23, ఆగస్టు 2022, మంగళవారం

బిగ్ జీరో – భండారు శ్రీనివాసరావు

 

“ఏదో అనుకున్నాకానీ నువ్వో బిగ్ జీరో”
అన్నారు, నాకు జర్నలిజంలో అక్షరాలు దిద్దించిన ఆంధ్రజ్యోతి వారపత్రిక ఎడిటర్ పురాణం సుబ్రమణ్య శర్మ గారు.
అప్పుడు నేను ఆయన దగ్గర సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు సుదీర్ఘ సెలవులో పోవడం వల్ల నాకు అనుకోకుండా కలిగిన అదృష్టం అది. దినపత్రికలో సబ్ ఎడిటర్ గా ఉన్న నన్ను ఎడిటర్ నండూరి రామ్మోహన రావు గారు కొన్నిరోజులపాటు పురాణం గారికి సాయంగా ఉండమన్నారు.
ఆరోజుల్లో, పేరు జ్ఞాపకం రావడం లేదు కానీ ఒక తెలుగు చిత్రానికి కధ, మాటలు రాసే అవకాశం పురాణం గారికి వచ్చింది. బెజవాడ బీసెంటు రోడ్డులోని మోడరన్ కేఫ్ లో ఒక గది ఇచ్చారు నిర్మాతలు. పగలు ఆఫీసు పనిచూసుకుని సాయంత్రానికి పురాణం గారు అక్కడికి వచ్చేవారు. ఆ పని పూర్తికావస్తున్న దశలో కాబోలు నన్ను సాయంగా రమ్మన్నారు.
ఆయన గారి ఆలోచనలు జెట్ స్పీడు. దానికి తగ్గట్టుగా వాటిని కాగితాలపై పెట్టడం నా పని, నన్నయభట్టుకు నారాయణ భట్టు మాదిరిగా. ఆయన చెబుతూ వుండడం నేను రాస్తూ పోవడం. నేను పత్రికా విలేకరినే కానీ తెలుగు షార్ట్ హ్యాండ్ గట్రా ఏమీ తెలవ్వు. అంచేత కొన్ని నట్లు పడేవి. ఆ సందర్భంలో ఒక రోజు పురాణం వారు అక్షింతలు వేస్తూ అన్న మాట ఇది. పెద్దవారి అక్షింతలు ఆశీర్వాదాలే కదా!
ఇంతకీ ఆయన ఆ ఒక్క మాటే అని ఊరుకోలేదు.
ఆయన అన్నదేమిటంటే:
“శ్రీనివాసరావ్! నువ్వో జీరో లాంటివాడివి. నీ సంగతి నీకు తెలవదు. ఎవరన్నా నీకు దన్నుగా వుంటే నీ విలువ ఇంకా బాగా పెరుగుతుంది, ఒకటి పక్కన సున్నా లాగా”
ఆయన ఏక్షణంలో అన్నారో తెలవదు.
ఈ సున్నా పక్కన మా ఆవిడ వచ్చి నిలబడిన తర్వాత కానీ నా విలువ పెరిగిన విషయం బోధపడలేదు.
ఇప్పుడు మళ్ళీ సున్నా సున్నా అయింది, పక్కన దన్నుగా నిలబడ్డ మనిషి పోయాక.



20, ఆగస్టు 2022, శనివారం

కాశీ నిబద్ధతకు నా ప్రణామం

2012 – 2022

పదేళ్ల కిందట నేనూ నా భార్య కాశీ పుణ్య క్షేత్రాన్ని దర్శించాము. విశ్వనాధుడి దర్శనం అనంతరం అన్నపూర్ణ దేవాలయానికి వెళ్ళాము. నాకు తెలియకుండానే మా ఆవిడ నా పుట్టిన రోజు ఆగస్టు ఏడో తేదీన నా పేరు మీద అన్నదానం చేయడానికి కాశీ అన్నపూర్ణ అన్నక్షేత్ర ట్రస్ట్ లో తగిన విరాళం చెల్లించింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ప్రతి ఏటా నా పేరు మీద అన్నదానం చేయడమే కాకుండా ఆ విషయాన్ని తెలియచేస్తూ ఉత్తరం పంపుతున్నారు. అంతే కాదు, అమ్మవారి కుంకుమ, అక్షింతలు, కాశీ దారాలు, ఒక రూపాయి బిళ్ళ పోస్టులో పంపుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు ఏడున అన్నదానం చేసినట్టు ఈ రోజు అందిన ఉత్తరంలో వుంది. విరాళం చెల్లించిన పుణ్యమూర్తి లోకంలో లేకపోయినా ఆ పుణ్యం నాకు ఏటా దక్కుతూనే వుంది.
ట్రస్ట్ అంటే నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న కాశీ అన్నపూర్ణ అన్నక్షేత్ర ట్రస్ట్ కు వేల వేల వందనాలు.



(20-08-2022)

17, ఆగస్టు 2022, బుధవారం

మూడేళ్ళయిందా నన్ను ఒంటరిని చేసి

 


సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు అర్ధరాత్రి చెప్పా పెట్టకుండా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు.
మళ్లీ మనుమరాలిగా జీవిక రూపంలో ఇంట్లో అడుగుపెట్టి ఎడారి జీవితంలో కొత్త చిగుళ్లు పూయిస్తున్నావు.
ఇంతటి దయకు నేను అర్హుడునని ఎలా అనుకున్నావ్!




16, ఆగస్టు 2022, మంగళవారం

పంద్రాాగస్ట్ ప్రభాత్ భేరీ - భండారు శ్రీనివాసరావు

 పంద్రాగష్టును మొదటిసారి పండుగ రూపంలో స్వతంత్ర భరత జాతి యావత్తు ఒక్కటై జరుపుకున్ననాటికి నేను ఏడాది శిశువుని. రెండో పండగ, రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవాన్ని తొలిసారి జరుపుకున్నప్పుడు నా వయస్సు అటూ ఇటుగా నాలుగేళ్ళు.

నాకు ఊహ తెలుస్తున్న వయస్సులో ఈ రెండు పండగలను యెంతో ఉత్సాహంతో జరుపుకున్న రోజులు యిప్పటికీ జ్ఞాపకం వున్నాయి. పొద్దున్నే లేచి బడికి వెళ్లి పంతులు గారు త్రివర్ణపతాకం చేతబట్టుకుని ముందు నడుస్తుంటే పిల్లలం అందరం ఊరేగింపుగా ఊరంతా తిరుగుతూ ప్రభాత్ భేరిలో పాల్గొనేవాళ్ళం.
ప్రభాత్ భేరి అనే మాటకు అర్ధం తెలియని వయసు. అయినా అలా ఊరేగింపుగా బయలుదేరి 'భారత్ మాతాకీ జై' అని నినాదాలు చేస్తూ వీధుల్లో తిరుగుతూ వుంటే ఊరంతా ఉత్సాహం ఉరకలెత్తేది. 'జనగణమన' గీతంలో, ఏ ఏ భాషల ప్రస్తావనవుందో, ఏ ఏ ప్రాంతాల ప్రసక్తి వుందో మాకు అప్పటికి తెలియదు. ఆ గీతాన్ని ఎవరు రాసారో, ఏ భాషలో రాసారో అంతకంటే తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే అది అందరి గీతం. జనగణమన చరణాలలోని, 'న' ను 'న' లాగా, 'ణ' ను 'ణ' లాగా, తప్పులు దొర్లకుండా ఎలా పాడాలన్న తపన ఒక్కటే మాకు తెలిసింది. ఢిల్లీ ఎక్కడ వుందో తెలియదు, ఎర్రకోట అంటే తెలియదు, కానీ దానిపై చాచా నెహ్రూ జండా ఎగురవేస్తాడని మాత్రం తెలుసు. ఏమీ తెలియని అజ్ఞానంలోని మధురిమను ఆస్వాదించడం కూడా ఒక మంచి అనుభవమే అని ఈనాడు ఆ రోజులను గుర్తుకు తెచ్చుకుంటే అనిపిస్తోంది.
అవును. ఎక్కడికి పోయాయి ఆ రోజులు?
'లేవరా నాన్నా! ఈరోజు స్కూల్లో జండా ఎగరేస్తారు తొందరగా వెళ్ళాలి' అని తల్లి అంటే- ‘కాసేపు పడుకోనీ మమ్మీ, ఈ రోజు సెలవే కదా!' అని పిల్లలు ముసుగేసి నసిగే రోజులు వచ్చేసాయి. పండగదినం స్తానంలో సెలవు రోజు వచ్చింది. తప్పులు లేకుండా ‘జనగణమన' పాడడం పోయి, ఆ గీతంలో తప్పులెన్నే రోజు వచ్చింది. ఏటేటా జరిగే పతాక ఆవిష్కరణలు మొక్కుబడిగా మారిపోయాయి. మర్నాడు ఆ జాతీయ పతాకాలను ఏ స్థితిలో చూడాల్సి వస్తుందో అనే బెంగ మాత్రం మిగిలిపోతుంది.
ఏమి చెప్పుదు సంజయా!
(16-08-2022)

15, ఆగస్టు 2022, సోమవారం

ఏం సాధించాం! – భండారు శ్రీనివాసరావు


స్వాతంత్ర అమృతోత్సవ సంబరాలు సరే, ఇన్నేళ్ళలో ఏం సాధించాం?

ఇలాంటి సాధింపులు ఈ పండగ పూట పక్కన బెట్టి, సాధించిన వాటిని గురించి ముచ్చటించుకుందాం. మనసుకు బాగుంటుంది.
గడచిన డెబ్బయ్ అయిదేళ్ళ కాలంలో ప్రపంచం గర్వించదగిన గొప్ప లక్షణాలను, విజయాలను స్వతంత్ర భారతం తన కొంగున ముడివేసుకుంది. 1947 లో మనదేశంతో పాటే స్వేచ్చా వాయువులు పీల్చుకున్న అనేక ఆసియా దేశాలు, ఇరుగు పొరుగు దేశాలు ఈ డెబ్బయి అయిదేళ్ళలో కొంతకాలం పాటయినా ప్రజాస్వామ్య పధాన్ని వీడి, నియంతృత్వపు బాటలో నడిచిన దాఖలాలున్నాయి. మన దేశం మాత్రం ఎన్ని వొడిదుడుకులకు లోనయినా, మరెన్ని వొత్తిడులకు గురయినా, ఎంచుకున్న మార్గంలోనే అప్రతిహతంగా పురోగమించి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటిగా తన స్తానాన్ని పదిలం చేసుకుంది.
జనాభాలో అత్యధిక భాగం నిరక్షరకుక్షులయినా 'వోటు' అనే ఆయుధంతో ప్రభుత్వాలను మార్చగల సత్తా వారి సొంతం.
అక్షర జ్ఞానం లేకపోయినా, కానులూ, ఏగానులనుంచి, బేడలూ అర్ధణాల నుంచి నయా పైసల లెక్కకు అలవోకగా మారగలిగిన 'మేధోతనం' మనవారి ఆస్తి.
గిద్దెలు, సోలలు, శేర్లు, సవాశేర్లు, మానికెల కొలతలనుంచి లీటర్లకు అతి తక్కువ వ్యవధిలో మారిన చరిత్ర మన వారిది.
అలాగే, వీసెలు, మణుగులనుంచి కిలోగ్రాములకు, బస్తాలనుంచి క్వింటాళ్లకు, 'మైలు రాళ్ళని' అధిగమించి కిలోమీటర్లకు ఎదిగారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా కిలోమీటర్ల లెక్కల్లోకి మారిపోకుండా పాతకాలంలోలా ఇంకా 'మైలు'రాళ్ళ దగ్గరే ఆగిపోయిన సంగతి ఇక్కడ గమనార్హం.
చదువూసంధ్యా లేని వాళ్లనీ, ఎందుకు పనికిరాని వాళ్ళనీ ఇతర దేశాల వారికి మనపై చిన్నచూపు. కానీ అలాటి మనవాళ్లు, దేశానికి స్వాతంత్రం రాగానే నిర్వహించిన తొలి ఎన్నికల్లో పార్టీల గుర్తులున్న పెట్టెలలో వోటు వేసే దశను అలవోకగా దాటేసారు. ఆ తరువాత ఒకే బాలట్ పేపరుపై ముద్రించిన అనేక పార్టీల గుర్తులనుంచి తాము ఎంచుకున్న అభ్యర్ధిని అతడి గుర్తుతోనే గుర్తుపట్టి వోటు వేయగల పరిణతిని అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా అధునాతన ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను తడబడకుండా ఉపయోగించుకోగల సామర్ధ్యాన్ని అలవరచుకోగలిగారు.
'ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణం' అనే నిర్లిప్త స్తితిని అధిగమించి ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో భారతీయుల ముద్ర స్పుటంగా, ప్రస్పుటంగా ప్రపంచ వ్యాప్తంగా కానరాగల అత్యున్నత శిఖరాలకు మన దేశం చేరుకోగలగడం స్వతంత్ర భారతం సాధించిన మరో ఘనత.
'చందమామ రావే' అంటూ పాటలు పాడే స్తితి నుంచి 'చంద్రయాన్' వరకు ఎదగగలిగాము. అంతరిక్ష పరిశోధనల్లో అభివృద్ధి చెందిన దేశాల సరసకు చేరగలిగాము. సుదూర లక్ష్యాలను చేధించగలిగిన అధునాతన రక్షణ క్షిపణులను అంబుల పొదిలో చేర్చుకోగలిగాము. సస్య విప్లవం విజయవంతం చేసుకుని ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే దుస్తితి తప్పించుకుని స్వయం సమృద్ధిని సాధించుకోగలిగాము.
ఏ ఇంగ్లీష్ వారితో తలపడి, అహింసా మార్గంలో వారితో పోరాడి స్వతంత్రం సంపాదించుకున్నామో, ఆ ఇంగ్లీషు వారి భాషనే ఆయుధంగా చేసుకుని, దేశ దేశాలలో కంప్యూటర్ రంగాన్ని మన కనుసన్నలతో శాసించగలుగుతున్నాము.
ఇలాంటి విజయాలను ఈనాడు మనం చెప్పుకోవాలి. ఇలాంటి ఘనతలను గురించి మనం ఈనాడు ఘనంగా చెప్పుకోవాలి.
ఇంకా ఏమైనా చెప్పుకోవాలి అని వుంటే వాటికి మరో రోజు కేటాయించండి.
ఈరోజు మాత్రం ఇలాగే గడపండి.
(15-08-2022)

14, ఆగస్టు 2022, ఆదివారం

మూడో పేజీ చూశారా గురూగారూ! – భండారు శ్రీనివాసరావు

  

(Published in Andhra Prabha daily today, 14-08-2022)


నా చిన్నతనంలో చదివిన జోకు ఇది.

ఒకతను దినపత్రిక ఒకటి  చేతబట్టుకుని వీధిలో అందరి వెంటాపడుతూ, ‘మూడో పేజీ చూశారా’ అని వేధిస్తుంటాడు. విషయం ఏమిటంటే అతగాడు రాసిన ఉత్తరాన్ని ఆ రోజు ‘పాఠకుల లేఖలు’ శీర్షికలో ప్రచురించారు. దాన్ని గురించి నలుగురికీ తెలపడానికి అతడెన్నుకున్న మార్గం ఇది. (ఆదుర్తి వారు తీసిన సినిమాలో కూడా ఈ మాదిరి సన్నివేశం వున్నట్టు గుర్తు)

తాము చేసిన పనులు ( వారి దృష్టిలో ఘనకార్యాలు) నలుగురి దృష్టికి తీసుకురావడానికి రకరకాల పద్ధతులు అనుసరిస్తూ వుండడం మనకు కొత్తేమీ కాదు. కొందరు బాహాటంగా బయటపడి నిస్సిగ్గుగా చెప్పుకుంటే, మరికొందరు నర్మగర్భంగా పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. రాజుల కాలంలో ఈ పని చేయడానికి కొందరు ఉద్యోగులు వుండేవాళ్ళు. రాజు చేసిన పనులను గోరంతను కొండంత చేసి పొగడ్తలతో ముంచెత్తడం వీరి ప్రధాన విధి. కొండొకచో, వారి ఆస్తాన కవులు కూడా ప్రత్యేక సందర్భాలలో అన్యాపదేశంగా ఈ కర్తవ్య పాలన చేసి తమ రాజభక్తిని కవితాత్మకంగా చాటుకునేవారు. తదుపరి జమీందారుల కాలంలో సయితం కొనసాగిన ఈ విధానం, ప్రజాస్వామ్య యుగంలో ఉగాది కవి సమ్మేళనాల రూపంలో కొత్తపుంతలు తొక్కుతోంది. ఇక మీడియాలో అనుదిన  ప్రచార ప్రకటనలు సరేసరి. ‘ప్రచారం కోసం ఇన్నిన్ని కోట్లు ప్రజాధనం ఖర్చు చేస్తారా ? ఆయ్!’ అంటూ హుంకరించి, పత్రికలకెక్కి విమర్శలు గుప్పించిన ప్రధానప్రతిపక్షం వాళ్ళే, తాము అధికారంలోకి రాగానే ఆ విషయాన్ని వీలుచేసుకుని మరీ మరచిపోతారు. మరచిపోవడమే కాదు, పబ్లిసిటీ ఇచ్చుకునే విషయంలో తమ వైరిపక్షం కన్నా నాలుగాకులు ఎక్కువే చదివామని అనిపించుకుంటున్నారు. కాలక్రమంలో ఇది మరింతగా ముదిరిపోయి ప్రభుత్వ పధకాల ప్రచారం కాస్తా అధికారంలో కీలక స్తానాల్లో వున్న వారి వ్యక్తిగత ప్రచారంగా రూపుదిద్దుకోవడం, ఆ ఖర్చును పన్నుల రూపంలో ప్రజల మీద రుద్దడం,  ఇవన్నీ ప్రజాస్వామ్య యుగంలో సహజాతి సహజంగా జరిగిపోతున్నాయి.

వ్యక్తిగతం అంటే గుర్తుకొచ్చింది. వ్యవస్థలు, ఆ వ్యవస్థలను శాసించే వ్యక్తుల సంగతి అటుంచండి. ఇప్పుడీ ప్రచార ఉధృతి అనేది సామాన్య జనజీవనంలోకి కూడా ప్రవేశించింది. పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, పూజలు, పునస్కారాలు అన్నీ ప్రచార ప్రాతిపదికనే జరిగిపోతున్నాయి. సంస్కృతీ సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తున్నామన్న భావనకన్నా, ఎంత ఆడంబరంగా జరుపుకుంటున్నామన్న అభిజాత్యమే వీటిల్లో బాగా కానవస్తోంది.

కొత్తగా ఫ్రిజ్ కొనుక్కున్నావిడ ఇంటికొచ్చిన ప్రతి వాళ్లకు అడగకుండానే ‘మంచినీళ్ళు తాగుతారా పిన్ని గారు’ అని అడిగి, నీళ్ళ గ్లాసు చేతికిచ్చి, ‘చల్లగానే వుంటాయి లెండి, కొత్త ప్రిజ్ కదా’ అంటూ తాము ప్రిజ్ కొన్న సంగతి చల్లగా బయటపెట్టే సన్నివేశాలకు సినిమాల్లో కొదవ వుండదు. అలాగే కొన్న చీరెలు గురించీ, నగల గురించీ ఇరుగూ పొరుగుతో చెప్పుకుని తృప్తిపడే ఆడంగులు కొల్లలుగా కనిపిస్తారు. ఇక మగవాళ్లు తమ చేతికి పెట్టుకున్న వాచీ, చేతిలో వున్న మొబైల్  ఎంత ఖరీదూ అనే విషయాన్ని అడగకుండానే అన్యులకు తెలియచేస్తుంటారు. ఇలాటివాళ్ళతో పేచీ ఏమీ లేదు. ‘ఆహా ఒహో అలాగా!’ అంటే చాలు మురిసి ముక్కచెక్కలవుతారు.

మరోరకం వాళ్ళతోనే ఇబ్బంది. వాళ్లు ఏది కొన్నా అదే బెస్ట్ అంటారు. తాము ఏది చేసినా అది ఇతరులు ఎవ్వరూ చేయలేరన్న ధీమా అనండి, అతిశయం అనండి, వారి మాటల్లో పెల్లుబుకుతుంటుంది. వాళ్ల రూటే సపరేటు. వాళ్లు వెళ్ళిందే మంచిహోటలు. వాళ్లు చూసిందే భేషయిన సినిమా. వాళ్లు చదివిందే చక్కటి పుస్తకం. వాళ్లు చెప్పిందే వేదం. ఇంతెందుకు! వాళ్లు పట్టిన కుందేటికి నాలుగు కాళ్ళు వుంటే నా మీద వొట్టు.

దీన్ని ‘వన్ వే’ పబ్లిసిటీ అనాలేమో. ఇతరులకి ఎంత మాత్రం ఛాన్స్ ఇవ్వరు మరి.

ఈ మధ్య ఓ కొత్తరకం సెల్ఫ్ డబ్బా ఒకటి మొదలయింది. ‘పలానా టీవీ పలానా టైం కు పెట్టండి. నా ప్రోగ్రాం వస్తుంది’ అని తెలిసిన వాళ్లకు, తెలియని వాళ్లకు మొబైల్ ఫోన్లల్లో ‘ఎస్సెమ్మెస్’ లు ఇస్తుంటారు. ‘దయచేసి పలానా వారపత్రికలో/దినపత్రికలో నా వ్యాసం వచ్చింది చదవండి ప్లీజ్’ అని వచ్చే ఎస్సెమ్మెస్ ల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. టీవీ చర్చల్లో పాల్గొనే మేధావులలో కొందరు ‘పలానా పత్రికలో ఈ విషయం గురించి ఇప్పటికే రాసేసాను’ అని చెప్పుకోవడం సెల్ఫ్ పబ్లిసిటీకి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఇక సోషల్ మీడియాలో ఆ రచనల కటింగులు, క్లిప్పింగులు పోస్టు చేయడం ఆనవాయితీగా మారింది. ఇప్పుడు వచ్చిపడ్డ  వాట్సప్ పుణ్యమా అని ఇక వీళ్ళని ఆపడం ఎవరి తరం కావడం లేదు.

‘నిన్ను గురించి నువ్వు ఎప్పుడూ చెప్పుకోకు. నిజం చెప్పుకుంటే ఎవ్వరూ నమ్మరు. అబద్ధం చెబితే మాత్రం ఇంకా యెంత వున్నదో అని సందేహిస్తారు’ అని  మా అన్నయ్య ఎప్పుడూ చెబుతుండేవాడు. కానీ ఈనాటి సూత్రాలకు ఇది పూర్తిగా విరుద్ధం. సిద్ధాంతాలయినా, ఆదర్శాలయినా దేశ, కాల, మాన పరిస్థితులను బట్టి మారిపోతుంటాయి. ఒకప్పుడు ఒక పార్టీలో వున్నవాడు ఎప్పటికీ అలాగే వుండిపోనక్కరలేదు. రాత్రికి రాత్రే తమ ప్రత్యర్ధి పార్టీలోకి మారిపోయి, కొత్త పార్టీ కండవా కొత్తగా కప్పుకుని మర్నాడు పొద్దున్నే ఏ టీవీ ఛానల్ చర్చావేదికపైనో  తమ వితండవాదాలతో కుండలు, బల్లలు బద్దలు కొడుతూ వుండవచ్చు. పొతే, మార్పు మానవులకు సహజం అన్న సిద్ధాంతం సమర్ధించుకోవడానికి ఎలాగూ వుంది. ‘తరచూ ఒపీనియన్స్ మార్చుకోకపోతే పొలిటీషియన్ కానేరడు’ అని గిరీశం ఏనాడో చెప్పాడు కూడా.

అంచేత మాస్టారూ, ప్రతివాడూ తన గురించి తానే చెప్పుకోవాలి. ఇతరుల గురించి నాలుగు మంచి మాటలు చెప్పే మంచితనం ఈనాడు కలికానికి కూడా దొరకని పరిస్తితి. అందువల్ల, ఏతావాతా చెప్పేదేమిటంటే మనకి మనమే పీఆర్వోలం. మన గురించి మనమే ప్రచారం చేసుకోవాలి. అవతల మనిషి నమ్మడం లేదని తెలిసినా మన గురించి మనం చెప్పుకుంటూనే పోవాలి. ఎదుటివాడు నమ్మకపోయినా కనీసం అతడి పక్కవాడు మన మాటల్ని నమ్మే ఛాన్సు కొంతయినా వుంటుంది. ఆలశ్యం ఎందుకు? స్వయం భజన బృందంలో చేరిపోదాం పదండి.

ఇక సిగ్గంటారా! దాన్ని వొదలకపోతే ఈ పాడు ప్రపంచంలో ఎదగడం కష్టం!!



11, ఆగస్టు 2022, గురువారం

రాజకీయాల్లో పెదరాయుడు వెంకయ్య నాయుడు – భండారు శ్రీనివాసరావు


(ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితం)


వెంకయ్య నాయుడు.

ఉపరాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి అంటూ పేరుకు ముందు విశేషణాలు అవసరం లేకుండా దేశమంతా తెలిసిన పేరు.

 

అలాంటి వెంకయ్యనాయుడు గురించిన ఒక విలేకరిగా నేను మరచిపోలేని కొన్ని జ్ఞాపకాలు వున్నాయి.


1972 – 73


ప్రత్యేక ఆంద్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులు. నేను బెజవాడ నార్లవారి ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాను. బందరు రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఇప్పుడు స్వరాజ్ మైదానం అనుకుంటా, అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రధాన వక్తలు మాట్లాడిన తరువాత ఒక యువకుడు మైకు అందుకున్నాడు. నిమిషాల వ్యవధిలోనే సభికులను తన వాగ్దాటితో మైకంలో ముంచి తేల్చాడు. ఎవరని ఆరా తీస్తే వెంకయ్య నాయుడు అన్నారు. పేరు చూస్తే వయసుమళ్ళినవాడనిపించించేది కానీ, మనిషి మాత్రం చాలా చిన్నకారువాడే.
1975
లో హైదరాబాదు ఆలిండియా రేడియోలో విలేకరిగా చేరిన మూడు సంవత్సరాలకు వెంకయ్యనాయుడు ఎమ్మెల్యేగా శాసన సభలో అడుగుపెట్టారు. ఆయనకు జోడీ ఎస్. జై పాల్ రెడ్డి. ఇక వాళ్ళు సభలో ప్రసంగం మొదలు పెట్టినా, ప్రశ్నలు లేవనెత్తినా, ప్రభుత్వాన్ని నిలదీసినా మొత్తం ప్రెస్ గ్యాలరీ పూర్తిగా నిండిపోయేది. వింటూ రాసుకోవడం విలేకరులకి అలవాటే అయినా వాళ్ళిద్దరూ చెబుతున్నది ఆసక్తిగా వినాలా, శ్రద్ధగా వింటూ పొల్లుపోకుండా రాసుకోవాలా అనేది అందరికీ ఒక సమస్యగా వుండేది. ఆ రోజుల్లో శాసన సభలో ఛలోక్తులుఅనే శీర్షికతో ప్రతి పత్రికా ఒక కాలం ప్రచురించేది. వాటిల్లో సింహభాగం వారిద్దరివే ఉండేవి. ఈ విషయంలో ఇద్దరూ ఇద్దరే. వెంకయ్యనాయుడి విశ్వరూపం నేను చూసింది అసెంబ్లీలోనే. అంత్య ప్రాసలతో ఉపన్యాసాన్ని రక్తి కట్టించే ఆ సాంప్రదాయాన్ని ఆనాటి నుంచి ఈనాటివరకూ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ప్రసంగాల్లో కూడా ఆయన కొనసాగిస్తూ వస్తూనే వున్నారు.
ఆయనతో నా రేడియో అనుబంధం ఇంకా విచిత్రం. ఏదైనా వార్తను పత్రికలకు ఎలా చెప్పాలో, రేడియోకు ఎలా చెప్పాలో ఆయనకు కరతలామలకం. మాకు మధ్యాన్నం, మళ్ళీ సాయంత్రం ప్రాంతీయ వార్తలు ఉండేవి. ఆయన ఇరవై మూడు జిల్లాల్లో ఎక్కడ వున్నా ఫోనుచేసి వార్త చెప్పేవారు. మేము ప్రసారం చేసింది విని, మళ్ళీ ఫోను చేసి బాగానే చెప్పారు కానీ మరో వాక్యం జత చేస్తే బాగుండేది, సాయంత్రం వీలుంటే  చెప్పండిఅనేవారు, ‘కాదుఅనడానికి వీల్లేకుండా.
ఇక ఎన్టీఆర్  రోజుల్లో జరిగిన   ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో ఆయన పాత్ర ఇంతా అంతా కాదు. ప్రజల్లో రగిలిన అసహనానికి ఆయన వాగ్ధాటి ఆజ్యం పోసిందనడంలో అతిశయోక్తి లేదు.
మరోసారి కలిసింది ఢిల్లీలో. మాస్కో రేడియోలో పనిచేస్తూ సెలవుపై హైదరాబాదు వస్తూ ఢిల్లీలో దిగాను. పూర్వ పరిచయం పురస్కరించుకుని వెడితే, గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించారు. మాస్కో విశేషాలు అడిగి ఆసక్తిగా విన్నారు.
ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న రోజుల్లో నేనూ జ్వాలా నరసింహారావు ఒకసారి ఢిల్లీ వెళ్ళాము. ఏపీ భవన్ లో దిగిన మమ్మల్ని కలవడానికి సీనియర్ జర్నలిష్టులు చంద్రకాంత్, ఆనంద్ వచ్చారు. మాటల మధ్యలో వెంకయ్యనాయుడు గారి ఇంటికి వెడుతున్నట్టు చెప్పి మమ్మల్ని కూడా రమ్మన్నారు. ఆయన ప్రతి సంక్రాంతి పండక్కు కాబోలు తన ఇంట్లో చక్కటి విందు భోజనం ఏర్పాటుచేసి, ఢిల్లీ లోని తెలుగు కుటుంబాలను ఆహ్వానిస్తారు. పిలవని పేరంటంగా వెళ్లిన మా ఇద్దర్నీ కూడా వెంకయ్యనాయుడు చాలా ఆదరంగా కనుక్కున్నారు. అందరూ వెళ్ళిన తరువాత వెళ్లి కలిస్తే వచ్చిన పనేమిటనిఆయనే ఆరా తీసారు. అప్పుడు జ్వాలా 108 లో పనిచేస్తున్నాడు. రాజస్థాన్ రాష్ట్రంలో విస్తరణ గురించి జ్వాలా చెబితే అక్కడి ముఖ్యమంత్రితో మాట్లాడుతానని చెప్పి, అప్పటికప్పుడే మాట్లాడారు కూడా.
ఏడాది క్రితం ఒకసారి హైదరాబాదులో ఏదో కార్యక్రమానికి హాజరయి, జనాల హర్షద్వానాల నడుమ ఆసక్తికర ఉపన్యాసం ముగించుకుని, విమానం టైం అయిందని మధ్యలోనే వెడుతుంటే దారిలో నాకు కనిపించారు. ఎలా వున్నావు శ్రీనివాసరావుఅంటూ అదే ఆదరణతో కూడిన పలకరింపు. నడుస్తూనే నా గురించి మంచీచెడూ కనుక్కుంటూ కారెక్కి వెళ్ళిపోయారు.

 

 

ఉపశ్రుతి :

దేశాన్ని కరోనా పట్టి  పీడిస్తున్న రోజులు.  జనమంతా ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో తెలియక తమని గురించే మధన పడుతున్న రోజులు.

2020 మే నెల నాలుగో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఫోను రింగయింది.

భండారు శ్రీనివాసరావు గారా! లైన్లో వుండండి వైస్ ప్రెసిడెంటు గారు మాట్లాడుతారు”

వెంకయ్య నాయుడు గారు దేశంలో చాలామందికి ఇలా ఫోను చేసి మాట్లాడుతున్నారని తెలుసు, కానీ ఆ ఫోను నాకు వస్తుందని ఊహించలేక పోయాను. ఇంతలోనే నాయుడు గారు లైన్లోకి వచ్చారు.

శ్రీనివాసరావు గారు ఎలా వున్నారు? నేను వెంకయ్య నాయుడిని”

నమస్కారం సార్! నేను బాగున్నానండీ! మీరెలా వున్నారు?”

నేను బాగానే వున్నాను. మీ ఆవిడ చనిపోయిన తర్వాత ఫోను చేసి మాట్లాడలేకపోయాను, వెరీ సారీ”

“..........”

హైదరాబాదులో మన మిత్రులందరూ కులాసేనే కదా!”

అందరూ బాగున్నారండీ. నాకు అర్ధం కాని విషయం అండీ. పేపర్లో చదివాను. మీరు ఈ కరోనా సమయంలో ఇలా అందరితో ఫోను చేసి మాట్లాడుతున్నారని. ఇంత తీరిక ఎలా దొరికింది”

ఇలాంటి సమయాల్లోనే కదా మాట్లాడి యోగక్షేమాలు కనుక్కోవాల్సింది”

“....................”

ఇక్కడ నేను నా భార్య ఇద్దరమే. పిల్లలు దగ్గర లేరు. బహుశా పెళ్ళయిన తర్వాత ఇలా ఇద్దరం ఒక్కచోట ఇన్నాళ్ళు కలిసివుంది ఇప్పుడేనేమో”

చాలా సంతోషంగా వుందండీ మీతో మాట్లాడడం”

నాకూ అలానే వుంది. అందరం పెద్ద వయసులో పడ్డాం. ఆరోగ్యం జాగ్రత్త! వుంటాను శ్రీనివాసరావు గారు”

తర్వాత సిగ్గనిపించింది. ఈ కరోనా సమయంలో నేనూ ఖాళీనే. కానీ ఎంతమంది స్నేహితులను పలకరించగలిగాను?

దటీజ్ వెంకయ్యనాయుడు !

కింది ఫోటో: 


(వెంకయ్య నాయుడితో వ్యాసరచయిత)


(11-08-2022)