18, డిసెంబర్ 2021, శనివారం

ఇల్లాలి ముచ్చట్లు - భండారు శ్రీనివాసరావు

 ఎక్కడెక్కడి విషయాలు, ఎప్పటెప్పటివో సంగతులు రాస్తుంటారు, ఏం జ్ఞాపకశక్తండీ మీది” అంటుంటారు స్నేహితులు చాలామంది.

కానీ అందరికీ తెలియని విషయం ఏమిటంటే నాకు ఏదీ బొత్తిగా గుర్తుండదని.

నేను రెండు మూడు ప్రశ్నలు అడుగుతాను, ఒకటి రెండింటికి సరయిన జవాబులు చెబితే సాయంత్రం సినిమాకు తీసుకు వెళ్ళమని నేను అడగను” అనేది మా ఆవిడ.

కొస్చెన్ నెంబర్ వన్. రాత్రి మీరు భోజనంలో బాగుందని మెచ్చుకుంటూ తిన్న కూరేది?  నెంబరు టూ ప్రశ్న. నిన్న మీరు బయటకు వెళ్ళేటప్పుడు వేసుకువెళ్ళిన చొక్కా కలరేమిటి? చెప్పగలరా! చెప్పలేరు. మీ మొహం చూస్తేనే తెలుస్తోంది, చెప్పలేరని. అయ్యొ సంబడం. జ్ఞాపక శక్తి అట, ఈయన్ని మించిన వాళ్ళు లేరట! మళ్ళీ అనకండి, విన్న జనం మొహాన్నే నవ్విపోతారు.

 

అది సరే! ఇందాక అనగా గుడికి వెడుతూ వేడి వేడి కాఫీ కలిపి పక్కన పెట్టి వెళ్లాను. వెడుతూ చెప్పాను కూడా, ఎప్పుడూ ఆ కంప్యూటరులో తల పెట్టి టిక్కూ టిక్కూ నొక్కడం కాదు, అప్పుడప్పుడూ బయట ప్రపంచంలో ఏం జరుగుతోంది గమనిస్తూ వుండాలని. కాఫీ వేడిగా వుంది, తాగమని చెప్పానా! చూడండి, చప్పగా చల్లారి పోయింది. ఇంతోసిదానికి అబ్బో వాళ్ళు మెచ్చుకున్నారు, వీళ్ళు మెచ్చుకున్నారంటూ ముసి ముసి నవ్వులు. మళ్ళీ కలుపుకు వస్తాను, ఈ సారయినా వేడిగా తాగండి”



 

16, డిసెంబర్ 2021, గురువారం

అత్తాకోడళ్ళ అనుబంధం

 

ఎక్కడో నాగపూర్ దగ్గర రాం టెక్ లో ఇంజినీరింగ్ చదువుకుంటున్న కొడుకు, ఓ తెల్లవారుఝామున ఇద్దరు ఆడపిల్లలను వెంటబెట్టుకుని ఆటోలో ఇంటికి వస్తే, ఆ తల్లి మనసు ఎలా వుంటుంది. ఇదిగో ఇలా.
అప్పటికి తెలుగు బొత్తిగా తెలియని ఆ ఇద్దరు ఆడపిల్లల్లో ఒకమ్మాయి భావన మాటల్లో:
My first memory :
My friend Swathi and I had taken the Dakshin express from Nagpur to Hyd to write our GRE exam in Hyderabad. Coincidentally Sandeep was also travelling in the same train. ( At that time I hardly knew about him , nothing more than a college mate).
We reached Hyd at the very early hours. Being unsure of our safety at that time of the day when it was still so dark, we asked Sandeep if he would like to come in the same auto as ours. He graciously agreed. While traveling we realised that our destinations were very near by and his drop off was just few houses before ours, so we ended up dropping him first...
I clearly remember it was still dark outside, the time was not more than 5:30 am .. the auto stopped at 62 Durga nagar colony. Sandeep stepped out of the auto , reached the gate and we all saw a graceful lady come by with a big smile. Sandeep greeted her Amma. Definitely she was expecting Sandeep and then she saw us two (my friend and me) in the auto and Sandeep introduced us to her.
I clearly remember her wearing a beautiful green sari . In her welcoming voice she insisted that we should come in and she would make breakfast for us. We were in awe of her warm gesture ... I had never before met someone who would invite two, almost, strangers and make breakfast for them in the wee hours of the morning.
In my heart I sure left that day with a strong desire to meet her again. Who knew at that time that God had a plan already and I was blessed with 20+ years of her love, care and admiration as my mother in law and I know she blesses even from above. I ❤ you mummy. – BHAWANA



పెళ్లిరోజు

 


రెండేళ్ల క్రితం  48 పరుగుల దగ్గర అనూహ్యంగా అవుట్ అయింది.

ఈరోజు డిసెంబరు పదహారు మా పెళ్లి రోజు. మా ఆవిడ వుండి వుంటే  గోల్డెన్ జూబిలీ.

ఇందుకోసం కన్న కలలన్నీ కనురెప్పలకిందే కరిగిపోయాయి.



16-12-2021

15, డిసెంబర్ 2021, బుధవారం

నాన్నకు నివాళి – యాజి

 


జంధ్యాల వెంకటేశ్వర్లు గారు మరణించి నలభయ్ ఏళ్ళు దాటిపోయాయి. ఆయన తన జీవిత కాలంలో రాసుకున్న అనేక రచనలు కొన్ని వెలుగు చూసాయి. మరికొన్ని వ్రాత ప్రతులుగానే మిగిలిపోయాయి. వారి కుమారుడు జే.వి.పి.ఎస్. సోమయాజులు (యాజి) గారు వాటిని క్రోడీకరించి ‘నాన్నకు నివాళి’ పేరుతొ  ప్రచురించారు.

ఈ పుస్తకం ఈరోజు నా చేతికి అందినప్పుడు యాదాలాపంగా కొన్ని పేజీలు  తిరగేశాను. విషయ సూచికలో చంద్రమౌళీశ్వర శతకం, చంద్రమౌళీశ్వరి శతకం అని కనపడ్డాయి. ఇందులో రెండోది కొంత విచిత్రంగా అనిపించింది. చంద్రమౌళీశ్వరి అని అమ్మవారి పేరు మీద వుండడం దానికి కారణం.

సరే! అది పక్కనబెట్టి ఈ పుస్తకానికి పరిచయ వాక్యాలు రాసిన విశ్వనాధ వారి పలుకుల్లో ఆయన శైలి ప్రస్పుటంగా  ఉన్నప్పటికీ వాటిలో రాసిన విషయాలు పుస్తకం మీద ఆసక్తి కలిగించేవిగా వున్నాయి.

కవిసామ్రాట్ కధనం ఇలా సాగింది.

“పంచశీలను గురించి, చీనా దురాక్రమణ గురించి కూడా వీరు (వెంకటేశ్వర్లు గారు) వ్రాసిరి. ఒక దృష్టితో చూచినచో వారు వ్రాసినదంతయు సమంజసముగా కన్పించును. సామంజస్యమనగా నేమి? పాఠకుని ఇష్టప్రకారముండుట. వానికి కొన్ని యభిప్రాయములుండును. ఆ అభిప్రాయములు తాను చదివిన గ్రంధములో నున్నచో వాడు గొప్ప కవి.  లేనిచో కాదు. సర్వ విధములైన భావములను చదివి వానియందున్న గుణములను చూడగలవాడే పాఠకుడు”   

ఈ అభిప్రాయం 1967 నాటిది. ఇది చదివిన తర్వాత విశ్వనాధ వారి దూరదృష్టి బోధపడింది. తర్వాత ఎప్పుడో దశాబ్దాల తర్వాత వచ్చిన ఫేస్ బుక్ పాఠకుల మనస్తత్వాన్ని ఆయన అంత ముందుగా ఎలా పసికట్ట కలిగారా అని అనిపించింది.

పొతే రచయిత పేరు చూసినా, విషయ పట్టిక చూసినా ఇందులో ఆధ్యాత్మిక భావాలు తప్ప వేరేమీ ఉండకపోవచ్చు అనే అభిప్రాయం కలుగుతుంది. కానీ ఈ రచయిత రాసిన పద్యాలు చదివితే, గ్రాంథికభాషలో రాసిన శ్రీశ్రీ కవితల విప్లవతత్వం గోచరిస్తుంది.

అంటరానితనాన్ని ఏవగించుకుంటూ  జంధ్యాల వారు అల్లిన పద్యం మచ్చుకు ఒకటి:

“వేయి పల్కులేల వీధులందున సూక

రములు గార్దభములు గ్రామసింహ

ములు నిరంతరంబు మెలగవచ్చును గాని

అడుగునిడలేడు హరిజనుండు”

 

“నీచముగ నిట్లు మిమ్ముల జూచువారి

పొలము పనులకు మీరలు పోవనేల?

వారి వీధుల నడుగిడి ఘోరమైన

శాపముల బొందనేల నిష్కారణముగ!”

అలాగే రెండు శతకములలో కూడా మకుటంగా చంద్రమౌళీశ్వరా! చంద్రమౌళీశ్వరీ! అనే శివ పార్వతుల సంబోధనలు ఉన్నప్పటికీ ఆ పద్యాలలోని సారాంశం అంతా సామాజికమే కావడం ఓ విశేషం. మరో విశేషం ఏమిటంటే రచయిత కీర్తిశేషులు జంధ్యాల వెంకటేశ్వర్లు గారు విశ్వనాధ వారికి గొప్ప అభిమాని, శిష్యుడు, మిత్రుడు కూడా. విశ్వనాధ వారు తాము రచించిన ప్రద్యుమ్నోదయం ప్రబంధ కావ్యాన్ని తమ స్నేహానికి గుర్తుగా వెంకటేశ్వర్లు గారెకి అంకితం ఇచ్చారు.



తొంభయ్ పేజీల ఈ పుస్తకం ప్రచురణకర్త శ్రీమతి జంధ్యాల కల్పకం. ప్రతులకు (మూల్యం ఇవ్వలేదు) శ్రీ JVPS SOMAYAJULU, Mobile: 98490 80949        

బస్సులో వచ్చిన మనిషి హెలికాప్టర్ ఎలా సంపాదించాడు?

 రోశయ్య గారి గురించిన మరో జ్ఞాపకం – భండారు శ్రీనివాసరావు

నాయుడమ్మ అవార్డు తీసుకునేవాడు అల్లాటప్పా మనిషి కాకూడదు అనేది ఆ అవార్డు కమిటీ బాధ్యుడు అయిన  విష్ణుమూర్తిగారి  మొదటి షరతు. దానికి కట్టుబడే ఇరవై నాలుగుమంది ప్రముఖులకు  ఏడాదికి ఒక్కరి చొప్పున ఇన్నేళ్ళుగా ఆ అవార్డును తెనాలిలో ఇస్తూనే వచ్చారు.

 ఇక ముఖ్య అతిధి సంగతి, ఆయన ముఖ్యమంత్రి అయినా, గవర్నర్ అయినా తెనాలి రావాల్సిందే. విష్ణుమూర్తి గారి  ఈ షరతు కారణంగా కొందరు రావడానికి ఒప్పుకుని కూడా రాలేని పరిస్తితి. వారిని తప్పుపట్టడానికి కూడా వీల్లేదు.

ఒకసారి సామ్ పెట్రోడా కి నాయుడమ్మ అవార్డు  ఇవ్వాలనుకున్నారు. కానీ ఆయన్ని ఒప్పించడం ఎలా! సీనియర్ జర్నలిస్ట్  ములుగు సోమశేఖర్  ఇత్యాది బృందం తలలు పట్టుకున్నారు. ఈ బృందంలో హిందూ మాధవరావు గారు, వెనిగళ్ళ  వెంకటరత్నం,  జ్వాలా, నేనూ శాశ్వత ఆహ్వానితులం. మా కార్యస్థానం లక్ డి కా పూల్ లోని ద్వారక హోటల్ లో ఒక రూము. తెనాలి నుంచి బస్సులో హైదరాబాదు వచ్చి విశుమూర్తి గారు రెగ్యులర్ గా దిగే హోటల్ అదే.

చేతులకు, మూతులకు పనులు చెబుతూనే, తలలు పట్టుకోగా, పట్టుకోగా  చివరికి ఓ మార్గం దొరికింది. ప్రముఖ చిత్రకారుడు ఎస్వీ రామారావు గారు చికాగోలో వుంటారు. ఆయనకీ, పెట్రోడా గారికీ స్నేహం అన్న సంగతి సోమశేఖర్ బయట పెట్టాడు. అంతే! అమెరికాలో ఉన్న ఆయన్ని పట్టుకుని పెట్రోడా మహాశయుల్ని ఒప్పించడం జరిగింది.  అక్కడికి ఒక సమస్య తీరింది.

అవార్డు కార్యక్రమం రోజు ఉదయం  సామ్ పెట్రోడా మహాశయులు ఢిల్లీ నుంచి హైదరాబాదు విమానంలో  వస్తారు. ఆయన్ని అదేరోజు తెనాలి తీసుకుపోయి, మళ్ళీ తీసుకురావాలి అంటే హెలికాప్టర్ కావాలి. రోడ్డు మార్గంలో సమయం సరిపోదు. మరెలా!

మళ్ళీ మిత్రబృందం ద్వారకలో భేటీ అయి మరోసారి తలలు పట్టుకుంది. అంతే! ఓ ఐడియా తలుక్కున మెరిసింది.

హెలికాప్టర్ సదుపాయం వున్న ముఖ్యమంత్రిని ముఖ్య అతిధిగా పిలిస్తే!

ఇక్కడ తెనాలి, తెనాలి వరస కుదిరింది. పొలోమని వెళ్లి రోశయ్యగారికి చెప్పుకోవడం, ఆయన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిని ముఖ్య అతిధిగా ఒప్పించడం చకచకా జరిగిపోయాయి. అప్పుడు మరో అవాంతరం. అది బయట వాళ్ళనుంచి కాదు, ఏకంగా విష్ణుమూర్తి గారి నుంచి. చెప్పాకదా! ఆయనో సీతయ్య. ఎవరి మాట వినరు.

హెలికాప్టర్ వెలుతురు వున్నప్పుడే తెనాలి నుంచి టేకాఫ్ అవ్వాలి. ప్రోగ్రాంని కాస్త ముందుకు జరపవయ్యా మగడా అంటే  విష్ణుమూర్తి గారు ససేమిరా అంటాడు.

మొత్తం మీద కాస్త పట్టు సడలించేలా చేయడానికి ద్వారకలో కాస్త ఎక్కువ సమయం గడపాల్సి వచ్చింది.

 ఇక శుభం కార్డు వేయొచ్చు అనేంతలో, వై.ఎస్.ఆర్. ఆ కార్యక్రమానికి హాజరుకాలేనటువంటి అర్జంటు పనేదో పడింది. అయితే ఆ సమస్యను ఆయనే తెలివిగా పరిష్కరించారు. రోశయ్యగారయితే ప్రసంగాలు చేయడంలో దిట్ట, నా బదులు ఆయన వస్తారని చెప్పి మొత్తం మీద టెన్షన్ తగ్గించారు. ముఖ్య అతిధిగా రోశయ్యగారు, అవార్డు గ్రహీతగా సామ్ పెట్రోడా గారు హెలికాప్టర్ లో హైదరాబాదునుంచి తెనాలి వెళ్లి వచ్చారు.

ఇన్నిన్ని పనులు చక్కబెట్టాలంటే ఆ వ్యక్తి వెనుక యెంత దన్ను వుండాలి?

విష్ణుమూర్తి గారి వెనుక ఏమీ లేదు, కేవలం పట్టుదల, పని పట్ల నిబద్ధత తప్పిస్తే!

ఓ చేదు జ్ఞాపకం మా పెళ్లి రోజు - భండారు శ్రీనివాసరావు


రెండేళ్ళ నాడు ఆగస్టు మొదటి వారంలో మిత్రుడు జ్వాలా, మా మేనకోడలు విజయలక్ష్మి దంపతుల యాభయ్యవ వివాహ వార్షికోత్సవం జరిగింది. హితులు, సన్నిహితులు, చుట్టపక్కాల నడుమ జ్వాలా దంపతుల పిల్లలు ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగలా నిర్వహించారు. “మరో రెండేళ్లలో మీ గోల్డెన్ జూబిలీ రెడీగా వుండు దుర్గత్తయ్యా!” అంది మా మేనకోడలు మా ఆవిడతో.

దేవతలకు ఉన్నట్టే మాఆవిడకు అనేక పేర్లు. పుట్టినప్పుడు కన్న తలితండ్రులు బియ్యంలో రాసి పెట్టిన పేరు కనకదుర్గ. కానీ ఆమె పుట్టింటి వాళ్ళందరూ చిట్టి అనే పిలిచేవాళ్ళు. పెళ్లి అయిన తర్వాత మా బామ్మ గారు నిర్మల అని మార్చింది. స్నేహితులందరికీ ఇదే పేరు వాడుక. చుట్టాల్లో చాలామందికి చుట్టరికం ఏదైనా అందరికీ ఆవిడ దుర్గత్తయ్యే.

సిల్వర్ తప్పితే మా ఆవిడకు గోల్డ్ ఇష్టం లేనట్టుంది. అందుకే అప్పటిదాకా ఆగకుండా వెళ్ళిపోయింది.

రేపు డిసెంబరు పదహారు మా పెళ్లిరోజు.
ఆ రోజు గురించి తలచుకుని మురిసిపోయే మంచి సంగతులేవీ మాకు లేవు. ఎందుకంటే అది కన్నీళ్ళ పెళ్లి.

1971 డిసెంబరు 15 వ తేదీ రాత్రి మద్రాసు నుంచి అంబాసిడర్ కారులో తిరుపతి ప్రయాణం. దారిలో భోరున వాన. అట్లా ఇట్లా కాదు, ఉరుములు, మెరుపులు, పిడుగులు. మధ్యమధ్యలో ఆగుతూ తెల్లారేలోపునే తిరుమల చేరాము. ఎస్వీ కాటేజీలో పైన గదులు తీసుకున్నాము. పురోహితుడు ఎలా దొరికాడో తెలవదు. మా ఆవిడ పిన్నివసుంధర కొన్న నీలం రంగు ఫారెన్ నైలెక్స్ చీరే పెళ్లి చీరె. నేను ధోవతి కట్టుకున్నానో, ప్యాంటు షర్టుతో పెళ్లి చేసుకున్నానో గుర్తు రావడం లేదు. ఎందుకంటే సందర్భం, సన్నివేశం అలాంటివి. తొమ్మిదీ పది గంటల నడుమ పెళ్లి జరిగిపోయింది. వెంటనే వెళ్లి బాలాజీ దర్శనం చేసుకున్నాము. ఇప్పట్లోలా క్యూ లైన్లు లేవు. కొండ దిగి వచ్చి భోజనం చేసి వచ్చిన కారులోనే మళ్ళీ మద్రాసు వెళ్ళాము. మా ఆవిడ స్నేహితులు టీ నగర్ హోటల్లో విందు ఇచ్చారు. అటునుంచి మా మామగారి వద్దకు వెళ్లాం. కూతుర్ని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. “నీకు ఏం తక్కువ చేస్తానని అనుకుని ఇలా పెళ్లి చేసుకున్నావ”ని మా ఆవిడను అడిగారు. కన్నీళ్ళే జవాబు.
రిజర్వేషన్ల గొడవ లేని రోజులు. అంచేత 16 వ తేదీ రాత్రి రైల్లో బయలుదేరి మర్నాడు ఉదయం బెజవాడ చేరుకున్నాము. రిక్షా చేసుకుని మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారింటికి వెళ్ళాము. మా అమ్మగారు కూడా అక్కడే వుంది. మమ్మల్ని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. కాళ్ళకు దణ్ణం పెట్టగానే దగ్గరకు తీసుకుని మనసారా ఆశీర్వదించింది.
‘పెళ్లి వద్దు! పెళ్ళాం కావాలి’ అనే నా మొండి పట్టుదల ఫలితం మా పెళ్లి. ఇరువైపుల పెద్దల చేత కళ్ళనీళ్ళు పెట్టించింది కూడా. బహుశా అదే ఆఖరిసారి కావచ్చు.
పెళ్లి అనేది ఇద్దరి మధ్య వ్యవహారం. మూడో వ్యక్తికి ఇందులో సంబంధం లేదు. పెళ్లి మీద ఖర్చుచేయడం వృధా అనే సిద్దాంతాన్ని నాకు నేనే ప్రతిపాదించుకుని, దానిమీదే భీష్మించుకుని కూర్చోవడంతో మా ప్రేమ పెళ్ళికి పెద్దల ఆమోదం లభించినా కొన్నేళ్ళు గా వాయిదా పడుతూ వచ్చింది. ఒక్కగానొక్క పిల్లకు గుళ్ళో పెళ్లి చేయలేను అనే మా మామగారి వాదన నేను పట్టించుకోలేదు.
అందుకే ఆయన ఇష్టపడిన పెళ్లిని ఇష్టం లేని గుళ్ళో పెళ్ళిగా చేసుకోవాల్సివచ్చింది. పెద్దతనంలో ఇప్పుడు తలచుకుంటే చిన్నతనంగా అనిపిస్తుంది.
ఏదిఏమైనా అన్నింటినీ నా జ్ఞాపకాలకు వదిలేసి తాను తప్పుకుని వెళ్ళిపోయింది. పెళ్ళంటే నా ఇష్టప్రకారం చేసుకున్నాను. ఇది నా చేతిలో లేదుగా!
(దండలు కూడా లేని పెళ్ళికి ఫోటోలు ఏమి వుంటాయి?)

14, డిసెంబర్ 2021, మంగళవారం

గీతాజయంతి

 కంచి పరమాచార్య వద్దకు ఒక పండితుడు వచ్చి తనను తాను పరిచయం చేసుకున్నాడు. భగవద్గీత ప్రవచనంలో తనకు అద్భుతమైన అనుభవం వుందనీ, పది రోజులపాటు గీతను బోధించడానికి ఏదైనా స్థానిక దేవాలయంలో వసతి కల్పిస్తే తన పాండిత్యాన్ని ప్రదర్శిస్తానని చెప్పాడు. స్వామి అలాగే అన్నారు.

మొదటి రోజు సుమారు యాభై మంది దాకా ఆయన ఉపన్యాసం వినడానికి వచ్చారు. మరునాడు సగం తగ్గిపోయారు. మూడోనాడు వచ్చిన జనం వేళ్ళమీద లెక్కబెట్టే విధంగా అతితక్కువగా వున్నారు. ఆ పండితుడు పరమాచార్యను కలిసి చెప్పాడు. “ఏమి కాంచీపురం అండీ ఇది. ఇంతకష్టపడి భగవద్గీతను చెబుదామని వస్తే మొదటి రోజు పట్టుమని యాభై మంది కూడా రాలేదు. మర్నాడు ఇంకా పలచపడ్డారు. వరస చూస్తుంటే రేపు ముగ్గురు కూడా వచ్చేట్టు లేరు.”

స్వామి మందహాసం చేసి ఇలా అన్నారు.

“నువ్వు అదృష్టవంతుడవే! కృష్ణ పరమాత్మ భగవద్గీత బోధించినప్పుడు వినడానికి వున్నది ఒకే ఒక్కడు. అందుకు సంతోషించు”

 

(మా అన్నయ్య భండారు పర్వతాలరావు గారు రాసిన పరమాచార్యుల పావనగాధలు పుస్తకం నుంచి)