1, మార్చి 2023, బుధవారం

ఏకాకి జీవితం – భండారు శ్రీనివాసరావు

 

ఒకానొక రోజుల్లో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించిన సంగతి దేశంలో కొన్ని కోట్ల మందికంటే, కొన్ని లక్షల మంది కంటే, కొన్ని వేలమంది కంటే కూడా నాకు ముందు తెలిసింది. జర్నలిస్టుని కావడం అందుకు కారణం.
పక్కింటి వాళ్ళు వ్రతం చేసుకుంటున్న సంగతి, పిలిచి వెళ్ళిన సంగతి మాత్రం గుర్తుండదు. తెలియదు. చాలా దగ్గరి వాళ్ళ ఇంట్లో వివాహం ఎప్పుడో ఎక్కడో తెలియదు. వధూవరుల పేర్లు తెలియదు. బాగా కావాల్సిన వాళ్ళ పిల్లల పేర్లు గుర్తుండవు, తెలియవు. అలాగే పెళ్లి రోజులు, పుట్టిన రోజులు వాట్సప్ చూస్తేనే కానీ గుర్తు రావు. ఛీ పాడు జీవితం.
అదే భార్య వుంటే ..
రెడీ రికనర్. గూగులమ్మకు అమ్మలగన్న అమ్మ.
(01-03- 2023)

ఇంగువ కట్టిన గుడ్డ - భండారు శ్రీనివాసరావు

వీలున్నప్పుడు మా చర్చలకు రాకూడదా! అంటూ ఏబీఎన్ ఛానల్ సీనియర్ యాంకర్ ఒకరు మెసేజ్ పెట్టారు. స్టూడియోలకు వెళ్లి చర్చల్లో పాల్గొనడం బాగా తగ్గించి మూడేళ్లు దాటుతోంది. అయినా ఇంగువ వాసన ఎంతో కొంత వుంటుంది కదా! అప్పుడప్పుడు ఇలా పిలుపులు అన్ని ఛానల్స్ నుంచి వస్తూనే వుంటాయి. మృదువుగా నో చెప్పడం ఇక్కడే అలవాటు అయింది.

2005 లో దూరదర్సన్ నుంచి రిటైర్ అయిన తర్వాత మొదలయిన టీవీ చర్చల అధ్యాయం 2019లో నా భార్య మరణించే వరకు నిరాఘాటంగా కొనసాగింది. ఆ రోజుల్లో టీవీల వారాలబ్బాయి అని అనేవారు. సోమవారం ఉదయం ఒక టీవీ చర్చకు వెడిత మళ్ళీ ఆ టీవీ స్టూడియోకి మరుసటి సోమవారం చర్చకు వెళ్ళడమే. ఆ తర్వాత ఆరు రోజులు ఒక్కో పూట ఒక్కో టీవీకి అన్నమాట. ఇక మధ్యాన్నం సాయంత్రం, రాత్రి వేళ చర్చలు అదనం. అసలు ఉద్యోగం చేసే రోజుల్లో కంటే రిటైర్ అయిన తర్వాతనే ఎక్కువ బిజీగా జీవితం మారిపోయింది. ఎక్కడా కప్పు కాఫీ తాగరాదు అనే నియమం కారణంగా ఆ భారం మా ఆవిడ మీద పడేది. HMTV (AS Rao Nagar) 99 TV (Kondapur) వంటి దూరాభారపు టీవీలకు వెళ్ళాలి అంటే కారులో దాదాపు ముప్పావుగంట ప్రయాణం. పొద్దున్నే లేచి నేను తయారు అయ్యే లోపల మా ఆవిడ వేడివేడిగా టిఫిన్, కాఫీ సిద్ధం చేసేది. వీటికోసం నా కంటే ముందుగానే నిద్ర లేచేది. అన్ని సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా ఏ టీవీకి ఒక్కటంటే ఒక్క నిమిషం కూడా ఆలస్యంగా వెళ్ళలేదు. గెస్టులు ఆలస్యంగా వస్తే ఎంత ఇబ్బందో నాకు రేడియో, దూరదర్సన్ రోజుల నుంచే తెలుసు.
ముందు రోజు సాయంత్రం ప్రతి టీవీ కో ఆర్డినేటర్ ఫోన్ చేసి ప్రోగ్రాం గుర్తు చేసేవారు. మళ్ళీ మరునాడు ఉదయం కారు పంపించామని ఫోన్ చేసి చెప్పేవారు. టీవీల్లో వీరికి జీత భత్యాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ, నానా చాకిరీ చేసేవారు. సబ్జెక్టును బట్టి యాంకర్ కోరిన గెస్టును నిమిషాల్లో స్టూడియోలకి రప్పించే సామర్ధ్యం వీరికి పుష్కలం. నాకు మాత్రం మినహాయింపు. నేను ముందుగా నిర్ణయించుకున్న టైం టేబుల్ ప్రకారమే వెళ్ళే వాడిని. ఈరోజు వెడితే మళ్ళీ ఏడు రోజుల తర్వాతనే.
ఏబీఎన్ సాల్మన్, సాక్షి సూర్యనారాయణ, శ్రీనివాసరెడ్డి, NTV నేతాజీ, 10 TV కార్తీక్, TV 5 భాను, TV 9 ETv శ్రీకాంత్, HMTV శ్రీనివాస్, V6 గోపి, T News శంకర్, AP 24 x 7 రాజేంద్ర, 99 TV నేతాజీ, జెమినీ న్యూస్ శ్రీనివాస్, PRIME 9 నరసింహాచార్యులు, MAHA NEWS ఆరిఫ్ షేక్, I News మోహన్, Bharath Toady TV సుబ్రహ్మణ్యం, రత్నకుమార్, Sneha TV గౌస్, (Express TV, 6 TV వంటివి తారల్లా ఓ వెలుగు వెలిగి మాయమయ్యాయి) ఇలా వీళ్ళందరూ కాలక్రమంలో నాకు మంచి స్నేహితులు అయ్యారు. ఇప్పటికీ వారితో నా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. నిజానికి వారందరినీ గుర్తు చేసుకోవడానికే ఈ పోస్టు రాస్తున్నాను. TV 9, CVR News కి కూడా వెళ్ళే వాడిని కానీ వెళ్ళిన సందర్భాలు అతి తక్కువ.
థాంక్స్ చంద్రిక గారు. అందర్నీ ఓమారు గుర్తు చేసుకునేలా చేశారు.
కొసమెరుపు:
"ఈమధ్య టీవీ చర్చల్లో కనిపించడం లేదేమిటి' అని అడిగారో పెద్దమనిషి.
నా జవాబు కోసం ఎదురు చూడకుండా ఆయనే అన్నారు మళ్ళీ.
"మంచిదేలెండి. విశ్లేషకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడేదాంట్లో పెద్ద తేడా వుండడం లేదు"
నోరు తెరవకపోవడం మంచిదయింది.
01-03-2023

27, ఫిబ్రవరి 2023, సోమవారం

మై హూ నా! – భండారు శ్రీనివాసరావు


(Published in Andhra Prabha daily on 26-02-2023, SUNDAY)


ఎవరి పరిపాలనలో అయితే పాలకుల ప్రమేయం లేకుండా పాలితులకు రోజువారీ జీవితం హాయిగా

గడిచిపోతుందో ఆ పరిపాలనను సుపరిపాలనగా చాణక్యుడు అభివర్ణించారు.


మూడు దశాబ్దాలకు పూర్వం మాస్కోలో, రేడియో మాస్కోలో పనిచేసే అవకాశం నాకు లభించింది. 1990 లో ఓ సెలవు రోజున ఢిల్లీ నుంచి మాస్కో  వస్తున్న ఓ మిత్రుడిని రిసీవ్ చేసుకోవడానికి భార్యా పిల్లలతో కలిసి మాస్కో నగర పొలిమేరల్లో వున్న షెర్మేతోవా అంతర్జాతీయ విమానాశ్రయానికి టాక్సీలో బయలుదేరాను. విపరీతంగా మంచు కురుస్తోంది. మార్గమధ్యంలో వుండగా కారు టైర్లు మంచులో  జారిపోయి ఓ పక్కకు వెళ్లిపోయింది. ఏం జరిగిందా అని ఆందోళన మొదలయ్యేలోగా, మంచు తెర కమ్మిన కారు కిటికీ అద్దం వెనుక ఆరున్నర అడుగుల భారీ శరీరం కనిపించింది. నల్లటి యూనిఫారం చూడగానే అతడు ట్రాఫిక్ పోలీసు అని గుర్తు పట్టాను. ఇంత  మంచువర్షంలో హఠాత్తుగా ఇతడెలా ప్రత్యక్షం అయ్యాడో అర్ధం కాలేదు. ఇప్పుడీ కేసు తేలేదాకా రోడ్డు మీద అవస్థలు తప్పవేమో అని భయపడుతున్న సమయంలో, ఆ పోలీసు రెండు కాళ్ళు నేల మీద గట్టిగా చరిచి, ఫుల్ సెల్యూట్ చేయడంతో మా మొహాల్లో  భయం తగ్గిపోయి ఆశ్చర్యం ఆవరించింది. పౌరులకు అక్కడి పోలీసులు ఇచ్చే మర్యాద అని తరువాత తెలిసింది. అతడు ఆ మంచులో కారు దిగవద్దని మాకు  సైగలు చేస్తూ, వాకీ టాకీలో  మాట్లాడుతున్నాడు. కొద్ది నిమిషాల్లో మరో టాక్సీ వచ్చి ఆగింది. అందులోకి మమ్మల్ని ఎక్కించిన తర్వాతనే అతడు ట్రాఫిక్ కేసు విషయం చూసుకోవడం మొదలు పెట్టాడు. కేసు విచారణ పేరుతొ మాకు ఎలాంటి ఇబ్బంది కలిగించని అతడి తీరు మమ్మల్ని ఎంతగానో  విస్మయపరచింది. చాణక్యుడు చెప్పిన సూక్తి గుర్తుకు వచ్చింది. 


యాభయ్ ఏళ్ళ క్రితం 

ఒకసారి మా వూరికి  పార్లమెంటు సభ్యుడు, కేంద్రమంత్రి అయిన డాక్టర్ కే.ఎల్. రావు టూరు ప్రోగ్రాము పెట్టుకున్నారు. 

ప్రోగ్రాం ప్రకారం  ఆయన మా వూరికి మధ్యాన్నం రెండు గంటల ప్రాంతంలో రావాలి. అందరం ఆయన కోసం ఎదురు చూస్తున్నాం.

మూడయింది, నాలుగయింది, మంత్రిగారి జాడలేదు. చూస్తుండగానే చీకటి పడింది. అప్పటికి మా వూళ్ళో కరెంటు లేదు. కిరసనాయిలు దీపాలే. ఇంతలో దూరంగా  జీపు హెడ్ లైట్ల కాంతి కనిపించింది. ఇంకేముంది, మంత్రిగారు  వస్తున్నారని సంబర పడ్డాము. ఆ జీపు లైట్లు ఆకాశంలో చుట్టూ గిరగిర తిరిగే సర్కసు దీపం (బీమ్) మాదిరిగా కొంతసేపు కనిపించి ఆ తర్వాత కనపడకుండా పోయాయి. ఇంకో రెండు గంటలు చూసి వూరివాళ్ళు ఇళ్ళకు మళ్ళారు.

ఆ తర్వాత కాసేపటికి రెండు జీపుల్లో మంత్రిగారి కాన్వాయ్ మా ఇంటి దగ్గర ఆగింది. మా బాబాయి కొడుకు సత్యమూర్తి అన్నయ్య మా వూరు సర్పంచ్. కాస్త వసతిగా ఉంటుందని ఆయన కార్యకలాపాలు మా ఇంటి నుంచే నడిపేవారు.

అనుకున్నంత సేపు పట్టలేదు మంత్రిగారి పర్యటన. ఊరి పోలిమేరల్లోకి వచ్చి ఊరిలోకి వెళ్ళే  దారి తెలియక చాలాసేపు ఇబ్బంది పడిన విషయం ఆయన చెప్పేదాకా తెలియదు. అంత అధ్వాన్నంగా ఉండేవి ఆరోజుల్లో  రహదారి సౌకర్యాలు. మా ఊరికి అయితే బండ్ల బాట మినహా వేరే దారిలేదు. చల్లారిపోయిన పాలను మళ్ళీ వేడి చేసి పెట్టి ఇచ్చిన కాఫీలు తాగి మంత్రిగారు  నిష్క్రమించారు. 

సరైన రోడ్డు సదుపాయం లేక  ఆ ప్రాంతపు ప్రజలు పడుతున్న ఇబ్బందులు స్వయంగా అనుభవం లోకి రావడం వల్లనెమో, ఢిల్లీ వెళ్ళగానే ఆ విషయంపై దృష్టి పెట్టినట్టున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే శ్రమదానం కార్యక్రమాన్ని ప్రకటించి మా వూరికి రోడ్డు, కరెంటు మంజూరు చేసారు. మా వూరికే కాదు చుట్టుపక్కల అనేక  గ్రామాలను కలుపుతూ వత్సవాయి నుంచి చెవిటికల్లు వరకు మా వూరి మీదుగా రోడ్డు పడింది. కరెంటు వచ్చింది. శ్రమదానం అంటే ఏ వూరివాళ్ళు ఆ ఊరికి కావాల్సిన కరెంటు స్తంభాలు తమ బండ్ల మీద చేరవేయాలి. అలాగే రోడ్డు నిర్మాణంలో శ్రమదానం చేయాలి. స్తంభాలు, కంకర, సిమెంటు వగైరా ప్రభుత్వం ఇస్తుంది.

కే ఎల్ రావు గారిచ్చిన స్పూర్తితో దాదాపు నలభయ్ గ్రామాల ప్రజలు పార్టీలతో నిమిత్తం లేకుండా తమ ఊళ్లకు కరెంటు, రోడ్డు సాధించుకున్నారు. ఇన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా ఆ గ్రామాల ప్రజలు ఆ రోడ్డుని కేఎల్ రావు గారి రోడ్డనే పిలుస్తారు.

ఇది గుర్తుకు వచ్చినప్పుడల్లా వెంటనే గుర్తొచ్చేది చాణక్యుడి సూక్తే.   

గత కొన్నేళ్లుగా  జంట నగరాల్లో కరెంటు కోతలు లేకుండాపోయాయి. 

అయినా కానీ, ప్రజలకు కరెంటు కష్టాలు పూర్తిగా తొలగిపోయాయని చెప్పలేము.

అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలకు కూడా ఈ అవస్థలు తప్పడం లేదు

ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. పౌరుడికి ఒక సమస్య ఎదురయినప్పుడు

దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకు వెడతాడు. స్పందించే అధికారి వుంటే చాలు

సగం సమస్య తీరిపోయినట్టుగా అతడు భావిస్తాడు. అన్ని సమస్యలకు ఏదో ఒక పరిష్కారం 

అంటూ వుంటుంది. కొన్నిటికి తక్షణ ఉపశమనం లభిస్తే మరి కొన్ని నిదానంగా

పరిష్కారమవుతాయి.

మేము ఉంటున్న ప్రాంతంలో విద్యుత్ సరఫరాలో కోతలు లేవు. కానీ అంతరాయాలు

వున్నాయి. సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళడానికి ఇప్పుడు

సాంఘిక మాధ్యమాలు అందుబాటులో వున్నాయి. 

నాకు తెలిసిన విషయాలను

సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మాత్రం చేస్తూ వస్తున్నాను. గతంలో కూడా మా

ప్రాంతవాసుల సమస్యలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తే మునిసిపల్ అధికారులు

తక్షణం స్పందించారు. అలాగే మరో అనుభవం.

ఒకరోజు రాత్రి కాసేపు కరెంటు పోయింది. లిఫ్ట్ లో ఒక పెద్దావిడ చిక్కుకు పోయింది.

కాసేపటికి కరెంటు వచ్చింది. ఆ పెద్దావిడ మా అపార్ట్ మెంటులో ఎవరినో

చూడడానికి వచ్చింది. లిఫ్ట్ ఇబ్బంది పెట్టడంతో గాభరా పడిపోయింది. ఇది

చూసి రాత్రి పొద్దుపోయిన తర్వాత నేను ఒక పోస్ట్ పెట్టాను.

“వేసవికాలం ప్రవేశించింది. నిరంతర విద్యుత్ సరఫరా విషయంలో పౌరుల

ప్రేమయాత్ర ముగిసింది అనుకోవాలా!  అటక ఎక్కించిన పవర్ ఇన్వర్టర్లను, జెనరేటర్లను

మళ్ళీ కిందికి దింపాలేమో! ఇలా చెప్పడానికి కాసింత  సిగ్గుపడుతున్నాను”

కఠినంగా రాశానేమో అని నాకే తరువాత అనిపించి ఆ పోస్ట్ తీసివేశాను.

ఆవిషయం మరచిపోయాను.

మరునాడు మధ్యాన్నం కాబోలు అయిదారుగురు మా ఇంటికి వచ్చారు.

“పొద్దున్న చైర్మన్ ప్రభాకర రావు గారు ఫోన్ చేశారు”

వారిలో ఒకరు ఈ మాట అంటూ, తనని తాను పరిచయం చేసుకున్నారు.

ఆయన గారి పేరు ఆనంద్.ట్రాన్స్ కోలో  సూపర్ ఇన్ టె౦డింగ్ ఇంజినీరు.

మిగిలినవాళ్ళు ఏడీయీలు, ఏఈలు.

సమస్య ఏమిటని అడిగారు. నేను చెప్పింది విన్నారు. అప్పటికే ఆశ్చర్యంలో

మునిగిపోయి ఉన్న నాకు ఆయన తన సెల్ ఫోన్ లో రికార్డ్ అయిన కొన్ని విషయాలు

చెప్పారు. అది వింటుంటే నా ఆశ్చర్యం రెట్టింపు అయింది. 

మా ప్రాంతంలో ఈ నెలలో అయిదు సార్లు కరెంటు పోయిందని చెబుతూ,  కరెంటు పోయిన

టైమును, మళ్ళీ వచ్చిన సమయాన్ని వివరాలతో సహా చూపించారు. నాలుగుసార్లు ఈ

ఎల్ (ఎర్త్ లీకేజీ), ఒకసారి ఓఎల్ (ఓవర్ లోడ్) వల్ల సరఫరాకు అంతరాయం

కలిగినట్టు రికార్డులలో వుంది.

ఎస్ ఈ గారి అధీనంలో మొత్తం 38 సబ్ స్టేషన్లు వుంటాయిట. ప్రతిరోజూ ఆ

ఏరియాల్లో ఎక్కడ, ఎన్నిసార్లు కరెంటు పోయిందనే వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేట్

అవుతాయట. ఆ సమాచారం ఆధారంగా వెనువెంటనే సరఫరా పునరుద్ధరణకు రాత్రీ పగలూ

ఇరవై నాలుగు గంటలు సిబ్బంది సిద్ధంగా వుంటారట.

సాధారణంగా చెట్ల కొమ్మలు నరికే సమయాలను ముందుగానే ఆయా వినియోగదారులకు

ఎస్సెమ్మెస్ ద్వారా తెలియచేస్తారట.

ఎంత ప్రయత్నం చేస్తున్నా తమ చేతిలో లేని కారణాల వల్ల సరఫరాలో ఆటంకాలు

కలుగుతున్న మాట నిజమే అని చెబుతూ, వాటిని సాధ్యమైనంత మేరకు తగ్గించడానికే

తాము, తమ సిబ్బంది నిరంతరంగా పనిచేస్తున్నామని చెప్పారు.

మా ప్రాంతంలో కరెంటు సరఫరాలో అంతరాయాలు లేకుండా చేయడానికి చేయవలసినది

చేస్తామని హామీ ఇచ్చారు.

ముందే చెప్పినట్టు సమస్య పరిష్కారం ముఖ్యమే కావచ్చు కానీ, సమస్యను విని,

‘నేనున్నాను కదా!’ అని భరోసా ఇచ్చేవాళ్ళు కూడా అంతే ముఖ్యం. అప్పుడే

ప్రభుత్వం పనిచేస్తోందని జనం అనుకుంటారు. పనిచేసే ప్రభుత్వం అని

మెచ్చుకుంటారు.

మళ్ళీ మూడు దశాబ్దాల తర్వాత చాణక్యుడి సూక్తి మరోమారు స్పురణకు వచ్చింది.

ప్రభుత్వ ప్రమేయం లేని సాధారణ జన జీవితం. వినడానికి బాగానే వుంది.

ఇలా అడపా దడపా కాకుండా చాణక్యుడి సూక్తి అనుదినం గుర్తుకు వచ్చే బంగారు రోజులు వస్తే ఎంత బాగుంటుందో!




22, ఫిబ్రవరి 2023, బుధవారం

ఈ చక్కటి జ్ఞాపకానికి అప్పుడే ఏడాది

 

ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఫోన్ మోగింది. “ శ్రీనివాసరావు గారా! సీఎం ఆఫీసు నుంచి. సీఎమ్ గారు మాట్లాడుతారు, లైన్లో వుండండి” అంది ఓ గొంతు. ఓ ఇరవై ఏళ్ళ క్రితం అయితే ఇలాంటి ఫోన్లు ఆశ్చర్యం లేదు. రిటైర్ అయి పదిహేను ఏళ్ళు దాటింది కదా! అందుకే ఆశ్చర్యం. “శ్రీనివాసరావు గారు, బాగున్నారా! ఎక్కడ వుంటున్నారు, ఒకసారి మాట్లాడుకుందాం, కారు పంపిస్తాను, ఇంటికి రండి” కొద్దిసేపటికే పియ్యే ఫోన్ చేసి లొకేషన్ తీసుకున్నాడు. మరి కొద్ది సేపటికే అనిల్ అనే డ్రైవర్ ఫోన్ చేసి మీ (మా) ఇంటి దగ్గర వున్నాను’ అన్నాడు. రోజూ మూడున్నరకు నా మధ్యాన్న భోజనం. రెండున్నర దాటితే కానీ స్నానం సంధ్యా ప్రసక్తి వుండదు. డ్రైవర్ ని ఉండమని చెప్పి అప్పటికప్పుడు తయారై, గుప్పెడు మెతుకులు నోట్లో వేసుకుని కారెక్కాను. సరాసరి సీఎం ఇంటికే తీసుకు వెళ్ళాడు. లిఫ్టులోపైకి వెళ్లేసరికి రండి రండి భోజనం చేద్దాం అని ఆహ్వానించారు కేసీఆర్. చేసేవచ్చానని చెబితే, ఇలా మాతో వచ్చి కూర్చోండి అన్నారు. భోజనం టేబుల్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ వున్న ఆరుగురిలో ఇద్దరే తెలుసు, ఒకరు సంతోష్, ఎంపీ. మరొకరు భాను ప్రసాద్ ఎం.ఎల్.సీ. భోజనాల కార్యక్రమం పూర్తి కాగానే కిందికి వెళ్లాం. వరసగా వాహనాలు. నన్ను కాన్వాయ్ లో మూడో వాహనంలో కూచోబెట్టారు. కారు తలుపు ఎంత గట్టిగా వుందంటే చేత్తో తీయడం సాధ్యం కాలేదు. అది బులెట్ ప్రూఫ్ అని చెప్పి డ్రైవర్ డోర్ తీశాడు. కాన్వాయ్ కదిలింది. నేరుగా బేగం పేట ఎయిర్ పోర్ట్ చేరింది. ఒక హెలికాప్టర్ దగ్గర ఆగింది. నేను దిగి ఒక పక్కన నిలబడ్డాను. ఇక్కడ నుంచి ఇంటికి చేరడం ఎల్లా అనేది నా ఆందోళన. ఈలోగా ఎవరితోనో ముచ్చటిస్తున్న సీఎమ్ నా వైపు చూసి ఎక్కండి అన్నారు. నాకు కలయో వైష్ణవ మాయయో అన్నట్టు వుంది. ఉద్యోగంలో వున్నప్పుడు ఇలాంటి ప్రయాణాలు అలవాటే. రిటైర్ అయి పదిహేనేళ్లు. అందుకే ఆశ్చర్యం. పక్కన కూర్చోబెట్టుకున్నారు. అరగంటలో నారాయణ్ ఖేడ్ చేరాము. స్టేజి మీద తన వెనకనే కూర్చోబెట్టుకున్నారు. బహిరంగ సభలో ప్రసంగిస్తూ కూడా నాతోపాటు భండారు శ్రీనివాసరావు కూడా వచ్చారు అని ఆయన చెబుతున్నప్పుడు మతి పోయింది. సభ ముగిసింది. తిరిగి అరగంటలో బేగంపేట ఎయిర్పోర్ట్. అక్కడ నుంచి సీఎం రెసిడెన్స్. పైకి వెళ్ళాము. వేడి వేడి ఉప్మా కాఫీ ఇచ్చారు. ఓ గంటన్నర ఏవేవో ముచ్చ్చట్లు. నన్ను ఎందుకు రమ్మన్నారో అంతు చిక్కలేదు. ఏడున్నర కాగానే నేను లేచి నిలబడి ధన్యవాదాలు చెప్పాను. ఆయన్ని ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపి రండి అన్నారు అక్కడ ఎవరితోనో. ఏడున్నర ప్రాంతంలో ఇంటికి చేరాను. అప్పటివరకు సెక్యూరిటీ జామర్ల వల్ల మూగనోము పట్టిన నా ఫోను మళ్ళీ ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ తో పిలుపులు మొదలు పెట్టింది. కలా నిజమా అనుకుందాం అంటే ‘నారాయణ్ ఖేడ్ మీటింగులో సీఎం తో పాటు నువ్వు కూడా కనిపించావు టీవీల్లో’ అని మిత్రుల ఫోన్స్. అయితే నిజమే అన్నమాట. ఇంతకూ ఎందుకు పిలిచినట్టు? నేను ఎందుకు వెళ్లినట్టు? ఈ భేతాళ ప్రశ్నకు జవాబు లేదు, కేసీఆర్ గారి అభిమానం ఆ స్థాయిలో ఉంటుందని సమాధానపడం తప్ప.


(21-02-2022) Video Clipping Courtesy: Shri Nirmal Akkaraju

https://fb.watch/iRRvVsg5dl/ https://fb.watch/iRPUnB4Ugw/

17, ఫిబ్రవరి 2023, శుక్రవారం

అనాయాస మరణం చూస్తే అసూయ ఎందుకు?

 


పొద్దున్న పదిగంటలకు మొద్దుబారిన నా మెదడు క్రమంగా అదుపులోకి వస్తోంది. వచ్చిన తర్వాత, విన్న సంగతులు నెమరు వేసుకుంటూ వుంటే  నా మనసంతా, అనకూడదు కానీ అసూయతో  నిండిపోయింది.

డెబ్బయ్ ఏడేళ్ల వయస్సులో ఈ అసూయ ఏమిటి. అది కూడా అనాయాసంగా చనిపోయిన  నా మేనకోడలు భర్త, నా చిన్న నాటి స్కూలు సహాధ్యాయి  జూపూడి ప్రసాద్ గురించి అంటే నా మనసే సమాధానం పడడం లేదు. మనుషులు ఇలాగా కూడా అనాయాసంగా పోతారా, ఇలాంటి అదృష్టం నా నొసట రాసి ఉందా లేదా అన్న ఆలోచనే ఆ అసూయకు కారణం.

నాకంటే రెండేళ్లు చిన్నవాడయిన నా మేనల్లుడు దుర్గా ప్రసాద్ ఈ మధ్యనే చనిపోయాడు,  ఇలాగే అనాయాసంగా దాటిపోయాడు. అనకూడదు కానీ అప్పుడు కూడా వాడి సునాయాస మరణం చూసి అసూయ పడ్డ మాట నిజం. అప్పుడు పైకి చెప్పలేదు. ఈ రెండో మరణ వార్త తెలిసిన తర్వాత ఇక చెప్పక తప్పడం లేదు.

ఖమ్మంలో వుండే ప్రసాద్ ఈ ఉదయం లేచి చాయ్ తాగి కాసేపు అలా పక్క మీదనే కళ్ళు మూసుకుని పడుకున్నాడు. అటూ ఇటూ ఇంట్లో తిరిగే వాళ్ళ అబ్బాయి షమీకి   అనుమానం వచ్చింది. ఏమిటి ఇంతసేపు పడుకున్నాడు, ఇలా ఆలస్యంగా లేచే అలవాటు ఆయనకి లేదే అనుకుంటూ తట్టి లేప బోయాడు.

అప్పుడు తెలిసింది అది నిద్ర కాదు, దీర్ఘ నిద్ర అని.

విషయం తెలిసి విదేశాల్లో ఉన్న పిల్లలు రేపు రాత్రికి వస్తున్నారు. ఎల్లుండి అంత్యక్రియలు.

నాలుగేళ్ల క్రితం మా ఆవిడ పోయినప్పుడు ఎక్కడో రాసుకున్న గుర్తు.

మన దేశంలో మెజారిటీ వృద్దులకు జీవన యానం చివర్లో ఐసు పెట్టెలో మూడు నిద్రలు తప్పేట్టు లేవు.

కఠినం అనిపించినా వాస్తవమే కదా!   

17-02-2023       




15, ఫిబ్రవరి 2023, బుధవారం

ఈనాటి వార్త: ఓనాటి జ్ఞాపకం

 





ఎక్కడ ? ఎప్పుడు ? 


కొంత కాలం గత కాలంలో కలిసిపోయిన తర్వాత, ఆ నాటి పాత విషయాలను గుర్తు చేసుకుంటూ వుంటే, గుర్తుకు వస్తూ వుంటే, కొంత సంతోషం అనిపిస్తుంది, కొంత తమాషాగా అనిపిస్తుంది.


ఈ ‘ఎక్కడ ఎప్పుడు’ ఇలాటి విషయాల్లో ఒకటి. 

ఈ రెండు పదాలతో రేడియో మార్నింగ్ బులెటిన్ లో ఒక హెడ్ లైన్ వార్త తయారు అయ్యేది.


అర్ధరాత్రో అపరాత్రో మా చిక్కడపల్లి ఇంట్లో ఫోన్ రింగయ్యేది. ఆ రోజుల్లో ల్యాండ్ లైన్ ఫోన్లే. సెల్ కాలం కాదు.


ఫోను  మంచం పక్కనే  పెట్టుకునేవాడిని. మరీ అర్ధరాత్రి ఫోనయితే అవతల  రైల్వే పీఆర్ఓ మైఖేల్. తెల్లవారుఝామున అయితే సీపీఆర్వో కృష్ణయ్య గారు. అదీ లెక్క.


ఫోను ఎత్తి ‘ఎక్కడ? ఎప్పుడు?’ అని అడిగేవాడిని.

వాళ్ళ నుంచి జవాబు తీసుకుని వెంటనే విజయవాడ రేడియో ప్రాంతీయ వార్తా విభాగం న్యూస్ ఎడిటర్ శ్రీ ఆర్వీవీ కృష్ణారావు గారు లేదా శ్రీ ఏమ్వీఎస్ ప్రసాద్ గారికో ఫోను కలిపేవాడిని. ఎవరు డ్యూటీలో వుంటే వాళ్ళు నా ఫోన్ రిసీవ్ చేసుకుని  'ఎక్కడ? ఎప్పుడు?' అని అడిగేవారు. నేను క్లుప్తంగా ఇచ్చిన సమాచారాన్ని వాళ్ళు ఓ వార్త రూపంలో రాసుకునే వారు.  వాళ్ళిద్దరూ ఎంతటి సమర్ధులు అంటే కొన్ని  క్షణాల్లో నేను చెప్పిన వార్తను విస్తరించి,  మరికొన్ని నిమిషాల్లో ప్రసారం అయ్యే ప్రాంతీయ వార్తల బులెటిన్ లో ప్రాధాన్యతా క్రమంలో చేర్చేవారు. 


“ఆకాశవాణి  ప్రాంతీయ వార్తలు చదువుతున్నది  ప్రయాగ రామకృష్ణ/ కొప్పుల సుబ్బారావు.


“దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఒక గూడ్స్ రైలు  రాత్రి పట్టాలు తప్పింది. పలానా  స్టేషన్ల నడుమ జరిగిన ఈ దుర్ఘటన కారణంగా పలు రైళ్ళ రాకపోకలకు  అంతరాయం కలిగిందని, కొన్ని రైళ్లు దారి మళ్లిస్తున్నారని రైల్వే అధికారులు కొద్దిసేపటి క్రితం మా హైదరాబాదు ప్రతినిధికి తెలియచేసారు. వివరాలు.....”


ఎక్కడో సికిందరాబాదు  రైల్వే క్వార్తర్స్ లో పొద్దున్నే రేడియో పెట్టుకుని వార్తలు వింటున్న రైల్వే అధికారులు, ఎలాంటి పొరబాటు లేకుండా వార్త ప్రసారం అయిన సంగతి తెలుసుకుని ఊపిరి పీల్చుకునే వారు. చెప్పిన వార్త ఎలాంటి తభావతు లేకుండా వస్తుందని తెలుసు కనుక నేను ముసుగు తన్ని నిద్రపోయేవాడిని.

14, ఫిబ్రవరి 2023, మంగళవారం

నిశ్శబ్దం రాజ్యమేలిన ముఖ్యమంత్రి సభ - భండారు శ్రీనివాసరావు

 (ఫిబ్రవరి 14 దామోదరం  సంజీవయ్య గారి జయంతి)

ఈ విషయం చెప్పే ముందు దీంతో సంబంధం ఉన్న మరో విషయంతో మొదలు పెడతాను.

మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ స్థాయికి చేరడానికి ముందు ఎక్కిన అనేకానేక నిచ్చెన మెట్లలో నెలకు పాతిక రూపాయల ‘విలేకరి కొలువు’ కూడా వుంది.

ఖమ్మంలోని ఎస్సార్ అండ్ బీజీ ఎన్ ఆర్ కాలేజీలో ఆయన డిగ్రీ పూర్తిచేశారు. రామ్మోహనరావు గారు ఆ కాలేజీలో లెక్చరర్. వారి నాన్నగారికి పత్రికల ఏజెన్సీ కూడా వుంది. అప్పట్లో ఆ ఏజెంట్లే పత్రికా విలేకరుల పాత్ర కూడా పోషించేవారు. మా అన్నయ్యకు తెలుగులో ఉన్న ప్రావీణ్యం గమనించి ‘నెలకు ఓ పాతిక ఇస్తాను, నీకు పాకెట్ మనీగా పనికి వస్తుంది, నువ్వు ఆంద్రజ్యోతి పత్రికకు వార్తలు రాస్తుండు. వాళ్ళు వేస్తె వేస్తారు, లేకపోతే లేదు, కానీ నీకు మంచి కాలక్షేపంగా వుంటుంది’ అని ప్రోత్సహించడంతో మా అన్నయ్య ఒప్పుకున్నాడు.

ఇక అసలు విషయానికి వస్తాను.

నాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఖమ్మం జిల్లా పర్యటన ఖరారు అయింది. అప్పటికే జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరూ రెండు వర్గాలుగా విడిపోయివున్నారు. జలగం వెంగళరావు, శీలం సిద్దారెడ్డి వంటి అతిరధులు కలిగిన ప్రధాన వర్గం అప్పటివరకు ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవ రెడ్డికి అనుకూలం. మరో వర్గం సంజీవయ్య వైపు. దీనికి మాకు బాబాయి వరుస అయిన బొమ్మకంటి సత్యనారాయణ నాయకులు. ఖమ్మం జిల్లాకు సంబంధించినంతవరకు ఆయన ముఖ్యమంత్రి సంజీవయ్యకు కుడి భుజం. సంజీవయ్యకు సంఘీభావం తెలిపేందుకు గోకినేపల్లిలో జిల్లా దళిత మహా సభ ఏర్పాటు చేశారు. ఈ సభను కవర్ చేయడానికి పాతిక రూపాయల విలేకరి అయిన మా అన్నయ్యను పురమాయించారు రామ్మోహన రావు గారు.

సభ బాగా జరిగింది. ముఖ్యమంత్రి ప్రసంగించడానికి మైకు ముందు నిలబడ్డారు. సంజీవయ్య స్వతహాగా మంచి వక్త. ఆయన ప్రసంగం మొదలు పెట్టారు.

నన్ను బాధ పెడుతున్న, నా మనసును కలచి వేస్తున్న ఓ విషయాన్ని మీకు చెప్పదలచుకున్నాను. ఇక్కడ పైనా కిందా కూర్చున్న మనుషులం అందరం ఒకే తీరున ఉన్నాము. ఒంట్లో పారే రక్తం రంగు అందరికీ ఎరుపే. కానీ మనలో చాలామందిమి సాటి మనిషిని మనిషిగా చూస్తున్నామా అంటే అనుమానమే. డబ్బున్న ఖామందులు పెంపుడు బొచ్చు కుక్క పిల్లల్ని తమ పక్కలపై పడుకోబెట్టుకుంటారు. ముద్దు చేస్తారు. అదే సాటి మనిషిని తాకడానికి కూడా వారికి అస్పృశ్యత అనే అనాచారం అడ్డం వస్తుంది. కుక్కలపాటి చేయరా ఈ మనుషులు? ఎందుకీ వ్యత్యాసం? ఎందుకీ వివక్ష?’

రెండు చేతులూ గట్టిగా గాలిలో ఊపుతూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి స్వరం బొంగురుపోయింది. పైకిలేపిన చేతులను అలాగే వుంచి ఆయన కాసేపు మౌనంగా వుండిపోయారు.

సభకు హాజరై ప్రసంగం వింటున్న యావన్మంది చేష్టలు ఉడిగి వుండిపోయారు. అంతటా నీరవ నిశ్శబ్దం.

సరే! ఆ రోజు సభ ముగిసింది. తిరిగి హైదరాబాదు వెళ్ళడానికి దామోదరం సంజీవయ్య అంబాసిడర్ కారు ఎక్కారు. ఆయన పక్కనే మా బాబాయి బొమ్మకంటి సత్యనారాయణ. ముందొక పోలీసు జీపు, వెనక మరో జీపు. అదీ ముఖ్యమంత్రి కాన్వాయ్ ఆ రోజుల్లో.

మా అన్నయ్య ఖమ్మం చేరుకున్న వెంటనే తన రిపోర్ట్ రాసి మర్నాడు పోస్టులో పంపారు. ఆ మరునాడు అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది.

ముఖ్యమంత్రి దళిత సభలో రాజ్యమేలిన నిశ్శబ్దం’.

వార్తతో పాటు మా అన్నయ్య పెట్టిన హెడ్డింగ్ కూడా యధాతధంగా పత్రికలో రావడం కొసమెరుపు.