20, సెప్టెంబర్ 2024, శుక్రవారం

చివరి మూడు రోజులు



సెప్టెంబర్ 22 ఆదివారం ఉదయం అమెరికా నుంచి తిరుగు ప్రయాణం.
సియాటిల్ నుంచి బయలుదేరి సాల్ట్ లేక్ సిటీ మీదుగా రాత్రంతా విమానంలో ప్రయాణం చేసి  బాల్టిమోర్ ఎయిర్పోర్ట్ చేరుకునే సరికి ఉదయం ఆరుగంటలు. మా మూడో అన్నయ్య కుమారుడు సత్య సాయి వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకు వెళ్ళాడు. రాత్రి నిద్ర మొత్తం బుధవారం పగటి వేళ బాకీ తీర్చుకున్నాము. 
ఎందుకంటే మర్నాడు గురువారం ఆ మర్నాడు శుక్రవారం హెక్టిక్ స్కెడ్యూలు. మా అన్నయ్య పిల్లలు అమెరికాలో వుండడం వల్ల నా ప్రయాణం నల్లేరు మీద బండిలా సాగుతోంది. ప్యాంటు జేబులో దువ్వెన తప్ప చేతి సంచీ బరువు కూడా నన్ను మోయనివ్వడం లేదు. 
ఒకరకంగా చెప్పాలి అంటే గవర్నర్ గారి పర్యటన మాదిరిగా వుంది. అన్నీ ఎరెంజ్ చేసి కారు, విమానం ఎక్కమంటారు.
గురువారం అంతా అమెరికా రాజధాని వాషింగ్ డీ సీ అంతా కలయ తిరిగాము. Nations' most famous adress వైట్ హౌస్ మా ప్రియారిటీ.
సెక్యూరిటీ హడావిడి వుంటుందని అనుకుంటూ వెడితే అక్కడ ముగ్గురు నలుగురు సాయుధ పోలీసులు మాత్రమే కనిపించారు. ముందుగా ఆన్ లైన్లో బుక్ చేసుకుంటే విజిటర్లను లోపలకు కూడా  అనుమతిస్తున్నారు.
విచిత్రం ఏమిటంటే వైట్ హౌస్ కు వెళ్ళే మార్గంలో పేవ్ మెంట్ మీద ఇద్దరు బిచ్చగాళ్ళు కనిపించారు. అదే దోవలో పేవ్ మెంట్ పై వచ్చే నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో  పోటీ పడుతున్న కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ చిత్రాలు వున్న టోపీలు, టీ షర్టులు అమ్ముతున్నారు.
అమెరికా పార్లమెంట్, లింకన్ మెమోరియల్, వాషింగ్ టన్ మెమోరియల్ (ఎత్తైన స్థూపం) చూసాము. 
అమెరికా రాజధానిలో మేము చూసినంతవరకు ఆకాశ హర్మ్యాలు కానరాలేదు. దానికి కారణం వాషింగ్ టన్ మెమోరియల్ స్థూపం కంటే మించి ఎత్తైన భవనాలు నిర్మించరాదని చట్టం వుందని చెబుతారు.
సాయంత్రం తిరిగి బాల్టి మోర్ వస్తూ రీగన్ ఎయిర్పోర్ట్ సమీపంలో గ్రెవెల్లీ పాయింట్ అనే ఒక టూరిస్ట్ ప్రాంతానికి వెళ్ళాము. అప్పటికే అక్కడ వందకు పైగా వాహనాలు పార్కింగు ఏరియాలో ఆగిఉన్నాయి. విమానాశ్రయం నుంచి బయలుదేరే లేదా అక్కడ ల్యాండ్ అయ్యే విమానాలను ఆ పాయింట్ నుంచి చాలా దగ్గరగా చూడవచ్చు.
హైదరాబాదు బేగంపేటలో ఎయిర్పోర్ట్ వున్నప్పుడు దగ్గరలో ఒక ఫ్లై ఓవర్ మీద నిలబడి,  ఇలానే వచ్చిపోయే విమానాలను జనం ఆసక్తిగా చూసిన సంగతులు గుర్తుకు వచ్చాయి. 
విమానాలను కనుక్కున్న దేశం అమెరికా. ఎగిరే విమానాలను దగ్గర నుంచి చూడాలని వందలమంది కార్లలో తరలి వెడుతున్న దేశం అమెరికా. చిత్రంగా అనిపించడంలో ఆశ్చర్యం ఏముంది?.
అయితే ఒక విషయం ఒప్పుకుని తీరాలి. 
ఎంత చిన్న విషయాన్ని అయినా పర్యాటక ఆకర్షణగా మార్చి జనాలను రప్పించడంలో వారి తెలివితేటలు అమోఘం.
ఇక రేపు అంటే శుక్రవారం ఉదయం న్యూయార్క్ ప్రయాణం.
అమెరికాలో పర్యాటక ప్రదేశాలు చుట్టబెట్టాలి అంటే  ముందు సిద్ధపడాల్సింది కాలి నడకకు.

18, సెప్టెంబర్ 2024, బుధవారం

లేక్ మిచిగాన్

లేక్ మిచిగాన్ - భండారు శ్రీనివాసరావు 

బాల్టి మోర్ చేరడానికి ఇంకా గంటన్నర విమాన ప్రయాణం ఉందనగా నిద్ర లేచిన మా కోడలు భావన, అదేమిటి పాపా మీరు రాత్రల్లా మేలుకునే వున్నారా అని అడిగింది. 
నా దగ్గర జవాబు ఏముంటుంది? ఇది నాకు అలవాటే అని చెప్పలేకపోయాను.
డెల్టా విమానం వెళ్ళే మార్గం ఎదురుగా వున్న చిన్న టీవీ తెరపై కనపడుతూ వుంది. అదేమిటో వెయ్యి కిలోమీటర్ల దూరం దాటివచ్చినట్టు, ప్రస్తుతం అమెరికాలోనే పెద్ద సరస్సు లేక్ మిచిగాన్ మీదుగా వెడుతున్నట్టు ఆ టీవీలో కనపడుతోంది. ఇంకా విచిత్రం ఏమిటంటే అమెరికాలో పెద్ద నగరాలు అయిన డెన్వర్, చికాగో వంటి నగరాల పక్కగా ప్రయాణం సాగుతోంది అనిపిస్తోంది. కానీ ఆ నగరాలు వందల మైళ్ళ దూరంలో వుండవచ్చు. కొన్ని వేల అడుగుల పైనుంచి తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రం కావడం చేత నేను అలాంటి భ్రాంతికి గురై వుండవచ్చు.
చూస్తుండగానే లేక్ మిచిగాన్ కూడా దాటినట్టే వుంది.
సరే కానీ మైళ్ళ కొద్దీ విస్తరించిన ఈ చెరువులు కబ్జాకు గురి కాకుండా ఎలా మనుగడ సాగిస్తూ వున్నాయబ్బా! 
కారణం ప్రభుత్వాలా! ప్రజలా!

సాల్ట్ లేక్ సిటీ

సాల్ట్ లేక్ సిటీ - భండారు శ్రీనివాసరావు 

ఏ వార్తకు అయినా డేట్ లైన్ ముఖ్యం. ఎప్పుడు, ఎక్కడ అనేది పేర్కొంటూ వార్త రాయడం అనేది జర్నలిస్టులకు వారి గురువులు నేర్పే తొలి పాఠం.
నేనిప్పుడు ఈ పోస్టులు రాస్తున్నప్పుడు సమయం సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలు. సియాటిల్ నుంచి మధ్యలో సాల్ట్ లేక్ సిటీ ఎయిర్ పోర్టులో దిగి మళ్ళీ బాల్టి మోర్ వెళ్ళే విమానం ఎక్కాము. డెల్టా ఎయిర్ లైన్స్ లో అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా ఎయిర్ హోస్టెస్ లు సకల మర్యాదలు చేస్తున్నారు. దానికి తోడు 30 వేల అడుగుల ఎత్తున కూడా వై ఫై సదుపాయం ఉంది. డెల్టా ఫ్లయి మైల్స్ స్కీం కింద ఈ అదనపు ఏర్పాటు అనుకుంటా. 
కింది ఫొటో సాల్ట్ లేక్ సిటీ ఎయిర్ పోర్టులో. ఈ ప్రాంతంలో ప్రధానమైన పర్యాటక ఆకర్షణ కేనియన్స్ (ప్రకృతి సిద్ధమైన లోతయిన లోయలు). 
వాటికి సంకేతంగా ఇక్కడి ఎయిర్ పోర్ట్ ను కేనియాన్స్ ఆకారంలో తీర్చి దిద్దారు.
18-9-2024

బై బై సియాటిల్

బై బై సియాటిల్ 

అమెరికా వచ్చిన పని ముగిసింది. మంగళ వారం సాయంత్రం సియాటిల్ నుంచి సాల్ట్ లేక్ సిటీ, అక్కడ నుంచి బుధవారం (అమెరికా టైం) ఉదయానికి బాల్టి మోర్, 22 ఉదయం వాషింగ్ టన్ డీ సీ నుంచి హైదరాబాద్.
23 జింబో నగర ప్రవేశం. మళ్ళీ నా రొటీన్ మొదలు.
డెల్టా ఎయిర్ లైన్స్ లో నేను, మా వాడు, కోడలు కలిసి ప్రయాణం. సియాటిల్ ఎయిర్పోర్ట్ లో బాగా సమయం వుండడం వల్ల ఎత్తైన అద్దాలనుంచి రన్ వే లపై ఎగురుతున్న, దిగుతున్న విమానాలను చూస్తూ కాలక్షేపం చేసాను. ఎవరో బలమైన కుర్రాడు కాగితంతో విమానాలు తయారు చేసి గాలిలోకి మరింత బలంగా విసురుతున్నట్టు నిమిషానికో విమానం అలా ఆకాశంలోకి ఎగిరి కనుమరుగు అయ్యే దృశ్యాలు చూడడం అదో అనుభూతి. 
ఆకాశంలో 37 వేల అడుగుల ఎత్తులో ఉదయించిన పూర్ణ చంద్రుడు నా మొబైల్ లో చిక్కాడు.
17-9-2024

17, సెప్టెంబర్ 2024, మంగళవారం

తిన్నడి మార్గమే తిన్నని మార్గం



పురాణాల్లో చక్కటి నీతి కధలు వున్నాయి. పురాణాలు కధలా అనే వాదన తేకండి. అవన్నీ మనిషి మనిషిలాగా ఎలా జీవించాలి అని చెప్పేవే.
చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా అన్నారు. అంటే ఏమిటి దైవాన్ని అర్చించడానికి మడులు దడులు అక్కరలేదు. ఈ విషయం మనకు కిరాతార్జునీయం గాధలో స్పష్టంగా కనబడుతుంది. శుచిగా వండిన ప్రసాదాల కంటే ఆ పరమేశ్వరుడికి భక్తితో తిన్నడు సమర్పించిన మాంస ఖండాలే ప్రీతికరం అంటూ పెద్దలు బోధించిన నీతి కధలు వింటూ పెరిగిన తరానికి కూడా మంచి వాక్యాలు రుచించడం లేదు. ఇదొక విషాదం.

16, సెప్టెంబర్ 2024, సోమవారం

18-21-11.40

 18-21-11.40
భండారు శ్రీనివాసరావు 

అమెరికా అనేది అగ్ర దేశమే కాదు వింతలు విడ్డూరాల గడ్డ అనిపిస్తుంది కొన్ని కొన్ని వింటుంటే. విన్నవాటిలో నిజమెంతో కానీ, నిజమా అనిపించక మానదు. బాల్య కౌమార యవ్వన వృద్ధాప్య అవస్థల మాదిరిగా ఇక్కడ మనిషి జీవితంలో ప్రతి దశకు కొన్ని వయసు నిబంధనలు. అన్ని రాష్ట్రాలలో వీటి తీరు ఒక్కతీరుగా వుండక పోవడం మరో విడ్డూరం. దేనికి దానికి నిబంధనలు ప్రత్యేకం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడానికి కనీస వయసు 21. డ్రైవింగ్ లైసెన్స్ కు 18. కొన్ని చోట్ల 16 ఏళ్లు సరిపోతాయిట. ఇక్కడ కారు లేకపోయినా, కారు నడపలేకపోయినా జీవితం క్లిష్టతరం అవుతుంది కాబట్టి ఈ వెసులుబాటు అంటారు. అయితే 18 ఏళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు కానీ 21 ఏళ్లు వచ్చేవరకు అర్ధరాత్రుళ్ళు కారు నడపకూడదు. ఒకవేళ అలా నడిపి ఆక్సిడెంట్ చేస్తే నేరమే కాకుండా వెహికిల్ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేయలేరు. 
కిందటి నెలలో మాకు తెలిసిన వాళ్ళ పిల్లలు రాత్రి పదకొండున్నరకు ఎక్కడో డిన్నర్ చేసి ఇంటికి తిరిగి వెడుతున్నారు. వాళ్లకు డ్రైవింగ్ కొత్త కాదు. అన్ని రకాల కార్లు నడపడంలో ప్రావీణ్యం వుంది. లైసెన్సులు కూడా వున్నాయి. కాకపోతే ఎవరికీ 21 నిండలేదు. మరో పది నిమిషాల్లో ఇల్లు చేరుతారు అనే సమయంలో, అడవి మార్గం కావడం వల్ల రోడ్డు మీద అడ్డంగా వచ్చిన ఓ జంతువును తప్పించబోయే ప్రయత్నంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన గోతిలోకి జారిపోయి తలకిందులు అయింది. కార్లో వున్న ముగ్గురు సీటు బెల్టులు పెట్టుకోవడం వల్ల ఎవరికీ ఏమీ కాలేదు. అడవి కావడం వల్ల మొబైల్ సిగ్నల్స్ లేవు. కాకపోతే, ప్రమాదం ఇంపాక్ట్ కు ఎయిర్ బ్యాగ్   బెలూన్లు తెరుచుకున్నాయి. అలా తెరుచుకోవడంతో ఆటోమేటిక్ గా ప్రమాదం ఎక్కడ జరిగింది అనే సమాచారం క్షణాల్లో పోలీసులకు  అందింది. కొత్తగా మార్కెట్ లోకి వస్తున్న  కార్లలో ఇలాంటి సాంకేతిక సదుపాయం వుందట. దాంతో ప్రమాదంతో పాటు లోకేషన్ కూడా తెలుసుకున్న పోలీసులు  వెంటనే అక్కడకు చేరుకోగలిగారు. ఎవరికీ ఎలాంటి గాయాలు తగలనందున,  మరో పోలీసు వాహనాన్ని నిమిషాల్లో పిలిపించి ఆ ముగ్గుర్నీ ఇంటికి క్షేమంగా చేర్చి జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోవడంతో కధ సుఖాంతం అయింది. 
ఇదిగో ఇక్కడే ముందు చెప్పిన అంకెలు వాళ్లకు అక్కరకు వచ్చాయి. 
డ్రైవ్ చేస్తున్న పిల్లవాడికి 18 ఏళ్లు. కానీ 21 నిండలేదు. కాబట్టి అర్ధరాత్రి 12 తర్వాత కారు నడప కూడదు. అయితే ఆక్సిడెంట్ జరిగిన టైం 11.40. ఇరవై నిమిషాలు ముందే జరిగింది కాబట్టి కేసు అవసరం రాలేదు . అదొక అదృష్టం. లైసెన్స్ రద్దు అయితే అమెరికాలో బతుకు దుర్భరం. 
ఇక కారు ఇన్స్యూరెన్స్.
కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నాయి కాబట్టి, వాటిని రిపేర్ చేయడం అసాధ్యంగా భావించిన, బీమా కంపెనీ వారు కొత్త కారు కొనుక్కోవడానికి గాను, అందుకయ్యే పూర్తి మొత్తాన్ని పరిహారంగా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. మూడు వారాల లోపే కొత్త వాహనాన్ని, తమకు ఇష్టం వచ్చిన మోడల్ ది, కాణీ అదనపు ఖర్చు లేకుండా కొనుక్కున్నారు. 
జరిగింది ప్రమాదమే అయినా,  రూల్స్ అన్నీ కలిసి రావడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.
ఇలాంటిదే మన దగ్గర జరిగితే పరిణామాలు ఎలా వుంటాయో  ఊహించడం కష్టమేమీ కాదు. పోలీసులనుంచి, బీమా కంపెనీల నుంచి ఎదురయ్యే ప్రశ్నలు, కష్టాలు ఇన్నీ అన్నీ కాదు అనేది అందరికీ తెలిసిన విషయమే.
ఇక్కడే ఒక విషయం చెప్పదలచుకున్నాను. 
మాన్యులకు, సామాన్యులకు చట్టాలు ఒకే విధంగా అమలు జరిగితే, 
మన దేశంలోనే కాదు,  ఏ దేశంలో కూడా  పౌరులు ప్రభుత్వాలు విధించే నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించరు.
కాకపొతే, అవి అమలు చేసే/ జరిగే తీరు పట్లే వారి కినుక. 
(16-9-2024)

జీవనయానం

జీవనయానం - భండారు శ్రీనివాసరావు 

నడుస్తూనే వున్నాను
గత  డెబ్బయ్ ఏడేళ్లుగా,
వాగులు  వంకలు దాటుకుంటూ
దారులు డొంకలు వెతుక్కుంటూ 
నడుస్తూనే వున్నాను 
కొన్ని చోట్ల నా దారి రహదారి
పలు చోట్ల దారంతా వరద గోదారి
ముళ్ళకంపలు, చీకు మొక్కలు,
గుంటలు, గతుకులు.
పడుతూ లేస్తూ
నడుస్తూ వస్తుంటే అదోరకం  ఆనందం
అలా నడుస్తూ పోతుంటే మరో రకం విషాదం 
ఈ నడక ఎన్నాళ్ళో తెలియదు
పరుగులాంటి నడకకు చివరి మజిలీ ఏదో  తెలుసు
కానీ చేరేదేప్పుడో మాత్రం  తెలవదు
అయితే ఈ నడకలో నేను వొంటరిని కాను
నాతోపాటు కోటానుకోట్లమంది భుజం భుజం కలిపి నడుస్తూనే వున్నారు
వారిలో కొందరే తెలుసు, కొందరసలే తెలియదు
చాలా మంది ఎవ్వరో తెలియదు కానీ కలిసి నడవక తప్పదు
కొందరి భాష తెలుసు మరికొందరి యాస తెలుసు
చాలామంది ఊసే తెలవదు
నడిచి నడిచి ఒక్కోసారి అలసట అనిపిస్తుంది.
కానీ ఆగే పని లేదు,  ఆగడం మన చేతిలో లేదు
ఆగితే మాత్రం ఆగినట్టే
ఇక అక్కడితో నడక ఆగినట్టే
అదే ఆఖరి అడుగు
అదే చివరి మజిలీ 
కలిసి నడుస్తున్న వాళ్ళు లిప్తపాటు ఆగి చూస్తారు
అంతే!
మళ్ళీ నడక మొదలెడతారు.
నన్ను దాటుకుంటూ ముందుకెడతారు
నేను అక్కడే ఆగిపోతాను  
అయినా ఈ జీవన యానం అంతటితో  ముగిసేది కాదు 
ముగిసినట్టు అనిపించినా నిజానికి అది ముగింపు కాదు
తెలియని మరో ప్రయాణానికి కొనసాగింపు.

Note: Courtesy Image Owner