1, జులై 2022, శుక్రవారం

స్వతంత్ర స్వతంత్రంగా మనగలుగుతుందా! – భండారు శ్రీనివాసరావు


‘ఈ సినిమాలో నేను చేస్తున్నది పూర్తిగా ఓ డిఫరెంట్ రోల్. ఇంతవరకు వేయని పాత్ర’ అని అంటుంటారు నటీ నటులు.
‘మా ఈ సినిమా మామూలు సినిమాలకు విభిన్నం. వైవిధ్యభరితంగా వుండే కధ’ అని చెబుతుంటారు నిర్మాత దర్శకులు.
అయితే ఆ సినిమాలు చూసేవారికి అలా అనిపించకపోవచ్చు. ఆ సినిమాలు అలానే చూసేవారికి అందులో కొత్తదనం కనిపించవచ్చు. నిజానికి ఈ రెండోరకం ప్రేక్షకుల వల్లే చిత్ర విజయం ఆధారపడుతుందని ఆ రంగానికి చెందిన పండితులు అంటుంటారు.
ఈ మధ్య ఈ మాధ్యమంలో, దాన్ని ప్రచారం అనాలో సమాచారం అనాలో తెలియదు కానీ ఒక కొత్త టీవీ ఛానల్ గురించి చదివాను. తమది డిఫరెంట్ ఛానల్ అనేది వారి నమ్మకం. దాన్ని తప్పుపట్టడానికి వీల్లేదు. పైగా ‘రెచ్చగొట్టం, రచ్చ చేయం’ అనేది ఆ ఛానల్ ట్యాగ్ లైన్.
మూడు పెగ్గులు తాగేవాడికి ఒక పెగ్గు ఆననట్టుగా ఇన్నేళ్ళుగా రచ్చలకు అలవాటు పడిన వాళ్ళు, ఈ ఛానల్ ని ఆదరిస్తారా! వీక్షకాదరణ లేకుండా ఈ రోజుల్లో ఓ ఛానల్ నడపడం ఈ పోటాపోటీ కాటాకుస్తీ కాలంలో సాధ్యమా! ఎంతమంది చూస్తే అంత గొప్ప ఛానల్, అంత మంచి ఆదాయం అని లెక్కల వేసుకునే రోజుల్లో ఇలాంటి ప్రయోగం విజయవంతమౌతుందా!
అయినా ఈ ప్రశ్నలు వేసుకోవాల్సింది, జవాబులు రాబట్టుకోవాల్సింది ఆ ఛానల్ నిర్వాహకులు.
వేసుకునే వుంటారు. జవాబులు అనుకూలంగా రాకపోయినా ఛానల్ ప్రారంభం జరిగిపోయింది అంటే ఏదో గట్టి పట్టుదల మీదే వున్నారని అనుకోవాలి. అందుకే కాబోలు విభిన్నంగా తమ ఛానల్ కు స్వతంత్ర టీవీ అని పేరు పెట్టుకున్నారేమో!
"మనం చేసేది జనం చూడవలెనా!
జనం కోరేది మనం శాయవలెనా!"
అనే పాతాళ భైరవి మాంత్రికుడి నోటవచ్చిన ఈ వాక్యం ఇక్కడ అతికినట్టు సరిపోతుంది.

బుల్లి తెరలపై అనునిత్యం సాగుతున్న రాజకీయ పోరాటాలు చూసి చూసి సాధారణ ప్రేక్షకులు విసుగెత్తి వున్నారు కనుక అటువంటి వాళ్లకి కొంత ఉపశమనం ఇచ్చే ప్రత్యామ్నాయంగా తమ ఛానల్ ఉంటుందని నిర్వాహకుల ఉద్దేశ్యంగా వుంది.
ప్రముఖ ఆంగ్ల, తెలుగు దినపత్రికల్లో విశేష అనుభవం కలిగిన కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో, తెలుగు టీవీ రంగంపై డాక్టరేట్ పుచ్చుకున్న సీనియర్ గా పేరు తెచ్చుకున్న భావనారాయణ సారధ్యంలో, పలు ప్రముఖ పత్రికలు, టీవీ ఛానల్స్ లో మంచి అనుభవం గడించిన అమరయ్య, తాడి ప్రకాష్, mnr M వంటి వాళ్ళు వెన్నుదన్నుగా ఉన్న ఈ కొత్త ఛానల్ వాళ్ళు తమ మాట నిలబెట్టుకోవాలని ఆశించడం అత్యాశ కాదు.
ఏదైనా మంచి ప్రయత్నం. మంచే జరగాలని కోరుకుందాం.
మండే ఎండాకాలంలో మలయ మారుతంలా వచ్చి విజయవంతం అయిన శంకరాభరణం చిత్రం ఉదాహరణ ఉండనే వుంది.


(01-07-2022)

హస్తవాసి వైద్యం – భండారు శ్రీనివాసరావు


(ఈరోజు జులై ఒకటి డాక్టర్స్ డే)

వాస్తవానికి సమాజంలో వైద్యులది విశిష్టమయిన స్తానం. అందుకే డాక్టరును ‘డాక్టరు గారు’ అని గౌరవంగా
సంబోధిస్తారు. నలుగురిలో వారికి పెద్దపీటవేసి మన్నన చేస్తారు. రోగాలబారి నుంచి కాపాడే అపర ధన్వంతరులుగా, ప్రాణబిక్ష పెట్టే కలియుగ దైవాలుగా కొలుస్తారు. నాకిప్పటికీ గుర్తు. మా చిన్నతనంలో మా వూరికి వారానికోసారి ఆలూరుపాడు నుంచి రామకృష్ణయ్య గారనే ఓ డాక్టరుగారు సైకిలు మీద వచ్చేవారు. చిన్న చితకా జ్వరాలకు తనతో తెచ్చుకున్న తోలుపటకా సంచీ నుంచి మందు గోలీలు ఇచ్చి వైద్యం చేసేవారు. పంటలు చేతికందినప్పుడు వూళ్ళోని పెద్ద పెద్ద ఆసాములు ఏడాదికోసారి కొలిచి ఇచ్చే ధాన్యం మినహా ఆ డాక్టరు గారు ఏనాడూ రోగులనుంచి ఫీజు వసూలు చేసిన దాఖలా లేదు. ఆయన వూరికి వస్తే చాలు దేవుడే నడిచివస్తున్నట్టుగా జనం భక్తి ప్రపత్తులు ప్రదర్శించేవారు. నాడి పట్టుకుని చూసి ‘ఇప్పుడెలావుందయ్యా రాముడూ’ అని ఆప్యాయంగా అడగగానే సగం రోగం చేతులతో తీసివేసినట్టు వుండేది. చుట్టుపక్కల అయిదారు వూళ్ళకు ఆయనే దిక్కు. సైకిల్ తొక్కుకుంటూ రోజుకో వూరు చుట్టబెట్టేవారు. ఆ రోజుల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే. కరెంటు వుండేది కాదు. ఉక్కపోస్తున్నా, నులక మంచంమీద కూర్చుని తన మానాన తాను రోగులకు వైద్యం చేస్తుండేవారు. కళ్ళల్లో కారుణ్యం. మొహంలో చెదరని చిరునవ్వు. ఆయన హస్తవాసిపట్ల అందరికీ అపరితమయిన గురి. జనాలకు కొండంత ధైర్యం.
మరి ఇప్పుడో. ఆ చిత్రం పూర్తిగా మారిపోయింది.
రోగులు పెరిగారు. రోగాలు పెరిగాయి. వైద్యులూ పెరిగారు. ఇచ్చే మందులూ పెరిగాయి. వాటి ఖరీదులూ పెరిగాయి. పెరగనిదల్లా వైద్యులపట్ల రోగులకు వుండే భరోసా! వుండాల్సిన దిలాసా!!
వైద్యులకు రోగులకు నడుమ ఉండాల్సిన అనుబంధం క్రమంగా కనుమరుగవుతోంది.
ఇప్పుడు వైద్యం అనేది వైద్యుల చేతుల్లో నుంచి కార్పొరేట్ల హస్తాలలోకి వెళ్ళిపోయింది. ఇక వాళ్ళు మాత్రం ఏం చెయ్యగలరు?

30, జూన్ 2022, గురువారం

వేణీ దానం అను సతీ పూజ – భండారు శ్రీనివాసరావు

చాలా ఏళ్ల క్రితం మేము సకుటుంబంగా అంటే దాదాపు ముప్పైమందిమి కాశీయాత్ర చేసాము. మార్గమధ్యంలో ప్రయాగ త్రివేణీ సంగమం వద్ద తర్పణ కార్యక్రమాలకు ముందు మా బృందంలోని దంపతుల చేత ఈ వేణీ దానం (పూజ) చేయించారు.

త్రివేణీ సంగమం దగ్గర గంగా, యమునా, సరస్వతి (అంతర్వాహినిగా) మూడు నదులు కలుస్తాయి. ఆడవారి పొడవైన తల వెంట్రుకలను మూడు పాయలుగా చేసి జడ అల్లడం తెలిసిందే. దానికీ దీనికీ ముడిపెట్టి ఈ పూజలు చేయిస్తారు. ఏడుజన్మల పాపాలు కొట్టుకుపోతాయని ఐతిహ్యం. సరే అదలా ఉంచుదాము.
నాకు ఈ పూజలో నచ్చినదేమిటంటే మొగుడి చేత భార్యకు సపర్యలు చేయించడం. అది చూసిన తర్వాత ఈ జన్మలో మొగుళ్ళు చేసిన పాపాలకు ప్రక్షాళన జరగడం ఖాయం అనిపించింది.
ఈ ప్రక్రియలో భర్త తన ఇల్లాలిని తొడపై కూర్చుండబెట్టుకోవాలి. ఆమె మొహాన్ని కడిగి తుడవాలి. కుంకుమ బొట్టు పెట్టాలి. వధువుగా మరి కొన్ని అలంకరణలు చేయాలి. లాలనగా మాట్లాడుతూ, భార్య జుట్టును మూడు పాయలుగా చేసి జడ అల్లాలి. ఇలా కొన్ని పనులు చేయించి మగవాడి ఆధిపత్య, అహంకార ధోరణికి అడ్డుకట్ట వేసే విధానం నాకీ క్రతువులో కనిపించింది.

29, జూన్ 2022, బుధవారం

నేనూ నా పాస్ పోర్ట్ - భండారు శ్రీనివాసరావు

నేనూ నా పాస్ పోర్ట్ - భండారు శ్రీనివాసరావు
నా మొదటి విదేశీ ప్రయాణం కౌలాలంపూర్ కు 1981 లో. మద్రాసులో నేనెక్కిన మలేసియన్ ఎయిర్ లైన్స్ విమానం ఏప్రిల్ పద్నాలుగు ఉదయం ఆరున్నరకు శ్రీలంక (సిలోన్) మీదుగా కౌలాలంపూర్ బయలుదేరింది. ఈ ప్రయాణానికి అవసరమైన పాస్ పోర్ట్ సరిగ్గా నాలుగు రోజుల ముందు ఏప్రిల్ పదో తేదీన జారీ అయింది. అప్పుడు పాస్ పోర్ట్ ఆఫీసు బర్కత్ పురాలో వుండేది. నాటి ముఖ్యమంత్రి శ్రీ టి. అంజయ్య గారి జోక్యంతో అంత త్వరగా పాస్ పోర్ట్ లభించింది. సీ.ఎం. ప్రైవేట్ సెక్రటరి నయీముద్దీన్ స్వయంగా నన్ను వెంటబెట్టుకు వెళ్లి పాస్ పోర్ట్ ఇప్పించారు. అయితే అది ఆరు మాసాలకు మాత్రమే పనికి వచ్చే తాత్కాలిక పాస్ పోర్టు.
ముఖ్యమంత్రి భద్రాచలంలో రాములవారి కళ్యాణ తలంబ్రాలు ఇవ్వాల్సిన కారణంగా ఆయన, ఆయన పరివారం ఒకరోజు ఆలస్యంగా బొంబాయి నుంచి కౌలాలంపూర్ బయలుదేరారు. కౌలాలంపూర్ లో కూడా ఆయన దిగిన హోటల్లోనే నాకూ వసతి సౌకర్యం కల్పించారు. అయాచిత వాహనయోగం కూడా పట్టడంతో చాలా ప్రదేశాలు ఉన్న కాస్త వ్యవధిలో చూడడం జరిగింది.
రెండో పాస్ పోర్టు అవసరం మాస్కో ప్రయాణం అప్పుడు కలిగింది. మెహదీపట్నానికి మారిన ఆఫీసుకు నేనూ, మా ఆవిడా ఇద్దరు పిల్లలతో వెళ్ళాను. ఆ రోజుల్లో ఒక ముస్లిం పెద్ద మనిషి పాస్ పోర్ట్ అధికారి. సత్యసాయిబాబాకు వీర భక్తుడు. ఆయన నన్ను చూడగానే పాస్ పోర్ట్ ధరకాస్తులు తీసుకుని వాటిని ఎవరికో అప్పగించి నాతొ పిచ్చాపాటీ మొదలు పెట్టారు. మా పిల్లలు చాలా చిన్నపిల్లలు. బయటకి పోదాం అంటూ సణుగుడు మొదలు పెట్టారు. దాంతో నేను కల్పించుకుని మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు కలెక్ట్ చేసుకోవడానికి అని అడిగాను. ఆయన దానికి నవ్వి ఇలా అన్నాడు.
‘మీరు భలే వాళ్లండి. మీ ఫోటోలు అతికించిన జిగురు అయినా ఆరాలా లేదా! అలా తొందరపడితే ఎలా?’
అప్పుడు నాకు అర్ధం అయింది. నాతొ ముచ్చట్లు చెబుతూ మరోపక్క వాటిని నాకు అప్పటికప్పుడు ఇచ్చే ఏర్పాటు ఏదో చేస్తున్నారని. అలా 1987 అక్టోబర్ 5 న మా ఇంటిల్లిపాదికి గంటలో పాస్ పోర్టులు చేతికి వచ్చాయి.
మరో పాస్ పోర్ట్ అవసరం మాస్కోలో వచ్చింది. మా ఆవిడకి, పిల్లలకి వేలిడ్ పాస్ పోర్టులు వున్నాయి కానీ నాది ఎక్స్పైర్ అయింది. మాస్కోలో పనిచేసేవారికి ఓ సౌలభ్యం వుంది. అక్కడ ఎంబసీ నుంచి కొత్త పాస్ పోర్ట్ తీసుకోవచ్చు. ఆ విధంగా 1991 ఏప్రిల్ 23 న, మరో కొత్త పాస్ పోర్ట్ నాకు మాస్కోలో రెండోరోజే వచ్చింది.
అమెరికాలో పనిచేస్తున్న మా పెద్ద కుమారుడి ఆహ్వానంపై అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. 2002 ఆగస్టు 20 వ తేదీన నాకూ మా ఆవిడకి పాస్ పోర్టులు వచ్చాయి. పదేళ్ల అమెరికా వీసాలు కూడా చెన్నై ఎంబసీ వాళ్ళు ఎలాంటి పర్సనల్ ఇంటర్వ్యూ లేకుండా హైదరాబాదు చిరునామాకు పోస్టులో పంపారు. 2003 లో సతీసమేత అమెరికా ఆరు మాసాల యాత్ర పూర్తయింది. అదే పాస్ పోర్టు అదే వీసాపై 2009 లో మరోసారి అమెరికా వెళ్లి వచ్చాము.
ఆ పాస్ పోర్టుకు కూడా పదేళ్ల జీవిత కాలం ముగిసింది.
2012 సెప్టెంబరు 11 మళ్ళీ కొత్త పాస్ పోర్టులు. అప్పటికి టాటాలకు చెందిన టీ సీ ఎస్ వాళ్ళు పాస్ పోర్ట్ జారీ విషయంలో నూతన సాంకేతిక సదుపాయాలను ప్రవేశ పెట్టారు. భార్యాభర్తలం ఇద్దరం ఆన్ లైన్ లో అప్లయి చేసుకుని నిర్దేశించిన రోజున నిర్దేశిత సమయానికి వెళ్లి అలుపూ సొలుపూ లేకుండా పాస్ పోర్టులు సంపాదించు కున్నాం.
2019 మార్చిలో మా రెండోవాడి పెళ్లి అయిన తర్వాత మళ్ళీ ఓసారి అమెరికా వెళ్లి వద్దామని అనుకున్నాం. వేలిడ్ పాస్ పోర్టులు, వీసాలు వున్నాయి కానీ, 2019 ఆగస్టులో మా ఆవిడ అర్ధాంతరంగా కన్నుమూయడంతో ఇక ఆ ప్రయత్నానికి గండి పడింది. ఆ తర్వాత పిల్లలు అమెరికాకు రమ్మనే అభ్యర్ధనలు ఎక్కువ కావడంతో మరోసారి పదేళ్ల వీసా స్టాంప్ నా పాస్ పోర్ట్ పై పడింది. మధ్యలో కరోన. ఒంటరిగా వెళ్లి అక్కడ ఏం చేయాలి, ఎక్కడ తిరగాలి అనే ఆలోచనతో ప్రస్తుతానికి అమెరికా ప్రయాణం వాయిదా వేసుకున్నాను. వీసా 2029 దాకా వుంది కానీ పాస్ పోర్ట్ వెలిడిటి 2022 సెప్టంబర్ తో ముగుస్తుంది కనుక కొత్త పాస్ పోర్ట్ తీసుకోవడం మంచిదని పిల్లల సలహా.
పాటించి ఆన్ లైన్ లో అప్లయి చేశాను. జూన్ ఇరవై ఎనిమిది మధ్యాన్నం రెండు గంటలకు టైం స్లాట్ ఇస్తూ మెసేజ్ వచ్చింది. పావుగంట ముందే లోపలకు పంపారు. చక్కటి ఏర్పాట్లు. టైం ప్రకారం వచ్చారు వెళ్ళిన పక్షంలో , అప్లికెంట్ల సమస్త వివరాలు వారి కంప్యూటర్ల తెరపై కానవస్తాయి కనుక చకచకా కౌంటర్ తర్వాత కౌంటర్ కు వెడుతూ పని మొత్తం అరగంట కంటే తక్కువ వ్యవధిలో పూర్తి అవుతుంది. ఒక కౌంటర్ లో ఫోటోతో పాటు వేలిముద్రలు తీసుకున్నారు. అక్కడ ఉండగానే File No. so and so Granted అని మెసేజ్ వచ్చింది. అంటే approved అని అర్ధం కాబోలు.
తిరిగి వస్తుంటే ఒక అద్దాల క్యాబిన్ లో పనిచేసుకుంటూ ఒక టీసీఎస్ అధికారి కనిపించారు. కలిసి పని బాగా జరుగుతోందని చెప్పాలని అనిపించి డోరు తోసుకుని వెళ్లి నా
అభినందనలు
తెలిపాను. ఆయన, కూడా మిమ్మల్ని ఎక్కడో ఛూసినట్టుంది అంటూనే గుర్తుపట్టి పలకరించారు. వారి పేరు సి.హెచ్. లక్ష్మీనారాయణ గారు. రీజినల్ హెడ్. ఆయన దినేశ్ అనే మరో తోటి ఉద్యోగిని పరిచయం చేశారు. వారు ఏపీ, తెలంగాణా రెండు రాష్ట్రాలకు బాధ్యత వహించే అధికారి. గతంలో పాస్ పోర్టు ఆఫీసులో పనిచేసిన, జ్వాలా ద్వారా పరిచయం అయిన మిత్రుడు శిరీష్ తాను స్నేహితులమని లక్ష్మీనారాయణ గారు చెప్పారు. ఎవరినీ కలవాల్సిన అవసరం రాకుండా అక్కడ పనులు జరుగుతున్న తీరు పట్ల నా సంతృప్తిని వ్యక్తం చేసి, టీసీఎస్ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పి వచ్చేశాను.
నా ఆరో పాస్ పోర్టు, బహుశా ఒకటి రెండు రోజుల్లో ఇంటికి వస్తుంది.

కింది ఫోటో: నలభయ్ ఏళ్ళ క్రితం నా మొదటి పాస్ పోర్టు పై నా ఫోటో
(28-06-2022)



(28-06-2022)      

 

           

 

ఆడవారి అసలైన సంతోషం - భండారు శ్రీనివాసరావు

సరళ పతీ సమేతంగా పండక్కి పుట్టింటికి వచ్చింది. పెళ్ళయిన తరువాత మొదటి పండగ కావడం వల్ల ఇల్లంతా ఒకటే హడావిడిగా వుంది. సరళ అక్కలూ, బావలూ అంతా వచ్చారు. భోజనాలు అయ్యాక అందరూ ఆరుబయట మంచాలు వేసుకుని తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నారు. సరళ తల్లి, కూతుర్ని దగ్గరకు తీసుకుని మెల్లగా అడిగింది, ‘మీ ఆయన నిన్ను సంతోషంగా వుంచుతున్నాడా’ అని. చిన్న స్వరంతో అడిగినా అది వినాల్సిన వాళ్ళు విన్నారు. దూరంగా కూర్చుని బావమరదులతో ముచ్చట్లు చెబుతున్న సరళ పెనిమిటి చెవిలో కూడా దూరింది. సరళ ఏం జవాబు చెబుతుందని అతగాడికీ ఆసక్తి కలిగింది. కాపురం బాగా సాగుతోందని, భర్త తనని సంతోష పెడుతున్నాడని సరళ ఖచ్చితంగా చెబుతుందని అతడి నమ్మకం.

సరళ బదులు చెప్పింది.
‘లేదు, ఆయన నన్ను సంతోష పెట్టడం లేదు’
ఆ సమాధానం విని సరళ మొగుడితో పాటు అక్కడ వున్న వాళ్ళందరూ నివ్వెర పోయారు, ఏమిటి ఇలా అంటోందని.
సరళ చెప్పడం కొనసాగించింది.
“ఆయన సంతోషపెట్టని మాట నిజమే. కానీ నేను సంతోషంగా ఉంటున్నాను. ఎవరో సంతోషపెడితే సంతోషపడడం నిజమైన సంతోషం కాదు.
నిజానికి ఒకానొక కాలంలో ఆడవాళ్ళు ఇలాగే సంతోషపడేవాళ్ళు

28, జూన్ 2022, మంగళవారం

ఎదిగి ఒదిగిన కర్మయోగి పీవీ నరసింహారావు


(జూన్ ఇరవై ఎనిమిది పీవీ జయంతి)

మరణించడానికి కొన్ని నెలలముందు శ్రీ పీవీ నరసింహారావు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు కనబడే హడావిడి యెలా వుండేదో ఒక విలేకరిగా నాకు తెలుసు. ఆయన చుట్టూనే కాదు చుట్టుపక్కల ఎక్కడ చూసినా అధికారులు, అనధికారులు, మందీ మార్బలాలు, వందిమాగధులు, ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు, ఆ వైభోగం వర్ణించ తరమా? అన్నట్టు వుండేది.
ఒక్క పీవీ అనే కాదు ప్రధానమంత్రి ఎవరయినా సరే, రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు అంటే చాలు యావత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు అప్రమత్తం అయిపోయేవి. శాఖల వారీగానే కాదు అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ఉన్నతస్థాయి సమావేశాలు జరిపి ప్రధాని పర్యటన ఏర్పాట్లు సమీక్షించేవారు. ఆకాశవాణి, దూరదర్శన్ ల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రధాని పాల్గొనే ప్రతి కార్యక్రమాన్ని రెండు టేపుల్లో రికార్డు చేయడానికి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసేవారు. కార్యక్రమం ముగియగానే ఆ వివరాలు రాసివున్న ఒక టేపును అక్కడికక్కడే ప్రధాని బృందంలోని అధికారులకు అందచేసేవారు. అవన్నీ ప్రధాని పాటు ఢిల్లీ చేరిపోయి ఆ తరువాత ప్రధాని కార్యాలయంలోని 'ఆర్చివ్స్' విభాగానికి చేరేవి. ఇప్పుడంటే మొబైల్స్ వచ్చాయి కనుక ఇబ్బంది లేదు. పూర్వం ప్రధాని ప్రసంగించే వేదిక దగ్గరగా టెలిఫోన్స్ డిపార్టుమెంటు వాళ్లు, దేశంలో ఎక్కడికయినా మాట్లాడగలిగే ఫోనును అమర్చేవారు. ఆ ఫోను ఎవరికి ఉపయోగపడిందో లేదో తెలవదు కాని ప్రధాని పర్యటన సమాచారం ఢిల్లీ, హైదరాబాదు, విజయవాడలకు ఫోను చేసి చెప్పడానికి రేడియో విలేకరిగా నాకు పలుసందర్భాల్లో ఉపయోగపడిన మాట వాస్తవం. పీవీ ప్రధానమంత్రిగా వున్నప్పుడు బేగంపేటలోని ఒక సందులో వున్న స్వామి రామానంద తీర్ధ ట్రస్టు కార్యాలయానికి వచ్చేవారు. ఇక అక్కడ చూడాలి అధికారులు, అనధికారుల హడావిడి. ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తరువాత కూడా అక్కడ జరిగిన ట్రస్టు సమావేశాలకు ఆయన హాజరయ్యేవారు. వాటిని కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు 'అధికారాంతమునందు...' అనే పద్యపాదం జ్ఞాపకం చేసుకోవాలో, 'ఈ కర్మభూమిలో పదవి, అధికారం ముందు అన్నీ దిగదుడుపే' అనే నిజాన్ని హరాయించుకోవాలో నాకు అర్ధం అయ్యేది కాదు.
పీవీ గురించిన మరో జ్ఞాపకం నా మదిలో వుండిపోయింది.
మాజీ ప్రధానిగా పీవీ రాజ భవన్ లో వున్నప్పుడు, నేనూ , ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్ ఆర్వీవీ కృష్ణారావు గారు, గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం వెళ్లి, ఆ పని పూర్తిచేసుకున్నతరవాత, రాజ్ భవన్ గెస్ట్ హౌస్ మీదుగా తిరిగి వెడుతూ అటువైపు తొంగి చూసాము. సెక్యూరిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము. ‘పీవీ గారిని చూడడం వీలుపడుతుందా’ అని అక్కడవున్న భద్రతాదికారిని అడిగాము. అతడు తాపీగా 'లోపలకు వెళ్ళండి' అన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టాము.
పెట్టిన తరవాత, మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్ బాల్ మాచ్ చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న ఫీలింగుతోనే, మమ్మల్ని పరిచయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు నా వైపు చూస్తూ, 'మీ అన్నయ్య పర్వతాలరావు ఎలావున్నాడయ్యా !' అని అడిగేసరికి నాకు మతి పోయినంత పనయింది. ఎప్పుడో దశాబ్దాల క్రితం, పీవీగారు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు, రాష్ట్ర సమాచార శాఖలో పనిచేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు ఆయనకు పీఆర్వో గా కొద్దికాలం పనిచేశారు. అసలు పీవీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ పీవీగారి గొప్పతనం. ఆ తరవాత కూడా ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానీ మాకు ‘కలయో వైష్ణవ మాయయో’ అన్నట్టుగావుంది. మేము కలసి కూర్చుంది, కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని వొంటి చేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ వుండడం వల్ల, కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత, కొణిజేటి రోశయ్య గారు వచ్చారు. ఆయన్ని చూడగానే పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది. రోశయ్య గారు వచ్చిన తరువాత కాసేపు వుండి మేము వచ్చేశాము. ఇది జరిగి ఏళ్ళు గడిచిపోయాయి కానీ ఈ చక్కని జ్ఞాపకం మాత్రం మా గుండెల్లో ఇంకా తాజాగానే వుంది. మరోసారి వారిని ఢిల్లీలో కలిసాను. రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెడుతూ అప్పుడు కేంద్రమంత్రిగా అత్యంత ఉచ్ఛ స్థానంలో వున్న పీవీ గారిని కలుద్దామని వెళ్లాను. బంగ్లా అంతటా నిశ్శబ్ధం. కాసేపటి తరువాత ఎవరో అటుగా వస్తే 'పీవీ గారిని కలవడానికి వీలుంటుందా' అని హిందీలో అడిగాను. అతగాడు బంగ్లాలో ఓ గది చూపించి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా తలుపు తోసి చూస్తే ఎదురుగా పీవీ గారు. ఎవ్వరూ లేరు. పరిచయం చేసుకుని మాస్కో వెడుతున్నట్టు చెప్పాను. అప్పుడు ఆయన విదేశాంగ మంత్రి అనుకుంటాను. నా మొహంలో భావాలు పసికట్టినట్టున్నారు. 'పనులు చేసి పెడుతూ వుంటే కదా పదిమంది వచ్చేది' అన్నారు ఆయన తన మొహంలో భావాలు ఏమీ తెలియకుండా.
'మాస్కో ఎందుకయ్యా వేరే దేశంలో మీ రేడియో ఉద్యోగాలు లేవా ? బాగా చలిదేశం. పెళ్ళాం పిల్లలతో ఎలావుంటావు' అని అడిగారు. చాలా ముక్తసరిగా మాట్లాడేవారని పేరున్న పీవీ గారు నేను వూహించని విధంగా చనువుగా ఆ రెండు ముక్కలు మాట్లాడ్డం నా అదృష్టం అనే భావిస్తాను.

కింది ఫోటో చాలా పాతది, సతీసమేతంగా పీవీ నరసింహారావు గారు









Below Andhrajyothy  LINK:



 ఎదిగేకొద్దీ ఒదిగిన కర్మయోగి - Andhrajyothy

చాయ్ పే చర్చ

 నిరాడంబరత్వం వ్యక్తిత్వ శోభని పెంచుతుంది.

జర్మనీలో  జరిగిన  అగ్రదేశాధినేతల సదస్సులో ఇద్దరు దేశాధినేతలు, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ,  ఫ్రాన్స్ అధ్యక్షులు ఎమ్మాన్యుయేల్  మర్కాన్ కలిసి  కూర్చుని చాయ్ తాగుతూ మాట్లాడుకుంటున్న ఈ దృశ్యం ఎంత రమణీయంగా వుంది. మన దేశంలో ఇది సాధ్యమా!  ఎంత హడావిడి చేస్తారు. పెద్ద పెద్ద టర్బన్లు పెట్టుకున్న సెవెన్ స్టార్  స్టివార్డ్స్,  స్టెన్ గన్ లు ధరించిన సాయుధ  అంగరక్షకులు, కనుసన్నల్లో వుండి కనిపెట్టి చూసే వ్యక్తిగత సిబ్బంది, టీవీ కెమెరాల హడావిడి! ఎంత గోలగోలగా వుంటుంది? ఇలా ఏ బాదరబందీ లేని దృశ్యాలు చూడడం మన దేశంలో ఎందుకు సాధ్యం కాదు?

బ్రిటిష్ రాచరికపు  శృంఖలాలు  తెంచుకున్నాము కానీ రాచరికపు వైభోగాలు ఇంకా మనల్ని ఇంగువ కట్టిన గుడ్డలా వెంటాడుతూనే వున్నాయి.

భారత్ స్వాతంత్ర అమృతోత్సవ్ సందర్భంగా అయినా ఆ  రాచరికపు అవశేషాలను కొంత మేరకు వదుల్చుకుంటే బాగుండు.  



(28-06-2022)