6, జనవరి 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (56) - భండారు శ్రీనివాసరావు

 

బహిరంగ సభల్లో, విలేకరుల సమావేశాల్లో క్లుప్తంగా మాట్లాడి వెళ్ళిపోయే వెంగళ రావు గారు, అసెంబ్లీలో అవసరమైన సందర్భాల్లో సుదీర్ఘంగా ప్రసంగించిన సందర్భాలు కొన్ని  వున్నాయి.

1976 లో జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో దాదాపు నలభయ్ యాభయ్ మంది సభ్యులు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడినంత సేపు ముఖ్యమంత్రి సభలో తన స్థానం నుంచి కదల లేదు. మౌనంగా సీట్లో కూర్చుని సభ్యులు ప్రస్తావించిన వివిధ అంశాలపై నోట్స్ రాసుకుంటూ పోయారు. తరువాత తన సమయం రాగానే లేచి సుమారు గంటన్నరపాటు అన్ని అంశాలను స్పృశిస్తూ సమాధానం చెప్పారు. సభలోని యావన్మందీ వెంగళరావు ప్రసంగాన్ని మెచ్చుకున్నారు.

ముఖ్యమంత్రి పదవి అనేది ఇంట్లో చిలక్కొయ్యకు తగిలించుకునే చొక్కా కాదు” అనేశారు ఆయన ఒకసారి. అదీ ఎక్కడో కాదు సాక్షాత్తు అసెంబ్లీలో.

ముఖ్యమంత్రి హోదాలో తిరుపతి వెళ్ళిన ముఖ్యమంత్రికి అక్కడి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం చెప్పారు. అదీ దీనికి నేపధ్యం.

ఆ అంశం అసెంబ్లీలో చర్చకు వచ్చింది. కమ్యూనిస్టు సభ్యులు ఆలయ అధికారులను తప్పుపట్టారు.

అప్పుడు ముఖ్యమంత్రి జలగం కలగచేసుకుని చెప్పిన మాట ఇది.

ముఖ్యమంత్రి పదవి అనేది ఇంట్లో చిలక్కొయ్యకు తగిలించుకునే చొక్కా కాదు. గుడికి వెళ్ళినా బడికి వెళ్ళినా అది నా వెంటే వుంటుంది”

దానితో చర్చకు తెర పడింది.

జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు బ్యాంకర్ల మీటింగు పెట్టారు. ఇప్పట్లోలా అప్పుడిన్ని  ప్రభుత్వ బ్యాంకులు  ఉండేవి కావు. ఓ పది మంది బ్యాంకు ఉన్నతాధికారులు హాజరయ్యేవారు.

ముఖ్యమంత్రి ఛాంబర్  లో మీటింగు. అధికారులు ఎందుకయినా మంచిదని ఓ పది నిమిషాలు ముందే వెళ్ళారు. ఇప్పట్లోలా సెక్యూరిటీ  బాదరబందీలు లేవు కాబట్టి వెళ్లి సీఎం కార్యాలయంలో సెక్యూరిటి అధికారి సీతాపతిని కలిసారు. రండి రండి మీ కోసమే సి ఎం ఎదురు చూస్తున్నారు అంటూ లోపలకు తీసుకువెళ్ళి కూర్చోపెట్టారు. సరిగ్గా చెప్పిన టైముకు నిమిషం తేడా లేకుండా వెంగళరావు గారు గదిలోకి వచ్చారు. ఎజెండా ప్రకారం మాట్లాడాల్సినవి మాట్లాడి, వినాల్సినవి విని ఇచ్చిన సమయం అరగంట కాగానే మంచిది వెళ్ళిరండి అని వీడ్కోలు పలికారు. గంటలు గంటలు పడిగాపులు పడకుండా వచ్చిన పని పూర్తయినందుకు అధికారులు కూడా సంతోషపడుతూ వెళ్ళిపోయారు.

జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా  గతంలో హోంమంత్రిగా వున్న సమయంలో పంజాగుట్ట ప్రాంతంలోని ద్వారకాపురి కాలనీలో ముచ్చటపడి కట్టుకున్న చిన్న భవంతిలోనే కొనసాగారు. ముఖ్యమంత్రి హోదాకు తగిన వసతులు అరకొరగా ఉన్నప్పటికీ చివరి వరకు ఆయన ఆ ఇంట్లోనే కాలక్షేపం చేసారు.

ఎమర్జెన్సీ సమయంలో సమర్ధుడైన  ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న జలగం వెంగళరావు గారు, తదుపరి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో  కేంద్రంలో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత, తన రూటు మార్చుకుని ఇందిరా గాంధీతో విడిపోయారు. తుపాను బాధితులను పరామర్శించడానికి మాజీ ప్రధాని హోదాలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఇందిరాగాంధీకి ప్రభుత్వ అతిథి గృహం కేటాయించడానికి కూడా ముఖ్యమంత్రి వెంగళరావు నిరాకరించడం వివాదాస్పదం అయింది. తమ నాయకురాలికి జరిగిన అవమానానికి కినిసి, అప్పుడు వెంగళరావు మంత్రి వర్గంలో కార్మిక  మంత్రిగా ఉన్న శ్రీ టి. అంజయ్య తన పదవికి రాజీనామా చేశారు.

రాజకీయాలు నిలకడగా వుండవు అనడానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, రాజకీయ నాయకులే మంచి ఉదాహరణ. ఇందిరాగాంధి చల్లని చూపులతో ముఖ్యమంత్రి అయిన వెంగళరావు ఒక దశలో ఆమెను రాజకీయంగా తీవ్రంగా విబేధించారు. అలాగే పీవీ నరసింహారావును కూడా అనరాని మాటలు అన్నారు. (నిజానికి నా జీవిత కధ అనే పేరుతొ,  తన పేరిట ప్రచురితమైన గ్రంథంలో ఈ మాటలు వున్నాయి)

ఆ పుస్తకంలో కొన్ని అంశాలు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి కావడంతో అది వివాదాస్పదం అయింది.

పీవీ నరసింహారావు గురించి  శ్రీమతి గాంధీ తనతో ఇలా చెప్పారంటూ  వెంగళరావు ఆ పుస్తకంలో ఉదాహరించిన విషయాలు దిగ్భ్రాంతి గొలిపేవిగా వున్నాయి.

"నేనింతవరకు అలాటి (పీవీ) అసమర్ధ నాయకుడ్ని చూడలేదు. కందూభాయ్ దేశాయ్త్రిపాఠీఉమా శంకర్ దీక్షిత్ లాగే ఈయనా ఒక  సీనియర్ అన్న నమ్మకంతో ఆయన్ని(ఆంద్ర ప్రదేశ్) ముఖ్యమంత్రిని చేసాను. కానీ ఆయన  బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం నాకెంతో బాధ కలిగిస్తోందని" ఇందిరాగాంధి తనతో చెప్పుకున్నట్టు వెంగళరావు పేర్కొన్నారు.

అలాగే మర్రి చెన్నారెడ్డి గురించి వెంగళరావు వెలిబుచ్చిన కధనాలు:

"విమాన ప్రమాదంలో మరణించడానికి నాలుగు రోజులు ముందు ప్రధాని తనయుడు సంజయ్ గాంధీ, చెన్నారెడ్డి స్థానంలో అంజయ్యను ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సంజయ్ ఆకస్మిక  మరణ వార్త చెన్నారెడ్డిని సంతోషంలో ముంచి వేసింది. సంతాపం వెలిబుచ్చడానికి బదులుగా చెన్నారెడ్డి సంబరాలు చేసుకున్నారనీమిఠాయిలు పంచిపెట్టారనీకృష్ణాజిల్లాకు చెందిన ఒక లెజిస్లేటర్ తనతో చెప్పినట్టు  వెంగళరావు తన పుస్తకంలో పేర్కొన్నారు.

అయితేఅసలా పుస్తకం తాను తన చేతుల్తో రాయలేదనీఎప్పటి జ్ఞాపకాలో  గుర్తు తెచ్చుకుని చెబుతుంటే వాటిని తన కోడలు అక్షరబద్ధం చేసారనిపుస్తకం పూర్తయిన తరువాత దాన్ని సమాచార శాఖ ఉన్నతాధికారిఅనేకమంది ముఖ్యమంత్రుల వద్ద పీ.ఆర్.వొ. గా పనిచేసిన భండారు పర్వతాలరావు 'ఎడిట్చేసారని ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  చెప్పుకొచ్చారు. అయితే ఆ పుస్తకంలో కొన్ని అంశాలు కొందరు  వ్యక్తులను బాధ పెట్టేవిగా  వున్నాయనివాటిని తొలగించడం మంచిదనీ అంటూ తాను గ్రంధ ప్రచురణకు  ముందుగానే వెంగళరావు దృష్టికి తీసుకువచ్చినట్టు పర్వతాలరావు వివరణ ఇచ్చారు.  అయినా ఆయన తన సహజ శైలిలోనే,  'ఏం పర్వాలేదంటూ'  తన సలహాను  పట్టించుకోలేదని,  అంచేత ఆ పుస్తకంలో తన పేరు ఎక్కడా ప్రస్తావించవద్దని కోరినట్టు పర్వతాలరావు  చెప్పారు. అలాగే పర్వతాలరావు గారి పేరు అందులో ఎక్కడాలేదు.

జీవిత చరిత్రల నుంచి నేర్చుకునే విషయాలు వుండాలి. అంతేకానిఅమ్మకాలు పెంచుకోవడం కోసమే రాస్తే వాటిపై జనాలకు నమ్మకాలు తగ్గిపోతాయి.

కింది ఫోటో:

ముఖ్యమంత్రి వెంగళరావు,, మదన్ మోహన్, కె. రోశయ్య పాల్గొన్న సభలో ప్రసంగిస్తున్న నాటి యువ కాంగ్రెస్ నేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి,



అయాం ఎ బిగ్ జీరో (55) - భండారు శ్రీనివాసరావు

 

నేను రేడియోలో చేరింది ఎమర్జెన్సీ రోజుల్లో. 1975 నవంబర్ 14 తేదీన అందులో చేరాను. జనం నమ్మినా నమ్మకున్నాఆదరించినా ఏవగించుకున్నా వార్తలకోసం రేడియో వినక తప్పని పరిస్తితి. పత్రికలపై సెన్సార్ షిప్ వుండేది.

అప్పుడు ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు. సమర్దుడయిన పాలకుడిగా పేరు. ఎమర్జెన్సీ ఆయనకు కలసివచ్చింది. రాజకీయంగా ఎదురు లేకపోవడంలేనిపోని విమర్శలకు ఆస్కారం వుండక పోవడంప్రభుత్వ అధికారులుసిబ్బందీ భయభక్తులతో నడుములు వంచి బుద్ధిగా పనిచేయడం,  ఇవన్నీ ముఖ్యమంత్రిగా ఆయనకు కలసివచ్చిన అంశాలు.

వెంగళరావు గారు ఖమ్మంజిల్లా పరిషత్ అద్యక్షుడిగా వున్నప్పటినుంచే అధికారులతో మంచిగా వుంటూ పనులను త్వరత్వరగా పూర్తి చేయించడం నాకు తెలుసు. ముఖ్యమంత్రి అయిన తరవాత ఆయన ఇదే విధానాన్ని కొనసాగించారు. త్వరితగతిన పూర్తయ్యే చిన్నమధ్య తరహా సేద్యపు నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చేవారు. శంకుస్థాపన చేసిన చేతులతోనే, ఆయన ఆయా ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయడం కళ్ళారా చూసాను. గ్రామాల్లో చెరువులకు మరమ్మతులు సకాలంలో చేయిస్తే రైతులకు అవసరమయిన తరుణంలో సాగు నీటి కొరత లేకుండా చేయవచ్చని ఆయన చెబుతుండేవారు. చెప్పిందే చేసి చూపెడుతూవుండేవారు. ఆయన కేంద్రమంత్రిగాపీసీసీ ప్రెసిడెంటుగావున్నప్పుడు ఖమ్మం జిల్లాలో ఓసారి జరిపిన పర్యటనలో నన్ను ఆయన తన కారులోనే వెంటబెట్టుకుని తీసుకువెళ్లారు. నా మేనల్లుడు కౌటూరి దుర్గాప్రసాద్ ఆ రోజుల్లో ఖమ్మం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఖమ్మం జిల్లాలో జరిగిన అన్ని అభివృద్ధి పనుల్లో ప్రతి ఇటుక మీదా తన పేరే రాసివుంటుందని వెంగళరావు గారు సగర్వంగా చెప్పుకోవడం నాకు ఇప్పటికీ గుర్తు.

 

వెంగళరావు వ్యవహార శైలి చాలా విలక్షణంగా వుండేది. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. పంజాగుట్ట,  ద్వారకాపురి కాలనీలోని ఇంటినుంచి ఆయన సచివాలయానికి బయలుదేరారంటే చాలు,  గడియారాల్లో టైం సరిచేసుకోవచ్చని చెప్పుకునేవారు. అంత ఖచ్చితంగా రోజూ ఒకే సమయానికి బయలుదేరడంతిరిగి ఇంటికి చేరడం వెంగళరావు గారికే చెల్లింది. తదనంతర కాలంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు సమయపాలన పాటిస్తామని ప్రకటనలు చేయడమే కానీఆ మాట  నిలబెట్టుకున్నవాళ్ళు లేరు. మాజీ ముఖ్యమంత్రిగా కూడా వెంగళరావు ఈ నియమాన్ని ఎన్నడూ వొదులుకోలేదు. హైదరాబాద్ పొలిమేరల్లోవున్న ఫాం హౌస్ కు వెళ్లడంతిరిగి రావడం అంతా కూడా అయిదు నిమిషాలు అటూ ఇటూ తేడా లేకుండా ప్రతి రోజూ ఒక నియమిత సమయంలో జరిగేలా ఆయన ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. వెంగళరావు చనిపోయినప్పుడు ఆయన దహన సంస్కారాలు ఆ తోటలోనే జరిపారు.

రేడియో విలేకరిగా ముఖ్యమంత్రి వెంగళరావు పద్దతులు నాకు బాగా నచ్చాయి. ఎందుకంటేఆయన విలేకరుల సమావేశాలను చాలా క్లుప్తంగా ముగించేవారు. రేడియో వార్తలకు తప్ప ఆ రోజుల్లో మరెవరికీ టైం కు సంబంధించిన ‘డెడ్ లైన్లు’ వుండేవి కావు. చెప్పాల్సింది చెప్పేసే వారు. తరువాత ఆయనే లేచి నిలబడి  ‘మంచిది వెళ్ళిరండి” అంటుంటే ఇక విలేకరులు మాత్రం ఏం చేయగలరువిలేకరులతో మాట్లాడే ఆ కొద్దిసమయంలో కూడా రొటీన్ ఫైల్స్ పై సంతకాలు పెడుతూనే వుండేవారు. అలాగని ఆయనకు విలేకరులతో సత్సంబంధాలు లేవని కాదు. ఆంధ్రజ్యోతి ఐ. వెంకట్రావుహిందూ రాజేంద్రప్రసాద్ వంటివారితో ఆయనే స్వయంగా ఫోనుచేసి మాట్లాడడం నాకు తెలుసు.

ఆయన దగ్గర పనిచేసే సిబ్బందిని  కూడా  వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. రావు సాహెబ్ కృష్ణ స్వామి గారు  ఒక్కరే ఆయన పేషీలో  ఐఏఎస్ అధికారి. మిగిలిన వారందరూ ఓ మోస్తరు  ఉద్యోగులే.  ప్రకాశరావు గారు వ్యక్తిగత కార్యదర్శి.  మరో ఇద్దరు పీఎలు వుండేవారు. డీఎస్పీ  స్థాయి కలిగిన పోలీసు అధికారి సీతాపతి గారు  సీఎం ప్రధాన  భద్రతాధికారి. ఒకళ్ళిద్దరు కానిస్టేబుళ్ళు బాడీ గార్డులు. లోకయ్య అనే నాలుగో తరగతి ఉద్యోగి ముఖ్యమంత్రికి వ్యక్తిగత సహాయకుడు. ప్రతేకంగా పీఆర్ఓ అంటూ ఎవరూ వుండేవారు కాదు. సమాచారశాఖలో పనిచేసే ఓ స్థాయి అధికారి పీ ఆర్ వొ బాధ్యతలు అదనంగా నిర్వహిస్తూ వుండేవారు. తరువాత కొన్నాళ్ళు ఈ బాధ్యతలను సి. నరసింహా రెడ్డి చూసేవారు.  నాన్ ఏసీ అంబాసిడర్ కారు సీ ఎం అధికారిక  వాహనం. ముందో పైలట్, వెనకో ఎస్కార్ట్ వాహనం. అంతే!  సీ ఎం కాన్వాయ్. సచివాలయంలో ఆయన   కార్యాలయం కూడా చాలా చిన్నదిగా వుండేది.

ముఖ్యమంత్రి గదిలో ఓ పదిపన్నెండు పేము కుర్చీలు ఉండేవి. హైదరాబాదులో పనిచేసే అన్ని పత్రికల విలేకరులు అందరూ వచ్చినా ఇంకా ఒకటి రెండు ఖాళీగానే ఉండేవి. ఇప్పుడు అలాంటి పరిస్తితి లేదు. విలేకరుల సమావేశం పెట్టాలి అంటే ఫతే మైదాన్ ఇండోర్ స్టేడియం కావాలి అని జోకులు వేసుకునే రోజులివి.

ముఖ్యమంత్రి వెంగళరావుతో  నాకో చిన్న పర్సనల్ టచ్ వుంది.

బెజవాడ నుంచి హైదరాబాద్ వచ్చానన్న మాటే కానీఇక్కడి ఇళ్ళ అద్దెలు నన్ను బెంబేలెత్తించాయి. ఆ సమయంలో ఎవరో చెబితే రెంట్ కంట్రోల్ ఆక్ట్ కింద ప్రభుత్వానికి ధరఖాస్తు పెట్టుకుని ఆ కాపీ ముఖ్యమంత్రికి ఇచ్చాను. గంటలో రెవిన్యూ అధికారులనుండి కబురువెంటనే దోమలగుడా వెళ్లి పలానా ఇంటిని స్వాధీనం చేసుకోమని. నేనూ మా ఆవిడా సంబరపడుతూ దోమలగూడాలో వున్న ఆ ఇంటికి ఎగురుకుంటూ వెళ్ళాము. అప్పుడు మేము అద్దెకు వుంటున్న ఇంటితో పోలిస్తే అది చాలా పెద్ద భవంతి. కిరాయి మాత్రం మేము చెల్లించే దానిలో నాలుగోవంతు కూడా లేదు. ‘ఆహా ఏమి అదృష్టం’ అనుకునే లోపల భోరున ఏడుపులు వినవచ్చాయి. ఇంటివాళ్ళట. ఆ ఒక్క ఇల్లూ రెంటు కంట్రోలు కిందకు పోతే వాళ్ల పని అంతే అట. మాకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఇటు చూస్తే అధికారులు తొందరపెడుతున్నారు. అటు చూస్తే ఇంటివాళ్ల ఏడుపులు గాభరా పెడుతున్నాయి. చివరికి ఆ ఇల్లు మాకు అక్కరలేదని అధికారులతో చెప్పాము. ‘ముఖ్యమంత్రి పేషీతో వ్యవహారం కుదరదంటే కుదరదన్నారు.  నేను గట్టిగా చెప్పడంతో  ఆ ఇల్లు మాకు నచ్చలేదని నాచేత కాగితం రాయించుకుని వెళ్ళిపోయారు.

గవర్నమెంట్ కేటాయించిన ఇంట్లోనే వుంటున్నానని బహుశా వెంగళరావు అనుకుండేవారేమో! ఎప్పుడయినా కనబడ్డప్పుడు, ‘ఇల్లు వసతిగా వుంది కదా!’ అనేవారు. నేను అవుననీ కానీకాదనీ కానీ అనకుండా తలపంకించి వూరుకుండేవాడిని.

కింది ఫోటో : జలగం వెంగళ రావు గారు



(ఇంకా వుంది)

5, జనవరి 2025, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (54) - భండారు శ్రీనివాసరావు

 నండూరి రామమోహన రావు గారికి నా మీద ఎనలేని కోపం వచ్చింది.

‘వెడతారండీ, వెడతారు. మా ఈ పేపరు, పత్రికల వాళ్లకు ఓ దిక్కుమాలిన మొదటి మెట్టు అయి కూర్చుంది. ముం దు వచ్చి చేరడం, పని నేర్చుకోవడం, తర్వాత రెక్కలు వచ్చిన పక్షుల్లాగా ఎక్కడికో ఎగిరిపోవడం. మేము ఇక్కడ ఏమీ పనిలేనివాళ్ళలాగా మరొకరికి పని నేర్పుతూ కూర్చోవడం.’

రేడియోలో ఉద్యోగం వచ్చింది, ఆ విషయం చెబితే సంతోషిస్తారు, ఆశీర్వదిస్తారు అని వెళ్లి చెబితే, నానెత్తిన పడ్డ అక్షింతలు ఇవి. నేను పని చేసిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో నేను ఎన్నడు చూడని ఎరుగని కోపం ఆయన మొహంలో, మాటల్లో కానవచ్చింది.  నిజమే. తప్పు నాదే. ఆంధ్రజ్యోతిని వదిలిపెట్టి వెళ్ళాలని నాకూ లేదు. కానీ తప్పనిసరి పరిస్తితితులు.

ఇల్లు ఖాళీ చేసి, తట్టా బుట్టా సదురుకుని, ఇండియన్ బ్యాంకు రుణంతో కొనుక్కున్న ఇనుప బీరువాని ట్రాన్స్ పోర్టులో వేసి, బస్సులో భార్యాపిల్లలతో హైదరాబాదు చేరాను. అప్పటికి మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు స్టేట్ బ్యాంకులో రీజినల్ మేనేజర్ గా అనుకుంటా పనిచేస్తూ, అశోక నగర్ లో అద్దెకు ఉంటున్నాడు. అందులో ఒక గదిలో చేరిపోయి ఇల్లు వెతుక్కునే కార్యక్రమంలో పడ్డాము.

ఇంటర్వ్యూ తరువాత ఆలిండియా రేడియోలో అడుగుపెట్టడం అది రెండోసారి. బుద్దిగా పదిగంటలకు వెళ్లాను.  

ఆకాశవాణి కేంద్రం, హైదరాబాదు’
(నిషిద్ధ ప్రదేశం, అనుమతిలేనిదే లోనికి రాకూడదు)
ఒక్కసారయినా ఇందులోకి అడుగుపెట్టగలిగితే ఎంత బాగుంటుందో!”
ఇలా మనసులో అనుకుంది ఎవరో కాదు, ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వానికి సాంస్కృతిక సలహాదారుడుగా పదేళ్లు పనిచేసిన మాజీ  సీనియర్  ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ కేవీ. రమణాచారి. ఒక సమావేశంలో ఆయన స్వయంగా ఈ విషయం చెప్పారు.
అలాంటి రేడియో స్టేషన్ లో మూడు దశాబ్దాలకు పైగా కొలువు చేసే అపూర్వ అవకాశం నాకు  లభించింది. ఇది పూర్వ జన్మ సుకృతం.

ఉద్యోగం చేసేవాడికి డ్రెస్ కోడ్ వుండాలనేది మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారి నిశ్చితాభిప్రాయం. అంటే  యూనిఫారం అని కాదు. హుందాగా వుండే దుస్తులు వేసుకుంటే అవతలవారికి మనపట్ల సరయిన అభిప్రాయం కలుగుతుందని ఆయన ఉద్దేశ్యం. అయితే, ‘రేపటి మనిషి’ గా నాకు నేను కితాబు ఇచ్చుకునే నాకు మాత్రం  వేసుకునే దుస్తులమీద అంత పట్టింపులు ఏమీ లేవు. ఆంధ్రజ్యోతిలో పనిచేసేటప్పుడు న్యూస్ పేపర్ నమూనాలో ప్రింట్స్ వున్న చొక్కాలు వేసుకుని తిరిగేవాడిని. రేడియోలో చేరిన తరవాత మా అన్నయ్య పట్టుబట్టి నా వేష ధారణలో కొంత మార్పు తీసుకురాగలిగారు. ఒకరోజు ఏదోపనిమీద రేడియో స్టేషనుకు వచ్చిన అయన, మా న్యూస్ ఎడిటర్ పన్యాల రంగనాధరావు గారిని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన రంగురంగుల బొమ్మల బుష్కోటు(బుష్ ష ర్ట్) తో ఆఫీసులో కనిపించారు. చూడడానికి చిన్న ఆకారమయినా,  రంగనాధరావు గారిది నిజమయిన రేడియో స్వరం. ఆయన చదివే వార్తల విధానాన్ని  ఈ నాటికీ గుర్తుచేసుకునేవారు వున్నారు.
ఆకాశవాణి – తెలుగులో వార్తలు చదువుతున్నది – పన్యాల రంగనాధరావు –డిల్లీ నుంచి ప్రసారమవుతున్న ఈ వార్తలను  విజయవాడహైదరాబాద్మద్రాసు  రేడియో  కేంద్రాలు రిలే చేస్తున్నాయి.” అంటూ ఆ వార్తలు మొదలయ్యే తీరు నాకు ఇప్పటికీ బాగా గుర్తు. అలాగే, జగ్గయ్యగారు వార్తలు చదివితే ఆయన కంఠం కంచులా మోగేదని వినడమే కానీ ఎన్నడు ఆ వార్తలు వినలేదు. నాకు వార్తలు వినే వయసు వచ్చేసరికే బహుశా ఆయన సినిమా రంగానికి వెళ్ళిపోయివుంటారు.

రేడియోలో చేరిన మొదటి రోజు బాగా జ్ఞాపకం వుంది. ఆఫీసుకు వెళ్లేసరికి రంగనాధరావుగారు ఏదో పనిచేసుకుంటూ కనిపించారు. పరిచయాలు అయిన తర్వాత  ఏం పని మీద వచ్చావన్నట్టు నా వైపు చూసారు. నా  మొహంలో రంగులు మారడం చూసి,  “ఇక్కడ మీకు పనేమిటి? మీరు రిపోర్టర్. బయట తిరిగితే కదా నాలుగు వార్తలు తెలిసేదిరోజూ సెక్రెటేరియట్ కు వెళ్ళండి. మంత్రులు చెప్పేది వినండి. నాలుగు ముక్కలు ముక్కున పెట్టుకు వచ్చి, తెచ్చి నా మొహాన కొట్టండి. అంతే! సింపుల్” అని తేల్చేసారు. అలా అంటూనే, “ఇంతకీ ఆఫీసుకు ఎలా వచ్చారు?” అని మరో అర్ధం కాని ప్రశ్న సంధించారు. “ఆటోలో వచ్చుంటారు. అవునా! అలా అయితే మీ జీతం డబ్బులన్నీ ఈ రిపోర్టర్ తిరుగుళ్ల కోసం ఆటోలకే తగలెయ్యాల్సి వుంటుంది. వార్తల సంగతి తరవాత. ముందు నేనో ఉత్తరం ఇస్తాను. దాన్ని తీసుకువెళ్ళి సమాచార శాఖలో ఇవ్వండి. అక్కడ అక్రిడిటేషన్ కార్డు తీసుకుని  ఆర్టీసీ ఆఫీసుకు వెళ్ళండి. వాళ్ళు ఇచ్చే బస్  పాసు తీసుకున్న తరవాతే, మిగిలిన ఏ పనులయినా!  తెలిసిందా!” అన్నారు. తెలియకపోవడానికి ఏముంది. కానీ ఇలాటి పై అధికారులు కూడా వుంటారా అన్నదే అంతవరకూ తెలియని విషయం.

 

కింది ఫోటో:

పన్యాల రంగనాధరావు గారు.



 

(ఇంకా వుంది)

నిన్నా మొన్నా ఈరోజు – భండారు శ్రీనివాసరావు

 మొన్న రెండు కార్లలో  బయలుదేరి మా స్వగ్రామం కంభంపాడు వెళ్ళాము. మా అన్నయ్య పిల్లలు కూడా వచ్చారు.  నిజానికి సొంత ఊరు వెళ్ళడంలో విశేషం ఏముంటుంది?

ఈరోజు మూడో ఏట అడుగుపెడుతున్న మా మనుమరాలు జీవికకి మా ఊరు చూపించాలి అనేది మా కోడలు నిషా కోరిక. మా వాడు సంతోష్ చనిపోవడానికి ముందు భార్యాభర్తలు ఇద్దరూ అమ్మాయిని ఊరికి తీసుకువెళ్లి పూర్వీకులు నివసించిన పల్లెటూరు చూపించాలని అనుకున్నారట, వచ్చే నెలకు వాడు చనిపోయి ఏడాది అవుతుంది కాబట్టి ఈలోగా ఆ  ఊరుకు వెళ్లి రావాలని కోడలు అనుకోవడంతో, అలానే వెళ్లి నిన్న సాయంత్రం తిరిగి హైదరాబాదు వచ్చాము. పల్లెటూరు ఛాయలు ఏమీ లేని ఊరును జీవికకు చూపించాము. చూపించాలి అనుకున్న ఎడ్లు లేవు, ఎడ్ల బండ్లు లేవు. అరకలు లేవు.  మా ఇంట్లో ఎదురింటి వాళ్ళు పెంచుకుంటున్నఒక నల్లటి గవిడి గేదె, దానికి పుట్టిన పదహారు రోజుల వయసున్న నల్లటి గేదె దూడను  చూపించాము. మదర్ బఫెలో, బేబీ బఫెలో అంటూ వాటితో కాసేపు ఆడుకుంది. భోజనాలు అయిన తర్వాత ఇంటికి ఒక కిలోమీటరు దూరంలో మా తోటలో (తోట అనడానికి అక్కడ పళ్ళ చెట్లు ఏమీ లేవు, మిరపతోట, మొక్క జొన్న తోట మాత్రం వున్నాయి) మా అమ్మగారు చనిపోయినప్పుడు మా మూడో అన్నయ్య వెంకటేశ్వరరావు గారు కట్టించిన మా అమ్మానాన్నల గుడికి వెళ్లి దణ్ణాలు పెట్టుకున్నాము. మర్నాడు ఖమ్మం మీదుగా హైదరాబాదు తిరిగివస్తుంటే అంధ్రజ్యోతిని ఢిల్లీ గడ్డపై దశాబ్దాలుగా వెలిగిస్తున్న ప్రముఖ పాత్రికేయులు  అప్పరసు కృష్ణారావుగారి ఫోను. అయిదారుగురితో ఈ సాయంత్రం  చిన్న కలయిక వంటి గోష్టి, తప్పకుండా  రండి అంటూ. ఇంటికి చేరి భోజనం చేసి డ్రైవర్ను పిలిపించుకుని వారున్న హోటలుకు వెళ్లాను. మామూలుగా అయితే ఏదో కారణం చెప్పి తప్పించుకునే వాడినే. కానీ కృష్ణారావు గారి ఆఫరు మామూలుగా లేదు. మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు గారిపై  వారు రాసిన పుస్తకాన్ని సాహిత్య అకాడమి ప్రచురించింది. వచ్చి ఆ పుస్తకాన్ని తన చేతుల మీదుగా అందుకోమని ఆహ్వానం. వెళ్లాను. వెళ్ళే సరికే, పీవీ గారి తనయుడు పీవీ ప్రభాకర రావు గారు, సీనియర్ సంపాదకులు కె. రామచంద్ర మూర్తిగారు, జ్వాలా నరసింహా రావు, మా శర్మ గారు, సీనియర్ పాత్రికేయులు, కృష్ణారావు గారి సోదరులు ఏ. శ్రీనివాసరావు, జగాన్ని ఎరిగిన జర్నలిస్టు మా శర్మ గారు అక్కడ వున్నారు. తరువాత కొంతసేపటికి ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె. శ్రీనివాస్ గారు, సీనియర్ పాత్రికేయుడు నందిరాజు రాధాకృష్ణ వచ్చి కలిసారు. మాటలు ముచ్చట్ల మధ్యలో కాలం తెలియలేదు.

తరువాత, మా అన్నయ్య కుమారుడు రాజేంద్ర ప్రసాద్ పుట్టిన రోజు వేడుకల కోసం మరో హోటల్ కు వెళ్లాను. ఈ విధంగా ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో బంధు మిత్రులతో సమాగమం. ఆనందంగా గడిచింది అనే వేరే చెప్పనక్కరలేదు.

ఈ వయసులో ఇంతటి ఆనందాన్ని ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు.

ఇక ఈరోజు, ముందే చెప్పినట్టు మా మనుమరాలి పుట్టిన రోజు.

‘వాడే వుండి వుంటే’ అని ఉబికి వస్తున్న ఆలోచనను గుండెల్లోనే అదిమిపెట్టుకుంటూ,  చిన్నారి జీవికకు హృదయపూర్వక ఆశీస్సులు, అభినందనలు.

కింది ఫోటోలు:


కుడి నుంచి: శ్రీయుతులు ఏ. కృష్ణారావు, నేను, కె. రామచంద్ర మూర్తి, కె. శ్రీనివాస్, నందిరాజు, మా శర్మ, ఏ. శ్రీనివాసరావు, పీవీ ప్రభాకర రావు, జ్వాలా నరసింహా రావు 




(తోటలో అమ్మానాన్నల గుడిలో)










(05-01-2025)

అయాం ఎ బిగ్ జీరో (53) - భండారు శ్రీనివాసరావు

 1974, అక్టోబర్  2.

దక్షిణ మధ్య రైల్వే అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కృష్ణా ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవం ఆ రోజు జరగబోతోంది. ఆ రైల్వే జోన్ మొత్తంలో అతి వేగంగా నడిచే మొట్టమొదటి రైలును నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు పచ్చ జెండా ఊపి ప్రారంభించబోతున్నారు. సికిందరాబాదు రైల్వే స్టేషన్ లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తాము ఆహ్వానించిన పత్రికల జర్నలిష్టులకు కూడా రైల్లో విజయవాడ వరకు  ప్రయాణానికి, తిరిగి రావడానికి ఏర్పాట్లు జరిగాయి.

సమయపాలనకు పెట్టింది పేరైన ముఖ్యమంత్రి వెంగళరావు సకాలంలోనే వచ్చారు. పచ్చ జండా పట్టుకుని సిద్ధంగా నిలబడ్డారు. రైల్లో తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాల్సిన జర్నలిష్టులు, ప్లాట్ ఫారం పై ముఖ్యమంత్రి ఏమైనా మాట్లాడుతారేమో అని భావించి తమ లగేజి బోగీలో వదిలేసి ప్లాట్ ఫారం మీదనే నిలబడ్డారు. ఇంతలో ముఖ్యమంత్రి జెండా ఊపడం, రైలు కదలడం ఒకేసారి జరిగాయి. ఇది ఊహించని కొందరు పాత్రికేయులు ప్లాట్ ఫారం మీదనే వుండి పోయారు. మరికొందరు సాహసించి కదులుతున్న రైలును ఎక్కేశారు. మేము ఎక్కకుండానే రైలును ఎలా బయలుదేరదీసారని కొందరు జర్నలిష్టులు అధికారులతో వాగ్వాదం పెట్టుకున్నారు. దాంతో అధికారులు రోడ్డు మార్గంలో వెళ్ళడానికి, తరువాతి స్టేషన్ లో వారిని ఎక్కించడానికి అప్పటికప్పుడు ఏర్పాట్లు చేశారు. రైలు ఎక్కలేని పాత్రికేయులు రైల్వే వారు సమకూర్చిన టెంపోవ్యాను ఎక్కారు. ఒకపక్క అత్యంత వేగంగా ప్రయాణించే కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలు మార్గంలో దూసుకు వెడుతుంటే, మరో పక్క రోడ్డు మార్గంలో ఈ వ్యాను ప్రయాణం మొదలైంది. వ్యాను నకరేకల్ చేరే సమయానికి అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుని బలంగా డీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జర్నలిష్టులు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు తీవ్రమైన గాయాల పాలై జీవితాంతం అవిటివారిగానే మిగిలిపోయారు.

చనిపోయిన వారిలో హైదరాబాదు ఆకాశవాణి విలేకరి తురగా కృష్ణ మోహనరావు గారు, తెలంగాణా న్యూస్ సర్వీసు విలేకరి అజీజ్, మలయాళ మనోరమకు చెందిన టీవీ ఆనంద్ వున్నారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు చెందిన గంటి ఎస్. మహదేవన్, డెక్కన్ క్రానికల్ న్యూస్ ఎడిటర్ జివికె మూర్తి కు తీవ్ర గాయాలు అయ్యాయి. రెహనుమా డెక్కన్ పత్రిక విలేకరి హిలాల్ ముర్తుజాకు కాలు తొలగించాల్సి వచ్చింది. నిజానికి అప్పుడు ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పనిచేస్తున్న దాసు కేశవరావుగారు ఈ కార్యక్రమం కవర్ చేయాల్సి వుంది. అయితే ఆయన సీనియర్ కొలీగ్ మహదేవన్ గారికి  విజయవాడలో ఏదో సొంతపని వున్న కారణంగా ఆయన తనకు తానుగా ఈ బాధ్యత  నుంచి తప్పుకున్నారు. ఆవిధంగా అనుకోకుండా వెళ్ళిన  మహదేవన్ ప్రమాదానికి గురయ్యారు. ఆంధ్రజ్యోతి ప్రతినిధి ఆదిరాజు ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పుకున్నారు. కృష్ణా ఎక్స్ ప్రెస్ కదలడం గమనించిన ఆదిరాజు రైలు పూర్తి వేగం అందుకోక ముందే ఎగిరి దూకి బోగీలోకి ఎక్కారు. ఆ రోజుల్లో కమ్యూనికేషన్ సదుపాయాలు లేకపోవడం వల్ల ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సరే! మళ్ళీ ప్రస్తుతానికి వస్తే,

కృష్ణా ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవం గురించిన వార్త పత్రికకి ఇవ్వడానికి వచ్చిన ఆదిరాజు వార్త రాస్తూ రాస్తూ యు ఎన్ ఐ టిక్కర్ చూసి నిర్ఘాంతపోవడానికి కారణం అదే. ఆయనకు కూడా అప్పటివరకు ఈ ప్రమాదం గురించి తెలియదు. తర్వాత రైల్వే అధికారులతో మాట్లాడి, పూర్తి సమాచారం సేకరించి వార్త ఇచ్చారు. అప్పటివరకు సిగరెట్ మీద సిగరెట్ తాగడం తప్ప కప్పు కాఫీ కూడా తాగలేదు. అంతటి పని రాక్షసుడు ఆదిరాజు.

ఆ తర్వాత చాలా రోజులకు, నేను ఆఖరి నిమిషంలో కధాచిత్ గా దరకాస్తు చేసిన  ఆలిండియా రేడియో ఉద్యోగం, నకరేకల్ దుర్ఘటనలో  తురగా కృష్ణ మోహనరావు గారి ఆకస్మిక మరణం కారణంగా ఖాళీ అయిన పోస్టు. ఎమర్జెన్సీలో ప్రభుత్వ ఉద్యోగులు అందరు భయపడి పనిచేసిన కారణంగా కావచ్చు, నా అప్లికేషన్ సకాలంలో రేడియో వారికి చేరింది. కొంత కాలానికి ఇంటర్వ్యూ కు హైదరాబాదు రమ్మని పిలుపు వచ్చింది.

కింది ఫోటో:

తురగా కృష్ణ మోహనరావు గారు రాసిన మాట కచేరీ పుస్తకంపై ఆయన రేఖా చిత్రం



(ఇంకా వుంది)

2, జనవరి 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (52) - భండారు శ్రీనివాసరావు

 విషయం తెలియగానే, వెంటనే అమెరికన్ ఆసుపత్రికి వెళ్లాను. అదే మొదటిసారి అక్కడికి వెళ్ళడం. మధ్య మధ్య రమణి గారిని వెంటబెట్టుకుని వెళ్లి తానే పరీక్షలు చేయించుకుని వచ్చేది. అంచేత ఎలాంటి సమస్య లేకుండా వెంటనే అడ్మిట్ చేసుకున్నారు. నేను వెళ్ళే సరికే కానుపు అయిపోయింది. మగపిల్లవాడు. రమణి గారు నన్ను చూసి మెత్తగానే అంటించారు. ‘మీరు భలే వాళ్లండి బాబూ. నెలలు నిండిన ఆవిడని ఇంట్లో అలా వదిలేసి ఎలా వెళ్ళారండి అని మొహం మీదే అనేసారు. ఏదైతేనేం మొత్తం మీద కధ సుఖాంతం. ఆ సంతోషంలో నేను, అప్పుడే పుట్టిన పిల్లాడికి సంతోష్ అని పేరు పెట్టేశాను. చెప్పాను కదా! మా ఇంట్లో అంటే నా ఇంట్లో పిల్లలకు ఎవరికీ నామకరణాలు లేవు, బాలసారలు లేవు.  పెద్దవాడు మద్రాసులో ఆదివారం నాడు పుట్టాడు. సండే కాబట్టి సందీప్ అని పేరు పెట్టాను.

మా బామ్మ రుక్మిణమ్మ గారు కూడా ఇలాగే పేర్లు పెడుతుంటుంది. మా ఐదో అక్కయ్య పేరు అన్నపూర్ణ. మా మూడో వదిన పేరు కూడా అన్నపూర్ణ. అంచేత ఆమె పేరును అరుణగా మార్చేసింది. మా ఆవిడ పేరు దుర్గ. మొదటిసారి ఆమెను కంభంపాడులో చూసినప్పుడు,  దుర్గ కాదు, ఈ పిల్లది నిర్మలమైన మనసు, ఇక నుంచి ఈ పిల్ల పేరు నిర్మల అని అప్పటికప్పుడు నామకరణం చేసేసింది. అదే చివరికి ఖాయమైంది, పాసుపోర్టులోనే కాదు, డెత్ సర్టిఫికేట్ లో కూడా అదే పేరు.

మూడో రోజే డిశ్చార్జ్ చేశారు.  ఇంటికి తీసుకువచ్చాము. అప్పటి నుంచి మా ఇద్దరు  పిల్లల్ని ఇంటివాళ్ళే పెంచారు. ఇంటి ఓనరు రాములు  రమణి గార్లకు ముగ్గురు ఆడపిల్లలు, లక్ష్మి, ఝాన్సి, బుడ్డి, బబ్లూ. మా ఆవిడ ఆసుపత్రిలో ఉన్న మూడు రోజులు ఈ పిల్లలే మా పెద్ద పిల్లవాడు, అప్పటికి రెండేళ్ల వాడు, సందీప్ బాగోగులు చూసుకున్నారు.  తల్లికి సరిగా పాలు పట్టకపోవడం వల్ల, వాడు  పూర్తిగా డబ్బా పాల మీదే పెరిగాడు. ఆ రోజుల్లో అమూల్ స్ప్రే అని పాల డబ్బాలు వాడేవాళ్ళం. కొన్నాళ్ళు  వీటికి తీవ్రమైన కొరత వచ్చింది.  బెజవాడ వన్ టౌన్ లో ఒక షాపులో అధిక ధరలకు బ్లాకులో  అమ్మేవాళ్లు. అక్కడికి పోయి కొనుక్కుని వచ్చేవాళ్ళం.  మా మామగారు మద్రాసు నుంచి ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తుంటే వాళ్ళతో అమూల్ స్ప్రే పాల టిన్నులు ఒకేసారి డజను పంపించే వారు. రెండో వాడు సంతోష్ తో ఈ సమస్య ఎదురుకాలేదు. తల్లి పాలతోనే పెరిగాడు.

చాలీ చాలని జీతాలు. జీతం సరిగా లేకపోయినా సంఘంలో గౌరవ మర్యాదలు బోలెడు. ఆ తృప్తి కోసం కొంతా, వేరేదారి లేక కొంతా అదే గొర్రెతోక జీతపు  ఉద్యోగంలో కొనసాగాల్సి వచ్చింది. ఆ రోజుల్లో జ్యోతిలో పనిచేసే జర్నలిస్టులందరికి ఆంధ్రప్రభ ఓ ఆశారేఖ. ఏదో విధంగా అందులో కొలువు సంపాదించుకుంటే జీవితం కుదురుకుంటుంది అనే భరోసా ఆ వైపుగా ప్రయత్నాలు చేయడానికి దోహదం చేసింది. నిజానికి నండూరి రామమోహన రావు గారి దగ్గర పనిచేయడం అంత సులువు మరోటి వుండదు. ఆంధ్రప్రభ ఎడిటర్ పండితారాధ్యుల నాగేశ్వరరావు గారు మాకు బాగా   తెలిసిన వారే కాకుండా మా బావగారి తరపున బంధువు కూడా. వారి అన్నగారి కుమారుడు రమణారావుకు, పండితారాధ్యుల నాగేశ్వరరావు గారి అమ్మాయిని ఇచ్చారు. ఆ రోజుల్లో ఆయన తీవ్రమైన ఉబ్బసం జబ్బుతో సతమతమవుతున్నారు. చాలా రోజులు ఆఫీసుకు వెళ్ళకుండా ఇంటి నుంచే పత్రిక వ్యవహారాలు చూస్తుండేవారు. నేను మా ఆవిడ ఇద్దరం పదిరోజులకోమారు వాళ్ళ ఇంటికి  వెళ్లి కలిసే వాళ్ళం. మేము ఉన్నంతసేపు ఆయన దగ్గుతూనే వుండేవారు. అలాంటి పరిస్థితిలో ఏం మాట్లాడాలో, ఉద్యోగం ఎలా అడగాలో అర్ధం అయ్యేది కాదు. కానీ ఆయనే కష్టపడుతూ రెండు ముక్కలు సైగలతో చెప్పేవాళ్ళు. కాస్త ఉపశమనం దొరికి ఆఫీసుకు పోయిన తర్వాత నీ సంగతి చూస్తాను అని ఆయన అన్నట్టు అర్ధం చేసుకుని తిరిగి ఇంటిదారి పట్టేవాళ్ళం.   

ఈ లోగా ఎమర్జెన్సీ వచ్చి పడింది.

1975 జూన్ 25

దేశంలో ఎమర్జెన్సీ విధించిన చీకటి రోజది.

బెజవాడ ఆంధ్రజ్యోతిలో చేరి అప్పటికి నాలుగేళ్ళు గడిచాయి. వున్నట్టుండి 'ఎమర్జెన్సీ' అనే కొత్త పదం పత్రికాపారిభాషిక పదకోశంలో చేరింది. ఇంగ్లీష్ పత్రికలకు పరవాలేదు. తెలుగులో ఏమి రాయాలి. కొన్ని తెలుగు దినపత్రికలు 'అత్యవసర పరిస్తితి' అని అనువాదం చేసాయి. కానీ ఆంధ్రజ్యోతి ఎడిటర్ నార్ల వేంకటేశ్వర రావు గారిది ప్రత్యేక బాణీ. అందుకే ఆయన, అ కు దీర్ఘం పెట్టి, 'ఆత్యయిక పరిస్తితి' అని నామకరణం చేశారు.

ఆనాటి రాజకీయ పరిణామాల నేపధ్యంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో అత్యవసర పరిస్తితి విధించాలని నిర్ణయించారు. కేంద్ర మంత్రిమండలి జూన్ ఇరవై ఐదో తేదీ రాత్రి అత్యవసరంగా సమావేశమై ఎమర్జెన్సీ విధిస్తూ తీర్మానించింది. మంత్రివర్గ తీర్మానానికి అనుగుణంగా రూపొందించిన ఆర్డినెన్స్ పై నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ జూన్ ఇరవై అయిదు అర్ధరాత్రి అంటే మరి కాసేపట్లో ఇరవై ఆరో తేదీ ప్రవేశించే ఘడియకు కొన్ని నిమిషాల ముందు దానిపై సంతకం చేశారు. ఆ రోజుల్లో ఇప్పటిలా టీవీ ఛానల్లు లేవు. 'ఆకస్మిక సమాచారం' లేదా 'ఇప్పుడే అందిన వార్త' తెలుసుకోవాలన్నా, వినాలన్నా రేడియో ఒక్కటే దిక్కు. అంచేత ఆ అర్ధరాత్రి నిర్ణయం గురించి మరునాడు ఉదయం ఆరుగంటలకు ప్రసారం అయ్యే రేడియో ఇంగ్లీష్ వార్తల్లో కాని యావత్ దేశానికి తెలియని పరిస్తితి. ఆ మరునాడు పత్రికలన్నింటిలో 'ఎమర్జెన్సీ' అనేదే పతాక శీర్షిక. బెజవాడలో చాలామంది మిలిటరీ ప్రభుత్వం వచ్చిందని అనుకున్నారు కూడా.

దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులను వేల సంఖ్యలో అరెస్టు చేసి జైళ్ళలో పెట్టారు. పత్రికా వార్తలపై సెన్సార్ షిప్ విధించారు. పత్రికల సెన్సార్ షిప్ అంటే ఏమిటో అప్పటిదాకా పత్రికలకీ తెలియదు. అధికారులకీ తెలియదు. ఆ రోజుల్లో పత్రికలకి ప్రత్యేకించి తెలుగు దినపత్రికలకి నేటి మాదిరిగా అధునాతన ముద్రణాయంత్రాలు లేవు. ప్రతి అక్షరం ఏర్చి కూర్చి అచ్చుకు పంపాల్సిన రోజులు. కృష్ణా జిల్లా కలెక్టర్ గారు సంతానం గారి పనుపున ఆనాటి సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు సెన్సార్ పనులు పర్యవేక్షించేవారు. ఏవార్త పత్రికలో ముద్రించాలి ఏది రాకూడదు అని ఆయనే నిర్ణయించేవారు. ఆ అధికారి కార్యాలయం గాంధీ నగర్ లో వుండేది. ఆంధ్రజ్యోతి ఆఫీసు లబ్బీపేటలో. ప్రతిరోజూ సాయంత్రం ప్రచురించే వార్తల్ని అచ్చులో కూర్చి అక్కడికి పట్టుకెళ్ళేవాళ్లు. కొన్నాళ్ళ తరువాత ఏది వేయాలో ఏది వేయకూడదో పత్రికలకే అలవాటు కావడంతో రోజూ తీసికెళ్ళే శ్రమ తగ్గిపోయింది. ఈలోపల ఇండియన్ ఎక్స్ ప్రెస్ అందరికీ ఓ దోవ చూపింది. వాళ్లు సంపాదకీయం ప్రచురించే జాగాను ఖాళీగా ఒదిలేయడం మొదలెట్టారు. దాంతో మిగిలిన వాళ్లు అందిపుచ్చుకుని సెన్సార్ అయిన వార్తల జాగాను ఖాళీగా తెల్లగా కనబడేట్టు ఒదిలేసి పత్రికలు ప్రచురించడం ప్రారంభించారు. ఈ నిరసన సులభంగానే ప్రజల్లోకి చేరింది. పత్రికలపై సెన్సార్ షిప్ గురించి జనం మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఇదో కధ.

మరో వైపు ఎమర్జెన్సీ దమన కాండ ఉత్తర భారతంలో అమలు జరుగుతున్న తీరు గురించి పుంఖానుపుంఖాలుగా వదంతులు వ్యాపించేవి. దక్షిణ భారతంలో ప్రత్యేకించి కాంగ్రెస్ పాలనలో వున్న ఆంధ్రప్రదేశ్, కర్నాటకల్లో పరిస్తితి కొంత మెరుగు. ఈ రాష్ట్రాల్లో కూడా రాజకీయ అరెస్టులు బాగానే జరిగాయి. కానీ ఉత్తర భారతంలో మాదిరిగా నిర్బంధ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు, ఇళ్ళ కూల్చివేతలు జరగలేదు. పైపెచ్చు, ప్రజానీకంలో ముఖ్యంగా బీదాబిక్కీకి అసలీ గొడవే పట్టలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడగడానికీ, తీసుకోవడానికీ భయపడిపోయేవాళ్ళు. ఫైళ్ళు చకచకా కదిలేవి. తెల్లవారుతూనే రోడ్లు శుభ్రంగా వూడ్చేవాళ్ళు. రోడ్డుపక్కన మూత్రవిసర్జన అనేది కలికానికి కూడా కానరాకుండా పోయింది. ఎమర్జెన్సీ బాగా వుందని కూడా జనం అనుకోవడం ప్రారంభించారు. మొదట్లో ధరవరలు కూడా ఆకాశం నుంచి దిగివచ్చాయి. బ్లాకు మార్కెట్ మాయమయింది.

అయితే ఏ భయం అన్నా కొన్నాళ్ళే అని తర్వాత తేలిపోయింది. జనంలో అంతకు ముందు వున్న బెరుకు పోయింది. అధికారుల్లో అది అంతకు ముందే పోయింది. దాంతో కధ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇదో కధ. ఒదిలేద్దాం.

ఒక రోజు మా పెద్దన్నయ్య ఒక పత్రికలో ఓ మూలన చిన్నగా వేసిన ఒక ఉద్యోగ ప్రకటన క్లిప్పింగు నాకు ఇచ్చాడు.

హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్ (రిపోర్టింగ్) ఉద్యోగం. బేసిక్ జీతం 325 రూపాయలు. జర్నలిజంలో మూడు నాలుగేళ్లు అనుభవం వున్న వాళ్ళు, తెల్లకాగితంపై వివరాలు రాసి  ఆ నెలాఖరు లోగా అప్లయి చేసుకోవాలి. వ్రాత పరీక్ష లేదు. నేరుగా అర్హులైన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు.  అన్నయ్య నాకు ఆ క్లిప్పింగు  ఇచ్చాడు అంటే అర్ధం దరఖాస్తు పెట్టమని పరోక్షంగా సూచన అన్నమాట. చాలా రోజులు తర్జనభర్జనలు పడి, చివరకు  ఎల్లుండి ఆఖరు రోజు అనగా ఒక దరఖాస్తు మామూలు పోస్టులో  పంపి ఆ విషయం మరిచిపోయాను.   

కొన్ని నెలలు వెనక్కి వెడితే.

ఆ రోజు ఆఫీసులో పనిచేసుకుంటూ వుండగా ఆంధ్రజ్యోతి హైదరాబాదు ప్రతినిధి ఆదిరాజు వెంకటేశ్వర రావు గారు హడావిడిగా మెట్లెక్కి ఎడిటోరియల్ హాలులోకి వచ్చారు. ఆయన రావడం అంటే తుపాను వచ్చినట్టే. ఆదిరాజు గారిని పదిమందిలో వున్నా, వందమందిలో వున్నా గుర్తుపట్టవచ్చు. ఒక్క సివిల్ కోర్టు ఆవరణలో తప్పిస్తే కోటు వేసుకున్నవాళ్ళు బెజవాడ మొత్తం మీద కనబడరు. ఈయన ఎప్పుడూ ఫుల్ సూటు, టై. నిగనిగలాడే బూట్లు, ఒక చేతిలో బ్రీఫ్ కేసు, రెండో చేతి వేళ్ళ మధ్యలో వెలుగుతున్న సిగరెట్టూ. రావడం రావడమే ఒక కుర్చీ బల్ల దగ్గరకు లాక్కుని వార్త రాయడం మొదలు పెట్టారు. అంతవరకూ ఎవరితో మాటాపలుకూ లేదు. దీక్షగా రాస్తూ పోయారు. ఈ లోగా పక్కనే వున్న యూఎన్ఐ క్యాబిన్ నుంచి గంట వినపడింది. ఏదైనా అర్జంటు వార్త వచ్చినప్పుడు అలా గంట మోగుతుంది. ప్యూన్ వెళ్ళేలోగా ఆదిరాజుగారే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ వార్తా సంస్థ పంపిన వార్త కాగితాన్ని చించుకుని వచ్చారు. దాన్ని చూస్తూనే మ్రాన్పడి పోయారు. ఏదో జరిగిందని ఆయన మొహంలోని ఆందోళన బట్టి తెలుస్తోంది కానీ ఏమి జరిగిందన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు. అంతవరకూ రాసిన కాగితాలను డస్ట్ బిన్ లో పడేసి కొత్తగా రాయడం మొదలు పెట్టారు.  విషయం ఏమిటి అని అడిగే ధైర్యం ఎవరికీ లేదు. అందరం అలా చూస్తూ వుండిపోయాం.

కింది ఫోటో:

ప్రముఖ పాత్రికేయుడు ఆదిరాజు వెంకటేశ్వరరావు



(ఇంకా వుంది)