12, జూన్ 2022, ఆదివారం

అట్టహాసం ఆర్భాటం – భండారు శ్రీనివాసరావు

  

(ఈరోజు 12-06-2022 ఆదివారం ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

 

అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహంలింకన్ ఒక చక్కని మాట చెప్పారు.

“ఒక మంచి వాడిని, సద్గుణ సంపన్నుడిని ఎంపిక చేసుకోండి. అతడికి అధికారం ఇచ్చి చూడండి, ఇక అతడెలా మారిపోతాడన్నది మీరే చూస్తారు.”

చాలామందికి అర్ధం కానిది ఇదే. అధికారంలో లేని సమయంలో ఎలాంటి బందోబస్తూ లేకుండా ప్రజల నడుమ అరమరికలు లేకుండా స్వేచ్చగా తిరిగిన రాజకీయ నాయకులు, పదవిలోకి రాగానే చుట్టూ భద్రతా వలయాలు నిర్మించుకుని ప్రజలకు ఎందుకు దూరం అవుతారన్నదే జవాబు లేని ప్రశ్న.

ఉన్నత స్థానాల్లో వున్న వ్యక్తులకు భద్రత కల్పించడం ఆక్షేపణీయం యెంత మాత్రం కాదు. అయితే ఆ పేరుతొ చేస్తున్న హడావిడీ, అనవసర వ్యయం గురించి ఎవ్వరూ ప్రశ్నించకూడదు అనడం కూడా సబబు కాదు.


కొన్నేళ్ళ క్రితం చైనా అధ్యక్షుడు అధికార పర్యటనపై ఢిల్లీ వచ్చారు. ఆయన వెళ్ళే మార్గాలనే కాకుండా చుట్టుపక్కల దారులను కూడా దిగ్బంధించారు. ఆ క్రమంలో పార్కింగ్ చేసివున్న కొన్ని వాహనాలను పోలీసులు క్రేన్ల సాయంతో తొలగిస్తున్నారు. పార్కింగు చేసి వున్న ఒక కారులోని మహిళను కిందికి దిగే అవకాశం కూడా ఇవ్వకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. క్రేన్ తో పైకి లేపిన వాహనంలో ఆ మహిళ చిక్కుకు పోయిన సమాచారం బయటకు పొక్కి,  పోలీసులను చిక్కుల్లో పడేసింది. 


అసామాన్యులకోసం అధికారులు అసాధారణ రీతిలో చేసే భద్రతా ఏర్పాట్ల కారణంగా సామాన్యులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఈ విషయం ఆ ప్రముఖులకు తెలుసో లేదో తెలవదు. శ్రీలంక అధ్యక్షుని హోదాలో మహీంద్ర రాజపక్సే వెంకన్న దర్శనం కోసం ఓ సారి తిరుపతి వచ్చారు. స్వామి సేవ చేసుకుని తిరిగి వెళ్ళారు. అయితే అయన రాకను పురస్కరించుకుని చేసిన భద్రతా ఏర్పాట్లు సామాన్య భక్తులకు చుక్కలు చూపించాయి. కొండ ఎక్కకుండానే వారికి దేవుడు కనబడ్డాడు. తిరుపతి అలిపిరి సెక్యూరిటీ గేటు వద్ద అసంఖ్యాకంగా వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. మరునాడు పత్రికల్లో వచ్చిన ఆ ఫోటోలు చూసే అవకాశం ఆ విదేశీ అతిధి దేవుడికి ఎలాగూ వుండదు. అంచేత తన భద్రత కారణంగా జనాలు ఎంతగా ఇక్కట్లకు గురయిందీ తెలిసివచ్చే అవకాశం ఆయనకి బొత్తిగా లేదు. 

ఆర్భాటపు భద్రతా ఏర్పాట్లకోసం ప్రజాధనం ఖర్చయినా ప్రజలు సహిస్తారు, ఎంతవరకు అంటే, తమ దినవారీ పనులకు ఆ ఏర్పాట్లు అడ్డం రాకుండా ఉన్నంత వరకు.

పొతే, ప్రముఖులకు కల్పిస్తున్న భద్రత, పటాటోపం, అధికార దర్పం ప్రదర్శించడానికే తప్ప వారి ప్రాణరక్షణకు సరిగా ఉపయోగపడడం లేదన్న అభియోగాలు వున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రముఖుల పేరుతొ కొందరికి కల్పిస్తున్న భద్రత అపహాస్యానికి గురవుతున్న మాటా నిజమే. 

ఉదాహరణకు 2014 లో ఒక వ్యక్తికి అసాధారణ భద్రత కల్పించారు. అతడికి ఏర్పాటు చేసింది జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. అతడికి పహరా కాయడానికి కేంద్ర భద్రతా దళానికి చెందిన పాతికమంది సాయుధ పోలీసులను నియోగించారు. ఇంతకీ ఆ వీ.వీ.ఐ.పీ. వున్నది ఒక ఆసుపత్రిలో చావుబతుకుల నడుమ. వెంటిలేటర్ల సాయంతో అతగాడి ప్రాణాలను ఏ క్షణానికి ఆ క్షణం డాక్టర్లు నిలిపి వుంచుతున్న స్తితిలో. వెంటిలేటర్లు ఎప్పుడు తొలగిస్తే అప్పుడు ఆ వ్యక్తి ప్రాణాలు హరీ అంటాయి. అయినా పోలీసు భద్రతమాత్రం కొనసాగించారు. ఇది అవసరమా అంటే అవుననే అంటారు అధికారంలో వున్నవాళ్ళు.


ముప్పయ్యేళ్ళ క్రితం జరిగిన ఒక ఉదంతాన్ని గుర్తు చేసుకుందాం. 

స్వీడన్ దేశపు ప్రధాన మంత్రి పామే ప్రతి రోజూ మాదిరిగానే ఆఫీసునుంచి ఓ సాయంత్రం ఇంటికి వచ్చారు. సినిమాకు పోదామన్న కోరికను భార్య వెలిబుచ్చింది. సరే అన్నారు ప్రధాని. వారిద్దరూ కాలినడకన బయలుదేరి భూగర్భంలో వున్న మెట్రోలో ప్రయాణించి గ్రాండ్ సినిమా థియేటర్ కు చేరుకున్నారు. (మన దేశంలో ఇలాటివి కలలో కూడా ఊహించలేము). సినిమా చూసి, పామే దంపతులు తిరిగి నడుచుకుంటూ ఇంటికి చేరుకునే క్రమంలో దారిలో ఒక దుండగుడు చాలా దగ్గర నుంచి కాల్పులు జరపడంతో పామే అక్కడికక్కడే మరణించారు. ప్రధాని భార్య ఈ సంఘటనలో గాయపడింది. ఈ దుర్ఘటన కారణంగా స్వీడన్ దివంగత ప్రధాని నిరాడంబర జీవన శైలి ప్రపంచానికి తెలిసివచ్చింది.

పలానా దేశపు ప్రధాన మంత్రి విమానాశ్రయంలో తోటి ప్రయాణీకుల మాదిరిగానే క్యూలో నిలబడి బోర్డింగు పాసులు తీసుకున్నారనీ, మరో దేశపు ప్రధాని, కొడుకును స్కూల్లో దింపి రావడానికి రోడ్డు క్రాస్ చేసి వెళ్ళాడనీ ఇలాటి వార్తలు విన్నప్పుడు, ఫోటోలు చూసినప్పుడు కూడా ఆశ్చర్యం అనిపించక మానదు. మన దేశంలో కూడా ఇటువంటి రాజకీయ ప్రముఖులు లేకపోలేదు. కాకపోతే వారి సంఖ్య వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. 


చూసి నేర్చుకోవాల్సిన ఒక  ఉదంతం గురించి చెప్పుకుందాం.

ఇది జరిగి చాలా ఏళ్ళయింది.

అదొక సువిశాల భవన ప్రాంగణం.

సుదూరంగా కెమెరా కన్ను నుంచి చూస్తే అంతా నిర్మానుష్యంగా వుంది. ఆ భవనం ప్రవేశ ద్వారం వద్ద ఓ వ్యక్తి వొంటరిగా నిలబడి వున్నాడు. కనుచూపుమేరలో ఎవరూ లేరు. ఇంతలో ఓ పొడవాటి నల్లటి మోటారు వాహనం అక్కడికి చేరుకుంది. దానికీ వెనుకా ముందూ ఎలాటి వాహనాలు లేవు. అందులో నుంచి ముందుగా డ్రైవర్ దిగి వెనుక వైపు డోరు తెరిచిపట్టుకున్నాడు. ఒకే వ్యక్తి ఆ కారునుంచి దిగాడు. కోటు బొత్తాములు సవరించుకుంటూ ముందుకు నడిచాడు. అప్పటివరకు అక్కడ వొంటరిగా వేచివున్న వ్యక్తి, రెండు అడుగులు ముందుకు వేసి కారులో నుంచి దిగిన వ్యక్తితో ఆప్యాయంగా కరచాలనం చేశాడు. ఆదరంగా ఆహ్వానించి సాదరంగా ద్వారం వైపు చేయి చూపించి ఇతర అతిధుల రాక కోసం ఎదురు చూస్తూ అక్కడే నిలబడి పోయాడు. ఆ వచ్చిన వ్యక్తి కూడా ఎవరికోసం ఎదురు చూడకుండానే, ఎవ్వరూ తోడు లేకుండానే వొంటరిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. 

చాలా దూరంనుంచి ఈ దృశ్యాన్ని రికార్డ్ చేస్తున్న అనేక టెలివిజన్ కెమెరాలు దాన్ని ప్రపంచ వ్యాప్తంగా తమ చానళ్ళలో ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఎందుకంటే ఆ ఇద్దరూ సామాన్యులు కారు. కారునుంచి దిగివచ్చిన వ్యక్తి ఈ ప్రపంచాన్ని తన కనుసన్నల్లో ఆడిస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. ఆయనకు స్వాగతం పలికిన వ్యక్తి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. రష్యాలోని సెంట్ పీటర్స్ బర్గ్ నగరంలో 2013 జరిగిన ఇరవై దేశాల అగ్ర నాయకుల (G-20) సదస్సులో పాల్గొనడానికి అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ఒబామా అక్కడికి వెళ్ళినప్పటి ముచ్చట ఇది. 

ఇదంతా యెందుకు చెప్పాల్సి వచ్చిందంటే వీఐపీ భద్రత పేరుతో ఎంతో హడావిడి చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బందుల పాలుచేసే అనుభవాలకు అలవాటుపడిన ప్రాణాలకు ఈ రకమైన దృశ్యాలు నిజంగా ఎంతగానో వూరట కలిగిస్తాయి. అలా అని వాళ్లు భద్రతా చర్యల పట్ల ప్రమత్తంగా వుంటున్నారని కాదు. ఆధునిక సాంకేతిక పరికరాలను సమర్ధవంతంగా వుపయోగించుకుంటున్నారని వేరే చెప్పనక్కరలేదు కూడా. 

మన దేశంలో ఈ దృశ్యం మరోరకంగా కానవస్తుంది. ఒక స్థాయి కలిగిన నాయకులు కలుసుకున్నప్పుడు సయితం కళ్ళు తిరిగే హడావిడి. మందీ మార్బలం, పుష్పగుచ్చాలతో సంసిద్ధంగా వుండే వ్యక్తిగత సిబ్బంది, ఏకే 47 వంటి తుపాకులు ధరించిన బ్లాక్ క్యాట్ బాడీ గార్డులు, ఎటుచూసినా అడుగడుగునా సాయుధ పోలీసు అధికారులు. ఇక విదేశీ ప్రముఖులు వస్తే చెప్పనక్కరలేదు. భద్రత పేరుతొ జనాలను కాల్చుకు తింటారు. చెప్పొచ్చేది ఏమిటంటే ఇలాటివాటిని చూసి నేర్చుకునేది ఏమైనా వుంటుందా అన్నదే.

ప్రముఖుల భద్రత విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా, ఏదైనా జరగరానిది జరిగితే అది సంచలన వార్త అవుతుందని, అంచేత సెక్యూరిటీ విషయంలో తాము చెప్పినట్టు విని తీరాల్సిందే అని భద్రతా విభాగం వారు నొక్కి చెబుతుంటారు. వారు చెప్పేది నిజమే కావచ్చు. మరి వందల కోట్లు ప్రజాధనం ఖర్చు అవుతున్న ఈ భద్రతా ఏర్పాట్ల విషయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవచ్చు కదా, తద్వారా ప్రముఖుల రాకపోకల సందర్భంలో బందోబస్తు పేరుతొ సామాన్యుల రాకపోకలకు కలుగుతున్న ఇబ్బందులను ఓ మేరకు తగ్గించవచ్చు కదా! అనేది మామూలు మనుషులకు కలిగే సందేహం. ప్రస్తుతం అలా కూడా చేస్తున్నారు. అంగరక్షకుల చేతుల్లో చిన్న సైజు బ్రీఫ్ కేసులు కనిపిస్తుంటాయి. వాటిల్లో ఇటువంటి పరికరాలే వుంటాయి. అయినా ప్రముఖుల రాకకు ముందు, అది వివాహ వేడుక కావచ్చు, సాధారణ సమావేశం కావచ్చు పోలీసు జాగిలాలతో, బాంబులను నిర్వీర్యం చేసే దళాలతో క్షుణ్ణంగా తనిఖీ చేయడం తప్పనిసరి. అలాగే ప్రముఖులు ప్రయాణం చేసే మార్గాల్లోనే కాకుండా భద్రతాధికారులు ఎంపిక చేసిన ప్రత్యామ్నాయ మార్గాల్లో సయితం వాహనాల కదలికలపై ఆంక్షలు విధించడం కద్దు. ఇంత శ్రమ పడ్డా, ఇంతటి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకున్నా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలేదు. దరిమిలా సెక్యూరిటీ ఏర్పాట్లను సమీక్షించి వాటిని మరింత పటిష్టం చేయడం ఒక్కటే జరుగుతోంది. తద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం పెరుగుతూనే వస్తోంది.

ఇది అవసరమా అనేది సామాన్యుల ప్రశ్న. అవసరమే అనేది అసామాన్యుల సమాధానం కావచ్చు.




11, జూన్ 2022, శనివారం

ఇదో తుత్తి

 నిన్న శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ హోటల్ దసపల్లాలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం జీవితంపై ఆకాశ వాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్ గోపాల కృష్ణ రాసిన జీవనగానం పుస్తక ఆవిష్కరణ సభలో భారత ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారి ఆత్మీయ పలకరింపు.




Photo Courtesy: Vice President Office

7, జూన్ 2022, మంగళవారం

కావాల్సింది పరిష్కారమా! టీవీ చర్చలా !


ఒక జరగరాని, జరగకూడని సంఘటన జరుగుతుంది. దానిపై వారిది బాధ్యత, వీరిది బాధ్యత అంటూ టీవీల్లో చర్చలు మొదలవుతాయి.

అవి ఒక కొలిక్కి రాకమునుపే అలాంటిదే మరో సంఘటన  జరుగుతుంది.

అంతే! ముందుది మరచిపోతారు. తాజా సంఘటనపై తాజా చర్చలు మొదలవుతాయి.

ఇదా కావాల్సింది. లేక పరిష్కారమా!

6, జూన్ 2022, సోమవారం

మౌనమె నా భాష

“I get intoxication while talking” అన్నాట్ట వెనుకటికి నాలాటి వాడు. అదేవిటో నా వదరుబోతుతనం ఇటీవలి కాలంలో బాగా తగ్గిపోయిందన్నది అచ్చంగా నా సొంత అభిప్రాయం. మాట్లాడడానికి తగ్గ వాతావరణం వుండాలని అప్పుడే మాట బాగా పెగులుతుందని ‘వసకారుడు’ ఏనాడో చెప్పాడు.

చదువుకునే రోజులనుంచి నాకీ మాటల పిచ్చి వుందనీ, అందుకే మాటల్లో పడి అసలు చదువు చెట్టెక్కిందనీ మా పెద్దవాళ్ళు అంటుండగా అనేకసార్లు వినే అదృష్టం నాకు కలిగింది. అయినా వేరే ఆటలకన్నా నాకు ‘మాటల ఆటలు’ అంటే వున్న వ్యామోహం ఏమాత్రం తగ్గలేదు. బహుశా రేడియోలో ఉద్యోగం ఇవ్వడానికి నాకు వున్న అనేక అనర్హతలను ఈ అదనపు అర్హత కప్పిపెట్టిందేమో అని అనుకునేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎస్సారార్ కాలేజీలో నాకంటే వయస్సులోనూ, చదువులోనూ పెద్దవాళ్లయిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు వుండేవాళ్ళు. కాస్త వీలు దొరికితే చాలు, వెళ్ళి వాళ్ళతో ముచ్చట్లు మొదలు పెట్టేవాడిని. శ్రద్ధ, సుధ అనే పేర్లు కలిగిన వాళ్ళిద్దరూ, వాళ్ల నోట్సులు రాసిపెట్టేవరకు నా మాటలు విని ఆ తరువాత ఎంచక్కా ‘మంచిది వెళ్ళి రండి’ అనేసేవాళ్ళు. అలా అని మాటల వల్ల అసలు ఏమాత్రం ఉపయోగం లేదనే గొప్ప అభిప్రాయానికి వెంటనే రానక్కర లేదు. వెనుకటికి నేను రైళ్ళలో రిజర్వేషన్ లేకుండానే ఈ మాటల మంత్రంతో తేలిగ్గా ప్రయాణాలు చేసేవాడిని. కూర్చున్నవాళ్ళ పక్కన కాసేపు నిలుచుని వాళ్ళతో మాటలు కలిపేవాడిని. ఆ తరువాత వాళ్లు మాటల మైకంలో పడిపోయి ‘అదేమిటి మాస్టారు అలా నిలబడేవున్నారు, వచ్చి ఇలా కూర్చోండి’ అని జాగా ఇచ్చేవాళ్ళు. కొండొకచో మరికొందరు శ్రోతలు మరీ మొహమాట పడిపోయి నా మాటలు వింటూ వాళ్లు లేచి నిలబడి నాకు కూర్చునే జాగా ఇచ్చేవాళ్ళు. రేడియో ఉద్యోగంలో చెప్పక్కర లేదు. ఆఫీసుకి పోవడమే గగనం కాని, వెళ్ళానంటే చాలు, మా న్యూస్ యూనిట్ చిన్న సభా ప్రాంగణంగా మారిపోయేది.
అలాటి ఘన వాక్చరిత్ర కలిగిన నేను ఈ నడుమ యెందుకు మాటలాటలు తగ్గించానని మా ఆవిడ సయితం అనుమానించడం మొదలెట్టింది. ‘వున్నట్టుండి ఈ వయస్సులో అంటే అరవై ఎనిమిది దాటిన తరువాత మా ఆయనకు కాసింత పెద్దమనిషితనం కానీ అంటలేదు కదా’ అని బోలెడు బోలెడు సంతోషపడిపోయేది. తెలుగు సీరియళ్ల ప్రోత్సాహాక ఉద్యమంలో మునిగిపోయి, టీవీల్లో రాజకీయ చర్చలు పట్టించుకోకపోవడంవల్ల పేరుకుపోయిన అజ్ఞానాంధకారణంగా ఆవిడకు ఈ జ్ఞానోదయం ఆలశ్యం అయిందని నా అనుమానం.
నిజమే. కొన్నేళ్ళ క్రితం వరకు, టీవీ చర్చావేదికల్లో ఒకరిని మించి మరొకరు, దూషణలతో కూడిన తిరస్కారాలవల్ల కలిగిన మాత్సర్యసహిత ప్రేలాపనలు పక్కన కూర్చుని అదే పనిగా వినీ వినీ నాకు మాట పడిపోయింది అనే విషయం ఆవిడకు తెలవదు.
అందుకే అన్నారు -
అంతయు మన మేలునకే

NOTE: Courtesy Image Owner



5, జూన్ 2022, ఆదివారం

లాభమెంత? నష్టమెంత? – భండారు శ్రీనివాసరావు


(ఈరోజు 05-06-2022 ఆదివారం ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)


పెట్రోలుకు మండే గుణం సహజం. మరి వాటి ధరలు మండిపోతూ వుండడం అంతకంటే సహజం. 

చాలా చాలా కాలం క్రితం  మొదటి గల్ఫ్ యుద్ధం సమయంలో కాబోలు, పెట్రోలు లీటరు ధరను, మూడు రూపాయలనుంచి తొమ్మిది రూపాయలకు ఒకేసారి మూడు రెట్లు పెంచారు. ఆ దెబ్బకు బొంబాయి (ఇప్పుడు ముంబై) లో కార్లలో ఆఫీసులకు వెళ్ళే బడా ఆసాములు రోజుకొకరి కారు చొప్పున వంతులవారీగా ప్రయాణాలు చేసేవారని పత్రికల్లో బాక్స్ ఐటం లు వచ్చాయి. ఇప్పుడు దాన్నే 'కార్ పూల్' అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఆ ముచ్చట కొద్ది రోజులే. తరువాత కధ మామూలే. పెరిగినధరకు అలవాటుపడ్డ జనం మళ్ళీ ఎవరి కారులో వారు వెళ్ళడం మొదలయింది. పెంచినా ఏం కాదు, పెరిగిన ధరలకు ప్రజలే అలవాటు పడతారు అనే భరోసా పాలకుల్లోకలిగింది. దాంతో పెట్రో ధరలు ఇన్నేళ్ళలో ఎన్ని రెట్లు పెరిగాయో లెక్క తెలియనంతగా పెరుగుతూ వచ్చాయి. కాకపోతే పెట్రో ధరలు పెరిగినప్పుడల్లా ప్రతిపక్షాలకు అదో ప్రచారాస్త్రంగా ఉపయోగపడుతూ వచ్చింది. కారు దిగి కాలు కిందపెట్టని నేతలు, ఆ ఒక్క రోజు కారు దిగి కాలినడకన ఊరేగింపులు చేసుకుంటూ వార్తల్లోకి ఎక్కడం ఓ మొక్కుబడి తంతుగా మారిపోయింది.

కీర్తిశేషులు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రో ధరలను పెంచింది. దానికి నిరసనగా ఎన్టీయార్ తన అధికార వాహనాన్నిఒదిలిపెట్టి ఆబిడ్స్ లోని తన నివాసం నుంచి సచివాలయం వరకు ఆటోలో ప్రయాణం చేయడం ఆ రోజుల్లో సంచలనం కలిగించింది. వారి వాహనశ్రేణి మాత్రం  ఖాలీగా ఆ ఊరేగింపు వెనుకనే వచ్చింది. ముఖ్యమంత్రి కారు ఒదిలి ఆటో ఎక్కడం నిరసనకు సంకేతంగా తీసుకోవాలని, అంతే కాని అనునిత్యం అలానే ఆటోలో ప్రయాణాలు చేయరని అధికార పార్టీ వారు పరోక్షంగా పత్రికలకు తెలియచేసారు.

పెట్రోధరలు మండినప్పుడల్లా ప్రతిపక్షాలు ఒక్క తాటిపై లేచి మండిపడడం కూడా కొత్తేమీ కాదు. ఒకే పార్టీ, తాను కేంద్రంలో అధికారంలో వున్నప్పుడు ఒకతీరుగా, ప్రతిపక్షాల పాత్రలో వున్నప్పుడు మరో విధంగా స్పందించడం షరా మామూలుగా మారిపోయింది. వాటి తీరు చూస్తుంటే, ఆ పార్టీల్లో చిత్తశుద్దికన్నా ఏదో మొక్కుబడి నిరసన ప్రకటనలు చేసి వూరుకోవడం అన్న ధోరణే బాగా కనబడుతోంది. నాటకీయంగా నాలుగురోజులు ఎడ్లబండ్ల ప్రయాణాలు, ధర్నాలు , రాస్తారోఖోలు చేయడం మినహా పెట్రోధరలను అదుపు చేయడం అంత సులభం కాదని రాజకీయాల్లో అక్షరాభ్యాసం చేసిన వారికి కూడా ఆ పాటికి వొంటబట్టే వుండడం అందుకు కారణం కావచ్చు.

పెట్రోలు ధరలు పెంచాల్సినప్పుడల్లా, దానికి కారణమయిన కేంద్ర ప్రభుత్వం చెప్పే సంజాయిషీ ఒక్కటే. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం వల్ల ధరలు పెంచక తప్పడంలేదన్న పడికట్టు పదాన్నే అటుతిప్పీ ఇటు తిప్పీ వారు జనం మీదికి వొదులుతుంటారు.

గతంలో ఒకసారి లీటర్ ఒక్కింటికి ధరను మూడు రూపాయల పైచిలుకు ఒక్కమారుగా పెంచారు. ఆ సందర్భంలో పాలకులు ఇచ్చిన వివరణ వేరుగానే కాకుండా వింతగాను వుంది. మన రూపాయి మారకం విలువ అతి దారుణంగా పడిపోయిందట. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్, రూపాయి మారకం విలువలో వచ్చిన తేడాల వల్ల భారత ఆయిల్ కంపెనీలకు లీటరుకు రెండు రూపాయల పైచిలుకు నష్టం వస్తున్నదట. ఆ కారణంగా పెట్రోల్ రిటైల్ ధరను లీటరుకు మూడు రూపాయలు పెంచుకోవడానికి ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు దయతో అనుమతి ఇచ్చిందట. అందువల్ల భారీగా పెంచిన ధరను జనం మంచిమనసు చేసుకుని భరించాలట. పెట్రోధరలు పెరిగినప్పుడల్లా గ్రామఫోన్ రికార్డులా పాలకులు వినిపించే వివరణే ఇది. ఇక ఏమి చెప్పుదు సంజయా అని విలపించడం ఒక్కటే పాలితులకు మిగిలింది. రూపాయివిలువ పడిపోయినప్పుడు ఎగుమతుల ద్వారా ఆదాయం పెరగాలి. కానీ ఈ విషయం ఏ వివరణల్లోను కానరాదు. సమయానుకూల మతిమరపుకు ఇది చక్కని ఉదాహరణ.


సరే ఇదంతా పాత కధ. 

ఇప్పుడు రోజులు మారిపోయాయి. కోడిగుడ్ల ధరల మాదిరిగా ఏరోజుకారోజే పెట్రో ధరలు మారిపోతున్నాయి. ఒక పూట పెట్రోలు ధర లీటరుకు ఇన్ని పైసలు తగ్గించామంటారు. డీసెలు ధర ఇన్ని పైసలు పెంచామంటారు. వారం తిరిగేసరికి పెరిగిన ధర తగ్గించామంటారు. తగ్గించిన ధర పెంచామంటారు. దీనికి కారణం క్రూడాయిలు ధరల్లో హెచ్చు తగ్గులంటారు. వెనుకటి రోజుల్లో ఈ ధరల హెచ్చింపు, తగ్గింపు ధరల ప్రకటన రాత్రి చాలా పొద్దుపోయిన తరువాత చేసేవారు. పలానా తేదీనుంచి అమల్లోకి వస్తుందనే వాళ్ళు. ఇప్పుడలా కాదు. లేడికి లేచిందే పరుగన్నట్టు ఏపూటకు ఆ పూటే ప్రకటనలు. టీవీల్లో స్క్రోలింగులు. దాన్నిబట్టే బంకుల్లో ధరలు. అంతా మాయ. విష్ణుమాయ.

ఇప్పుడు ఇది కూడా పాత కధల జాబితాలోకి చేరిపోయింది.

ఇప్పుడు మరో కొత్త విష్ణు మాయ మొదలయింది.

పెట్రో ధరలు లీటరుకు ఇన్ని రూపాయలో, పైసలో తగ్గించినట్టు ప్రకటన వస్తుంది. జనం అమ్మయ్య అనుకునే లోగా దాని వెంటే మరో స్క్రోలింగు పరుగులు తీస్తుంది, తగ్గిన మందానికి మరికొంత కలిపి ఎక్సయిజు డ్యూటీ పెంచారని. ఈతపండు చేతికిచ్చి తాటిపండు లాక్కోవడం అంటే ఇదే కాబోలు. 

పెట్రోలు ధరలు మళ్ళీ పెంచారు అని పత్రికల్లో వస్తుంటుంది. మళ్ళీ పెంచారు అనడంకంటే ఇంకోసారి పెంచడానికి వీలుగా మరోసారి పెంచారు అనడం సబబుగా వుంటుంది. ఎందుకంటె పెంచడం అది ఆఖరు సారీ కాదు, మళ్ళీ పెంచరన్న పూచీ లేదు.


చమురు కంపెనీలకు నష్టాలు వస్తున్నాయని, ఆ నష్టాలను భరిస్తూ రావడం వల్ల సర్కారు ఖజానాకు గండి పడుతోందని, అప్పుడప్పుడు ఇలా ధరలను పెంచడం ద్వారా ఆ గండిని ఓ మేరకయినా పూడ్చుకోవాలని ప్రభుత్వం వాదిస్తుంటుంది. నిజమే నష్టాలు వచ్చే వ్యాపారం చేయమని ఎవరూ కోరరు. కానీ ఈ వాదనలో వున్న పస ఎంతన్నదే సాధారణ జనం అడిగే ప్రశ్న. పెట్రో ఉత్పత్తుల రిటైల్ ధరల్లో సగభాగానికి పైగా వున్న పన్ను భారాన్నితగ్గించి సామాన్యులకు ఎందుకు వూరట కలిగించరు? అన్న ప్రశ్నకు కూడా ప్రభుత్వాలనుంచి సమాధానం దొరకదు. విభిన్న పార్టీలు పాలిస్తున్న  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు నెపం మోపుకోవడం మినహా ప్రజలకు దక్కే ఉపశమనం ఏమీ లేదు. 


ఆయిల్ కంపెనీలు లాభాల్లో నడుస్తున్నాయా, నష్టాలను మూటగట్టుకుంటున్నాయా అనేది వినియోగదారుడికి సంబంధించినంత వరకు ఒక ప్రశ్నే కాదు. వాటి నిర్వహణ శైలి గమనించే వారికి అవి నష్టాల్లో వున్నాయంటే ఒక పట్టాన నమ్మబుద్ది కాదు. అసలిన్ని కంపెనీలు అవసరమా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఒక్కొక్క కంపెనీ, తన అధికారులు, సిబ్బంది జీత భత్యాలపై పెడుతున్న ఖర్చు చూస్తుంటే సామాన్యులకు కళ్ళు తిరుగుతాయి. అలాగే, పెట్రో కంపెనీలు ప్రకటనలపై పెడుతున్న ఖర్చు అంతాఇంతా కాదని ఓ మోస్తరు లోకజ్ఞానం వున్న వాళ్లకు కూడా ఇట్టే అర్ధం అవుతుంది. పత్రికల్లో, మీడియాలో ప్రకటనలు ఇచ్చి వ్యాపారాభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఏ మేరకువుందో ఆ కంపెనీలే ఆలోచించుకోవాలి. నిజంగా నష్టాలు వస్తున్నప్పుడు ఆధునికీకరణ పేరుతొ పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఎంత వుంది? నష్టాలు వస్తున్నప్పుడు వాటినుంచి బయటపడడానికి ఖర్చు తగ్గించుకోవడం ఒక్కటే సులువయిన మార్గం. ఇది తెలుసుకోవడానికి అర్ధశాస్త్రంలో పట్టాలు అక్కరలేదు. నష్టాలు, సబ్సిడీల పేరుతొ ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారం పడుతున్నట్టు చేస్తున్న ప్రకటనల్లో ఏదో డొల్లతనం వున్నట్టు ఎవరయినా అనుమానిస్తే వారిని తప్పు పట్టలేము.

లెక్కలు,డొక్కలు అన్నవి సాధారణ వినియోగదారుడికి అక్కరలేని విషయాలు. అతనికి తెలిసిందల్లా ధర పెంచినప్పుదల్లా అతడి జేబుకు ఎంత చిల్లి పడుతున్నదన్నదే. దాన్నిబట్టే అతడి స్పందన వుంటుంది. కానీ అది అరణ్య రోదనే కూడా అతడికి తెలుసు. అతడి అసహాయత సర్కారుకు తెలుసు. తరుణం వచ్చేవరకు జనం ఏమీ చెయ్యలేరన్న ధీమా పాలకుల చేత చెయ్యకూడని పనులు చేయిస్తుంటుంది. కానీ, విషాదం ఏమిటంటే ఆ తరుణం అంటే వోటు ద్వారా పాలకులను మార్చే సమయం ఆసన్నమయినప్పుడు అప్పటి సమస్యలు తెరమీదకు వస్తాయి. ఇప్పటి సమస్యలు తెర మరుగుకు వెడతాయి. సామాన్యుడి ఈ బలహీనతే సర్కారు బలం. ఈ సూక్ష్మం తెలిసినవారు కనుకనే రాజకీయ నాయకులు వారు ఏ పార్టీ వారయినా ఇన్ని నాటకాలు యధేచ్చగా ఆడగలుగుతున్నారు.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకోసం ఇచ్చే వంట గ్యాస్ సిలిండర్లపై ఇస్తున్న సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసింది.

పిల్లలను,  ప్రజలను  జీవితాంతం కనిపెట్టుకుని చూడాల్సిన బాధ్యత తలితండ్రులది, ప్రభుత్వాలది అని గట్టిగా నమ్మే సంస్కృతిలో జీవిస్తున్నాం. 

మొన్నీమధ్య ఒక కార్టూను కళ్ళబడింది. పెట్రోలు బంకు ముందు సూటూ బూటూ వేసుకున్న వ్యక్తి చేతిలో ఓ ప్లకార్డు పట్టుకుని నిలబడి అడుక్కుంటూ వుంటాడు. దానిమీద ఇలా రాసివుంటుంది. "భార్యతో పాటు రెండు కార్ల భారం కూడా నేను మోయాలి"

భారం మరొకరు మోసినంత కాలం బాధ్యత తెలియదు.   

అది తెలియనంత కాలం ఇలాంటి  కార్టూన్లే వస్తుంటాయి.


తోకటపా 

లాభ శాతమెంత? నష్ట శాతమెంత?

“నాలుగు పెంచు, మూడు తగ్గించు, మరో రెండు తగ్గించి అయిదు పెంచు. అలానే ఒకటి తగ్గించి ఇంకోటి పెంచు. ఆరు తగ్గించి అయిదు పెంచు.”

“ఏవిటీ లెక్క అర్ధం లేకుండా!”

“అర్ధం చేసుకోవాలి నాయనా! ఈ లెక్కల్ని తెలుగులో పెట్రోధరలు అంటారుష.



4, జూన్ 2022, శనివారం

ఎవరు మేజరు? ఎవరు మైనరు? – భండారు శ్రీనివాసరావు

ఇప్పటి విషయమే కాని కొంత పాత కధ చెప్పాలి.

అప్పుడెప్పుడో యాభయ్ ఏళ్ళ క్రితం సినిమా రివ్యూలు రాసేందుకు ఫ్రీ వ్యూలు (Free View) చూడడానికి  ధియేటర్లకి డుతుండేవాడిని. రిలీజ్ కు ముందు వేసే  Preview లకి ఇవి అదనం. మన వీలూసాలూ చూసుకుని వెళ్ళడానికి వీలైన ఏర్పాటు అన్నమాట.

ఒక రోజు అలా ఓ సినిమాకి వెళ్ళాను, గుప్త జ్ఞాన్ అనుకుంటా. బాగా రష్ గా వుంది. టిక్కెట్లు కొనుక్కుని వచ్చిన వాళ్ళు నిమిషం ఆలస్యం అయితే ఏ సీను మిస్సవుతామో అన్నట్టుగా తోసుకుని వెడుతున్నారు. కొంత నిమ్మళించిన తర్వాత అడిగాను గేటువాడిని. లోపలకి వెళ్ళిన వాళ్ళలో చాలామంది చిన్న పిల్లల మాదిరిగా వున్నారు. ఇది ఏ సర్టిఫికేట్ సినిమా. ఎలా పంపిస్తున్నావు అని.

అతడు నవ్వి చెప్పాడు. ‘ఏ అనగానే వచ్చేది వీళ్ళే. వీళ్ళను నీ వయసు ఎంత అని అడిగితే ఆ సర్టిఫికేట్ తెచ్చుకున్న ఫాయిదా ఏముంటుంది. వీళ్ళే కదా మహారాజ పోషకులు

యాభయ్ ఏళ్ళ క్రితమే ఇలా వుంది. తెలియంది తెలుసుకోవాలని, చూడంది చూడాలని ఆ వయసులో తప్పకుండా అనిపిస్తుంది.  దాన్ని క్యాష్ చేసుకోవాలని సినిమా వాళ్ళ తాపత్రయం.

మేజరు ఎవరు , మైనర్ ఎవరు అని కదా చెప్పుకుంటున్నాం.

పద్దెనిమిది లోపల మైనరు, దాటితే మేజరు అని ఓ సర్కారు వారి లెక్క వుంది. కానీ ఆ లెక్కను ఎవరు లెక్క పెడతారు. అదీ ఈ రోజుల్లో. చిన్నాపెద్దా అందరూ ఐ నో పీ ఎం, ఐ నో సీ ఎం  బాపతు అయినప్పుడు అసలు కుదరదు.

అప్పటికీ ఇప్పటికీ కొట్టవచ్చినట్టు కనబడే కొన్ని మార్పులు వున్నాయి.

పిల్లలు ఒక వయసు వచ్చేవరకు తలితండ్రుల కనుసన్నల్లో వుండేవాళ్ళు. బయట ప్రపంచంలో తిరిగేది తక్కువ. ఇంట్లో గడిపేది ఎక్కువ. టీవీలు లేవు, పత్రికలు లేవు. లేవని కాదు, పిల్లల చేతిలో ఉండేవి కావు. దాంతో చదువే వారికి లోకం. ఇతరేతర లోక జ్ఞానం పూజ్యం. అమ్మాయిల వైపు  చూడడానికి భయపడే వారు. ఇక ఆడపిల్లలు బోలెడు సిగ్గుపడే వారు. అలానే వుండి పోవాలని రచయిత ఉద్దేశ్యం కాదు. మార్పుల గురించి ప్రస్తావనలో భాగంగా చెప్పింది మాత్రమే. పేరెంట్స్ కూడా పిల్లల పట్ల బాధ్యతగా వుండేవాళ్ళు. ఇది కాక మంచీ చెడూ చెప్పడానికి ఇళ్ళల్లో తాతయ్యలు, నాయనమ్మలు వుండేవాళ్ళు.  ఆ కాలంలో ఇంత పొడగరి పిల్లలు అరుదు. చూడగానే చిన్నవాడు అని తెలిసి పోయేది. ఇప్పుడలా కాదు. తినే తిండ్లూ, పెరిగే వాతావరణం వారిలో శారీరకపరమైన మార్పులకు కారణం అవుతున్నాయి.  చిన్న వయసులోనే పెద్దగా కనబడుతున్నారు. ఇళ్ళల్లో పెద్దల భయం బొత్తిగా లేదు. అసలా పెద్దలే ఇళ్లకు చేరే సరికే నడి ఝాము అవుతోంది. ఇక పిల్లల సంగతి కనుక్కునే తీరిక, ఓపిక  వారికి ఎక్కడుంది కనుక.

దానికి తోడు ప్రపంచం వారి గుప్పిట్లోకి వచ్చేసింది మొబైల్ రూపంలో. అందులో చూడాల్సింది,  చూడకూడనిది అంటూ ఏమీ లేదు. మేజరు, మైనరు అనే వివక్ష అసలే లేదు. దీనికి తోడు నాగరికత పేరుతొ వస్త్ర ధారణలు, నియమాలు లేని ఆహారవిహారాలు, ఆడా మగా తేడాలేని స్నేహాలు. ఇక వారికి వయసుతో నిమిత్తం లేని  లేనిపోని ఆలోచనలు వస్తే అది వారిది తప్పా!

తప్పదు. చట్టాలు మార్చాలి. మేజరు, మైనరు అనే తేడా లేకుండా చేసిన తప్పుడు పనులకు తగిన శిక్షలు పడాలి. చేసింది మేజరు నేరం, తప్పించుకునేది మైనర్ పేరుతొ.

ఢిల్లీ ఉదంతం గుర్తుంది కదా! రాత్రి వేళ బస్సులో వస్తున్న అమ్మాయిపై జరిగిన ఘాతుకం. ఇనుపరాడుతో మర్మాంగాలను హింసించిన పశువు మేజరు కాదు, మైనరు. ఆ పేరుతొ పడాల్సిన శిక్ష నుంచి చట్టమే అతడిని కాపాడింది.

ఈ పరిస్థితి మారాలంటే  ముందు తలితండ్రులు మారాలి. వారికి చదువు చెప్పే విద్య సంస్థలు కూడా కొంత బాధ్యత తీసుకోవాలి. చట్టాలు మారాలి.

ఇవేవీ జరగకుండా ఏదైనా జరగరానిది జరిగినప్పుడు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ బుల్లి తెరలపై చర్చలు చేస్తే జరిగేది ఏముంటుంది. జనం ఆ సంఘటన గురించి మాట్లాడుకుంటారు. ఎప్పటి వరకు? మరో ఇలాంటి సంఘటన జరిగే వరకు.

(04-06-2022)

నా మొదటి స్కూటరు – భండారు శ్రీనివాసరావు

కలకత్తా (ఇప్పుడు కోల్ కటా) కార్యస్థానంగా కలిగిన యునైటెడ్ బాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎనభయ్యవ దశకం ప్రధమార్ధంలో అనుకుంటాను హైదరాబాదు వచ్చి అప్పటి ఏకైక ఫైవ్ స్టార్ హోటల్ బంజారా హోటల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అలాటి వాటికి రాయని భాస్కరులు (పత్రికా రచయితలు) ఒకరిద్దర్ని మినహాయిస్తే డ్యూటీమీద వచ్చే వాళ్ళు పట్టుమని పదిమంది కూడా వుండేవాళ్ళు కాదు. అందువల్ల మాటా మంతీ మాట్లాడుకోవడానికి వ్యవదానం, వెసులుబాటు ఉండేవి. అప్పటికే జర్నలిజం వృత్తిలో చేరి పుష్కర కాలం గడిచింది కాని (ద్విచక్ర) వాహనయోగం పట్టలేదు. కొత్త స్కూటరు ఖరీదు పదివేల లోపే. బాంకు ఋణం ఇచ్చినా మూడు నాలుగు వేలు చేతినుంచి పెట్టుకోవాల్సి రావడం వల్ల, అప్పు ఇచ్చే బాంకులవాళ్ళు వున్నా తీసుకోవడానికి ఓ పట్టాన ధైర్యం చాలేది కాదు. ఈ నేపధ్యంలో యునైటెడ్ బాంకు చైర్మన్ హైదరాబాదు వచ్చారు. ఆయన బాంకులు, లోన్లు గురించి మాట్లాడుతుంటే ఆకాశవాణి న్యూస్ ఎడిటర్ మల్లాది రామారావు జర్నలిస్టులకు స్కూటర్ లోన్లు గురించి కదిలించారు. ఆయన వెంటనే స్పందించి అక్కడ వున్న స్తానిక బాంకు అధికారిని పిలిచి వెంటనే కావాల్సిన వారికి లోన్ శాంక్షన్ చేసి ఆ విషయం తనకు తక్షణం తెలియచేయాల్సిందని హుకుం జారీ చేసారు. సరే ప్రెస్ కాన్ఫరెన్స్, దరిమిలా ఏర్పాటు చేసే విందు భోజనాలు ముగిసిన తరువాత ఎవరి ఇళ్ళకు వాళ్ళం వెళ్ళిపోయాం.

రెండు రోజుల తరువాత కోటీ లోని యునైటెడ్ బాంకు నుంచి ఫోను వచ్చింది. లోను కోసం రాలేదేవిటి అని వాకబు. ఆశ్చర్యం వేసింది. నమ్మబుద్ది వేయలేదు. అపనమ్మకంతోనే అక్కడికి వెళ్లాను. బాంకు అధికారి స్కూటరు లోనులో ఓ ఇరవై శాతం అయినా ముందు ధరావతు మొత్తంగా కట్టమన్నాడు. ఆ డబ్బే వుంటే మీ దగ్గరకు ఎందుకు వస్తామని లేచి రాబోతుంటే, ఆయనే మళ్ళీ కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి ‘మీకు లోను శాంక్షన్ చేసి మళ్ళీ మా హెడ్ ఆఫీసుకు ఈ సాయంత్రానికల్లా రిపోర్ట్ చేసుకోవాలి, ముందు చెక్కు తీసుకు వెళ్ళండి’ అని హామీదారుల సంతకాలు కూడా అడక్కుండా, కాసేపట్లో చెక్కు చేతిలో పెట్టాడు. ఆ రోజుల్లోనే, గుజరాత్ గవర్నమెంటు వాళ్ళ గిర్నార్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. అంతా వెస్పా స్కూటర్ మోజులో వున్నారు. కానీ అది దొరకాలంటే చాలా ఏళ్ళు వెయిట్ చేయాలి. దాంతో చాలామందికి గిర్నార్ స్కూటర్ వరప్రసాదంలా కనబడింది. అంతకు రెండు రోజులముందే ఎక్స్ ప్రెస్ సుందరం గారు గిర్నార్ కొనుక్కుని దాన్నే నాకు సిఫారసు చేయడంతో నేనూ అదే కొనుక్కున్నాను. మా వైభోగం ఎలా ఉండేదంటే గిర్నార్ మనిషి మా ఇంటికే వచ్చి స్కూటర్ ను సర్వీసింగుకు తీసుకువెళ్ళేవాడు.
1987లో మాస్కో వెళ్ళడానికి కొన్ని మాసాల ముందు జరిగిన ‘హెల్మెట్ ధరించని జర్నలిస్ట్ అరెస్ట్’ అనే సంచలన ఉదంతానికి కారణమైన ‘నేను’, ఆరోజు వెడుతున్నది ఈ గిర్నార్ స్కూటర్ మీదనే.
ఆ కధ అనేక మలుపులు తిరిగి సుఖాంతం అయింది కానీ ఆనాటి నుంచి స్కూటర్ ఎక్కలేదు.
ఇక హెల్మెట్ ఉపాఖ్యానం ఏమిటంటే:
హెల్మెట్ నిబంధన పాటించనందుకు నన్ను ఓ పోలీసు ఇన్స్పెక్టర్ పట్టుకుని హుమాయూన్ నగర్ పోలీసు స్టేషన్ లో పెట్టారు. ఈ సంగతి తెలిసి వివిధ పత్రికల్లో పనిచేసే విలేకరులు, సీనియర్లు స్టేషన్ బయట ధర్నా చేశారు. మర్నాడు అసెంబ్లీ ఈ కారణంగా వాయిదా పడింది. ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ సంఘటన పై దర్యాపుకు రిటైర్డ్ న్యాయమూర్తి చైర్మన్ గా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ పోలీసు అధికారిని బదిలీ చేశారు ఈ క్రమంలో..
చిత్రంగా ఈ కధ మరో మలుపు తిరిగింది. రాయలసీమకు చెందిన ఆ న్యాయమూర్తికి గ్రీన్ లాండ్స్ గెస్టు హౌస్ లో కార్యాలయం ఏర్పాటు చేశారు. అక్కడ కలుసుకోవాలని నాకు వర్తమానం పంపారు.
తీరా వెడితే, తెలిసింది, ఆ రిటైర్డ్ జడ్జి గారి అమ్మాయి రేడియోలో నా జీవన స్రవంతి కార్యక్రమానికి అభిమాని. నన్ను చూస్తాను అంటే ఆయన వెంటబెట్టుకుని వచ్చారు. హెల్మెట్ లేదని నన్ను పట్టుకున్న ఇన్స్పెక్టర్ కూడా వచ్చారు. ఆయన మా ఆఫీసులో పనిచేసే ఓ ఉద్యోగికి చుట్టం. అతడ్ని తీసుకుని మా ఇంటికి వచ్చి తన ఉద్యోగానికి ఇబ్బంది లేకుండా చూడమని కోరాడు. ఆ విషయం నేను అప్పుడే మరచిపోయాను కాబట్టి మీకు అపకారం చేసే ఉద్దేశ్యం నాకు లేదని అతడికి భరోసా ఇచ్చాను.
తర్వాత అదే మాట జడ్జి గారెతో చెప్పాను. త్వరలోనే నేను మాస్కో పోతున్నాను కాబట్టి, ఎవరూ నా కారణంగా బాధ పడడం ఇష్టం లేదని అన్నాను. జరిగింది దురదృష్టకర సంఘటన కాబట్టి మరచిపోవడమే దీనికి పరిష్కారం అని కూడా చెప్పాను.
ఆయన నా మాట మన్నించారు. ఆవిధంగానే కేసు మూసేశారు.
తర్వాత చాలా కాలానికి (అప్పుడు నేను ఇండియాలో లేను) అసెంబ్లీకి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించింది.
కధకు ఆవిధంగా శుభం కార్డు పడింది