుక్కునే చొక్కా సైజు కూడా నీకు
తెలవదు. ఆవిడ కొంటే తప్ప నీకు దిక్కులేదు. పిల్లలు ఏం తింటారో తెలవదు. వాళ్ళ పుట్టిన
రోజులు కూడా నీకు జ్ఞాపకం వుండవు. అన్నీ కంప్యూటర్ లాగా ఆవిడ గుర్తు పెట్టుకోవాలి.
ఇంట్లోకి ఏ సరుకులు కావాలన్నా ఆవిడే తేవాలి. పోపులడబ్బా ఎక్కడుందో కూడా నీకు
తెలవదు. సరుకులు ఉన్నాయా నిండుకున్నాయా జవాబు చెప్పమంటే నీకు పడేవి నిండు సున్నా
మార్కులే. ఈ విషయంలో ఆవిడని మించిన ఇన్వెంటరీ ఉంటుందా చెప్పు. చెప్పు అంటే జ్ఞాపకం
వచ్చింది. ఆవిడ వెంట వుండి కొనిపెట్టకపొతే నీ చెప్పు సైజు కూడా నీకు తెలవదు.
పిల్లల స్కూలెక్కడో, వాళ్ళేం చదువుతున్నారో, అసలు
చదువుతున్నారో లేదో మీ ఆవిడ చెబితే కానీ తెలవదు. నీకీ
సినిమా ఇష్టమో, నీకు ఏ కూర ఎలా చేస్తే యెంత ఇష్టమో ఆవిడకు తెలిసినంతగా నీకు బొత్తిగా
తెలవదు. అల్లాంటి మనిషి ఎల్లా వుందంటే సింపుల్ గా ‘ఓకే’ అంటావా! అడిగేవాడు లేక.
ఆయ్!!’
కాబట్టి మొగుడు
మిత్రాస్! (ఏవిటో నాకూ సోషల్ నెట్ వర్క్ భాష
పట్టుబడుతోంది). ఒక్క రోజే కదా! మీరు మీరు కాదనుకుని, మీ ఆవిడ మీ ఆవిడే
అనుకుని ఎంచక్కా నాలుగు మంచి మాటలు ఆవిడతో మాట్లాడండి.
ఆదివారం వంట పని పెట్టుకోకుండా ఏదైనా హోటల్ కు తీసుకువెళ్ళి, ‘ఛా! ఈ కూరా ఒక
కూరేనా, నువ్వు వండితే ఆ రుచే వేరు’ అంటూ కాకమ్మ
కబుర్లు కమ్మగా చెప్పండి. ఆడవాళ్ళు నమ్ముతారని నమ్మకం నాకయితే లేదు కానీ, ఆడవాళ్ళ గురించి
నాకో బలమైన నమ్మకం వుంది. వాళ్ళు అల్ప సంతోషులు. కనీసం మిమ్మల్ని నమ్మించడం
కోసమైనా వాళ్ళు మీ మాటలు నమ్మినట్టు కనిపిస్తారు.
ప్రయత్నం చేస్తే
పోయేదేమీ లేదు నాలుగు మాటలు తప్ప.
(NOTE: Image
Courtesy: RotteneCARDS)
18, సెప్టెంబర్ 2022, ఆదివారం
కల కాదా! నిజమా!! నా భ్రమా!!!
అందరు చేస్తున్నది అదే! - భండారు శ్రీనివాసరావు
(Published in Andhra Prabha daily today Sunday 18-09-2022)
16, సెప్టెంబర్ 2022, శుక్రవారం
ఇదో కళ.....
ఇందులో నిష్ణాతులకు ఆస్కార్ ఇవ్వాలి. ఒకరు రాసినదానిని తమ పేరుతొ తిరిగి పోస్ట్ చేసుకోవడం ఒక తీరయితే, తమ భావాలకు పెద్దల పేరు తగిలించి వారి కొటేషన్లుగా పోస్ట్ చేయడం ఇంకో తంతు.
దీనికి పేరడీ ఈ
కింది చిత్రం. అబ్రహంలింకన్ కాలం నాటికి ఇంటర్నెట్ లేదు. అయినా దాన్ని గురించి ఆయన
గారు చెప్పారంటూ ఒక కొటేషన్ ఇవ్వడం నేటి పెడ ధోరణులకు అద్దం పడుతోంది. దీన్ని
చూసయినా 'కాపీ, పేస్టు, ఫార్వార్డ్ ' బాపతు వాళ్ళ తీరు
మారుతుందా అంటే అనుమానమే.
చెయ్యి తీస్తాను అన్ననోటితో క్షమాపణ చెప్పిన రోశయ్య
ఉప్పూ కారం తినే వాడికి కోపం రావడం సహజం. అలుగుటయే ఎరుంగని ధర్మరాజు వంటి వాడు అలిగితే ఏమి జరుగుతుందో కృష్ణుడు ఒక పద్యంలో చెప్పాడు. అలాగే ఒకసారి రోశయ్య గారెకి కూడా కోపం వచ్చింది. అదీ నిండు శాసన సభలో. ఎప్పుడూ చమత్కారాలు రాలుతుండే ఆయన నోటి వెంట పరుష పదజాలాలు దొర్లడం చూసి ప్రెస్ గేలరీలో ఉన్న పాత్రికేయులు సయితం అవాక్కయ్యారు.
ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్ శాసన సభలో టీడీపీ సభ్యుడు శ్రీ గాలి ముద్దు కృష్ణమ నాయుడి వైఖరి పట్ల
.రోశయ్య గారెకి అసహనం కలిగింది. అది ఆగ్రహంగా మారింది. తీవ్ర పదజాలం వాడారు. బహుశా
తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో శ్రీ రోశయ్య సంయమనం కోల్పోయి మాట్లాడడం ఇదే ప్రధమం
కావచ్చు. ఆ రోజు సభలో ముద్దుకృష్ణమ నాయుడిని ఉద్దేశించి ఆవేశంతో ఊగిపోతూ ఆయన ఇలా
అన్నారు:
“ఏమిటా
గద్దింపులు?
నువ్వు పెద్ద మగాడివా! ఏమిటా చెయ్యి? చెయ్యి తీస్తాను జాగ్రత్త!
ఏమనుకుంటున్నావో!”
తర్వాత
తాను అన్న మాటలకు ఆయనే సభలో క్షమాపణ చెప్పారు.
“నా
కారణంగా ప్రజాధనం లక్షలాది రూపాయలు దుర్వినియోగం అయిపోతుందని, ఈ సభ గౌరవం తగ్గిపోతుందని నాక్కూడా
భావన కలిగింది. నేను ఇరవై ఎనిమిదో తారీకున మాట్లాడుతూ, గౌరవనీయులు శ్రీ ముద్దు కృష్ణమ
నాయుడు గారి గురించి కఠినంగా మాట్లాడినటువంటి మాట నేను విత్ డ్రా చేసుకుంటున్నాను.
నా విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను”
ఒకప్పుడు
ఇలా ఉండేవి శాసన సభలు
(15-09-2022)
Video LINK:
https://youtu.be/hC9GdIctEKE

