11, ఫిబ్రవరి 2022, శుక్రవారం

ఇదేమంత ఘన కార్యం? – భండారు శ్రీనివాసరావు

 “మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. అలాగే మీ సాయం కూడా కావాలి” అన్నాడతను.

గొంతు బొంగురుగా అదో రకంగా వుంది.

ఉర్దూ వార్తల టైం అవుతోంది. హెడ్ లైన్స్ డిక్టేట్  చేస్తుంటే మొదలయిన సంభాషణ ఇది.

“కాసేపు అలా కూర్చోండి. బులెటిన్ పని కాగానే మాట్లాడుకుందాం” అన్నాను. అని నా పనిలో మునిగిపోయాను.

ఉర్దూ వార్తల తరవాత తెలుగు వార్తలు.  ప్రాధాన్యాన్ని బట్టి వార్తల్లో కొన్ని మార్పులు చేసి, సరి చూసి న్యూస్ రీడర్ చేతిలో  కాగితాలు పెట్టాను. అతను వాటిని మరోమారు చదువుకుంటూనే స్టూడియో వైపు వెళ్ళిపోయాడు.

అప్పుడు గమనించాను, ఆ బొంగురు గొంతు వ్యక్టి ఇంకా అక్కడే వున్నాడు. వార్తలు మొదలయ్యాయి. అందరితో పాటు అతనూ వింటున్నాడు. ఆరూ ఇరవై అయిదుకు  ఠంచనుగా ‘ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం అంటూ న్యూస్ రీడర్ ముగించాడు.

“ఇప్పుడు చెప్పండి, ఏదో చెప్పాలని అన్నారు కదా!” అని నేనే కదిలించాను.

“ఇక్కడా! బాగుండదేమో! అలా బయటకు వస్తారా” అన్నాడతను.

“ఏం పర్వాలేదు. చూసారు కదా! మా న్యూస్ రూమ్. అంతా ఒకటే హాలు. పనిచేసే మనుషుల మధ్య పార్టిషన్లు కూడా లేవు. అందరం ఒక కుటుంబం లాగా పనిచేసుకుంటాము. రహస్యాలు ఏవీ వుండవు”

“ఆలానా! సరే! నాకు రేడియోలో వార్తలు చదవాలని వుంది. అలాగే మీరిప్పుడు బులెటిన్ డిక్టేటర్  చేస్తుంటే గమనించాను. ఈ ఉద్యోగం నాకేమైనా దొరుకుతుందా! మా దోస్తులు చాలామంది చెప్పారు, నా గొంతు రేడియోకి సూట్ అవుతుందని. బయట వాళ్ళు కూడా వార్తలు చదువుతుంటారని, వెళ్లి ప్రయత్నించమని,  అందుకే వచ్చాను. ఈ విషయంలో నాకేమైనా సాయం చేయగలరా!”

“మీరు విన్నది కొంత  నిజమే. మా దగ్గర ఇలా క్యాజువల్ గా వార్తలు చదివే వాళ్ళు వున్నారు. ఇదిగో! ఈయన ఇప్పుడే స్టూడియో నుంచి వచ్చారు. మీరు ఇప్పటిదాకా విన్న వార్తలు ఈయన చదివినవే.. బ్యాంకులో పనిచేస్తారు. మాకు అవసరంపడ్డప్పుడు  ఇదిగో ఇలా వచ్చి, మా దగ్గర వార్తలు చదువుతుంటారు. అయితే. ఇందుకు ఒక విధానం వుంది. ముందు వ్రాత పరీక్ష వుంటుంది. అందులో పాసయితే మళ్ళీ ఆడిషన్ వుంటుంది. ఈ పరీక్షలు అవీ కూడా రెండేళ్ళకో, మూడేళ్ళకో పెడతాము. అవన్నీ దాటి సెలక్టు అయితే  నెలకో అయిదుసార్లు వార్తలు చదివే అవకాశం వస్తుంది. ప్రతినెలా రాకపోవచ్చు. రెగ్యులర్ న్యూస్ రీడర్లు సెలవు పెడితే ఆ ఖాళీలో ఇలా సెలక్ట్ అయిన క్యాజువల్స్ కి అవకాశం ఇస్తాము. కాబట్టి ఈ పద్దతి ఫాలో అయి ప్రయత్నం చేసుకోండి” అని ఓ సలహా ఇచ్చి సంభాషణ ముగించబోయాను.

“..........”

“అయినా రేడియోలో వార్తలు చదవడం అంత సులభం అనే అభిప్రాయం మీకు ఎందుకు కలిగింది” అని అడిగాను. తర్వాత అనిపించింది, ఈ ప్రశ్న వేయకుండా వుంటే బాగుండేదని.

అతను చెప్పాడు.

“చిన్నప్పటి నుంచి రేడియో వార్తలు వింటున్నాను. ఎప్పుడో ఒకప్పుడు వార్తలు చదవాలనే కోరిక మొదలయింది. దానితో చదువుకు పదో తరగతితో బ్రేకు పడింది. నిన్ననే ఓ పత్రికలో చదివాను, ఓ హీరో సినిమా ఫస్ట్ షో చూడడంకోసం ఒక పూటల్లా క్యూ లైన్లో నిలబడ్డాడుట. ఇప్పుడు అదే హీరోతో నటిస్తున్నానని చెప్పాడు. ఆయనకు సాధ్యపడింది నాకెందుకు చేతకాదు?

గదిలో ఉన్న వాళ్లందరికీ నవ్వు వచ్చింది, అతడి మాటలు విని. కానీ పైకి ఎవ్వరూ నవ్వలేదు.

కొంచెం ఆలోచనలో పడ్డారేమో తెలియదు.

నాకయితే అనిపించింది.

“ఇన్నేళ్లుగా నేను చేస్తున్న పని ఇంత సులభమా! ఏమో!”

(ఆకాశవాణి అమృతోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాదు రేడియో వారు నా అనుభవాలను ఓ అరగంట రికార్డు చేస్తాం రమ్మంటే వెళ్లాను. ఒకప్పటి న్యూస్ రీడర్, నా సహోద్యోగి  సమ్మెట నాగమల్లేశ్వర రావు ఈ కార్యక్రమ నిర్వాహకులు. రికార్డింగ్ పూర్తయిన తర్వాత,  ఎటూ వచ్చాను కదా! అని పుట్టింటికి (న్యూస్ యూనిట్) కి వెళ్లాను. పుష్కరాల క్రితం  అక్కడ చాలామందితో కలిసి  పనిచేశాను. కొందరు కొత్తవాళ్ళు కనబడ్డారు. కాసేపు అక్కడ మాటామంతీ జరిపి, ‘ఇచ్చోటనే కదా! ముప్పయ్యేళ్లు వార్తలు వండి వార్చింది’ అని గుర్తు చేసుకుంటుంటే, గుర్తొచ్చిన జ్ఞాపకం ఇది)

(11-02-2022)     

10, ఫిబ్రవరి 2022, గురువారం

చిట్టి చెల్లెలు శైలజ – భండారు శ్రీనివాసరావు

నేను రేడియోలో చేరిన ఓ ఇరవై ఏళ్ళ తర్వాత ఢిల్లీ నుంచి బదిలీపై శైలజ అనే అమ్మాయి మా యూనిట్లో  చేరింది. బుద్ధిగా తలవంచుకుని పనిచేసుకు పోవడం తప్ప వేరే  ప్రపంచం ఎరుగని ఆ అమ్మాయి, న్యూస్ యూనిట్లో వాతావరణం చూసి మొదట్లో బెదిరిపోయింది. వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, రాజకీయ నాయకులు, జర్నలిష్టులు ఇలా ఎంతో మందితో అది ఒక  ప్రభుత్వ కార్యాలయంలా కాకుండా రైల్వే స్టేషన్ ప్లాటు ఫారం మాదిరిగిగా రణగొణధ్వనులతో గడబిడగా వుండేది. చాలా కొద్ది సమయంలోనే శైలజ సర్దుకుంది. ఇంకా అతికొద్ది సమయంలోనే పనిలో వేగం, చురుకూ చూపి, మొత్తం యూనిట్ కే తలలో నాలుకలా మారింది. పేరుకు ఇంగ్లీష్ స్టెనో ఉద్యోగం అయినా యూనిట్ కు అవసరమైన అన్ని పనులను నెత్తికెత్తుకునేది. మొత్తం యూనిట్ లో పనిచేసేవారందరికీ ఒక చిట్టి చెల్లెలు అయింది.

మా ఆవిడ అంటే శైలజకు ప్రాణం. శైలజ అంటే మా ఆవిడకు ఆరో ప్రాణం. పండుగలు, వ్రతాలు, నోములు, వాయినాలు, ముత్తయిదువు పేరంటాళ్ళు ఇలా అన్ని సందర్భాలలో కలిసేవాళ్ళు. ఆఫేసులో కొద్ది వ్యవధానం దొరికితే చాలు, చటుక్కున ఆటోలో మా ఇంటికి వెళ్లి ముచ్చట్లు చెప్పి వచ్చేది. ‘శైలజ లాంటి ఆడపిల్ల ఒక్కళ్ళు వుంటే చాలు, వేరే దీపాలు అక్కరలేదు ఇంటికి’ అనేది మాఆవిడ. ఇద్దరి నడుమా అంతటి అన్యోన్యం.ఆప్యాయత.

నా భార్య చనిపోయిన షాకు నుంచి నేను కొంత తేరుకున్నాను కాని, తను ఇంకా కుదుటపడ్డట్టు లేదు.

నిన్న ఫిబ్రవరి తొమ్మిది పుట్టిన రోజున, ఎక్కడ ఎలా సంపాదించిందో తెలియదు, ఏదో ఫంక్షన్ లో హడావిడిగా తిరుగుతున్న మా ఆవిడ నిర్మల ఫోటో సంపాదించి ఫ్రేము కట్టించి  ఆమె  పుట్టిన రోజు కానుకగా నాకు ఇచ్చింది.

ఇలాంటి బహుమతులకు వెలలు, ధరలు వుండవు. వున్నా ఖరీదు కట్టే వాళ్ళు వుండరు.

థాంక్స్ శైలజా!



(10-02-2022)

బొటనవేలి కధ - భండారు శ్రీనివాసరావు

 

చదువు రానివాళ్ళని, సంతకం చేయడం తెలియనివాళ్ళని అంగుష్టమాత్రులని సంస్కృతంలో, నిశానీగాళ్ళని సంకర భాషలో, వేలిముద్రగాళ్ళని అచ్చ తెలుగులో ఎద్దేవా చేస్తుంటారు. కాని వారికి తెలియంది ఒకటుంది. వేలెడు బొటనవేలే కదా అనుకోకండి దానికి కూడా బోలెడు చరిత్ర వుంది సుమా!

ఒక్కసారి అరచేయి ఎలావుంటుందో, అందులో వేళ్ళ అమరిక ఎలా వుంటుందో గమనించండి. చూపుడు వేలు, మధ్యవేలు, ఉంగరం వేలు, చిటికిన వేలు పక్కపక్కన వుంటే ఒక్క బొటనవేలు ఒక్కటే విడిగా వుంటుంది. ఆ ఒక్కటి లేదనుకోండి ఇంతోటి నాగరీకం ఉండేదే కాదు. మనుషులందరూ పాత రాతియుగంలోనే ఉండిపోయేవారు. బొటనవేలు ప్రాశస్త్యం తెలిసిన వాడు కనుకనే ద్రోణాచార్యుడు ఆ వేలిని గురుదక్షిణగా ఇమ్మంటాడు తన శిష్యుడు కాని ఏకలవ్యుడిని. ప్రియ శిష్యుడు అర్జునుడికి పోటీ అతడొక్కడే అని గ్రహించిన ద్రోణుడు బొటనవేలును గురుదక్షిణగా కోరి ఏకలవ్యుడిని శాశ్వితంగా  విలువిద్యకు దూరం చేసినట్టు పురాణ కధనం.

నిజమే. మనిషికి బొటనవేలు అనేది లేకపోతే చేతికి పట్టు చిక్కదు. దేన్నీ పట్టుకోలేదు. పట్టుకోలేకపోతే ఇన్నిన్ని విద్యలు అతగాడికి అలవడేవి కావు. ఒక చేత్తో రాతిని పట్టుకుని మరో రాతితో దాన్ని కొట్టి నిప్పు రాజేసిన విధానమే  ఆదిమజాతి మనుషుల జీవితాలనే  సమూలంగా మార్చివేసింది. మొత్తం నరజాతి చరిత్రనే పెద్ద మలుపు  తిప్పింది. ఆయుధం పట్టాలన్నా, అన్నం తినాలన్నా, అసలు ఏపని చేత్తో చేయలన్నా బొటనవేలే కీలకం. మనిషి చేతికి  ఆ బొటనవేలే లేకపోతే మానవుడు ఇప్పటికీ ఆదిమ మానవుడి మాదిరిగానే మిగిలిపోయి ఉండేవాడని సూతుడు సౌనకాది మునులకు చెప్పగా వారిలో ఒకండు ఆ విషయాన్ని భవదీయుడితో పంచుకోవడం జరిగింది.



 

మంగళం మహత్! శ్రీ! శ్రీ! శ్రీ!

8, ఫిబ్రవరి 2022, మంగళవారం

ఫిబ్రవరి తొమ్మిది – భండారు శ్రీనివాసరావు

 “Mister! Happy Birthday!”

“……………….”

అటునుంచి స్పందన లేదు. వుండదు, రాదు.

నాకు తెలుసు. ఎందుకంటే అక్కడ ఎవ్వరూ లేరు.

ఫిబ్రవరి తొమ్మిది. మా ఆవిడ నిర్మల పుట్టిన రోజు.

1971లో పెళ్ళయినప్పటి నుంచి 2019 లో   ఆమె  చనిపోయేవరకు నలభయ్ ఎనిమిదేళ్లుగా  నేను మా ఆవిడను పేరు పెట్టి ఎన్నడూ పిలవలేదు. మిస్టర్ అనే పిలిచేవాడిని.

ఎందుకంటే ఆవిడ నాకూ, నా చిన్న  కుటుంబానికీ ‘మాస్టర్ కాబట్టి. 



(09-02-2022)

7, ఫిబ్రవరి 2022, సోమవారం

ఒక తరం ఆపేక్షలు, అభిమానాలు

 కింద ఫోటోలో మా అన్నదమ్ముల మధ్యలో వున్నది ఎనభయ్ అయిదేళ్లు దాటిన యువకుడు. యువకుడు అని ఎందుకు అంటున్నాను అంటే ఈయన గారు ఎక్కడో నల్లకుంట నుంచి మెట్రో పట్టుకుని నాగోలులో దిగి, ఆటోలో రాత్రి మా పెద్దన్నయ్య  మనుమరాలు  శరణ్య పెళ్లి జరిగిన స్వాగత్ గ్రాండ్ హోటల్ కు చేరుకొని,  రెండో అంతస్తులోని పెళ్లి మంటపానికి ఒంటరిగా వచ్చేసారు.

ఈ వృద్ధ బాలకుడి పేరు ఆకురాతి వెంకటేశ్వర రావు గారు. మా అన్నయ్యకు బాల్య స్నేహితుడు కాదు కానీ ఆప్త మిత్రుడు. నేను కాలేజీలో చదువుకుండే రోజుల్లోనే ఆయన అమెరికా, ఆఫ్రికా వంటి అనేక దేశాలు చుట్టి వచ్చాడు. వయసు రీత్యా కొంత వినికిడి తగ్గింది కానీ స్వరం మాత్రం అప్పటిలా  కంచుకంఠం.

‘నా స్నేహితుడు పర్వతాల రావు గారి మనుమరాలి పెళ్ళికి నేను రాకుండా ఎలా వుంటాను?’  అంటారు ఆయన, ‘ఎలా వచ్చారు?’ అనే నా ప్రశ్నకు జవాబుగా.

వెంకటేశ్వర రావు గారి భార్య శ్రీమతి విజయలక్ష్మి ఎస్సారార్ కాలేజీలో లెక్చరర్. కొన్నేళ్ళ క్రితం ఆవిడ మరణించారు. అప్పటినుంచి ఆమెనే తలచుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. మనసును చిక్కబట్టుకోవడానికి ఇదిగో ఇలా పుస్తకాలు రాస్తున్నారు.

ఆకురాతి గారి గురించి ఒక విషయం చెప్పుకోవాలి. ఆయన ఇంగ్లీష్ పరిజ్ఞానం చాలా గొప్పది. ఆయన తుమ్మినా దగ్గినా ఇంగ్లీష్ లోనే అని చెప్పుకునే వారు. ఈ రామాయణం పుస్తకం కూడా వెంకటేశ్వర రావు గారు ఆ భాషలోనే రచించారు.

రాసిన పుస్తకం మా చేతిలో పెట్టి, ఓ చేతిలో ఓ చేతి సంచి, మరో చేతిలో ఓ చేతి కర్ర పట్టుకుని అలవోకగా లిఫ్ట్ దిగి వెళ్ళిపోయారు ముందు ఆటో, తర్వాత మెట్రో రైలు పట్టుకుని ఆ రాత్రి ఇంటికి చేరడానికి, కారులో పంపిస్తాం అనే మా మాట చెవిన పెట్టకుండా.

యు ఆర్ ఆల్వేస్ గ్రేట్ వెంకటేశ్వర రావు గారూ!  



07-02-2022  

పాత ఫోటో

 

ఫోటో అనేది చక్కని జ్ఞాపకం. ఇక పాత ఫోటో అయితే అదో  మధుర స్మృతి. ఈ కింది ఫోటో వయసు  ఓ పాతికేళ్ళ పై చిలుకే.

చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తీసిన ఫోటో. కర్టేసి: మిత్రుడు  శ్రీ జయప్రసాద్, ఎండీ, మెట్రో టీవీ. ఆ రోజుల్లో బాబు గారి ఆకస్మిక పర్యటనలు మీడియాకు మంచి ఆహారం. అలా ఒక రోజు ప్రత్యేక బస్సులో వెడుతుండగా సీఎం మాతో (విలేకరులతో) ముచ్చటిస్తూ ఉన్నప్పటి దృశ్యం. ఆయన ఎదురుగా పొడుగు చేతుల తెల్ల చొక్కా మనిషిని నేనే.

మొదటి టరమ్ అని ఎందుకు గట్టిగా చెప్పగలుగుతున్నాను అంటే చంద్రబాబు కాళ్ళకు వున్న చెప్పులు. బహుశా తర్వాత అమెరికా వెళ్ళినప్పుడు ఆయన తన  ఆహార్యం (ప్యాంటు, చొక్కా)  ఏమీ మార్చుకోలేదు కానీ చెప్పుల నుంచి బూట్లలోకి మారిపోయారు.  



ఇబ్బంది పెట్టే సరదాలు – భండారు శ్రీనివాసరావు


ఒకానొక రోజుల్లో నేను టీవీ చర్చలకు  ముప్పూటలా   వెళ్ళే రోజుల్లో...

ఒక టీవీలో చర్చాకార్యక్రమం నిర్వాహకుడు చర్చలో పాల్గొంటున్న ఒకరిని ఇలా సంబోధించారు.

“ఒకప్పటి టీడీపీ నాయకుడిగా, ప్రస్తుత టీఆర్ఎస్ నాయకుడిగా ఈ అంశంపై మీ అభిప్రాయం చెప్పండి”

సరదాగా చేసిన ఈ పరిచయ వాక్యం అందర్నీ నవ్వించింది. నిజానికి సీరియస్ చర్చల్లో అప్పుడప్పుడూ ఇలాంటి చమక్కులు అవసరం కూడా. 

అయితే, ఇలాటి పరిచయాలు చేయాల్సివస్తే పాల్గొనే వాళ్లకి కొంత ఇబ్బందే.

ఉదాహరణకు:

“ఒకప్పుడు మీరు కాంగ్రెస్. తరువాత టీడీపీలో చేరారు. కొంతకాలం తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. కొద్దిరోజులకే ఎన్నికలు రావడం, మీరు టీఆర్ఎస్ లో చేరడం జరిగిపోయాయి. రాష్ట్రం విడిపోవడంతో వైసీపీలో చేరి గెలిచిన తర్వాత టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు ముందు మరో పార్టీ జనసేనలోనో, లేదా మరింత తాజాగా  పెట్టబోయే పేరుపెట్టని మరో పార్తీలోనో చేరుతారనే వార్తలు వినవస్తున్నాయి. ఈ అనుభవ నేపధ్యంలో ఈ అంశంపై మీరు యేమని అనుకుంటున్నారు”