10, జనవరి 2023, మంగళవారం

NEWS – భండారు శ్రీనివాసరావు

 జర్నలిజం విద్యార్థి దశలో NEWS అంటే North (ఉత్తరం), East (తూర్పు), West (పశ్చిమం), South (దక్షిణం) ఇలా నాలుగు దిక్కుల నుంచి వచ్చే సమాచారం అని చెప్పేవారు. మా చిన్నప్పుడు ఆంధ్రపత్రిక దినపత్రికలో అనేక వార్తలు వచ్చేవి. నిజంగా నాలుగు దిక్కుల నుంచి అందే వార్తలు ఆ పత్రికలో కనబడేవి. పాట్రిస్ లుముంబా, డాగ్ హామేర్షేల్ద్, ఐసన్ హోవర్, స్టాలిన్, కృశ్చెవ్, నాసర్, మార్షల్ టిటో, చౌ ఎన్ లై, అరాఫత్ వంటి విదేశీ నాయకుల పేర్లు, లియోపాల్డ్ విల్లీ, కాంగో వంటి ప్రాంతాల పేర్లు చిన్న పిల్లలకు కూడా తెలిసేంతగా ఆ వార్తలు ప్రముఖంగా ప్రచురించేవారు. కాలక్రమంలో మనం ఉంటున్న ప్రాంతాలకు సంబంధించిన వార్తలకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలయింది. ఇది ఎంతగా రెక్కలు విచ్చుకుంది అంటే హైదరాబాదు వంటి నగరాల్లో చిక్కడపల్లిలో అర్ధరాత్రి ఏదైనా సంఘటన జరిగితే పొరుగున వున్న అశోక్ నగర్ లో పంపిణీ అయ్యే పత్రికల్లో ఆ వార్త ప్రచురణకు నోచుకోనంతగా. అంతగా పత్రికల్లో వార్తలు ప్రాంతాల వారీగా పరిమితం అయిపోతున్నాయి. కాబట్టి NEWSకి వేరే భాష్యం చెప్పుకోవాలి ముందు ముందు.

ఇంత ఉపాధ్ఘాతం ఎందుకంటే మన పొరుగున ఉన్న తమిళనాడు అసెంబ్లీలో ఈ రోజు (సోమవారం) గవర్నర్ చేసిన ప్రసంగంపై పాలక పక్షం తీవ్ర అభ్యంతరం చెప్పినట్టు కొన్ని టీవీల్లో స్క్రోలింగులు గిరగిర తిరిగాయి. గవర్నర్ వాకవుట్ చేసినట్టు, పాలక పక్షం వాకవుట్ చేసినట్టు ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు స్క్రోలింగులు నడిపారు. రేపు తెల్లారి పత్రికలు చూడాలి ఏది వాస్తవమూ తెలుసుకోవడానికి.
అర్ధం అయినంతవరకు తెలియవచ్చింది ఏమిటంటే, తమిళనాడు మంత్రివర్గం ఆమోదించి పంపిన ప్రసంగం ప్రతిని యధాతధంగా చదవడం సాంప్రదాయం (Convention). అయితే గవర్నర్ , రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన ఆ ప్రసంగంలోని కొన్ని పేరాలు చదవకుండా, కొత్తగా కొన్ని వాక్యాలు చేర్చి చదివారు అన్నది స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకె ప్రభుత్వం అభ్యంతరం, అభియోగం కూడా. అసెంబ్లీలో గవర్నర్ చేసే ప్రసంగం సాంప్రదాయానికి (క్యాబినెట్ ఆమోదించిన ప్రసంగానికి) అనుగుణంగా వుండాలి, అసెంబ్లీ వెలుపల చేసేవి, (రిపబ్లిక్ డే రోజున చేసే ప్రసంగాలు) కొంత మూల ప్రతిని దాటి చదివినా పర్వాలేదన్నది మరో సాంప్రదాయం.
నిజంగా ఇది రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య తలెత్తిన ఓ వివాదం. సాంప్రదాయం (Convention) నిబంధన (Rule) కాదన్నది ఒక వాదన. సాంప్రదాయాలను పాటించడం ప్రజాస్వామ్య స్పూర్తి అనేది మరో పక్షం వాదన. ఈ రెండు వాదనలు చేసే వాళ్ళు వేర్వేరు రాజకీయ పార్టీల వాళ్ళు కావడం వల్ల చిక్కుముడి విడివడడం అంత సులభం కాదు.
ఇలాంటి సంఘటనలు మరీ కొత్తవి ఏమీ కాదు.
పూర్వం కమ్యూనిస్టుల ఏలుబడిలో వున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ధర్మవీర అనే పెద్దమనిషిని గవర్నర్ గా పంపింది. ఆయన కూడా నేటి తమిళనాడు గవర్నర్ రవి గారి లాగానే క్యాబినెట్ ఆమోదించిన ప్రసంగం ప్రతిని పక్కన పెట్టి, అసెంబ్లీలో సొంత ప్రసంగం చేయడంతో అప్పటి కమ్యూనిస్ట్ ప్రభువులు భగ్గుమన్నారు.
ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కలిగిన భారత ప్రజాస్వామ్యంలో అన్ని చోట్ల ఒకే పార్టీ పాలించే రోజులు చెల్లిపోయాయి.
కాబట్టి అరుదుగా చోటు చేసుకునే ఇటువంటి సంఘటనలు ముందు ముందు తరచుగా తలెత్తే అవకాశాలు మెండుగా వుంటాయి కనుక, వీటికి రాజ్యాంగబద్ధమైన పరిష్కారం ఎంత త్వరగా కనుక్కుంటే అంత శ్రేయస్కరం.
(09-01-2023)
Like
Comment
Share

9, జనవరి 2023, సోమవారం

ఆ మాట చెప్పాల్సింది నేను – భండారు శ్రీనివాసరావు

 అత్తగారు చేటలో బియ్యం పోసుకుని చెరుగుతూ వరండాలో కూర్చుని వుంటే ఓ బిచ్చగాడు వచ్చి అమ్మగారు బిక్షం అని కేక పెట్టాడు. లోపల పనిచేసుకుంటున్న కోడలు పిల్ల, ‘చేయి ఖాళీ లేదు, రేపు రా’ అని మరో కేక పెట్టింది. బిచ్చగాడు వెళ్లిపోతుంటే అత్తగారు ‘ఇటురా అబ్బీ’ అని ఇంకో కేక పెట్టింది. వాడు ఆశగా వచ్చి నిలబడితే ‘చేయి ఖాళీ లేదు రేపు రా’ అంది. ‘అదేమిటమ్మ గారూ మీ కోడలు గారు చెప్పిందే మళ్ళీ చెప్పడానికి నన్నెందుకు వెనక్కి పిలిచారు’ అని అడిగాడు.

ఎందుకా చేయి ఖాళీ లేదు అని చెప్పడానికి అదెవత్తె! ఏ మాటైనా చెప్పే అధికారం ఈ ఇంట్లో నాదే’ అన్నది అత్త గారు చేతిలో చేట విదిలిస్తూ.

ఇది చిన్నప్పుడు చదువుకున్న కధ. ఇప్పుడు కూడా ఇలాంటి కధలు పునరావృతం అవుతున్నాయి వేరే రూపాల్లో.

కాకపొతే ఈ కొత్త కధల్లో కోడలు పాత్ర లేదు. ఇద్దరూ అత్తలే.

నేరాలు, శిక్షలు - భండారు శ్రీనివాసరావు

 (Published in ANDHRAPRABHA on 8-1-2023, SUNDAY)

 

కాలమాన పరిస్తితులను బట్టి, అమల్లో వున్న చట్టాలను బట్టి, నేరాల  నేర స్వరూప, స్వభావాలు మారిపోతుంటాయి. వేసే శిక్షలు మారిపోతుంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో మద్య నిషేధం అమల్లో ఉన్నరోజుల్లో అత్యంత సమర్ధుడయిన ఒక అధికారి తన వాహనంలో మద్యం సీసాతో పోలీసులకు పట్టుబడి, కొద్ది రోజులు జైల్లో వుండాల్సివచ్చింది. ఆ అవమానం భరించలేక ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసారు. ఆ తరువాత కొద్ది రోజులకే మద్యనిషేధం ఎత్తి వేసారు. కానీ ఆయనకు జరిగిన నష్టాన్ని ఎవ్వరూ పూడ్చలేరు. ఆ రోజుల్లో తాగడం తప్పు. ఇప్పుడు ఖజానా నింపడం కోసం, ప్రభుత్వాలే పట్టుబట్టి జనాలచేత అదేపనిగా తాగిస్తున్నాయి. మారిన పరిస్తితులను బట్టి తప్పు ఒప్పుగా, ఒప్పు తప్పుగా మారిపోతున్నాయి. ఈ మార్పులను సమాజం అతి సహజంగా పరిగణిస్తోంది.

పలుకుబడి కలిగిన పెద్దలు మాదక ద్రవ్యాలతో పోలీసులకు పట్టుబడి, బయటపడిన వార్తలు అప్పుడప్పుడు వింటుంటాము. అదే నేరానికి థాయిలాండ్ వంటి దేశంలో మరణశిక్ష విధించే వీలుంది. మానభంగాలు సరేసరి. మన దగ్గర, సకాలంలో విచారణ పూర్తయి నిందితులకు శిక్షపడితే అబ్బురం అనుకోవాలి. అదే కొన్ని మధ్య ప్రాచ్య దేశాల్లో ఇదే నేరానికి పాల్పడ్డ వారికి చేతులు నరికేస్తారు. మానభంగం ఒక్కటే కాదు, దొంగతనం కూడా ఆ దేశాల్లో పెద్ద నేరమే. ఆ నేరం ఘోరం అనుకునేవారికి ఆ శిక్ష తప్పనిపించదు. అయ్యో పాపం అనుకునేవారికి అంత శిక్ష అవసరమా అనిపిస్తుంది.

చిన్న నేరాలకు చిన్న శిక్షలు, పెద్ద నేరాలకు పెద్ద శిక్షలు వేయడం కొన్ని దేశాల్లో సంప్రదాయం అయితే, చిన్న నేరానికి కూడా పెద్ద శిక్ష వేయడం కొన్ని దేశాల్లో అనూచానంగా వస్తోంది. జీవిత ఖైదు అంటే జీవితాంతం జైల్లో ఊచలు లెక్క పెట్టనక్కరలేదు. సత్ప్రవర్తనతో బయట పడేవాళ్ళు కొందరయితే రాజకీయ ఔదార్యాలతో శిక్షాకాలం పూర్తి కాకుండానే ఇళ్ళకు చేరేవారు చాలామంది. చైనాలో మాత్రం జీవిత ఖైదు అంటే బతికి ఉన్నంత కాలం కారాగారంలోనే వుండాలి. ఎలాటి మినహాయింపులు రాయితీలు వుండవు. అమెరికాలో కూడా దాదాపు ఇంతే. కాకపోతే శిక్షాకాలం తగ్గించే అధికారం ప్రెసిడెంటు ఒక్కరికే వుంటుంది.

రాజకీయ కారణాలతో ఏళ్ళ తరబడి జైళ్లలో మగ్గినవారు అనేకమంది వున్నారు. దక్షిణాప్రికాలో నెల్సన్ మండేలా సుదీర్ఘకాలం అంటే ఇరవై ఏడేళ్ళపాటు జైల్లోనే గడిపారు.

పాలస్తీనా జాతీయుడు నేల్ బార్గౌతి ఏకంగా అక్షరాలా   నలభయ్ నాలుగేళ్ళుగా ఇజ్రాయెల్ జైల్లో ఉంటున్నాడు. ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు ఆయన వయస్సు ఇరవై ఒకటి. స్వేచ్చాజీవిగా కంటే ఖైదీగానే ఆయన ఎక్కువ కాలం గడిపాడన్నమాట. ఆయనకు శిక్ష వేసిన న్యాయమూర్తి ఇన్నేళ్ళని శిక్షాకాలాన్ని నిర్దారించకపోవడం వల్ల ఎప్పుడు విడుదలయ్యేది ఆయనకీ తెలియదు. ఇది మరో విషాదం.

బర్మా(మియన్మార్) లో సైనిక ప్రభుత్వం తమ విధానాలను వ్యతిరేకించిన బొమిన్ యోకో అనే ఇరవై ఒక్క ఏళ్ళ వ్యక్తికి ఏకంగా నూట నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష వేసి తన కక్ష తీర్చుకుంది.

పొతే, ఇది జరిగింది అమెరికాలో. 2006 లో జార్గియాలోని ఒక న్యాయస్థానం ఇద్దరు నేరస్తులకి ఏడేసి చొప్పున జీవితకాలపు జైలు శిక్షలను విధించింది. అంతటితో వారిని ఒదిలిపెట్టలేదు. అదనంగా ఒక్కొక్కరికీ రెండువందల అరవై అయిదేళ్ళు చొప్పున కఠిన కారాగార శిక్ష విధించింది. ఇంత పెద్ద శిక్ష వేయడానికి వారు చేసిన గొప్ప నేరాలు ఏమిటంటే సాయుధ దొంగతనాలకు పాల్పడడం.

దీన్ని మించిన శిక్షను ఒక ఇరాన్ న్యాయమూర్తి వేసారు.

1969 లో ఇద్దరు నేరస్తులను విచారించిన ఆ న్యాయమూర్తి వారికి ఒక్కొక్కరికీ ఏడువేల నూట తొమ్మిదేళ్ళు జైలు శిక్ష విధించి నేరగాళ్లకు సింహస్వప్నంగా మారారు.

ఇలా ఏళ్ళకు ఏళ్ళు జైలు శిక్షలు వేసే క్రమంలో అమెరికా న్యాయమూర్తి ఒక రికార్డు నెలకొల్పారు. 1981 లో అలబామా రాష్ట్రంలో డుడ్లె వెన్ కైజర్ అనే వ్యక్తి ఉబుసుపోక తన భార్యను హత్య చేసాడు. అడ్డంపడ్డ అత్తగారినీ హతమార్చాడు. పనిలో పనిగా తన నేరాన్ని చూసిన ఒక కాలేజీ కుర్రవాడిని కూడా ప్రాణాలతో ఒదిలిపెట్టలేదు. న్యాయస్థానం కూడా కైజర్ మహాశయుడ్ని తేలిగ్గా ఒదలలేదు. పదివేల సంవత్సరాల జైలు శిక్ష వేసి మొత్తం అమెరికా న్యాయవ్యవస్థ చరిత్రలో ఒక రికార్డు తన ఖాతాలో వేసుకుంది.

అత్యంత తక్కువ కాలం శిక్ష అనుభవించిన నేరస్తుడు ఒకడు వున్నాడు. అతగాడు జైల్లో ఉన్న సమయం ఎంతో తెలుసా! ఒకే ఒక్క నిమిషం. అతడి పేరు జోసెఫ్ మంచ్ (1874-1907). అమెరికాలోని సియాటిల్ లో  సైనికుడిగా  పనిచేస్తున్న జోసెఫ్, ఓ రోజు  పీకలదాకా   మద్యం సేవించి, ఆ మత్తులో  అల్లరిచిల్లరగా  ప్రవర్తించిన కారణంగా న్యాయమూర్తి అతడికి ముప్పయి రోజులు జైలు శిక్ష, వంద డాలర్ల జరిమానా విధించారు. అతడు పై కోర్టుకు అప్పీలు చేసుకున్నాడు. అక్కడి న్యాయమూర్తి కింది కోర్టు విధించిన నెల రోజుల శిక్షకు  బదులు  అతడ్ని ఒకే ఒక్క నిమిషం జైల్లో ఉంచితే సరిపోతుందని తీర్పు చెప్పారు. దరిమిలా పోలీసులు జోసెఫ్ మంచ్ ని  కారాగారానికి తీసుకువెళ్లి  సెల్ లో వేసి, తాళం వేసి, ఒక్క  నిమిషం కాగానే విడుదల చేశారు.

పొతే,  అసలు విషయానికి వస్తే, కోర్టు శిక్షలనుంచి బయటపడ్డ ప్రముఖులు వున్నారు. వాటిని తప్పించుకోలేక జైళ్లల్లో మగ్గుతున్న గొప్పవారూ వున్నారు.

కొన్నేళ్ళ క్రితం అమెరికాలోని వర్జీనియా మాజీ గవర్నర్ రాబర్ట్ మెక్డోనెల్, తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని విలువైన కానుకలు స్వీకరించాడు అనే అభియోగాన్ని విచారించిన న్యాయమూర్తి, ఆయన్ని దోషిగా నిర్ధారించి కటకటాల్లోకి పంపాడు. కానుకల వ్యవహారం కనుక సహజంగానే అయన గారి భార్య గారి హస్తం వుండే వుంటుందన్న కోణంలో విచారించి ఆవిడను కూడా భర్తతో పాటు జైలుకు సాగనంపారు.

సరే! నేరం చేసి జైలుకు వెళ్ళడం మామూలే. తెలిసీ తెలియని చిన్నతనంలో చిన్ననేరాలు చేసి జైలు పాలయి తరువాత జీవితంలో చాలా గొప్పవాళ్ళయిన వాళ్ళు కూడా వున్నారు.

ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ పేరు తెలియని వాళ్ళు వుండరు. అయితే ఆయన్ని గురించి చాలామందికి తెలియని విషయం ఒకటుంది. బాల్యంలో ఆయన ఒక రాత్రల్లా జైల్లో ఉండాల్సిన పరిస్తితి ఏర్పడింది. ఆ రాత్రి జైలు వాతావరణం, పోలీసుల ప్రవర్తన చూసిన హిచ్ కాక్ కు ఆ భయం జీవితాంతం వెంటాడుతూ వచ్చింది.

ఉపశృతి : అనగనగా ఒక రాజ్యం. దాన్ని ఒక నియంత పాలిస్తున్నాడు. ఆ నియంతకు వ్యతిరేకంగా హాస్యోక్తిగా మాట్లాడుకోవడం కూడా శిక్షార్హమైన నేరం. అలాటి దేశంలో -

ఒక న్యాయమూర్తి ముద్దాయికి శిక్ష వేసి కడుపుబ్బా నవ్వుకుంటూ కోర్టు హాలు నుంచి బయటకు వస్తున్నాడు.

వెంట వున్న ఆయన స్నేహితుడు అడిగాడు ఎందుకలా నవ్వుతున్నారని.

'జీవితంలో ఇంత గొప్ప జోకు నేనెన్నడూ వినలేదు. అందుకే ఇంతలా నవ్వొస్తోంది'

'ఏమా జోకు? నాకూ చెప్పండి ఆనందిస్తాను' అన్నాడు మిత్రుడు.

'అలా ఎలా. ఆ జోకు చెప్పినందుకే కదా,  అతగాడికి పదేళ్ళు జైలు వేసింది'

 


8, జనవరి 2023, ఆదివారం

ఆత్మస్తుతి పరనింద – భండారు శ్రీనివాసరావు

 మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు భీష్మ ద్రోణులు నేల కూలిన తర్వాత సైన్యాధిపత్యం స్వీకరించిన కర్ణుడు కదనరంగంలో అర్జునుడు లేని సమయం చూసి చెలరేగిపోతాడు. ధర్మరాజుపై శరపరంపరగా అస్త్రాలు ప్రయోగించి తీవ్రంగా గాయపరుస్తాడు.

సూర్యాస్తమయం కాగానే నాటి యుద్ధం ముగుస్తుంది. గాయపడ్డ శరీరంతో, బాధ పడుతున్న మనసుతో ధర్మజుడు గుడారం చేరతాడు. అక్కడ తమ్ముడు ఆర్జునుడిని చూడగానే మనసులోని మాట పైకి వస్తుంది.

కర్ణుడు బాణ ప్రయోగంతో తనను నిలువెల్లా గాయపరుస్తుంటే వెంట వుండి కాపాడాల్సిన పాండవ మధ్యముడు కనిపించకుండా పోయాడని’ నిందారోపణ చేస్తాడు.

కౌరవులతో సాగిస్తున్న ఈ మహా సమరంలో తాను ఒక్కడే పదుగురి పెట్టున ప్రాణాలకు తెగించి పోరాడుతున్నానని, అలాంటి తనపైనే ఈ నిష్టూరాలు ఏమిటని బాధపడతాడు. ‘ఇంతటి నింద మోస్తూ జీవించడం కంటే మరణమే మేలు’ అని ప్రాణత్యాగానికి పూనుకుంటాడు. అది గమనించిన యుధిష్టురుడు, ‘తొందరపడి మాట తూలినందున తాను ప్రాణాలు త్యజించడమే సబబని’ తమ్ముడిని వారించబోతాడు.

వీరి సంభాషణను ఆలకించిన శ్రీ కృష్ణుడు వారితో ఇలా అంటాడు.

మీరిద్దరూ ప్రాణాలు తీసుకోవాల్సిన అగత్యం లేదు. ఎందుకంటే తమ్ముడిని నిష్కారణంగా నిందించినప్పుడే ధర్మజుడు మరణించాడు. అలాగే ఆత్మస్తుతికి పాల్పడినప్పుడే పార్ధుడు జీవచ్చవంగా మారిపోయాడు”.

మహాభారతంలో ప్రక్షిప్త కధనంగా ప్రాచుర్యంలో ఉన్న ఈ వృత్తాంతం తెలిపేదేమిటంటే ఆత్మస్తుతి (స్వోత్కర్ష) పరనింద (ఆరోపణ) వీటికి పాల్పడే వాడు జీవించి వున్నామరణించినట్టు లెక్కే అని.

7, జనవరి 2023, శనివారం

అనుబంధం ఆత్మీయత

 అరికాలి మీద ఎవరో గోకుతున్న ఫీలింగ్ తో మెలకువ వచ్చింది. టైం చూస్తే అర్ధరాత్రి దాదాపు పన్నెండు. కిందికి చూస్తే మంచాన్ని ఆనుకుని నా వైపే నవ్వుతూ  చూస్తున్న నా మనుమరాలు జీవిక. ఒక్క క్షణం ఏమీ అర్ధం కాలేదు. ఇంత రాత్రి పూట రెండు గదులు దాటుకుని పారాడుకుంటూ నా పడక గదిలోకి ఎలా వచ్చింది. చేతులు చాపి దగ్గరికి తీసుకోమంటున్న ఆ చిన్నారిని క్షణం ఆలస్యం చేయకుండా  నా చేతుల్లోకి తీసుకున్నాను. 

ఏడాది  కాలంలో ఇలా ఎప్పుడూ జరగలేదు అనుకోవాలా! జరిగిందని ఆనందపడాలా!

ఎంత గొప్ప అనుభూతి.  

‘అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుగురూ వేటకు వెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు. ఒకటి ఎండలేదు. చేపా చేపా ఎందుకు ఎండలేదు, గడ్డి మోపు అడ్డం వచ్చింది. గడ్డి మోపా గడ్డి మోపా ఎందుకు అడ్డం వచ్చావు?....’

నా చిన్నప్పుడు మా బామ్మ చెప్పిన కధ  చెబుతుండగానే అది పూర్తి కాకుండానే నా ఒడిలోనే జీవిక  నిద్రపోయింది.



07-01-2023

1, జనవరి 2023, ఆదివారం

రేడియోలో ‘దూడలు’ – భండారు శ్రీనివాసరావు


చాలా ఏళ్ళ కిందటి సంగతి. 

ఢిల్లీలో బాబూ జగ్జీవన్ రామ్ మరణించినట్టు ఆరోజు ఉదయం ఆరుగంటల ప్రాంతంలో పీటీఐ వార్తా సంస్థ వార్త ఇచ్చింది. మరో నలభయ్ అయిదు నిమిషాల్లో విజయవాడ నుంచి ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. ప్రాంతీయ వార్తావిభాగం అధికారి శ్రీ ఆర్వీవీ కృష్ణారావు, వెంటనే స్పందించి, జగ్ జీవన్ రాం గురించిన సమస్త సమాచారం సిద్ధం చేసుకుని సవివరంగా ఆ వార్తను ప్రసారం చేసారు. న్యూస్ రీడర్, కీర్తిశేషులు కొప్పుల సుబ్బారావు ఆ రోజు బులెటిన్ చదివారు. ప్రాంతీయ వార్తల అనంతరం ఢిల్లీ నుంచి వెలువడే సంస్కృత వార్తల్లో ఈ సమాచారం లేకపోవడంతో సిబ్బంది కంగారు పడ్డారు. ఆ తరువాత ఏడూ అయిదుకు వచ్చే ఢిల్లీ తెలుగు వార్తల్లోనూ, ఎనిమిది గంటల జాతీయ వార్తల్లోనూ ఆ మరణ వార్త లేకపోవడంతో కంగారు మరీ ఎక్కువయింది. బెజవాడ రేడియో కప్పదాటు వేసిన విషయం బయట పడింది. అప్పటి తెలుగు దేశం లోక్ సభ సభ్యుడు శ్రీ పుట్టపాగ రాధాకృష్ణ ఈ విషయాన్ని ప్రశ్న రూపంలో లేవనెత్తారు. సమాచార శాఖ మంత్రి ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో, ఈ వార్త ప్రసారం చేయడంలో పీటీఐ పై ఆధారపడి దేశంలోని ఏడు రేడియో స్టేషన్లు తప్పు చేశాయని తెలిపారు. గమ్మత్తేమిటంటే ఈ పొరబాటు చేసిన విజయవాడ రేడియో స్టేషన్ పేరు ఈ జాబితాలో లేదు.

ఏది ఏమైనా ఈ ఉదంతంతో రేడియో అధికారులు మరణ వార్తల ప్రసారం విషయంలో అనుసరించాల్సిన ఆదేశిక సూత్రాలు ఢిల్లీ నుంచి జారీ అయ్యాయి. రేడియో విలేకరి స్వయంగా వెళ్లి చూసి ఇచ్చేదాకా, ముఖ్యుల మరణ వార్తను ప్రసారం చేయరాదని ఆంక్షలు విధించారు. 

తరువాత చాలా కాలానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి శ్రీ టి. అంజయ్య ఢిల్లీలోని రామమనోహర్ లోహియా ఆసుపత్రిలో మరణించారు. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న శ్రీ పీవీ నరసింహారావు అంజయ్య భౌతిక కాయాన్ని విమానంలో హైదరాబాదు తీసుకు వస్తున్నట్టు జాతీయ వార్తా ఛానళ్ళు సమాచారం ఇచ్చాయి. బెజవాడ నుంచి వెలువడే కొన్ని ప్రధాన పత్రికల్లో కూడా అంజయ్య మరణ వార్త ‘లేట్ న్యూస్’ రూపంలో సంక్షిప్తంగా ప్రచురించారు. 

విజయవాడలో ఉన్న కృష్ణారావు గారు హైదరాబాదులో ఉన్న నాకు ఫోను చేసి అడిగారు. వార్త కరక్టే అని చెప్పాను. కానీ ఆయన చనిపోయింది ఢిల్లీలో. నిబంధనల ప్రకారం ఢిల్లీ విలేకరి ఆ వార్తను ధ్రువపరచాలి. అందుకోసం ప్రయత్నించారు కానీ ఆ సమయంలో ఢిల్లీలోఎవరూ దొరకలేదు. చనిపోయింది రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. నిబంధనల పేరుతొ ఆరోజు న్యూస్ బ్రేక్ చేయక పొతే ప్రజలనుంచి పెద్ద నిరసన వచ్చే ప్రమాదం వుంది. దాంతో ఏమైతే ఏమైందని కృష్ణారావు గారు అంజయ్య గారి మరణ వార్తను ఇతర వివరాలతో కలిపి ఉదయం ఆరూ నలభయ్ అయిదు నిమిషాలకు మొదలయ్యే ప్రాంతీయ వార్తల్లో ప్రముఖంగా ప్రసారం చేసారు. 

మళ్ళీ సీను రిపీట్. ఢిల్లీ తెలుగు వార్తల్లో ఆ ముచ్చటే లేదు. ఇక్కడ నుంచి ఇచ్చినా నిబంధనల పేరుతొ తీసుకోలేదు. 

‘తెలుగు ప్రముఖుడు ఒకరు చనిపోతే ఆ వార్తను  ఢిల్లీ తెలుగు వార్తల్లో ఆ విషయం చెప్పరా’ అంటూ మళ్ళీ పుట్టపాగ రాధాకృష్ణ గారే పార్ల మెంటులో హడావిడి చేసారు. 

ఇలాటివే మరి కొన్ని అవకతవకలు రేడియో వార్తల్లో దొర్లాయి. ఒకటి జగ్జీవన్ రాం మరణ వార్త, రెండోది లోక్ నాయక్ జయప్రకాశ్ కన్నుమూత గురించిన వార్త. ఈ రెండింటినీ ధ్రువ పరచుకోకుండానే వార్తల్లో ఇవ్వడం, నాలుక కరచుకోవడం జరిగింది. పార్లమెంటు శ్రద్ధాంజలి ఘటించింది కూడా. ఆ తరువాత కానీ జరిగిన పొరబాటు తెలియరాలేదు. 

ఇంకా పాత కాలంలో తమిళనాట (అప్పుడు మద్రాసు రాష్ట్రము) ద్రవిడ నాయకుడు అన్నాదొరై మరణ వార్త ప్రసారం చేసే విషయంలో రేడియోవాళ్ళు తొందర పడి దూడ వేసారనే వదంతి ఒకటి వుంది. నాకైతే తెలియదు.


మరోటి విదేశీ రేడియో ముచ్చట. 

ఎనభయ్యవ దశకం చివర్లో నేను మాస్కోలో, రేడియో మాస్కో తెలుగు విభాగంలో పనిచేసే రోజుల్లో, తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎం.జి. రామచంద్రన్ తీవ్ర అస్వస్థత అనంతరం కన్ను మూశారు. వార్తను ధృవీకరించుకోవడం జరిగింది కానీ, ఆ వార్త రేడియో మాస్కో తమిళ వార్తల్లో కూడా ప్రసారానికి నోచుకోలేదు.  కారణం మరో విషయంలో వాళ్లకు ధృవీకరణ సకాలంలో అందకపోవడమే. అదేమిటంటే, చెప్పుకోవడానికి  చిత్రంగా వుంటుంది కానీ, ఎం.జి. రామచంద్రన్ కు  అప్పటి కేంద్ర ప్రభుత్వానికి నడుమ సయోధ్య ఉందా లేదా అనే విషయం  రేడియో మాస్కో ఢిల్లీ విలేకరినుంచి తగిన సమాచారం అప్పటికి అందకపోవడం వల్ల ఆ మరణ వార్తను కొన్నాళ్ళు నిలిపి వేసి  తర్వాత ప్రసారం చేశారు.


ఇంకోటి,  ఏకంగా స్వకీయమే. అంటే రేడియో విలేకరిగా స్వయంగా నేను వేసిన దూడ సంగతే. అదీ చెప్పుకోవాలి కదా మరి.

ఆరోజు మంత్రి వర్గం సమావేశమౌతోంది. మధ్యాహ్నం పన్నెండు తర్వాత ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడతారని కబురొచ్చింది. సచివాలయం బీట్ చూసే విలేకరుల, అందరం బిలబిలమంటూ సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌కు చేరుకున్నాం. విలేకరులు, అధికారులతో సమావేశాలు నిర్వహించేందుకు ఆ ఛాంబర్‌ ప్రక్కనే ఒక చిన్న హాలు ఉండేది. 

ఓ అరగంట తర్వాత అప్పటి ముఖ్యమంత్రి శ్రీ అంజయ్య ఆ హాల్లోకి వచ్చారు. విలేకరులందరినీ పేరుపేరునా పలకరిస్తూ మామూలు కబుర్లలో పడిపోయారు. మధ్యమధ్యలో ఏం మొయిన్‌  (మొయినుద్దీన్‌ - ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి) అందరికీ అన్నీ (కాఫీ టిఫిన్లు) అందాయా? అని వాకబు చేస్తున్నారు. అప్పటికి దాదాపు ఒంటిగంట కావస్తుండడంతో చివర్లో కూర్చున్న నాలో అసహనం పెరిగిపోతోంది. మరో పదిమిషాల్లో మధ్యాహ్నం ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. ఈ బులెటిన్‌ తప్పిపోతే మళ్లీ సాయంత్రం దాకా దిక్కులేదు. కానీ అంజయ్యగారి కబుర్లు ఒక పట్టాన తేలేలా కనిపించడంలేదు. చివరికి ఏదయితే అదే అయిందని లేచి ఆయన దగ్గరకు వెళ్లాను. వార్తల టైమ్‌ అవుతోందని చెప్పేసి, ఏం చెప్పదల్చుకున్నారో ఒక్క ముక్కలో చెప్పండని కోరాను. దానికాయన పెద్దగా నవ్వేస్తూ `చెప్పడానికేముంది! మంత్రులందరూ (రాజీనామా లేఖలు) ఇచ్చేశారు' అని సైగలతో చెప్పేశారు. నేను రయ్‌ మంటూ బయటకు పరుగెత్తి, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రేడియోకి ఫోన్‌ చేసి మంత్రుల రాజీనామా వార్తని అందించాను.

ఇదంతా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే, విలేకరులు వార్తలను అందించే తొందర్లో ఎలా తప్పుల్ని తొక్కుతారో అన్నది తెలియ చెప్పడానికే. ఇందుకు నేనూ మినహాయింపు కాదని చెప్పడానికే.

అంజయ్యగారి మంత్రి వర్గాన్ని `జంబోక్యాబినెట్‌' అని ఎద్దేవా చేసేవారు. అరవైమంది మంత్రులేమిటి, విడ్డూరం కాకపోతే అనేవారు. కార్టూన్ల సంగతి సరేసరి. అయినా, ప్రతిదీ తేలిగ్గా తీసుకునే తత్వం ఆయనది. యాదగిరి (హెలికాప్టర్‌)తో తనను ముడిపెట్టి ఒక దినపత్రికలో ప్రచురించే వ్యంగ్య చిత్రాలను కూడా నవ్వుతూ ఆస్వాదించే మనస్తత్వం ఆయనది.

`వెనకటి రోజుల్లో జిల్లాకు ఒకే ఒక్క అయ్యేఎస్‌ ఆఫీసర్‌ (జిల్లాకలెక్టర్‌) ఉండేవాడు. ఇప్పుడో, ఇద్దరు ముగ్గురు అలాంటి అధికార్లు జిల్లాల్లో పనిచేస్తున్నారు. అలాంటప్పుడు జిల్లాకు ఇద్దరు మంత్రులు వుంటే తప్పేంటి `శ్రీనివాసూ' అనేవారు ఆంతరంగిక సంభాషణల్లో.

ఇక వార్తల్ని అందించడంలో తొందరపాటు విషయానికి వస్తే ఆ రోజు నేను హడావిడిలో అరవైమంది మంత్రులు రాజీనామా చేశారని చెప్పాను. రేడియోలో కూడా అలాగే ప్రసారమైంది. నిజానికి ముఖ్యమంత్రితో కలిపి మంత్రివర్గంలో సభ్యులసంఖ్య అరవై. 59 మంది మంత్రులే ఆరోజు రాజీనామా చేశారు. సాయంత్రం వార్తల్లో ఈ తప్పు సవరించుకున్నామనుకోండి. ఇలాంటి పొరపాట్లే మరికొన్ని తరహా వార్తల విషయంలో జరిగితేనే వస్తుంది చిక్కంతా.

శ్రీమతి ఇందిరాగాంధీని హత్యచేసినప్పుడు చాల సేపటివరకూ రేడియో ఆ వార్తని వెల్లడించలేదు. ఆవిడ మరణవార్తని జాతికి తెలియచెయ్యడంలో తాత్సారం జరిగిందని దరిమిలా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధానిపై కాల్పులు జరిగాయన్న వార్త బయటకు పొక్కింది కానీ అసలేం జరిగిందన్న దానిపై అందరికీ తీరని సందేహాలే. చివరికి రాజీవ్‌ గాంధీ కూడా శ్రీమతి ఇందిరా గాంధీ మరణం గురించి బీ బీ సీ వార్తలు విని ధృవపరుచుకున్నారు. 

ఆమెపై కాల్పులు జరిపిన అంగరక్షకుల్లో ఒక సిక్కు మతస్తుడు ఉన్నాడన్న సంగతిని రేడియో వార్తల్లో ముందు వెల్లడించలేదు. అందువల్ల, అప్పటివరకూ అందరి మనసుల్లో ఆందోళన, అలజడి తప్పిస్తే అంతా ప్రశాంతమే. కానీ కాల్పులు జరిపిన అంగరక్షకుల్లో ఒకడిపేరు `బియాంత్‌ సింగ్‌' అన్న రేడియో వార్తల్లో విషయం వెల్లడి కాగానే ఒక్కసారిగా అంతా తారుమారయింది. పరిస్థితులు వర్ణించలేనంత భీభత్సంగా పరిణమించాయి. ఎక్కడో ఢిల్లీలో జరిగిన ఘాతుకానికి దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల్లో ప్రయాణించే సిక్కు ట్రక్కు డ్రైవర్లు ఊచకోతకు గురయ్యారు. అవేశకావేశాల ముందు వివేకం, విచక్షణ తలవంచాయి.

ఎవరో చెప్పినట్టు ట్యూబునుంచి పేస్టు బయటకు తీయగలమే కానీ మళ్లీ అందులో పెట్టలేం. అలాగే పేల్చిన తూటా కూడా. ఒక్కోసారి వార్త రగిలించే ప్రమాద తీవ్రత సయితం అలాంటిదే.

నిజమే. వార్తను వెనువెంటనే అందించాలన్న కర్తవ్యదీక్షని మెచ్చుకుని తీరాల్సిందే. కానీ సామాజిక బాధ్యత సంగతేమిటి? పగల సెగలు రగిలించి, వ్యధలు మిగిలించి, విపరీత పరిణామాలకు దారితీసే అవకాశం ఉన్న సమాచారాన్ని కాసేపు తొక్కి పెడితే వచ్చే నష్టం ఏమిటి?

భయంకరమైన పోటీ వాతావరణంలో పయనిస్తున్న ఈనాటి మీడియా మనుగడకు ఎంతో కొంత మేరకు సంచలనాత్మక కథనాలు అవసరమే. కాకపోతే టీ ఆర్‌ పీ రేటింగ్‌లతో పాటు విశాల జనహితాన్ని పట్టించుకోవడం కూడా ఆవశ్యకమే! కాదంటారా!